న్యూఢిల్లీ: బలవంతంగా మతం మార్చడం ముమ్మాటికీ తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. భారతదేశంలో నివస్తున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అయితే,
సమాజానికి సేవ చేయడం కోసం మరో మతంలోకి వెళితే అది బలవంతపు మత మార్పిడి కాదని పేర్కొంది. అలాంటి కేసులకు గతంలో తీర్పులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించింది. అలాగే.. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగే మత మార్పిడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మత మార్పిడుల వ్యవహారంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. బలవంతపు మత మార్పిడులు దేశ భద్రతకు ప్రమాదకరం కావొచ్చని సుప్రీంకోర్టు గతంలో వెల్లడించింది. అంతేకాకుండా పౌరుల మత స్వేచ్ఛకు కూడా ప్రతిబంధకమేనని పేర్కొంది. ఇలాంటి మత మార్పిడులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఇదీ చదవండి: మూన్‌లైటింగ్‌పై సీజేఐ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment