3 వీళ్లకు..1 వాళ్లకు | Elections to be held for five MLA quota MLC seats | Sakshi
Sakshi News home page

3 వీళ్లకు..1 వాళ్లకు

Published Wed, Mar 5 2025 4:21 AM | Last Updated on Wed, Mar 5 2025 4:21 AM

Elections to be held for five MLA quota MLC seats

ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు 

మూడు కాంగ్రెస్‌కు.. ఒకటి బీఆర్‌ఎస్‌కు ఖాయం.. ఐదో సీటుపై ఉత్కంఠ.... కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐలలో ఒకరికి చాన్స్‌ 

సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌? 

కాంగ్రెస్, సీపీఐల్లో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం దక్కాలన్నా ఎంఐఎం సహకారం తప్పనిసరి 

బీజేపీ గైర్హాజరయ్యే అవకాశం.. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వైఖరి ఎలా ఉంటుందోనన్న చర్చ 

బీఆర్‌ఎస్‌ రెండో అభ్యర్థిని నిలిపితేనే ఎన్నికలు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన వేళ.. పార్టీల గెలుపోటములపై చర్చ జరుగుతోంది. ఏ లెక్క ఎలా ఉన్నా, ఎవరు హాజరైనా.. గైర్హాజరైనా పార్టీల బలాబలాను బట్టి చూస్తే.. ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి మూడు, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం తప్పనిసరిగా లభించనున్నాయి. ఐదో స్థానం సాధించేందుకు కాంగ్రెస్‌కు కానీ, బీఆర్‌ఎస్‌కు కానీ తగిన సంఖ్యా బలం లేదు. దీంతో ఈ స్థానానికి జరిగే ఎన్నిక కీలకంగా మారింది. 

ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి ఉండడం గమనార్హం. అయితే బీఆర్‌ఎస్‌ తన బలానికి మించి రెండు స్థానాలకు అభ్యర్థులను నిలిపేతేనే ఎన్నికలు జరిగే అవకాశాలుండగా, అలా జరగకపోతే ఐదు స్థానాలూ ఏకగ్రీవమయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

మార్చి 29న ఐదుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రిటైర్‌ అవుతున్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్‌ హసన్‌ ఎఫెండీ ఉన్నారు. ఈ స్థానాలు భర్తీ చేసేందుకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 

బలాబలాలు ఇలా..! 
అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులుండగా కాంగ్రెస్‌ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. మిత్రపక్షమైన సీపీఐకి మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు ఈసారి 20 ఓట్లు రావాల్సి ఉన్నందున కాంగ్రెస్‌ అభ్యర్థులు ముగ్గురికి 60 ఓట్లు పోను మరో 6 ఓట్లు మిగులుతాయి.  

⇒ బీఆర్‌ఎస్‌కు అధికారికంగా 38 మంది సభ్యుల బలముంది. అంటే ఆ పార్టీ 20 ఓట్లతో నికరంగా ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. ఇంకా 18 ఓట్లు మిగులుతాయి. అయితే బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. వారు బీఆర్‌ఎస్‌కు సహకరించే పరిస్థితి లేదు. అలాగని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసే పరిస్థితులు కూడా లేవు. 

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సీక్రెట్‌ ఓటింగ్‌ పద్ధతిలో జరుగుతాయి. పార్టీ విప్‌కు భిన్నంగా ఓటేసిన వారిని ఆయా పార్టీలు గుర్తించగలవు కానీ అధికారికంగా నిర్ధారించలేవు. కానీ ఫిరాయింపు అంశంలో అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ 10 మంది ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఓటింగ్‌కు బీజేపీ దూరమేనా? 
ఈ ఎన్నికల్లో బీజేపీ పాల్గొనే అవకాశం లేదు. ఆ పార్టీకి 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగని ఆ పార్టీ కాంగ్రెస్‌కు లేదా బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అవకాశం కూడా లేదు. దీంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అభ్యర్థుల గెలుపునకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌లో మార్పు వస్తుంది. 19 అవుతుంది. అయినా ఫలితాల్లో మార్పు ఏమీ ఉండదు.  

⇒ బీజేపీతో పాటు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది కూడా గైర్హాజరైతే మాత్రం అధికార పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. అప్పుడు 101 మంది మాత్రమే ఓటేస్తారు. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 17 అవుతుంది. అప్పుడు నలుగురు గెలిచేందుకు 68 ఓట్లు అవసరమవుతాయి. అంటే కాంగ్రెస్, సీపీఐలకు మరో రెండు ఓట్లు మాత్రమే తక్కువ అవుతాయి. ఎంఐఎం సహకరిస్తే ఆ స్థానం సులువుగా కాంగ్రెస్‌ పక్షాన చేరుతుంది. కానీ ఎంఐఎం ఐదో సీటు తమకు కావాలని అంటోంది. 

మాకే కావాలంటున్న ఎంఐఎం 
తమ సభ్యుడు రియాజుల్‌ హసన్‌ పదవీ విరమణ నేపథ్యంలో తమకే ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీని ఎంఐఎం కోరుతోంది. కానీ కాంగ్రెస్‌ అందుకు సిద్ధంగా లేదు. ఏఐసీసీ సూచన మేరకు నాలుగో స్థానాన్ని ఖచ్చితంగా సీపీఐకి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అప్పుడు ఎంఐఎం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. 

కాంగ్రెస్‌ పార్టీ సూచిస్తున్న విధంగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో బరిలోకి దిగేందుకు ఎంఐఎం అంగీకరిస్తే కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎంల కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుంది. కానీ ఎంఐఎం విభేదించి బీఆర్‌ఎస్‌ పక్షాన చేరితే ఫలితం భిన్నంగా ఉంటుంది. పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టినా బీఆర్‌ఎస్‌కు 28 మంది సభ్యులుంటారు. 

వీరిలో 20 మంది సాయంతో ఒక అభ్యర్థి గెలుస్తారు. మరో 8 మంది మిగులుతారు. వీరికి ఎంఐఎంకు చెందిన ఏడుగురు తోడయితే బలం 15కు చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్‌ పక్షాన కూడా 15 ఓట్లు మాత్రమే మిగులుతాయి. (మ్యాజిక్‌ ఫిగర్‌ 17 అయితే, ముగ్గురు సభ్యులు గెలిచేందుకు అవసరమైన 51 ఓట్లు పోను మరో 15 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతారు.  

రసవత్తర పోరు! 
ఒకవేళ కాంగ్రెస్‌ సీపీఐలతో పాటు 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రతిపాదించే అభ్యర్థులకు ఓటేస్తే వారి బలం 76కు చేరుతుంది. అయినా నలుగురు అభ్యర్థులు గెలవాలంటే నాలుగు ఓట్లు తక్కువ పడతాయి. అప్పుడు ఎంఐఎం కీలకం అవుతుంది. 

ముందే చెప్పినట్టు ఒకవేళ బీజేపీ గైర్హాజరైతే మాత్రం నలుగురు అభ్యర్థులు గెలవడానికి 76 ఓట్లు సరిపోతాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదిస్తుంది? సీపీఐకే అవకాశం ఖాయమా? ఎంఐఎం ఏం చేస్తుంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓట్లేస్తారా? అసలు బీఆర్‌ఎస్‌ రెండో అభ్యర్థిని నిలబెడుతుందా? అనే అనేక ప్రశ్నలతో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ బీఆర్‌ఎస్‌ ఒకే అభ్యర్ధిని ప్రతిపాదిస్తే కాంగ్రెస్‌ కూటమికి నాలుగు, బీఆర్‌ఎస్‌కు ఓ స్థానం దక్కడం మాత్రం ఖాయం.  

మ్యాజిక్‌ ఫిగర్‌ 20 ఇలా.. 
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కౌంటింగ్‌ ప్రక్రియ శాసనసభా నియమావళి ఆధారంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన ఓట్ల (మ్యాజిక్‌ ఫిగర్‌) కోసం ప్రత్యేక సూత్రాన్ని పాటిస్తారు. మొత్తం సభలోని ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే స్థానాల సంఖ్యకు ఒకటి కలిపి భాగిస్తారు. 

ఈ మొత్తానికి మరొకటి కలుపుతారు. అప్పుడు వచ్చే సంఖ్యను మేజిక్‌ ఫిగర్‌గా నిర్ధారిస్తారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 119. ఈ సంఖ్యను ఐదుకు ఒకటి కలిపి అంటే ఆరుతో భాగిస్తే 19 వస్తుంది. దానికి ఒకటి కలిపితే 20 అవుతుంది. 

20 తర్వాత డెసిమల్స్‌లో ఎంత వచ్చినా పట్టించుకోరు. ఈ విధంగా ఈసారి ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు 20 ఓట్లు అవసరమవుతాయని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ పార్టీ సభ్యులైనా ఓటు వేయకుండా గైర్హాజరైన పక్షంలో మ్యాజిక్‌ ఫిగర్‌ మారుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement