కన్నీటి అల | The wave of tears | Sakshi
Sakshi News home page

కన్నీటి అల

Published Sun, Sep 6 2015 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

కన్నీటి అల

కన్నీటి అల

ఆదిమ యుగంలో అరుపులు, పెడబొబ్బలే మాట్లాడుకునేవారు. అంతగా ప్రేమ పుడితే తాకి, ముట్టి భావాలు కలబోసుకునేవారు. ఆ తరువాత అమ్మలక్కలకు పిట్టగోడలు, అన్నలు, అయ్యలకు రచ్చబండలు దొరికాయి. అమెరికా నుంచి అనకాపల్లి దాకా రచ్చబండ చర్చిస్తే, ఆవకాయ నుంచి ఆడబిడ్డ దాకా పిట్టగోడ పార్లమెంటు చర్చించేది. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని గ్లోబ్ మొత్తం ఒక పిట్టగోడ! ప్రపంచం ఒక రచ్చబండ!! కిరాణా దుకాణాలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. యూట్యూబ్ ఓ సినిమా హాలైపోయింది. అన్నిటికీ ఇప్పుడు ఇంటర్‌నెట్టే దిక్కు. ఆఖరికి చావడానికి కూడా గూగుల్ సాయం తీసుకునే దశకి వచ్చేసింది ప్రపంచం. అంతకన్నా వింతేమిటంటే చావు వార్తను కూడా లైక్ కొట్టి షేర్ చేసే స్థాయికి ఎదిగిపోయింది ప్రపంచం. గతవారం నెట్ ప్రపంచాన్ని షేకాడించిన కొన్ని కబుర్లు... మీకోసం!!!
 
అదేమిటో... తుపాను వచ్చినా గడ్డిపోచ బతికే ఉంటుంది. కానీ యుద్ధం వస్తే మాత్రం పసిపాపలే చనిపోతూంటారు. అలాంటి వాడే అలన్ కుర్దీ. ఎర్ర చొక్కా, నీలి నిక్కరుతో టర్కీ సముద్ర తీరంలో ఆదమరిచి పడుకున్నట్టు పడున్న అలన్ కుర్దీ ఇప్పుడు యుద్ధంపై యుద్ధం ప్రకటించడానికి ఒక పెద్ద కారణం. సరిహద్దులపై సమరం సాగించేందుకు ఒక ఆయుధం. వీసాల విచ్చుకత్తులను విరిచేందుకు ఒక సాధనం. తీరానికి శవమై కొట్టుకొచ్చిన మానవత్వం ఇప్పుడు ప్రపంచం గుండెలోపలి మెత్తటి పొరలను గీరుతోంది. అలన్ కుర్దీ హ్యుమానిటీ వాష్డ్ అషోర్ అన్న హ్యాష్ టాగ్‌గా మారిపోయారు. అతని బాల్యాన్ని విజయవంతంగా నిద్రపుచ్చేసిన ప్రపంచం ఇప్పటికైనా మేల్కొంటుందా?
 
ప్రపంచాన్ని కదిలించిన ఫొటో!
ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య దాడులతో సిరియా నలిగిపోతోంది. పౌరులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఐరోపా వలస వెళుతున్నారు. సిరియాలోని కోబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా కూడా తన భార్య రేహన్, కుమారులు అలన్ కుర్దీ (ఫొటోలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మూడేళ్ల బాబు), గాలిప్(5) లతో దేశం వదిలాడు. టర్కీకి వచ్చి, గ్రీసులోని కోస్‌కు వెళ్లేందుకు పడవ ఎక్కాడు. వీరి పడవ ఓవర్ లోడ్ అయి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. అబ్దుల్లా బయట పడ్డాడు కానీ, భార్యా పిల్లలు చనిపోయారు. అలాన్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు నీలోఫర్ డెమిర్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ఫొటో తీయడంతో ఈ విషాదం బయటికొచ్చింది. ప్రపంచ దేశాలను కదిలించింది.
 
మాలూలూబా... ఐ లవ్ యూ!!
అనగనగా నటాలియా అనే ఓ ఫ్రెంచి అమ్మాయి. ఒంటరిగా ఆస్ట్రేలియాకి వచ్చింది. మాలూలుబా అనే బీచ్‌లో అటూ ఇటూ తిరిగి, ఓ ఐరిష్ పబ్‌లో ఓ అందగాడిని కలిసింది. ఆమె సొగసరి. అతడు గడసరి. అటు అలల హోరు. ఇటు వయసు జోరు. పైన వెన్నెల రాత్రి. కింద ఇసుక తిన్నెలు... తెల్లారిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆరు వారాల తరువాత ఆమెకి తాను తల్లి కాబోతున్నట్టు తెలిసింది. ఆమెలోని మాతృత్వం ఆమెను కనీసం పేరైనా తెలియని ఆ తండ్రి కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఓ యూట్యూబ్ వీడియో పోస్ట్ చేసి, ఆయన్ని, నా బిడ్డని కలపండి అని వేడుకుంది. ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ప్రజలు బీచ్ వెంట వెతుకులాడారు. నెట్‌లో లక్షల సంఖ్యలో వీడియోని షేర్ చేశారు. 30 లక్షల మంది వీడియో చూశారు. అందరూ వారిద్దరూ మళ్లీ కలవాలని కోరుకున్నారు. మాలూలుబా బీచ్ మార్మోగిపోయింది. ఆఖరికి రెండు రోజుల తరువాత యాండీ సెల్లర్స్ అనే యువకుడు నేనే ఆ తండ్రిని అని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్లు ఒక జంటను కలిసిన తరుణాన సంతోషంతో మాలూలుబా బీచ్ వైపు పరుగులు తీశారు. భలేగా ఉంది కదూ ఈ లవ్ స్టోరీ... ఆగండాగండి. అక్కడే అసలు ట్విస్ట్! ఇదంతా మాలూలుబా బీచ్‌కి, అక్కడి ఐరిష్ హోటల్‌కి పబ్లిసిటీ ఇచ్చేందుకు యాండీ సెల్లర్స్ చేసిన చిలిపి మార్కెటింగ్ మాయాజాలం అన్నది బయటపడింది. అంతే... ఓ అందమైన కలని చిదిమేసినందుకు ఆస్ట్రేలియన్లు ఇప్పుడు సెల్లర్స్‌ను తిట్టిపోసుకుంటున్నారు. నటాలియాను ఆడిపోసుకుంటున్నారు.
 
కిర్రెక్కించే క్లోజప్‌లు... వెర్రెక్కించే ఊహలు

‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను’ అంటూ రమాప్రభ రాజబాబుకి ఓ కథ చెబుతుంది. ఓ మీసాలోడు ఎలా తనను పక్కమీదకు లాగాడో, దుప్పట్లో ఎలా చోటిచ్చాడో, ఏమేమి చేశాడో చెబుతుంది. ఆవేశంలో రగిలిపోతాడు అమాయకపు రాజబాబు. ఆఖరికి ‘అంతకోపం ఎందుకయ్యా... అప్పుడు నా వయసు అయిదు అయ్యా... ఆ వచ్చినది మా తాతయ్య’ అని రమాప్రభ అనేసరికి రాజబాబు సిగ్గుతో మెలికలు తిరిగిపోతాడు. కార్ల్ జూనియర్ అనే పుట్టగొడుగులు, చీజ్‌తో చేసిన బర్గర్ల కంపెనీ ఇలాంటి టీజింగ్ ఎడ్వర్టయిజ్‌మెంట్‌ని నెట్టింట్లో క్రేజీ క్రేజీగా చలామణి చేసేస్తోంది. వెలుగు చీకట్లతో పుట్టగొడుగుల క్లోజప్ చూపించి, ఊహల్ని అక్కడెక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఆఖరికి లైటు వేసేసరికి పుట్టగొడుగులు కనిపిస్తాయి. కిర్రెక్కించే క్లోజప్‌లు, వెర్రెక్కించే ఊహలతో ఆకలి పెంచే ఎడ్వర్టయిజ్‌మెంట్ ఇది.
 
నెటిజనులు నెటిధనులు అవుతారా?
కాన్పూరులో ఓ కమల్‌కుమార్. ఆయన ఉండేది ఒక మురికివాడలో. ఆయన ఉద్యోగం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం. ఆ చెత్త సేకరణతోటే తన కుటుంబాన్ని నడుపుకుంటాడు. కమల్ కుమార్ ఆషామాషీ మనిషి కాదు. పేరుమోసిన బాక్సర్. నేషనల్ లెవెల్‌లో బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని తన సత్తా ఏమిటో చూపించాడు. కానీ కాలం కలిసిరాక బతుకు చెత్తబండిని లాగుతున్నాడు. కనీసం తన పిల్లవాడిని బాక్సర్ చేసేందుకు సాయం చేసేవారికోసం ఎదురుచూస్తున్నాడు. క్వింట్ అనే వెబ్‌సైట్ కమల్ కుమార్ కథను వీడియో రూపంలో నెట్‌లోకి అప్‌లోడ్ చేసింది. లైక్స్ బోలెడన్ని వస్తున్నాయి. కానీ లైక్‌లతో కడుపు నిండదు. నెటిజనులు నెటిధనులు అవుతారా? కమల్ కుమార్ కష్టాన్ని తీరుస్తారా? నెట్ న్యూస్‌లోనే చూద్దాం...
 
చాయ్‌తో చదువు
కెఫే కాఫీడే, క్రాస్ వర్డ్ పుస్తకాల షాపు కలిసున్న చోట, బుక్ షాప్‌లో నుంచి కావలసిన పుస్తకాన్ని తీసుకుని కాఫీ తాగుతూ చదివేయొచ్చు. వెళ్లేటప్పుడు కావాలంటే పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. లేకపోతే అక్కడే వదిలేసి రావచ్చు. సరిగ్గా అలాంటి హోటలే నడుపుతున్నాడు 62 ఏళ్ల లక్ష్మణ్ రావ్. మహారాష్ట్ర అమరావతి నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడ ఒక ఫుట్ పాత్ టీ షాపు నడుపుతున్నాడు. దాని పక్కనే తాను రాసిన 12 హిందీ పుస్తకాలను కూడా పెడుతున్నాడు. ఆయన నవలలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రజలు చాయిలో నంజుకుని తినేస్తున్నట్టు చదువుతున్నారు. అక్కడ నిజంగా చాయ్ పే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇందిరా గాంధీ నుంచి ఎందరో ప్రముఖులతో ఆయన దిగిన ఫొటోలు కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి.
 
సైజ్ జీరోకి సవాలు
 అందంపై అమెరికన్ల ఆలోచనలు చైనా అమ్మాయిల ఇనప బూటు లాంటివి. అవి అమ్మాయిలను సైజ్ జీరోల చట్రంలో బిగించేస్తాయి. బతుకును క్యాలరీల లెక్కలకు, నడుము కొలతలకు, కొలెస్టరాల్ తీసివేతలకు పరిమితం చేసేస్తాయి. బొద్దుగా ఉండటం పాపమేమోనన్నట్టు చేసేస్తాయి. ఏ ఫర్ అనోరెక్సియా, బి ఫర్ బులీమియా... ఇలా అక్షరానికో అనారోగ్యం చొప్పున వచ్చినా ఫరవాలేదు. బ్యూటీ కొలతలు తప్పడానికి వీల్లేదనే వేలంవెర్రి స్థాయికి దిగజార్చేస్తాయి. అలా బొద్దుగా, ముద్దుగా ఉన్న ఓ పాప కత్తెరతో కోసేసుకునైనా లావు తగ్గాలని ప్రయత్నిస్తు న్నట్టున్న ఓ ఫొటోను టెర్రీ హెమెన్ వే అనే మహిళ ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. అక్షరాలా లక్షా పన్నెండు వేల మంది లైక్ చేశారు. సైజ్ జీరో వేలం వెర్రిని సవాలు చేసే ఈ ఫోటోను చూడండి. లైక్ చేయండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement