
ప్రేమికుల రోజు ఆన్‌లైన్‌లో గిఫ్టుల అమ్మకాల జోరు
బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో వంటి వేదికల్లో రికార్డు అమ్మకాలు
పూలు, చాక్లెట్లు, బొమ్మలు, గ్రీటింగ్స్‌కే అధిక గిరాకీ
రూ.29,844 పెట్టి 174 చాక్లెట్లు కొన్న ఢిల్లీ కస్టమర్
స్విగ్గీలో నిమిషానికి 581 చాక్లెట్లు, 324 గులాబీల ఆర్డర్
ఒక్కరోజే 4 లక్షల గులాబీలు అమ్మిన ఎఫ్‌ఎన్‌బీ
సాక్షి, హైదరాబాద్: గులాబీలు, చాక్లెట్లు్ల, బంగారు ఆభరణాలు, టెడ్డీబేర్ బొమ్మలు, ప్రముఖులు రాసిన పుస్తకాలు.. ఇలా కాదేదీ ప్రేమ వ్యక్తీకరణకు అనర్హం అన్నట్లుగా సాగింది ఈసారి ప్రేమికుల రోజు. ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో సమీపంలోని షాపునకు వెళ్లి పూలో, గ్రీటింగ్ కార్డులో కొని తమ మనసు గెలిచినవారికి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు.
కానీ, ఇప్పుడు ప్రతి వస్తువుకూ ఈ–కామర్స్ సైట్లవైపే చూస్తున్నాం కదా! ప్రేమికుల రోజున కూడా ప్రేమికులంతా ఈ సైట్లపైనే పడ్డారు. గులాబీలు, చాక్లెట్లు, అందమైన బొమ్మలు తదితర వస్తువులను ప్రేమికులరోజు (శుక్రవారం ) వివిధ ఈ–కామార్స్ సైట్లలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు.
ఆఫర్ల జోరు
ప్రేమికుల రోజున జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రెస్టారెంట్లు, ట్రావెల్ కంపెనీలు కూడా జతకలిసి లిమిటెడ్ ఎడిషన్ ప్రొడక్టులు మొదలు వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఐజీపీ, ఫ్లవర్ ఆరా ఫ్లడ్ వంటి గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనలైజ్డ్ మగ్స్, హార్ట్ షేప్ కుషన్లు, ఇతర కానుకలను పరిచయం చేశాయి.
దేశీయ స్టార్టప్‌లు సైతం వివిధ రంగాలు, సెక్టార్లవారీగా పలు వస్తువులను వ్యాప్తిలోకి తెస్తున్నాయి. చివరకు ఇండిగో స్పెషల్ వాలంటైన్స్ డే సేల్‌ను ప్రకటించి డిస్కౌంట్ రేట్లపై జంటలు విమానాల్లో ప్రయాణించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అ‘ధర’హో
ఈ కామర్స్ సంస్థలు ప్రేమికులరోజు రష్‌ను బాగా నే క్యాష్ చేసుకున్నట్లు ఫెర్ష్న్ ఎన్‌పెటల్స్ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రేమికుల రోజు ప్రత్యేకం పేరుతో పలు వస్తువులను అధికధరలకు అమ్మినట్లు తెలిపింది.
పలు గిఫ్ట్ హ్యాంపర్ల ధర రూ.90 వేల పైచిలుకు ఉన్నది. పలు సైట్లలో చాక్లెట్ల ధరలు రూ.499తో మొదలై రూ.82,999 (ఐఫోన్ సహితంగా) వరకు ఉన్నాయి. డైసన్ ఎయిర్‌వ్రాప్ ఫ్యాన్సీ ప్యాకింగ్ హ్యాంపర్‌కు రూ.46,999కు విక్రయించారు. 14న తమ ప్లాట్‌ఫామ్స్‌పై విక్రయాల రికార్డులను పలు ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.
» ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 24 ఆర్డర్ల ద్వారా 174 చాక్లెట్లను రూ,29,844కు కొనుగోలు చేశాడు.
» 14న పీక్‌టైమ్‌లో నిమిషానికి 581 చాక్లెట్లు, 324 గులాబీలకు ఆర్డర్ వచ్చినట్టు స్విగ్గీ ప్రకటించింది.
» ప్రేమికుల రోజున 4 లక్షల గులాబీలకు ఆర్డర్లు పొందినట్లు ఎఫ్‌ఎన్‌బీ తెలిపింది. ఈ నెల ప్రారంభం నుంచి 13వ తేదీ వరకు 15 లక్షల గులాబీలు విక్రయించినట్లు వెల్లడించింది.
» ఫిబ్రవరిలో మొదటి 11 రోజుల్లోనే యూనీకామర్స్ యూనీవేర్ ప్లాట్‌ఫామ్ కోటికి పైగా బహుమతి వస్తువుల (గిఫ్టింగ్ ఐటమ్స్)ను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment