![Fraud in Name of online love in telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/love_0.jpg.webp?itok=7fcHNfU-)
అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు
దేశవ్యాప్తంగా 400% పెరిగిన స్పామ్ కాల్స్, ఈ–మెయిల్స్
ఆన్‌లైన్ రొమాన్స్‌లో 39% మంది సైబర్ మోసగాళ్లే
ఆన్‌లైన్‌లో అపరిచితులను నమ్మొద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
ఆన్‌లైన్‌లో ప్రేమ పేరిట వల వేస్తున్న సైబర్ మోసగాళ్లు.. అవతలి వ్యక్తి తమ అదీనంలోకి వచ్చినట్టు గుర్తించిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు. పలు వెబ్‌సైట్‌లు, డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోని వెబ్‌సైట్లలోని సమాచారాన్ని సేకరిస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి ఎదుటి వారికి వలపు వల వేస్తున్నారు.
ఇందుకోసం వారి అభిరుచులకు తగ్గట్టుగా వ్యవహరించి మోసాలకు తెరతీస్తున్నారు. నగరంలోని ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారంతా విదేశాల్లో ఉంటూ మోసాలు చేస్తున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు, మిలిటరీ ఉద్యోగులు, యువత ఇలా పలువర్గాలను ఈ తరహా మోసాలకు టార్గెట్‌గా ఎంచుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్
39 % సైబర్ నేరగాళ్లే..
ఆన్‌లైన్‌లో ప్రేమ కోసం పరితపిస్తూ కొందరు డేటింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లలో తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఆన్‌లైన్‌లో జత కూడుతున్న వారిలో 39 శాతం మంది అవతలి వ్యక్తులు సైబర్ నేరగాళ్లే అన్న విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది.
అదేవిధంగా ఆన్‌లైన్ ప్రేమ పేరిట స్పామ్ ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌లో దేశవ్యాప్తంగా ఇటీవల 400% పెరుగుదల ఉన్నట్టు తేలింది. ఇలా ఆన్‌లైన్‌లో ప్రేమ పేరుతో మోసగించేందుకు సైబర్ కేటుగాళ్లు మాటువేసి సిద్ధంగా ఉంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లు, డేటింగ్‌యాప్‌ల నుంచి ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏఐ టూల్స్‌ను వాడి తప్పుడు గుర్తింపులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.
చిక్కకపోతే వారాలు.. నెలలు కూడా..
ముందస్తుగానే ఎదుటి వారి వివరాలు, వారి అభిరుచులు, బలహీనతలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్‌ను వాడి అందుకు తగిన విధంగా మెసేజ్‌లు తయారు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లతో ఎదుటి వ్యక్తుల్లో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైతే వారాలు, నెలలు కూడా ఓపికగా చాటింగ్ చేస్తున్నారు. ఇలా ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు.
‘నా ఆరోగ్యం బాగా లేదు..ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలి, మా కుటుంబ సభ్యుడు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారు..కొంచెం డబ్బులు సర్దు..తిరిగి ఇచ్చేస్తా..’ అని సెంటిమెంట్ డైలాగ్‌లతో ఎదుటి వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లుఅతి ప్రేమలు నటిస్తూ..నాకు తెలిసిన ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టు..నీకు మంచి లాభాలు వస్తాయని ఊదరగొడుతూ..డబ్బులు దండుకుంటున్నారు.
ఇలా వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడగానే..దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చుకుంటున్నారు. ‘మీకు ఖరీదైన గిఫ్ట్ పంపుతున్నాను..కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజులు చెల్లించి ఆ బహుమతులు తీసుకో’ అంటూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు డేటింగ్ యాప్‌లకే పరిమితం కావడం లేదు. మ్యాట్రిమోని వెబ్‌సైట్లలోనూ 78 శాతం వరకు మహిళల పేరిట ఫేక్ ప్రొఫైల్స్‌ను తయారు చేస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది.
అపరిచితులను ఆన్‌లైన్‌లో నమ్మొద్దు..
ఆన్‌లైన్‌లో పరిచయం అయి.. తర్వాత ఆర్థిక అవసరాలను చూపుతూ డబ్బు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ స్నేహాల్లో చాలావరకు మోసపూరితమైనవేనని గ్రహించాలని వారు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించినా..ట్రేడింగ్ యాప్‌లలో పెట్టుబడుల పేరిట ఒత్తిడి తెచ్చినా అది మోసమని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment