నిన్న తనఖా.. నేడు వేలం! | Congress Govt ready to sell 400 acres of TGIIC lands | Sakshi
Sakshi News home page

నిన్న తనఖా.. నేడు వేలం!

Published Wed, Mar 5 2025 6:17 AM | Last Updated on Wed, Mar 5 2025 6:17 AM

Congress Govt ready to sell 400 acres of TGIIC lands

400 ఎకరాల టీజీఐఐసీ భూముల అమ్మకానికి ప్రభుత్వం సన్నద్ధం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) అధీనంలో ఉన్న సుమారు 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం ద్వారా రూ.25 వేల కోట్లు సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఐసీఐసీఐ బ్యాంకుకు సెక్యూరిటీ బాండ్ల రూపంలో తనఖా పెట్టిన భూమికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మాస్టర్‌ ప్లాన్‌ లే ఔట్‌ రూపొందించి దశలవారీగా వేలం వేయడం ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. 

మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, వేలంలో సహకారం అందించేందుకు ‘ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీ కన్సల్టెంట్‌’ ఎంపిక కోసం గత నెల 28న టీజీఐఐసీ ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేసింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. 

గతంలో ప్రభుత్వ గ్యారంటీతో ఐసీఐసీఐకి తనఖా
టీజీఐఐసీ అధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా రైతుభరోసా వంటి పథకాల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చబౌలిలోని 25(పీ) సర్వే నంబరులోని సుమారు రూ.20 వేల కోట్లు విలువ చేసే 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. 

‘క్యాపిటల్‌ ట్రస్ట్‌’ అనే మర్చంట్‌ బ్యాంకర్‌కు రూ.10 వేల కోట్ల రుణ సేకరణ బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో 9.6 శాతం వడ్డీపై రుణం ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ముందుకు వచ్చింది. అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలనే మెలిక పెట్టింది. 

ప్రభుత్వ గ్యారంటీతో తాకట్టు ద్వారా తీసుకునే రుణాలకు కూడా ‘ద్రవ్య బా«ధ్యత బడ్జెట్‌ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్‌బీఐ వర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ నిధుల అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అక్టోబర్‌ 26న జరిగిన కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలపడంతో రుణ సేకరణ ప్రక్రియ పూర్తయింది.

సెక్యూరిటీల విడుదలకు షరతులతో ఓకే
రూ.20 వేల కోట్లకు పైగా విలువ కలిగిన భూములపై కొల్లేటరల్‌ సెక్యూరిటీ పెట్టి కేవలం రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచనలో పడింది. అవే భూములు వేలం వేస్తే రూ.20 వేల నుంచి రూ.25 వేల కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశముందనే అంచనాకు వచ్చింది. 

ఈ నేపథ్యంలోనే వేలం వేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే తమకు కొల్లేటరల్‌ సెక్యూరిటీగా పెట్టిన భూములను వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై  అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ బాండ్లు విడుదల చేసేందుకు ఐసీఐసీఐ తొలుత నిరాకరించినట్లు తెలిసింది. 

అయితే తమకు నిధులు అత్యవసమని, కొల్లేటరల్‌ సెక్యూరిటీ బాండ్లను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. రుణం తీర్చేందుకు పదేళ్ల వ్యవధి ఉండటాన్ని, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో కొన్ని షరతులతో బాండ్ల విడుదలకు ఐసీఐసీఐ అంగీకరించినట్లు సమాచారం. 

ఈఎంఐ డిపాజిట్‌కు అంగీకారం?
భూ తనఖా ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం ప్రతినెలా రూ.100 కోట్ల మేర కిస్తీ (ఈఎంఐ) కింద చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు చెల్లించాల్సిన కిస్తీ సుమారు రూ.2,500 కోట్లు ముందస్తుగా డిపాజిట్‌ చేస్తేనే కొల్లేటరల్‌ సెక్యూరిటీ బాండ్లు తిరిగి ఇస్తామంటూ ఐసీఐసీఐ విధించిన షరతుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తూనే వేలం ప్రక్రియకు తెరలేపింది.

గతంలో ఎకరం రూ.50 వేలకే విక్రయించిన చంద్రబాబు సర్కారు
కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25(పీ)లోని సుమారు 425 ఎకరాల భూమిని 2003లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున ‘ఐఎంజీ అకాడమీస్‌ భారత’ అనే సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మంత్రివర్గ ఆమోదం, ఒప్పందం లేకుండానే అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 

అయితే ఎంఓయూలో పేర్కొన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడంతో 2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భూమిని తిరిగి తీసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించింది. సుమారు రెండు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని గత ఏడాది ఆరంభంలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement