పాల్మాకుల గ్రామం సర్వే నంబర్ 13లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధే సర్కారు భూమిని కబ్జా చేశాడు. పట్టా భూమి కొనుగోలు చేసి..పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. రూ.2 కోట్ల విలువైన ఈ భూమికి ఏకంగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి.. తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పలుకుబడి కలిగిన ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తెలిసినా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. శంషాబాద్ మండలం పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 13లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 28 ఎకరాలను పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది.
అక్రమంగా నిర్మించిన ప్రహరీ
నాలుగు ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. ఈ భూమిని ఆనుకుని పట్టా (సర్వేనం.28) భూములున్నాయి. ఈ భూమిలో కొంత మేర కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి కన్ను పక్కనే ఉన్న సర్కారు భూమిపై పడింది. పట్టా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన ఆయన పనిలో పనిగా హద్దు రాళ్లను తొలగించి సర్కారు భూమిని కూడా తన ఖాతాలో కలిపేసుకున్నాడు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.రెండు కోట్లు ఉంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్ట కూడా ఉంది. ఈ బండరాళ్లను పగలగొట్టి గ్రానైట్ రాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆక్రమణలను అడ్డుకుంటాం
ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేయగా మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఆర్‌ఐని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే..స్వా«దీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు నాటుతాం. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శంషాబాద్
నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత
సర్వే నంబరు 13 సర్కారు భూముల పక్కనే మార్గదర్శి చిట్‌ఫండ్ యజమాని రామోజీరావు భూములు ఉన్నాయి. నాలుగు ఎకరాలను తన భూమిలో కలిపేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2011లో ‘సాక్షి’ ఈ భూ కబ్జాపై వరస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్దారించారు. దీంతో ఆక్రమణదారులు అప్పట్లో ఈ నాలుగు ఎకరాలను వదిలేసి లోపలి వైపు కడీలు పాతారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ సర్కారు భూమిపై ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కన్నుపడింది.
చదవండి: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment