సాక్షి, సిటీబ్యూరో: రెవెన్యూ విభాగం నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వివాదాల్లో చిక్కుకొని కోర్టుకు ఎక్కుతున్నాయి. అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక వీటికి సంబంధించిన కేసులు ఏళ్లుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కేసులకు అయితే ఏళ్ల తరబడి కౌంటర్ కూడా దాఖలు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో పలు కేసుల్లో ప్రతికూల తీర్పులు తప్పడం లేదు. మరోవైపు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరితో ప్రతివాదులు పైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇదీ హైదరాబాద్ జిల్లాలో వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూముల కేసుల పరిస్థితి. కోర్టు కేసులకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక న్యాయ విభాగమూ ఉంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్ధాయి అధికారి పర్యవేక్షణలో ఈ విభాగం కేసుల పరిశీలన, కౌంటర్ దాఖలు, సమగ్ర వాదనలకు సరిపడా సమాచారం ప్రభుత్వ న్యాయవాదులకు అందిస్తోంది. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా రెండేళ్లలో మరో 20శాతం కేసులు పెరగడం గమనార్హం.
58శాతం వివాదాల్లోనే...
నగరంలో సుమారు రూ.1805 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీలో చదరపు గజం భూమి విలువ సుమారు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వానికి దాదాపు 4,36,471.2 చదరపు గజాల స్థలాలున్నాయి. చదరపు గజానికి రూ.70వేల చొప్పున లెక్కిస్తే... వీటి విలువ రూ.3,055 కోట్లకు పైనే ఉంటుంది. అందులో సుమారు 58శాతం అంటే 2,57,972 చదరపు గజాల స్థలం కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని విలువ రూ.1,805 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
యోగితా హయాంలో కదిలిక...
కలెక్టర్ యోగితారాణా హయాంలో ప్రభుత్వ భూముల కోర్టు కేసులపై కదలిక వచ్చినా.. ఆమె బదిలీతో మళ్లీ కథే పునరావృతమవుతోంది. వాస్తవానికి గతేడాది జనవరిలో సర్కార్ స్థలాలను నిగ్గు తేల్చేందుకు యోగితారాణా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమగ్ర అధ్యయనం చేసి కౌంటర్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మండలానికి టాప్ టెన్ చొప్పున కేసులను ఎంపిక చేసి సంబంధిత డిప్యూటీ తహసీల్దార్లతో అంతర్గత సమీక్షలు నిర్వహించారు. ప్రతి కేసును సమగ్రంగా అధ్యయనం చేసి ఆధారాలపై నివేదికలను రూపొందించారు. తొలివిడతగా అత్యంత విలువైన భూములకు సంబంధించిన సుమారు 70 కేసులను ఎంపిక చేసి యోగితారాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌తో సమావేశమై చర్చించారు. కొంతకాలం కేసుల్లో పురోగతి కనిపించినప్పటికీ...ఆ తర్వాత కదలిక లేకుండా పోయింది.
పెండింగ్ కేసులు ఇలా...
జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి సుమారు 2,023 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. సివిల్ కోర్టులో 329, హైకోర్టులో 1,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తమ్మీద 2,832 కేసులకు గాను 120 కేసుల్లో ప్రభుత్వానికి ప్రతికూల తీర్పులు రాగా... 213 కేసుల్లో అనుకూల తీర్పులు వచ్చాయి. మరో 179 కేసుల్లో ప్రతివాదులు కేసులను ఉపసంహరించుకున్నారు. 199 కేసుల్లో కోర్టు పలు డైరెక్షన్స్ ఇవ్వడంతో సమస్య సమసిపోయింది. కాగా సుమారు 290 ఫిర్యాదులు కొన్ని కేసులతో ముడిపడి ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం మొత్తం 1,733 కేసులుగా నిర్ధారించింది. వీటిలో 646 కేసులపై కౌంటర్లు దాఖలు చేయగా, 992 కేసులకు దాఖలు చేయలేదు. 81 కేసుల సంబంధించి ఇతర ప్రభుత్వ విభాగాలు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరో 14 కేసులకు మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment