లీజ్‌ డీడ్‌తో పాగా.. | Land Grabbing in Hyderabad | Sakshi
Sakshi News home page

లీజ్‌ డీడ్‌తో పాగా..

Published Tue, Jul 30 2019 8:34 AM | Last Updated on Tue, Jul 30 2019 8:34 AM

Land Grabbing in Hyderabad - Sakshi

వివాదాస్పద స్థలం ఇదే

గచ్చిబౌలి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో గచ్చిబౌలి ప్రాంతంలోని అత్యంత విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు పథకం పన్నారు. స్థలం యజమానుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు స్థలానికి యజమాని ఎవరు, అద్దెకు ఉంటున్న వారి వివరాలు ఆరా తీశారు. తప్పుడు పత్రాలతో స్థలం ఆక్రమించడమేగాక అమాయకులకు విక్రయించి రూ. లక్షలు దండుకున్న ప్రగతి సొసైటీ కమిటీ సభ్యులతో పాటు  25 మందిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్‌ 32లో ఐటీ కంపెనీల సమీపంలో 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. 2000 సంవత్సరంలో ఐఐసీ సిస్టమ్స్‌ 3 ఎకరాలు, బ్రిజేష్‌ కోహల్‌ 20 గుంటలు, బాబురావు 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. యూఎల్‌సీకి దరఖాస్తు చేసుకోగా 2005లో ప్రభుత్వం దీనిని రెగ్యులరైజ్‌ చేసింది.   2014 వరకు యజమానులే పొజిషన్‌లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు, కమిటీ సభ్యులు సదరు స్థలాన్ని క్రమించారు. అంతేగాక సదరుస్థలం తమదేనని నమ్మించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. 165 మంది గదులను నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటుండగా, దీనికి ప్రగతినగర్‌ గా నామకరణం చేయడమేగాక జీహెచ్‌ఎంసీ నుంచి ఇంటి నెంబర్లు, విద్యుత్‌ మీటర్లు తీసుకున్నారు.

నకిలీ డాక్యుమెంట్లతో మోసం....
మొబైల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ నిర్వాహకులు ధర్మరాజు 1991లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తనకు గచ్చిబౌలిలోని వివిధ సర్వే నెంబర్లలో 99 ఎకరాలు పట్టా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించాడు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు  అప్పట్లో ధర్మరాజుపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అంతేగాక అతడిపై అప్పటికే సైఫాబాద్, మాదాపూర్‌ పీఎస్‌లలో కేసులు ఉన్నాయి.  

లీజ్‌ డీడ్‌తో ఆక్రమణ..
కాగా ధర్మరాజు సదరు స్థలాన్ని ప్రగతి సొషల్‌ ఆర్గనైజేషన్‌కు లీజుకు ఇస్తున్నట్లు శామీర్‌పేట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి లీజు డీడ్‌ సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు గచ్చిబౌలి సర్వే నెంబర్‌ 32లో నాలుగు ఎకరాల స్థలం తమదేనని పేర్కొంటూ ఆక్రమించారు.  

అరెస్టయ్యింది వీరే....
ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు కంచి నాగమణి, కంచి సురెందరయ్య, ఇ. ముత్తు, జి. చెన్నయ్య, ఎం. విక్రమ్, భాస్కర్‌రావు, తలారి రాము, లక్ష్మీబాయి, వి.గోవిందమ్మ, బి.సంతోష, ఏ. జాములు, ఎల్‌. కోటయ్య, ఎం. శివకుమార్, ఎల్‌. పాండు, ఎన్‌. జీవన్‌కుమార్, ఎన్‌. దానేడప్ప, బి. శివాజీ, ఎస్‌. రవీందర్, వి.సుధాకర్, కె. సుందర్‌రావు, కోటేశ్వర్‌రావు, ఎం.యాదగిరి, ఎం. అశోక్, కె. భాస్కర్, జి.ఝాన్సీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.   ఆగమ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుజాత, «కె. ధర్మరాజు, జి. రామారావు, పి. శ్రీనివాస్‌రావు, డి. సతీష్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.  

నోటీసులు కూడా ఇవ్వలేదు....
నోటీసులు ఇవ్వకుండానే రాయదుర్గం పోలీసులు తమను అరెస్ట్‌ చేశారని ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు నాగమణి భర్త సురెందరయ్య ఆరోపించారు. స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, సొసైటీ సభ్యులే నివాసం ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు..
సర్వే నెంబర్‌ 32లోని తమ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించిన యజమానులు ఐఐసీ సిస్టమ్స్, బ్రిజేష్‌ కోహల్, బాబురావు 2017, 2018లో సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం  ధర్మరాజుకు 99 ఎకరాలకు  రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పట్టా ఇచ్చినట్లుగా చూపుతున్న డాక్యుమెంట్‌ నకిలీదిగా తేల్చింది. అంతేగాక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి కోర్టుకు నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌  సైబరాబాద్‌ కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రగతి నగర్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ సభ్యులు నాలుగు ఎకరాల స్థలంలో 90 చదరపు గజాల చొప్పున 165 ప్లాట్లు చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఒక్కో ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించి అమాయకులను మోసం చేశారన్నారు. నాలుగైదు ప్లాట్లు కొనుగోలు చేసి అమ్ముకున్న వారిని అరెస్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. 70 మంది బాధితులను విచారించి వాగ్మూలం తీసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement