Youth Depending On OnlineTherapy Rather Than Doctors Advice For Treatment - Sakshi
Sakshi News home page

యువతలో ఇడియట్స్‌.. గూగుల్‌నే నమ్ముతున్న వైనం!

Published Tue, Aug 24 2021 8:27 AM | Last Updated on Tue, Aug 24 2021 3:01 PM

Youth Are Depending On Online Rather Than Doctors Advice For Treatment - Sakshi

లబ్బీపేట (విజయవాడతూర్పు): యువత, విద్యావంతుల్లో ఇడియట్స్‌ పెరిగిపోతున్నారు. ఇడియట్‌ అంటే తిట్టు కాదు. ఇంటర్నెట్‌ డెరీవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ ట్రీట్‌మెంట్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారని అర్థం. వీరిని డాక్టర్‌ గూగుల్‌గా కూడా పిలుస్తారు. వారికి ఏదైనా జబ్బు చేస్తే, ఆ లక్షణాలను గూగుల్‌లో సెర్చ్‌ చేసి జబ్బు, దానికి చికిత్స ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్‌ వద్దకు వెళ్లి, తనకు ఫలానా జబ్బు అని, చికిత్స చేయాలని అడుగు తారు. జబ్బు లక్షణాలు ఏమిటో చెప్పాలని అడిగితే, తాను గూగుల్‌లో పరిశీలించి, తెలుసుకున్నానంటూ బదులిస్తారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు ఇలాంటి వారు ఎక్కువగా వస్తున్నారు. డాక్టర్‌ మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో శోధిస్తున్నారు. అక్కడ ఆ ముందుకు సంబంధించి ఏవైనా దుష్ఫలితాలు ఉంటా యని పేర్కొంటే, వాడకుండా మానేస్తున్నారు. డాక్టర్ల వద్దకు వస్తున్న 100 మంది చదువుకున్న వారిలో 60 శాతం మంది డాక్టర్‌ చీటీలోని మందుల సమాచారం కోసం గూగుల్‌లో శోధిస్తున్నారు. మరో 15 శాతం మంది ఇడియట్సేనని వైద్యులు పేర్కొంటున్నారు.

చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా..


కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే.. 
ప్రతి విషయాన్నీ గూగుల్‌లో శోధించడం ద్వారా కొత్త సమ స్యలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మందులు, జబ్బు విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో చూడటం సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. ఒక మందు వాడిన వారిలో లక్ష మందిలో ఒకరికి దుష్ఫ లి తాలు వచ్చినా, గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రతి మందు గురించీ గూగుల్‌లో శోధించడం సరికాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

డాక్టర్‌ గూగుల్‌గా మారిన వైనం 
ఇప్పుడు కొంత మంది ఏదైనా జబ్బు చేస్తే, గూగుల్‌లో శోధించి సొంతగా మందులు వాడేస్తున్నారు.  మందులను కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. అది సరి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జబ్బుకు చికిత్స సరిగ్గా జరగక పోతే ప్రాణాల మీదకు వస్తుందని పేర్కొంటున్నారు. గూగుల్‌ డాక్టర్‌గా మారిన వారు కూడా ఇడియట్‌ అనే సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉందన్నారు. రోగి వ్యవహారశైలి, మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు అంచనా వేయాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రకాల మానసిక జబ్బులు, సెక్స్‌ సామర్థ్యం పెరిగేందుకు వాడే వయగ్రా వంటి వాటి గురించి కూడా ఎక్కువగా గూగుల్‌లో శోధిస్తున్నారని వివరించారు.

చదవండి: అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement