న్యూఢిల్లీ: దేశీయంగా సగానికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ప్రాంతీయ భాషల్లో న్యూస్ కోసం ఆన్‌లైన్ మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వార్తల వినియోగం అత్యధికంగా (63 శాతం - 23.8 కోట్ల మంది) ఉంటోంది. పట్టణ ప్రాంత యూజర్లలో ఇది 37 శాతంగా ఉంది.
టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా 72.9 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇందులో 52 శాతం మంది (37.9 కోట్లు) వివిధ న్యూస్ యాప్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్ ఫార్వర్డ్‌లు, యూట్యూబ్ మొదలైన వాటి ద్వారా ప్రాంతీయ భాషల్లో వార్తలను ఆన్‌లైన్‌లో చూడటం, చదవడం, వినడం చేస్తున్నారు.
తమ తోటివాళ్లలో కూడా టీవీ చానళ్లతో పోలిస్తే ఆన్‌లైన్ మాధ్యమమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటోందని 48 శాతం మంది పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లో, 8 ప్రాంతీయ భాషల్లో, 15 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్ న్యూస్ వినియోగ ధోరణులను తెలుసుకునేందుకు కాంటార్–గూగుల్ దీనికి సంబంధించిన సర్వే నిర్వహించాయి. ఇందుకోసం 16 నగరాలకు చెందిన 4,600 మందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసింది. 64 పైచిలుకు చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. దీని నివేదిక ప్రకారం..
- వార్తల వినియోగానికి వీడియోలు అత్యధికంగా ఇష్టపడే ఫార్మాట్‌గా ఉంటున్నాయి. టెక్ట్స్, ఆడియో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- బెంగాలీ వీడియో కంటెంట్‌కు అత్యధిక డిమాండ్ (81 శాతం) ఉంది. తమిళం (81%), తెలుగు (79%), హిందీ (75%), గుజరాతీ (72%), మలయాళం (70%), మరాఠీ.. కన్నడ (చెరి 66%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- టెక్ట్స్ వినియోగం ఎక్కువగా గుజరాతీ, కన్నడ కంటెంట్‌కు చెరి 20 శాతం చొప్పున ఉంది. మరాఠీలో 18 శాతంగా ఉంది. ఆడియో న్యూస్ కంటెంట్‌కు మరాఠీ, మలయాళంలో అత్యధికంగా (16 శాతం) డిమాండ్ ఉంది.
- ఆన్‌లైన్ న్యూస్ చూసేందుకు ఎక్కువ శాతం మంది (93 శాతం) యూట్యూబ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా (88 శాతం), చాట్ యాప్స్ (22 శాతం), సెర్చి ఇంజిన్లూ (61 శాతం), పబ్లిషర్ న్యూస్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు (45 శాతం), ఆడియో న్యూస్ (39 శాతం), ఓటీటీ లేదా కనెక్టెడ్ టీవీ (21 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- 80 శాతం మంది ఆన్‌లైన్ న్యూస్ వినియోగదారులకు పలు సందర్భాల్లో అనుమానాస్పద కంటెంట్ ఎదురైంది. అది వాస్తవమైనదా లేక తప్పుడు వార్తా అన్నది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఏ న్యూస్ వెబ్‌సైట్‌లోను కనిపించకుండా కేవలం వాట్సాప్ లేదా నోటిమాటగానో వస్తే అలాంటి వాటిని తాము తప్పుడు సమాచారంగా పరిగణిస్తున్నామని 43 శాతం మంది తెలిపారు.
- 60 పదాలకన్నా తక్కువగా సంక్షిప్త రూపంలో ఉండే న్యూస్‌ను 70 శాతం మంది చదువుతుండగా, 67 శాతం మంది టాప్ స్టోరీ హెడ్‌లైన్స్‌ను, 48 శాతం మంది సుదీర్ఘ కంటెంట్‌ను చదువుతున్నారు.
- 25 శాతం మంది ఆన్‌లైన్ న్యూస్ వినియోగదారులు 60 సెకన్ల లోపు క్లిప్‌లను ఇష్టపడుతుండగా, 19 శాతం మంది మరింత ఎక్కువ నిడివి కలిగి ఉండే వాటిపై ఆసక్తి చూపుతున్నారు.
- 73 శాతం మంది ఆన్‌లైన్ రీడర్లు.. ఎక్కువగా హైపర్‌లోకల్ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
- వార్తల్లో కూడా వివిధ సెగ్మెంట్లకు వివిధ రకాలుగా ప్రాధాన్యం ఉంటోంది. ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్‌ను (76 శాతం మంది – 37.9 కోట్లు) యాక్సెస్ చేస్తున్నారు. క్రైమ్ రెండో స్థానంలో ఉండగా.. దేశ, రాష్ట్ర, నగర వార్తలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment