తలనొప్పి నుంచి పెద్దజబ్బుల దాకా సోషల్ మీడియాలో శోధన..
సామాజిక మాధ్యమాల్లో వర్టిగోపై అత్యధిక సెర్చింగ్
ఆన్‌లైన్ వైద్య పరిష్కారాలు మంచిది కాదంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా వెనకాముందూ ఆలోచించడం లేదు.. పరిష్కారం కావాలంటే.. గూగుల్ అన్వేషిస్తున్నారు. ఎలాంటి జబ్బుకైనా చికిత్స విధానాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అదెంతవరకు పోయిందంటే.. తలనొప్పి, పంటి నొప్పి వంటి చిన్న అనారోగ్యాలు మొదలుకుని పెద్ద పెద్ద జబ్బుల దాకా ఆన్‌లైన్‌లో శోధించడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.
దేనికైనా గూగుల్ ఉందిగా..
సాధారణంగా మొబైల్ ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్, డెస్క్‌టాప్ కంప్యూటర్, లాప్‌టాప్‌లు మొదలుకుని కార్లు, ఇతర పరికరాలు, మెషీన్లలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురుకావడం తెలిసిందే. కానీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తగానే.. వాటిపై అవగాహన ఉన్నవారు, నిపుణులను సంప్రదించడానికి ముందే వెంటనే గూగుల్‌లోనో, యూ–ట్యూబ్‌లోనో, మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పైనో శోధించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇలా ఇంటర్నెట్, వివిధ సామాజిక మాధ్యమాలు అనేవి పలురకాల సమాచారం, వివరాల సేకరణకు చిరునామాగా మారిపోయాయి.
అన్ని వర్గాల వారు వివిధ అంశాలపై తరచూ సోషల్‌మీడియాను ఆశ్రయించడం ఇటీవల మరింతగా పెరిగిపోయింది. మిగతా విషయాలు ఎలా ఉన్నా.. ఆరోగ్యంతో ముడిపడిన విషయాలు, చికిత్స విధానాలు, అనారోగ్య సమస్యల పరిష్కారం వంటి వాటికి కూడా గూగుల్, వివిధ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. ఏ అనారోగ్య సమస్య తలెత్తినా.. ఏ మందు వేసుకోవాలి, చికిత్సకు ఏం చేయాలి అనేది కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం ఆందోళనకు కారణమౌతోంది.
ఈ ధోరణి మరింత పెరగడంతో.. ఇతరులకు వైద్యపరమైన సలహాలు గట్రా అందజేస్తున్నవారు క్రమంగా ‘గూగుల్ డాక్టర్లు’గా చెలామణి అవుతున్నారు. ముందుగా ఏదైనా అనారోగ్య సమస్య లక్షణాలను, దానికి సంబంధించిన చికిత్స పద్ధతుల గురించి గూగుల్‌లో శోధించి, ఆ తర్వాత సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.
ఎవరైనా రోగులు తమకు కలిగిన చిన్న సమస్యకు సైతం.. అతిగా భయపడిపోయి ఆన్‌లైన్‌లో వాటికి చికిత్స లేదా పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నాలు మంచిది కాదని వైద్యులు, వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెర్టిగో.. పెనుసమస్యే..
ఇటీవల కాలంలో ‘వెర్టిగో’తో బాధపడుతున్న వారు అధికంగా సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం, చికిత్స విధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ స్కిల్స్’లో ప్రచురితమైన ఈ పరిశీలనలో వెర్టిగో చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులు, విధానాలను తెలుసుకునేందుకు 51 శాతం ‘వెర్టిగో’ రోగులు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
పరిసరాలు తిరుగుతున్నట్టు, కళ్లు తిరిగి పడిపోతున్నట్టు, ఒకచోట నిలబడలేక పడిపోతున్న భావనకు గురికావడం, విడవకుండా తలనొప్పి రావడం, నడిచేటప్పుడు ఇబ్బంది ఎదురుకావడం, శరీర బరువులో మార్పులు రావడం, వణుకుతున్న భావన కలగడం, స్వల్పకాలానికే కొన్ని విషయాల్లో మరుపు వంటివి ‘వెర్టిగో’ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మధ్యవయసు వారు (54 శాతం), పిల్లలు (27 శాతం), పెద్దవయసు వారు (19 శాతం) ప్రయత్నించినట్టు ఈ సర్వేలో వెల్లడైంది.
అన్ని వయసుల వారిని కలుపుకొంటే.. వారిలో 65 శాతం మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రాండ్‌వాచ్ (ఎంటర్‌ప్రెజ్–గ్రేడ్ సోషల్ లిసనింగ్ టూల్) అనేదాన్ని వినియోగించారు. దీనిద్వారా ట్విటర్ (ఎక్స్), యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, మెడికల్ ఫోరమ్స్, బ్లాగ్‌లు, ఈ–కామర్స్ సమీక్షలను పరిశీలించారు. ప్రధానంగా వీరంతా కూడా వివిధ సాధనాల ద్వారా వెర్టిగో సమస్యకు సమర్థవంతంగా ఎలా చికిత్స చేయాలి?, అందుకు నిపుణులైన వైద్యులెవరనే అంశంపై దృష్టి పెట్టారు.
సోషల్ మీడియా.. రెండంచుల కత్తి
ఈ అధ్యయనం ద్వారా చివరకు తేల్చింది ఏమిటంటే.. సామాజిక మాధ్యమం రెండంచుల కత్తి లాంటిదని, ఏదైనా విషయమై సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేయడమేకాక, ఆయా అంశాలపై సమాచారం తెలుసుకోవడంలో అంతరాలు ఏర్పడి కొన్ని తప్పుడు భావనలు, అభిప్రాయాలు, సూత్రీకరణలు చేసేందుకు కూడా దారి తీస్తున్నట్టు పేర్కొన్నారు.
అందువల్ల ఈ విషయంలోనూ ప్రజలను చైతన్యపరిచేందుకు సోషల్‌మీడియాను వైద్యులు, నిపుణులు ఉపయోగించుకోవలసిన ఆవశ్యకత పెరిగిందంటున్నారు. ఈ మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారుతున్న అంశాలను పరిశీలించి.. ఏవైనా తప్పుడు భావనలు, అభిప్రాయాలు వ్యక్తమైతే వాటిని దూరం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు.
ఇన్‌స్ట్రాగామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వైద్యులు ఆయా ముఖ్యమైన అంశాలకు సంబంధించిన చిన్నచిన్న వీడియోలను పెట్టడం ద్వారా.. లక్షలాది మందిలో చైతన్యాన్ని కలిగించి, చికిత్సా పద్ధతులపై విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ఒక వైద్యుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment