
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్.
ప్రేమకథా కాలం.. 1997..
స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్‌కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన.
నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్‌లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్‌కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు.
ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది.
దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్‌కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది.
రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు.
‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment