ఏ ‘క్లిక్‌’లో ఏ ‘కీడు’ దాగుందో! | Today is International Safer Internet Day: Awareness on the Safe Internet | Sakshi
Sakshi News home page

ఏ ‘క్లిక్‌’లో ఏ ‘కీడు’ దాగుందో!

Published Tue, Feb 8 2022 4:09 AM | Last Updated on Tue, Feb 8 2022 5:44 PM

Today is International Safer Internet Day: Awareness on the Safe Internet - Sakshi

ప్రతిష్ట అరోరా, ప్రాజెక్ట్‌ మేనేజర్‌

అంతర్జాలం (ఇంటర్‌నెట్‌)లో ఉన్న విచిత్రం ఏమిటంటే... ‘మాకేమీ తెలియదు’ అనేవాళ్లే కాదు... ‘మాకంతా తెలుసు’ అనుకునేవాళ్లు కూడా బోల్తా పడుతుంటారు. ఎందుకంటే కొత్త ప్రమాదాలు సరికొత్త రూపాల్లో వస్తుంటాయి. అందుకే అంతర్జాలం అంటే ఆసక్తి మాత్రమే కాదు అనేక రకాలుగా అప్రమత్తంగా ఉండాలి...

బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే కొందరు ఆకతాయిలు ఆన్‌లైన్‌లో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైకి చెందిన శ్వేత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపోమాపో పెళ్లి. ఈలోపు అబ్బాయి తండ్రి నుంచి కబురు వచ్చింది. ‘పెళ్లి క్యాన్సిల్‌’ అని!

అమ్మాయి తరపు వాళ్లు ఆవేశంతో అతడిని నిలదీయబోతే కొన్ని ఫొటోలు చూపించాడు. శ్వేత ఎవరో అబ్బాయితో ఉన్న ఫోటోలు అవి. అంతే! ఆవేశంగా వచ్చిన వారు సైలెంటైపోయారు. వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లారు. ‘మా పరువంతా తీశావు’ అని కూతురిని తిట్టడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు.

 ‘ఈ బతుకు వృథా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు’ అనుకుంది శ్వేత. కాని అలా చేస్తే నిందను నిజం చేసినట్లవుతుంది కాబట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులతో మాట్లాడింది. వాళ్లు దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే, అవి మార్ఫింగ్‌ ఫోటోలని. తామంటే  గిట్టని బంధువులే ఈ పని చేశారు! ఒక్క మార్ఫింగ్‌ అనేకాదు... ఆర్థిక మోసాలు, సైబర్‌ బుల్లింగ్‌... మొదలైనవి అంతర్జాలం అంటే అంతులేని భయాన్ని సృష్టిస్తున్నాయి.

అందుకే కొందరు మహిళలు అంతర్జాలానికి అందనంత దూరంలో ఉంటున్నారు. కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్‌తోనే అనుసంధానమై ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీకి చెందిన ‘సోషల్‌మీడియా మ్యాటర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ  ‘మోసం జరిగాక అయ్యో! అని నిట్టూర్చడం కంటే మోసం జరిగే అవకాశమే ఇవ్వకుంటే బాగుంటుంది కదా!’ అనే విధానంతో రంగంలోకి దిగింది. పన్నెండుమంది యువతీ యువకులు ఉన్న బృందం సోషల్‌ మీడియా మ్యాటర్స్‌.

సేఫ్‌ ఇంటర్నెట్‌  గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న ‘సోషల్‌ మీడియా మ్యాటర్‌’ సంస్థ సభ్యులు

స్కూల్, కాలేజీ, యూనివర్శిటీ, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాలు... మొదలైన వాటిలో ఇంటర్నెట్‌ సెక్యూరిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులు బోర్‌ కొట్టకుండా ఉండటానికి ఎమోజీకేషన్‌ టెక్నిక్‌ ఉపయోగించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను సందర్భోచితంగా ఉదహరిస్తారు, పిట్టకథలు చెబుతారు. ఆకట్టుకునే చిత్రాలను ప్రదర్శిస్తారు.

‘రూల్స్‌ అండ్‌ టూల్స్‌ వితిన్‌ సైబర్‌స్పేస్‌’లో భాగంగా డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కాపాడుకోవడం, సెక్యూరిటీ ఆఫ్‌ కనెక్షన్స్‌... మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది సోషల్‌ మీడియా మ్యాటర్స్‌.

వర్క్‌షాప్‌కు వెళ్లడానికి మొదట్లో ఆసక్తిగా అనిపించలేదు. ఫ్రెండ్‌తో కలిసి వెళ్లా. ఇంటర్నెట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– ఆనంది, నాగ్‌పూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement