charity organizations
-
రూట్స్ : సేవే శక్తి!
ఉత్సాహం నుంచి శక్తి జనిస్తుంది. మరి ఆ ఉత్సాహం ఎలా వస్తుంది? ఎవరి మాట ఎలా ఉన్నా... విట, జలజ్ దాని దంపతులకు మాత్రం ఆ ఉత్సాహం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల ద్వారా వస్తుంది. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన ఈ దంపతులు తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక మంచి పని చేసి చూడండి. అందులో నుంచి వచ్చే శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది’ అంటున్నారు... ముందుకు వెళ్లడం మంచిదేగానీ వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా మంచిదే. విటల్, జలజ్ దాని దంపతులు అదే చేశారు. వారి తాత స్వçస్థలం గుజరాత్‌లోని చారిత్రక పట్టణం కపడ్ వంజ్. ఆయన రకరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఆయన సేవాకార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎనభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ‘కపడ్వంజ్ కెలవాణి మండల్’ (కెకెఎం) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సంస్థ పరిధిలో పదమూడు విద్యాసంస్థలు ఉన్నాయి. ‘కెకెఎం’తో కలిసి పనిచేయడం విట, జలజ్ దంపతులలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత... తమ సేవాకార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘దాని ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ‘కెకెఎం’తో పాటు అన్నమిత్ర ట్రస్ట్, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘అన్నమిత్ర’తో కలిసి దేశంలోని 6,500 పాఠశాలలో పిల్లల కోసం మ«ధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘బాలకార్మిక వ్యవస్థ పోవాలంటే ముందు పిల్లలకు కడుపు నిండా తిండి దొరకాలి. ఆ భోజనమే వారిని విద్యకు దగ్గర చేస్తుంది. అభివృద్థిపథంలోకి నడిపిస్తుంది’ అంటుంది విట. ‘ప్రథమ్’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి అట్టడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంది దాని ఫౌండేషన్. సేవా కార్యక్రమాలే కాకుండా తమ కుమారుడు, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ కోరిక మేరకు ఆటలపై కూడా దృష్టి సారించారు. ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ఆటలకు ప్రాచుర్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో క్రీడాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లెవెల్లో పిల్లలను క్రీడల్లో తీర్చిదిద్దడానికి హై–పెర్ఫార్మెన్స్ ప్లాన్స్, హై–పెర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. గతంతో పోల్చితే విద్యార్థులు ఆటలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటుంది విట... ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. మన దేశంలో కోట్ల జనాభా ఉంది. ఇలాంటి దేశంలో మనం ఛాంపియన్లను తయారు చేయలేమా!’ ‘క్రీడలపై వారి అనురక్తి, అంకితభావాన్ని దగ్గరి నుంచే చూసే అవకాశం వచ్చింది. క్రీడారంగంపై వారు చేపడుతున్న కార్యక్రమాల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అంటున్నాడు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా. గతకాలం మాట ఎలా ఉన్నా విట ప్రస్తుతం తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతుంది. ‘ఆడ్వర్బ్ టెక్నాలజీ ప్రైవెట్ లిమిటెడ్’ చైర్మన్ జలజ్ కంపెనీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలకు తగిన సమయం కేటాయిస్తుంటాడు. విట దృష్టిలో స్వచ్ఛంద సేవ అంటే చెక్ మీద సంతకం చేయడం కాదు. యాంత్రికంగా చేసే పని కాదు. మనసుతో చేసే మంచిపని. ప్రజలతో కలిసి పోయి చేసే ఉత్తేజకరమైన పని. ‘ఆటలో ఉత్సాహం ఉంటుంది. వినోదం ఉంటుంది. గెలుపు కోసం చేసే పథక రచన ఉంటుంది. లైఫ్ స్కిల్స్‌ను పిల్లలు ఆటల్లో నుంచే నేర్చుకోవడం మొదలు పెడతారు. – విట, దాని ఫౌండేషన్ -
Snehalatha Mekala: అట్టడుగు వర్గాల కోసం అంతర్జాతీయ వేదికలపై...
ఎనిమిది దక్షిణాసియా దేశాలూ, అభివృద్ధికి నోచుకోని అనేక ఆఫ్రికాలోని వెనకబడిన దేశాల పల్లెల్లోని అట్టడుగు వర్గాలు, మారుమూల గిరిజనులకు, నగరాల్లోని మురికివాడల్లో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న వందలాది సంస్థల్ని సమన్వయం చేసే బాధ్యతలు... చాలా దేశాల్లోని పేదలూ, అణగారిన ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్లాంటి వారి అవసరాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడంతో పాటు వారికి అందాల్సిన సేవలూ, సౌకర్యాల విధాన రూపకల్పనలకు కృషి.. తమ పరిశోధనల్ని అంతర్జాతీయ సంస్థలకూ, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకూ, అక్కడి నేతలకు తెలియజెప్పే పని... అర్ధరాత్రి, అపరాత్రుల్లేకుండా దాదాపు 35 పైగా దేశాల్లో పర్యటనలు... ఇవన్నీ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న సార్క్ దేశాల, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త ‘స్నేహలత మేకల’తో మాటా మంతీ... ► ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి... స్నేహలత : మన దేశంలోనే కాకుండా... మరెన్నో దేశాలలోని కుగ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో, పేదరికం తాండవిస్తున్న కొన్ని దేశాల్లోని మారుమూల పల్లెల్లో, పట్టణ మురికివాడల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కల్పనకు అవసరమైన విధాన రూపకల్పనలతో పాటు అనేక సేవా కార్యకలాపాల రంగంలో పాలుపంచుకుంటున్నాను. మనదేశంతోపాటు బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని 500 పైగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలను సమన్వయపరుస్తూ... అవి తమ అవసరాలను, అభిప్రాయాలను అంతర్జాతీయ వేదికలపైన తెలియజెప్పే బాధ్యతలను, ప్రభుత్వ సహాయాలు అందేందుకు లోపరహితమైన విధాన రూపకల్పనలో పాలుపంచుకునే‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ శానిటేషన్ ఫర్ ఆల్’ (సాకోశాన్) ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. అట్టడుగువర్గాలు, గిరిజనలతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్ లాంటివారి వెతలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడమే కాకుండా... ఆ సేవలన్నీ వారికి ఎలా అందాలన్న విధాన రూపకల్పనపై ప్రభుత్వాలతో కలిపి పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమాల కోసం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలు మొదలుకొని... యూఎస్, ఫ్రాన్స్, బెల్జియమ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం. ► ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కార్యకలాపాలూ, వాటిల్లో మీ భాగస్వామ్యం... ఇది రెండు విధాలుగా జరుగుతుంది. వివిధ దేశాల్లోని 500 స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పాటు, బడుగువర్గాలు, నగర మురికివాడల్లోని పేద ప్రజల వెతలు తీర్చడానికి వివిధ దేశాల్లోని హైలెవల్ పొలిటికల్ కమిటీలు, ప్రభుత్వంలోని నేతలు, బాధ్యులందరూ తీసుకోవాల్సిన చర్యలు, అవి జరగడానికి అవసరమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో తోడ్పాటు అందిస్తుంటాను. అలాగే అట్టడుగు వర్గాలు, గిరిజనుల గొంతుకను అంతర్జాతీయ వేదికలపై వినిపించడం... ఇదంతా ఒకవైపు కార్యక్రమం. ఇక మరోవైపున మా ప్రతిపాదనలు సాకారమయ్యాక... వీటి నిర్వహణకు కావలసిన పాలనాపరమైన ఆవశ్యకతలు, నిధులు... ఇవన్నీ అనేక దేశాల్లోని బడుగువర్గాలు, నగర మురికివాడల ప్రజలకు చేరేందుకు అవసరమైన సేవలందిస్తుంటాం. ► ఇన్ని దేశాల్లోని ఇన్నిన్ని మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులెలా? మాకు యునిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్, వాటర్ ఎయిడ్, జీడబ్ల్యూపీ వంటివాటితో పాటు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు నిధుల్ని అందిస్తాయి. ► అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మీ ప్రవేశం... ఇందుకు దోహదపడ్డ నేపథ్యం... నా కెరియర్ కర్నూలులో మొదలైంది. వాననీటిని ఒడిసిపట్టి, చెక్‌డ్యామ్స్ వంటివి నిర్మించి, భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే ‘వాటర్‌షెడ్’ కార్యక్రమంలో చాలా చిన్నస్థాయి ‘సోషల్ ఆర్గనైజర్’గా కెరియర్ ప్రారంభించా. ఈ కార్యక్రమంలో ఓ వ్యవసాయ అధికారి, ఓ ఇంజనీర్, ఓ ఫారెస్టు అధికారితోపాటు కలిసి ఫీల్డ్‌లో పనిచేయాలి. మారుమూల ప్రాంతాలతోపాటు కొన్నిసార్లు గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి వచ్చేది. క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలూ, వేదికలపై కార్యకలాపాలతో పాటు ప్రపంచబ్యాంకుకూ, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలకు కన్సెల్టెన్సీ బాధ్యతలనూ నిర్వర్తించా. ప్రస్తుతం తాజాగా ‘ఫాన్సా’ లో ముఖ్యంగా సమన్వయ బాధ్యతలు. ఈ కార్యక్రమంలోనే భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ బోర్డుతో కలిసి ఇక్కడ కూడా నీటి వృథా నివారించడం, వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఓ ప్రాజెక్టులో భాగం పంచుకున్నా. ► భవిష్యత్తు కార్యకలాపాల గురించి ఏమైనా ప్రణాళికలు? ప్రస్తుతం ఈ సేవలతో పాటు కొంపల్లి ప్రాంతంలో ‘నిశ్చింత’ అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా. అది నాకెంతో ఇష్టమైన సేవా కార్యక్రమం. చేయగలిగినంత కాలం చేశాక... నేనూ, నా భర్త... పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్నే ఎంచుకుని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంతమందికి ఆరోగ్యాన్నివ్వాలన్నదే నా సంకల్పం. ఆమె సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం. ► మహిళగా వివక్షగానీ, ఇబ్బందులుగానీ ఎదుర్కొన్నారా? స్నేహలత : వివక్ష కాదుగానీ... ఇబ్బందులు చాలానే ఎదుర్కొన్నా. మారుమూల పల్లెలకూ, దట్టమైన అడవుల్లోని చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో నన్ను తీసుకెళ్లడానికి తోటివాళ్లు ఇబ్బంది పడేవారు. పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ఇలా గ్రామాలు పట్టుకు తిరగడం నాకంటే... నాతోటివాళ్లనీ, గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టేది. వాళ్లతో మమేకం కావడానికీ, వయసుకంటే పెద్దగా కనిపించడానికీ చీరకట్టుతో వెళ్తుండేదాన్ని. అడవిబాటల్లో చీరకట్టుతో ప్రయాణం అదో ఇబ్బంది. కాన్ఫరెన్స్‌ల కోసం ఇంగ్లిష్ తెలియని ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు ఓ సవాల్. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఆఫ్రికాలోని బుర్కినాఫాస్ లాంటి చోట్లకు వెళ్లినప్పుడు కేవలం సైగలతో నెట్టుకురావడం లాంటివి ఇబ్బంది కలిగించేవే. ఒంటరిగా దాదాపు 35 దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని అటవీ ప్రయాణాలు, అర్ధరాత్రి పయనాలు సాహసయాత్రకు తీసిపోనివిగా ఉండేవి. మహిళలకు ఫీల్డ్ జాబ్ అనువు కాదని ఈ రోజుల్లో అనుకోడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. మూడు దశాబ్దాల కిందటే నేనూ, అలాగే మా తరంలోని అనేకమంది చేయగలిగినప్పుడు... ఇప్పుడిది ఓ అంశమే కాదు. – యాసీన్ ఫొటో: రాజేశ్ -
బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమే, కానీ..
న్యూఢిల్లీ: బలవంతంగా మతం మార్చడం ముమ్మాటికీ తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. భారతదేశంలో నివస్తున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అయితే, సమాజానికి సేవ చేయడం కోసం మరో మతంలోకి వెళితే అది బలవంతపు మత మార్పిడి కాదని పేర్కొంది. అలాంటి కేసులకు గతంలో తీర్పులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించింది. అలాగే.. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగే మత మార్పిడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మత మార్పిడుల వ్యవహారంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. బలవంతపు మత మార్పిడులు దేశ భద్రతకు ప్రమాదకరం కావొచ్చని సుప్రీంకోర్టు గతంలో వెల్లడించింది. అంతేకాకుండా పౌరుల మత స్వేచ్ఛకు కూడా ప్రతిబంధకమేనని పేర్కొంది. ఇలాంటి మత మార్పిడులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదీ చదవండి: మూన్‌లైటింగ్‌పై సీజేఐ సంచలన వ్యాఖ్యలు -
గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
ఏ ‘క్లిక్’లో ఏ ‘కీడు’ దాగుందో!
అంతర్జాలం (ఇంటర్నెట్)లో ఉన్న విచిత్రం ఏమిటంటే... ‘మాకేమీ తెలియదు’ అనేవాళ్లే కాదు... ‘మాకంతా తెలుసు’ అనుకునేవాళ్లు కూడా బోల్తా పడుతుంటారు. ఎందుకంటే కొత్త ప్రమాదాలు సరికొత్త రూపాల్లో వస్తుంటాయి. అందుకే అంతర్జాలం అంటే ఆసక్తి మాత్రమే కాదు అనేక రకాలుగా అప్రమత్తంగా ఉండాలి... బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే కొందరు ఆకతాయిలు ఆన్లైన్లో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైకి చెందిన శ్వేత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపోమాపో పెళ్లి. ఈలోపు అబ్బాయి తండ్రి నుంచి కబురు వచ్చింది. ‘పెళ్లి క్యాన్సిల్’ అని! అమ్మాయి తరపు వాళ్లు ఆవేశంతో అతడిని నిలదీయబోతే కొన్ని ఫొటోలు చూపించాడు. శ్వేత ఎవరో అబ్బాయితో ఉన్న ఫోటోలు అవి. అంతే! ఆవేశంగా వచ్చిన వారు సైలెంటైపోయారు. వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లారు. ‘మా పరువంతా తీశావు’ అని కూతురిని తిట్టడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు. ‘ఈ బతుకు వృథా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు’ అనుకుంది శ్వేత. కాని అలా చేస్తే నిందను నిజం చేసినట్లవుతుంది కాబట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులతో మాట్లాడింది. వాళ్లు దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే, అవి మార్ఫింగ్ ఫోటోలని. తామంటే గిట్టని బంధువులే ఈ పని చేశారు! ఒక్క మార్ఫింగ్ అనేకాదు... ఆర్థిక మోసాలు, సైబర్ బుల్లింగ్... మొదలైనవి అంతర్జాలం అంటే అంతులేని భయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే కొందరు మహిళలు అంతర్జాలానికి అందనంత దూరంలో ఉంటున్నారు. కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్తోనే అనుసంధానమై ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీకి చెందిన ‘సోషల్‌మీడియా మ్యాటర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘మోసం జరిగాక అయ్యో! అని నిట్టూర్చడం కంటే మోసం జరిగే అవకాశమే ఇవ్వకుంటే బాగుంటుంది కదా!’ అనే విధానంతో రంగంలోకి దిగింది. పన్నెండుమంది యువతీ యువకులు ఉన్న బృందం సోషల్ మీడియా మ్యాటర్స్. సేఫ్ ఇంటర్నెట్ గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న ‘సోషల్ మీడియా మ్యాటర్’ సంస్థ సభ్యులు స్కూల్, కాలేజీ, యూనివర్శిటీ, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాలు... మొదలైన వాటిలో ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులు బోర్ కొట్టకుండా ఉండటానికి ఎమోజీకేషన్ టెక్నిక్ ఉపయోగించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను సందర్భోచితంగా ఉదహరిస్తారు, పిట్టకథలు చెబుతారు. ఆకట్టుకునే చిత్రాలను ప్రదర్శిస్తారు. ‘రూల్స్ అండ్ టూల్స్ వితిన్ సైబర్‌స్పేస్’లో భాగంగా డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కాపాడుకోవడం, సెక్యూరిటీ ఆఫ్ కనెక్షన్స్... మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది సోషల్ మీడియా మ్యాటర్స్. వర్క్‌షాప్‌కు వెళ్లడానికి మొదట్లో ఆసక్తిగా అనిపించలేదు. ఫ్రెండ్‌తో కలిసి వెళ్లా. ఇంటర్నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – ఆనంది, నాగ్‌పూర్ -
ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు
న్యూజెర్సీ: ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్మారకర్ధం ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జూన్ 27న ఏర్పాటైంది. ఈ సంస్థతో పలు గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా అనేకమంది పాల్గొన్నారు. కాగా ఈ స్వచ్ఛంద సంస్థకు శ్రీనివాస్ గూడూరు ఛైర్మన్ గా, అధ్యక్షుడిగా భాస్కర్ గంటి, వైస్ చైర్ పర్సన్ గా రాజేశ్వరి బుర్రా, కార్యదర్శిగా లక్ష్మి మోపర్తి, కన్వీనర్ గా ప్రవీణ్ గూడూరు, సలహా సంఘం సభ్యుడిగా దాము గేదెల వ్యవహరించ నున్నారు. సంస్థ భవిష్యత్తు గాయనీ గాయకులకు పోటీలను నిర్వహించి ఎస్పీబీ పేరు తో అవార్డు ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటుపై ఎస్పీ శైలజ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పిన ఈ సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, అందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని సంస్థ ముఖ్య సలహాదారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ళ భరణి , వడ్డేపల్లి కృష్ణ, న్యూజెర్సీ కమిషనర్ ఆఫ్ యుటిలిటీస్ ఉపేంద్ర చివుకుల, లీడ్ ఇండియా యూఏస్ఏ ఛైర్మన్ హరి ఎప్పనపల్లీ, తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి, ఓం స్టూడియో అధినేత అశోక్ బుద్ది, రామాచారి, మాధవపెద్ది సురేష్ , తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ చెందిన ప్రముఖ గాయకులు మనో, సుమన్, మల్లికార్జున్, గోపిక పూర్ణిమ, పార్థు నేమాని , విజయ లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు. యూఎస్ఏ ఇతర దేశాల్లోని పలు తెలుగు సంఘాల నాయకులు, వేగేష్నా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వంశీరామరాజు, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ బాల ఇందూర్తి, టిఎఫ్ఏఎస్ ప్రెసిడెంట్ శ్రీదేవి జగర్లాముడి, జీఎస్‌కేఐ ప్రెసిడెంట్ మధు అన్నా, శ్రీవాస్ చిమట తదితరులు ప్రసంగించారు. ఎస్పీబీపై ప్రశంసలు కురిపించారు. బాలూ వ్యక్తిత్వం ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. -
కాస్త.. చూసి వడ్డించండి
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అని భోజనాన్ని దైవంతో పోలుస్తాం. ఇలాంటి మన దేశంలో ఆహార పదార్ధాల వృథా పెరిగిపోతోంది. ఓ పక్క దేశంలో ఆహార భద్రత కరువై పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోపక్క పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, శుభకార్యాల పేరిట చేస్తున్న హం గామాతో వేల కోట్ల విలువైన ఆహారం చెత్తకుప్పల్లోకి వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరుగుతున్న శుభకార్యాల ద్వారా కనిష్టంగా 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతోందని, దాని విలువ కనిష్టంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అంచనా వేసింది. ఆర్థిక, సామాజిక పరపతిని చూపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో వంటకాలు పెట్టడం, భారీ సంఖ్యలో జనం హాజరైన సందర్భాల్లోనే వృథా ఎక్కువగా ఉంటోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. 75 రోజులు.. 838 కార్యక్రమాలు.. ఓ సర్వే దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో 21.4 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కరువైంది. మూడేళ్లలోపు చిన్నారుల్లో 46% మంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఆహార కొరత కారణంగా 23% మంది తక్కువ బరువు తో పుడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల పేరిట భారీగా ఆహార వృథా దేశాన్ని పట్టి పీడుస్తోందని కేంద్రం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు.. అసలు ఎక్కడెక్కడ వృథా ఎక్కువగా ఉంది.. ఆర్థిక ప్రభావం ఏయే సందర్భాల్లో వృథా పెరుగుతోంది.. వంటి అంశాలపై కేంద్ర ఆహార సంస్థ ప్రధాన పట్టణాల్లో సర్వే చేయించింది. దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు ఆతిథ్య రంగ సంస్థలు, వివిధ రకాల ప్రజలు, చెత్త నిర్వహణ సిబ్బందితో విడివిడిగా ఓ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసింది. 838 వివాహాది శుభకార్యాలను, సాంఘిక జన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. దీనిని విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ముఖ్య పరిశీలనలు ఇలా.. - వివాహాది కార్యక్రమాల సమయంలో వృథా ఎక్కువగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 89 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వార్షికోత్సవాలు, పుట్టిన రోజు వేడుకల్లో వృథా ఎక్కువని 32.5 శాతం ప్రజలు అభిప్రాయాలు చెప్పారు. - ఆతిథ్య రంగ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం వృథా ఉంటోందని 44.9 శాతం ప్రజలు తెలిపారు. - వృథా అవుతున్న దాంట్లో 67.9% ఎక్కువ వంటకాలు వడ్డించి నప్పుడు, 57.4% భారీగా జనాలు హాజరైనప్పుడు ఉంటోంది. ఇందులో కూరగాయల భోజనంలో వృ«థా ఎక్కువగా ఉండగా, బియ్యం, బిర్యానీ వంటకాలను ఎక్కువగా పారేస్తున్నారు. - కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించిన సమయంలో ఆహార వృథా 11.45 శాతమే ఉంటుండగా, క్యాటరింగ్ నిర్వాహకులు వడ్డిస్తే 14.45 శాతం ఉంటోంది. బఫేలో అయితే ఈ వృథా 74.95 శాతం ఉంటోంది. - వడ్డించకుండా వదిలేసిన, లేక మిగిలిన వంటకాలను చారిటీలకు లేక ఎన్జీవోలకు దానం చేసే విధానం 7.2 శాతం మాత్రమే ఉండగా, 15.6 శాతం వివిధ సందర్భాల్లో జరుగుతోంది. 77.2 శాతం మాత్రం పూర్తిగా వృథాగానే పారేస్తున్నారు. 10 వేల కోట్ల వృథా.. దేశంలో ఆర్థిక సంపద పెరుగుతున్న మాదిరే మధ్య, దిగువ తరగతి సంపద వృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగానే శుభకార్యాల నిర్వహణ, వాటిల్లో ఆహార వంటకాలపై ఖర్చు పెరిగిందని కేంద్రం అధ్యయనం తేల్చింది. సమాజంలో ఆర్ధిక పరపతిని చూపేందుకు, సామాజికంగా తన బలాన్ని తెలిపేందుకు కార్యక్రమాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడటం లేదని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏటా రూ.1.10 లక్షల కోట్లు శుభకార్యాలపై ఖర్చు చేస్తుండగా, ఇందులో రూ.40 వేల కోట్ల మేర అంటే దాదాపు 40 శాతం ఆహార వంటకాలపై వెచ్చిస్తున్నారు. ఇందులో 15 నుంచి 25 శాతం అంటే రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోంది. వంటకాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, భారీగా జనాలు హాజరైనప్పుడే వృథా ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఏటా పెళ్లిళ్లు, ఇతర సామూహిక సమ్మేళనాల పేరిట రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని అంచనా ఉంది. ఇందులో రూ.4 వేల కోట్ల మేర వంటకాలపై ఖర్చు చేస్తున్నా, ఆహార వృ«థా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని కేంద్ర నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనలు ఇలా.. - అతిథుల సంఖ్యను పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఆహార వృథాపై అవగాహన కల్పించడమే సరైన మార్గం. - కొన్ని స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసేలా చూడాలి. - ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రణాళిక లేకపోవడంతో ఆహార వృథా అవుతోంది. దీన్ని నివారించాలి. - ఆహ్వాన పత్రికల మీద ఆహార వృథాపై అవగాహన సందేశాలతో పాటు కార్యక్రమానికి హాజరయ్యేది, లేనిది ముందే సమాచారం ఇచ్చేలా ఆహ్వానితులకు అవగాహన కల్పించాలి. - ఆహారాన్ని గౌరవించేలా, వృథా వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పేలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఈ అంశంపై బోధన ఉండాలి. - అస్సాం, రాజస్థాన్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లో గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆరు రకాలైన వంటకాలు మాత్రమే శుభకార్యాల్లో వడ్డించాలనే నిబంధన ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఫలితం ఉంటుంది. - (సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి) -
లీజ్ డీడ్‌తో పాగా..
గచ్చిబౌలి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు పథకం పన్నారు. స్థలం యజమానుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు స్థలానికి యజమాని ఎవరు, అద్దెకు ఉంటున్న వారి వివరాలు ఆరా తీశారు. తప్పుడు పత్రాలతో స్థలం ఆక్రమించడమేగాక అమాయకులకు విక్రయించి రూ. లక్షలు దండుకున్న ప్రగతి సొసైటీ కమిటీ సభ్యులతో పాటు 25 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 32లో ఐటీ కంపెనీల సమీపంలో 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. 2000 సంవత్సరంలో ఐఐసీ సిస్టమ్స్ 3 ఎకరాలు, బ్రిజేష్ కోహల్ 20 గుంటలు, బాబురావు 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. యూఎల్‌సీకి దరఖాస్తు చేసుకోగా 2005లో ప్రభుత్వం దీనిని రెగ్యులరైజ్ చేసింది. 2014 వరకు యజమానులే పొజిషన్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు, కమిటీ సభ్యులు సదరు స్థలాన్ని క్రమించారు. అంతేగాక సదరుస్థలం తమదేనని నమ్మించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. 165 మంది గదులను నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటుండగా, దీనికి ప్రగతినగర్ గా నామకరణం చేయడమేగాక జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నెంబర్లు, విద్యుత్ మీటర్లు తీసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో మోసం.... మొబైల్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు ధర్మరాజు 1991లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తనకు గచ్చిబౌలిలోని వివిధ సర్వే నెంబర్లలో 99 ఎకరాలు పట్టా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించాడు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు అప్పట్లో ధర్మరాజుపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అంతేగాక అతడిపై అప్పటికే సైఫాబాద్, మాదాపూర్ పీఎస్‌లలో కేసులు ఉన్నాయి. లీజ్ డీడ్‌తో ఆక్రమణ.. కాగా ధర్మరాజు సదరు స్థలాన్ని ప్రగతి సొషల్ ఆర్గనైజేషన్‌కు లీజుకు ఇస్తున్నట్లు శామీర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లీజు డీడ్ సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు గచ్చిబౌలి సర్వే నెంబర్ 32లో నాలుగు ఎకరాల స్థలం తమదేనని పేర్కొంటూ ఆక్రమించారు. అరెస్టయ్యింది వీరే.... ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు కంచి నాగమణి, కంచి సురెందరయ్య, ఇ. ముత్తు, జి. చెన్నయ్య, ఎం. విక్రమ్, భాస్కర్‌రావు, తలారి రాము, లక్ష్మీబాయి, వి.గోవిందమ్మ, బి.సంతోష, ఏ. జాములు, ఎల్. కోటయ్య, ఎం. శివకుమార్, ఎల్. పాండు, ఎన్. జీవన్‌కుమార్, ఎన్. దానేడప్ప, బి. శివాజీ, ఎస్. రవీందర్, వి.సుధాకర్, కె. సుందర్రావు, కోటేశ్వర్రావు, ఎం.యాదగిరి, ఎం. అశోక్, కె. భాస్కర్, జి.ఝాన్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగమ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుజాత, «కె. ధర్మరాజు, జి. రామారావు, పి. శ్రీనివాస్‌రావు, డి. సతీష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నోటీసులు కూడా ఇవ్వలేదు.... నోటీసులు ఇవ్వకుండానే రాయదుర్గం పోలీసులు తమను అరెస్ట్ చేశారని ప్రగతి సోషల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు నాగమణి భర్త సురెందరయ్య ఆరోపించారు. స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, సొసైటీ సభ్యులే నివాసం ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు.. సర్వే నెంబర్ 32లోని తమ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించిన యజమానులు ఐఐసీ సిస్టమ్స్, బ్రిజేష్ కోహల్, బాబురావు 2017, 2018లో సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ధర్మరాజుకు 99 ఎకరాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పట్టా ఇచ్చినట్లుగా చూపుతున్న డాక్యుమెంట్ నకిలీదిగా తేల్చింది. అంతేగాక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి కోర్టుకు నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రగతి నగర్ సోషల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు నాలుగు ఎకరాల స్థలంలో 90 చదరపు గజాల చొప్పున 165 ప్లాట్లు చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఒక్కో ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించి అమాయకులను మోసం చేశారన్నారు. నాలుగైదు ప్లాట్లు కొనుగోలు చేసి అమ్ముకున్న వారిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. 70 మంది బాధితులను విచారించి వాగ్మూలం తీసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆకలి తీర్చడంలో వింధ్య పర్వతం
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు.. అలాంటి అన్నం, కూరలను వృథాగా పారవేసే వారి వద్దకు వెళ్లి.. ఆ ఆహారపదార్థాలను సేకరించి, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందిస్తూ.. వారి ఆకలి తీర్చుతోంది సిరిసిల్లకు చెందిన ధరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వింధ్యారాణి. చేసేది చిరుద్యోగమైనా, మంచి మనసున్న మారాణి వింధ్యారాణి సిరిసిల్లలోని పేదవర్గాలకు విందు భోజనాన్ని వడ్డించే అక్షయపాత్ర అయింది.. బట్టల సేకరణతో శ్రీకారం... సిరిసిల్లలో 2004లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థను వింధ్యారాణి మరి కొందరితో కలిసి ప్రారంభించారు. సామాజికంగా సేవ చేసేందుకు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో పెద్ద బాక్స్(అట్టపెట్టె)ను ఏర్పాటు చేసి మీ పిల్లలకు సరిపోని(పట్టని) డ్రెస్‌లను ఈ డబ్బాలో వేయండి.. ఆ దుస్తులను పేద పిల్లలకు మేం అందిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ధరణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ డబ్బాలో చాలామంది కొత్త కొత్త డ్రెస్‌లను వేశారు. మంచి మంచి చీరలను మహిళలు స్వచ్ఛందంగా వేశారు. ఇలా వచ్చిన బట్టలను సిరిసిల్ల కార్మికవాడల్లో నిరుపేదలకు పంపిణీ చేశారు. 300 మంది పిల్లలకు డ్రెస్‌లు, మరో 120 మంది మహిళలకు చీరలు అందించారు. బట్టలు పాతవే కావచ్చు. కానీ ఎంతోమందికి అవి కొత్తబట్టలయ్యాయి. అలా ఒక చిన్న ఐడియాతో పేదలకు బట్టలు అందించింది ధరణి సంస్థ. రైస్ బకెట్ పేరుతో సిరిసిల్ల పట్టణంలోని భావనారుషి నగర్‌లోని ఇళ్ల నుంచి బియ్యం సేకరించారు. పది కిలోల చొప్పున 50 కుటుంబాలకు బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారు. ఇలా అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ.. ధరణి సంస్థ ముందుకు సాగుతోంది. 15ఏళ్లుగా సిరిసిల్లలో ధరణి సంస్థ మానవీయ కోణంలో సాయం అందింది. భోజనం మిగులు.. లేదు దిగులు... ఊరిలో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా ‘ధరణి’ సంస్థకు ఫోన్ వస్తుంది. సమాచారం అందగానే పరుగున వెళ్లి ప్రత్యేక పాత్రల్లో సేకరించడం.. ఆటోలో తీసుకెళ్లి కార్మికవాడల్లోని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో మిగిలిన ఆ అన్నం, ఆ కూరలను తీసుకెళ్లి కార్మికవాడల్లో పంపిణీ చేయడం పెద్ద శ్రమతో కూడిన పని అయినా నాలుగేళ్లుగా 30 వేల మందికి విందుభోజనాలు అందించిన ఘనత ధరణి సంస్థది. ఇటీవల విందుభోజనాన్ని అడవుల్లో ఆకలితో అలమటించే వన్యప్రాణులకు సైతం అందించారు. గంభీరావుపేట మండలం గోరింటాల అడవుల్లో కోతులకు ఆహారాన్ని అందించడం విశేషం. ఆర్డీవో భిక్షానాయక్ ప్రేరణ... 2015లో సిరిసిల్ల ఆర్డీవోగా పని చేసిన భిక్షానాయక్ ఆలోచనకు ధరణి సంస్థ ఆచరణ రూపమిచ్చింది. సిరిసిల్లలోని ఫంక్షన్ హాల్స్‌లో ధరణి సంస్థ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా అది పేదల కడుపు నింపేందుకు ఈ సంస్థ శ్రమిస్తుంది. అయిన వారి ఆదరణకు దూరమైన వృద్ధులకు దుస్తులు అందిస్తూ.. స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఆసరాగా ఉంటుంది ధరణి సంస్థ. మహిళా దినోత్సవం, హరితహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు సాయం చేయడంలోనూ ముందుంది. ఓ మహిళ నాయకత్వంలో ధరణి సంస్థ పేదల సేవలో ముందుకెళ్లడం విశేషం. సిరిసిల్లలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసే వింధ్యారాణి ధరణి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అప్పటి రాష్ట్రమంత్రి కేటీఆర్, అప్పటి జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51,000 నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వింధ్యారాణిని అభినందించారు. నగదు పురస్కారంగా వచ్చిన ఆ మొత్తంతో ఆటోను కొనుగోలు చేసి ధరణి సంస్థ సేవలను విస్తరించేందుకు వినియోగించడం విశేషం. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో నిరుపేదల సేవలో ముందుకు సాగుతున్న ‘ధరణి’ సంస్థ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశిద్దాం. – వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల పేదల కళ్లలో ఆనందం చూస్తున్న.. మా సంస్థ అందిస్తున్న సేవలు చిన్నవే అయినా.. పేదల కళ్లలో ఆనందం చూస్తున్న. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ధరణి సంస్థ నిర్వహణలో నా భర్త జయసింహారెడ్డి సహకరిస్తున్నారు. సంస్థలోని ఇతర సభ్యులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో బాగా పని చేయగలుగుతున్నాం. – కె. వింధ్యారాణి, సంస్థ అధ్యక్షురాలు -
రమణంపల్లి పునర్నిర్మాణానికి అడుగులు
మాడ్గుల: వంద సంవత్సరాల క్రితం కనుమరుగైన రమణంపల్లి గ్రామం పునర్నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ గ్రామాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ముందుకు వస్తున్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి–ఆర్కపల్లి గ్రామాల సమీపంలో రమణంపల్లి గ్రామం ఉన్నట్లు రికార్డుల్లో మాత్రమే పేర్కొనబడి ఉంది. ఆ గ్రామంలో పూర్వం అంటువ్యాధుల బారిన పడడంతో స్థానికులు గ్రామాన్ని వదిలిపెట్టి సుద్దపల్లి, ఆర్కపల్లికి వెళ్లి అక్కడే తలదాచుకుని కాలక్రమేణ ఆయా గ్రామాల్లోనే స్థిరపడ్డారు. అయితే వారు తమ పూర్వీకుల గ్రామాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రమణంపల్లి గ్రామం ఉన్న ప్రదేశాన్ని గతంలో గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ (వీఆర్ఓ) వారు కొనుగోలు చేసి ఆ సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు స్థానికుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలంలో మొదటి విడత 20 మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికే ఆ సంస్థ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో లబ్ధి పొందిన కుటుంబాలు సైతం పరిసర ప్రాంతంలో పెద్ద అడవి ఉందన్న భయంతో ఇళ్లలోకి వెళ్లలేదు. దీంతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. కాగా, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారి కుటుంబీకుల పేర విరాసత్ కావడంతో సదరు వ్యక్తులు తమ సొంత ఆస్తులుగా భావిస్తూ తమను ఇళ్లకు రానివ్వడం లేదని లబ్ధిదారుల వారసులు ఆరోపిస్తున్నారు. మాకు కేటాయించిన ఇళ్లను అçప్పగించాలి మాకు గతంలో వీఆర్ఓ సంస్థ వారు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. దొంగలు, అడవి జంతువుల బెడదతో పాటు విద్యుత్ సౌకర్యం లేదని మేము ఇళ్లలోకి వెళ్లలేదు. ప్రస్తుతం ఆ భయం లేనందును మాకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్తాం. మా ఇళ్లను కొంతమంది కబ్జా చేసుకుని స్థలం తమదేనంటూ బెదిరిస్తున్నారు. –ఏదుల రాములమ్మ, సుద్దపల్లి వారసులకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి గతంలో వీఆర్ఓ సంస్థ వారు డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వారసులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషిచేస్తున్నాం. సంస్థ కొనుగోలు చేసిన భూమికి సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు వ్యక్తులను గార్డియన్‌గా పెడితే వారి వారసులు భూమి తమదని చెప్పడం విడ్డూరం. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి సంస్థ సహకారంతో డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం. – యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్, సుద్దపల్లి -
అమెరికా దెబ్బ.. హఫీజ్ తిక్కకుదిరింది
అమెరికా దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. హఫీజ్ సంస్థలకు బయట ఆర్థిక మూలాలను అడ్డకుంటూ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాదంతోపాటు హఫీజ్ కార్యకలాపాలను అడ్డుకోకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు నిధులను నిలిపివేసింది. దీంతో దిక్కుతోచని పాక్, హఫీజ్‌కు చెందిన సంస్థల ఆర్థిక మూలాలకు అడ్డకట్టవేసింది. హఫీజ్ సయీద్‌కు చెందిన సంస్థలకు విరాళాలిస్తే జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుందని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ వెల్లడించింది. సయీద్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-దవా(జేయూడీ), ఫలాఫ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్) సంస్థలతో పాటు మొత్తం 72 సంస్థలపై నిషేధం విధిస్తూ బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చుతున్నట్లు పాక్ ప్రకటించింది. ఈ సంస్థలకు ఎవరైనా ఆర్థికంగా విరాళాలు అందజేస్తే 10ఏళ్ల జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా ఎరుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇవ్వడం నేరంగా పరిగనిస్తున్నామని ప్రకటిస్తూ పాక్‌లోని అన్ని మీడియా సంస్థలతో పాటు, పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా సయీద్‌కు చెందిన జేయూడీ, ఎఫ్ఐఎఫ్ సంస్థల ఆస్తులను జప్తు చేసేందుకు పాక్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉగ్రవాదుల నియంత్రణకు అమెరికా ప్రతి ఏడాది పాక్‌కు సుమారు దాదాపు రూ.7,290 కోట్లు (1.15 బిలియన్ డాలర్ల) భద్రత సాయాన్ని అందిస్తోంది. అయితే ఉగ్ర నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో పాక్‌కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. -
లిటీల్ స్టార్స్@Five Stars
స్టార్ హోటల్‌కు వెళ్లాలని.. పసందైన విందు లాంగించాలనుకునే మధ్య తరగతి మందభాగ్యులెందరో ఉంటారు. కానీ తిన్నాక చుక్కలు కనిపిస్తాయని ఆ సాహసానికి పూనుకోరు. కాస్తో కూస్తో ఉన్నవాళ్లకే ఈ పరిస్థితి ఉంటే..దిక్కూమొక్కూ లేని అనాథల పరిస్థతి ఏమిటి?.. ఐదుతారల హోటల్లో వంటకాలెలా ఉంటాయో కూడా ఊహించలేని అనాథలకు ఫైవ్‌స్టార్ రుచులను పరిచయం చేశాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. చవులూరించే భోజనమే కాదు రోజంతా ఆటపాటల తో ఎంగేజ్ చేసి చిన్నారుల మోముల్లో సంతోషం నింపాయి. ..:: దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ, హాస్టల్స్‌లో, అనాథ శరణాలయాల్లో తలదాచుకుంటున్న చిన్నారులకు సరికొత్త ఆనందం పంచాలనుకున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్ నిర్వాహకులతో కలసి 50 మంది అనాథ పిల్లలను రెస్టారెంట్‌కు ఆహ్వానించి వారికి పసందైన విందు ఇచ్చాయి. అంతేకాదు వినోద కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆసరా అనాథాశ్రమం, లాడ్జ్ కీస్ నంబర్ 297, ఈ మర్చంట్ డిజిటల్, స్టార్ ఎన్జీవో తదితర సంస్థలు పాల్గొన్నాయి. సందడే సందడి.. పిల్లలందరూ స్టార్ హోటల్లోకి అడుగుపెట్టగానే ఘజల్ గాయకుడు ఖాన్ అలీఖాన్ తన పాటలతో అలరించారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచి పెట్టారు. ‘ఈ మర్చంట్’ పేరుతో కంప్యూటర్ వ్యర్థాలతో ఆకర్షణీయంగా పలు ఆకృతుల్లో చేసిన బొమ్మలను పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. భోజనం తర్వాత కొనసాగిన ఆటపాటలు చిన్నారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. మూడుగంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారులంతా సందడిగా గడిపారు. ఎంతో తృప్తినిచ్చింది.. సాధారణంగా రెస్టారెంట్లలో మిగిలిన పదార్థాలను పార్సిల్ చేసి పేదలకు పంచుతాం. కానీ, నేరుగా పిల్లలను ఇక్కడికి పిలిచి విందు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. చెన్నైలోని మా బ్రాంచ్‌లో ఈ పద్ధతిని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభించాం. నగరంలోని ఇతర రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సంతోషం. - గురు, డెరైక్టర్ (సేల్స్) , నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్ ఫొటోల కోసం క్లిక్ చేయిండి -
షెల్టర్ కన్నా రోడ్డే భేష్!
* నైట్ షెల్టర్లు అపరిశుభ్రంగాఉంటున్నాయన్న నిరాశ్రయులు * ‘ఉచితం’ ఆశించే రోడ్డునాశ్రయిస్తున్నారంటున్న అధికారులు న్యూఢిల్లీ: తమకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్లు అపరిశుభ్రంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కాగా, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఇచ్చే దుప్పట్లు, బట్టల కోసమే నిరాశ్రయులు రోడ్లపై నిద్రిస్తున్నారని ప్రభుత్వ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ‘‘ఒక రాత్రి నైట్‌షెల్టర్‌లో నిద్రపోయి చూడండి. మేము ఎటువంటి దురవస్థను అనుభవిస్తున్నామో’’ అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికుడు అరుణ్‌కుమార్ అన్నాడు. బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో నైట్ షెల్టర్ ఉన్నప్పటికీ అరుణ్ రిజర్వు బ్యాంకు వద్ద పేవ్‌మెంట్‌పై నిద్రించేందుకే ఇష్టపడుతున్నాడు. నైట్‌షెల్టర్లలో ఇచ్చే దుప్పట్ల నిండా పేలు ఉంటాయని చెప్పారు. ఢిల్లీ పట్టణ ఆశ్రయ అభివృద్ధి బోర్డు (డీయూఎస్ఐబీ) తెలిపిన ప్రకారం నగరంలో ప్రస్తుతం 219 నైట్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో 15వేల మందికి పైగా ఆశ్రయం పొందవచ్చు. పాత ఢిల్లీ వీధుల నుంచి లూటియన్స్ వరకు రాత్రి సమయంలో ఎముకలు కొరికే చలి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నారు. నైట్షెల్టర్లకు వచ్చే వారిని పశువుల్లా కుక్కుతున్నారని, పడుకున్న తరువాత కనీసం అటుఇటు పొర్లడానికి కూడా స్థలం ఉండదని రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల ప్రేమ్ అనే కార్మికుడు చెప్పాడు. అక్కడ వసతులు బాగుంటే తాము ఈ చలిలో రోడ్లపై ఎందుకు పడుకుంటామని ప్రేమ్ ప్రశ్నించాడు. ఈ ఆరోపణలను డీయూఎస్ఐబీ ఖండించింది. నిరాశ్రయుల్లో కొందరు కావాలనే రోడ్లపై నిద్రిస్తుంటారని పేర్కొంది. స్వచ్ఛంద సంస్థలు, నిరాశ్రయుల సంక్షేమం కోసం పని చేసే వ్యక్తుల నుంచి ఉచితంగా లభించే దుప్పట్లు, వస్త్రాలను పొందేందుకే వీరు రోడ్లపై నిద్రిస్తుంటారని డీయూఎస్ఐబీ డెరైక్టర్ కమల్ మల్హోత్రా చెప్పారు. ప్రతిరోజు, ప్రతి షెల్టర్‌ను తనిఖీ చేసేందుకు 31 మంది సీనియర్ అధికారులు వెళ్తుంటారని అన్నారు. వారు చెబుతున్నంత అధ్వానంగా నైట్ షెల్టర్లు లేవని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలోనే 13 వేల దుప్పట్లను ఉతకడం ప్రారంభించామని, కొత్తగా మరో 6,781 బ్లాంకెట్లను నైట్ షెల్టర్లకు సరఫరా చేశామని మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 14వేలకు పైగా దుప్పట్లు ఉన్నాయని, మరో 20 వేల బ్లాంకెట్ల కోసం టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. నైట్ షెల్టర్లుగా ఉపయోగించేందుకు కొన్ని భవనాలను గుర్తించాలని హైకోర్టు సూచించింది కదా అన్న ప్రశ్నకు, అందుకు కొన్ని పరిమితులున్నాయని మల్హోత్రా పేర్కొన్నారు. ఆ భవనాల్లో మరుగుదొడ్లు ఉండాలని, లేదా సంచార మరుగుదొడ్డిని పంపే వెసులుబాటు ఉండాలని అన్నారు. అటువంటి భవనాలను గర్తించాలని తాము ఇప్పటికే ఎన్డీఎంసీకి సూచించామని చెప్పారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
నిబంధనలకు లోబడే ఎన్జీఓలు పనిచేయాలి అవగాహన సదస్సులో కలెక్టర్ కిషన్ జిల్లా పరిషత్ : అన్ని వర్గాల సమష్టి కృషితోనే బాలల హక్కుల రక్షణ సాధ్యమని కలెక్టర్ జి.కిషన్ అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల కమిషన్ మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీలో స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓలు)ల ప్రతినిధులు, ప్రభు త్వ శాఖల అధికారులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలో 162 స్వచ్ఛంద సంస్థలుండగా.. వాటిలో 22 సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటి ని తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. పేద, అనాథ పిల్లల కోసం మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. మూడో తరగతి నుంచి పోస్ట్‌మెట్రిక్ వరకు ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. లక్ష్యాలను సాధించలేకపోతున్నాం.. 2011లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్, 2104 ఫిబ్రవరి 2న రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఏర్పడ్డాయని, ఇవి బాలల కోసం పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయాయని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు అభిప్రాయపడ్డారు. బాలల రక్షణ కోసం పలు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు పరిమితులుంటాయని, అదే స్వచ్ఛంద సంస్థలకు విస్తృతంగా పనిచేసే అవకాశాలుంటాయన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించామని ఆయన వివరించారు. అధికారులు, ఎన్జీఓలకు మధ్య సమన్వయం లేదన్న విషయాలను గుర్తించామన్నారు. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉంటే సకల సౌకర్యాలు సమకూరేవని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటైందని అచ్యుతరావు వివరించారు. ఐఏఎస్ అధికారి సుజాతారావు చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటైందని జిల్లాకు చెందిన కమిషన్ సభ్యురాలు మమతారఘువీర్ తెలిపారు. తమ కమిషన్ సభ్యులు 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉంటారని, బాలలు ఎలాంటి ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. బాలల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు పాఠశాలల్లో నిర్వహిస్తే ప్ర యోజనకరంగా ఉంటుందని గీసుకొండ మండలం కొమ్మా ల గ్రామానికి చెందిన విద్యార్థిని సునీత కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం ప్రయత్నించినా ఎవరు సహకారం అందించలేదన్నారు. చి వరకు మరికొంత మందితో కలిసి కొన్ని పుస్తకాలు కొనుగో లు చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు. బాల ల కోసం పనిచేస్తున్న కమిషన్, స్వచ్ఛంద సంస్థల్లో బాలల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే బాలలకు సరైన రక్షణ ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, శ్రీనివా స్, ఓంకార్, డీఈఓ విజయ్‌కుమార్, డీఎంహెచ్ఓ సాంబశి వరావు, కార్మికశాఖ అధికారి, ఓఎస్డీ నాగరాజు బాలల కోసం చేస్తున్న పనులను వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు బాలరాజు, మురళీధర్‌రెడ్డి, రహీమొద్దీన్, అదనపు జేసీ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ పీఓ కృష్ణజ్యోతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డి, డీసీపీఓ వెంకటరమణ పాల్గొన్నారు.