వెతికి పెట్టండంటూ ‘హైడ్రా’కు ఇబ్బడిముబ్బడిగా ప్రజల ఫిర్యాదులు
గ్రేటర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరులు, నాలాల కబ్జా.. ఆక్రమణలు తొలగించాలంటూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల విన్నపాలు
ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పణ
గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫొటోల్లాంటివీ జోడిస్తున్న వైనం
తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం..అనేక చెరువులు 20 నుంచి 90 శాతం వరకు కబ్జా
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం వెల్లడి
మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61 శాతం ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకు నివేదిక.. హైదరాబాద్ మనుగడ
ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన
బెంగళూరు తరహాలో చెరువుల పునరుద్ధరణ: హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: కబ్జాకు ఏ చెరువూ కాదు అనర్హం అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఓ మోస్తరు వాన కురిసినా కాలనీలను వరద ముంచెత్తుతోంది. రోడ్లే చెరువుల్ని తలపిస్తున్నాయి.
ఇక భారీ వర్షం అంటే నగరజీవి బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంటోంది. చెరువులు, కుంటల్లాంటి జలవనరులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెరువుల్లో ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తుండటంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేదీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఆధారాలతో సహా..
‘తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్‌లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి. కానీ ప్రస్తుతం దాని అలుగు మాత్రమే కనిపిస్తోంది కానీ చెరువు కనిపించట్లేదు..’అని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిధిలో ఉన్న జలవనరుల పరిరక్షణ కోసం.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించిన ఈ ఏజెన్సీ 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా వివిధ విభాగాలకు చేసే ఫిర్యాదులకు బాధితులు, ప్రజలు.. పలు పత్రాలు, ఫొటోలు, ఆడియో, వీడియో సీడీల్లాంటివి జత చేస్తుంటారు.
కానీ హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫొటోలను జత చేసి మరీ ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను హైడ్రా, ఇతర విభాగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉంటున్నట్లు సమాచారం.
మాదాపూర్ ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్టుగా చెబుతున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్–కన్వెన్షన్‌పై.. ‘జనం కోసం’అనే సంస్థతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కూల్చివేత తర్వాతే హైడ్రాకు లెక్కకుమిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదునూ వివిధ కోణాల్లో పరిశీలించి, రికార్డులు తనిఖీ చేసిన తర్వాతే హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది.
అన్ని అనుమతులతో దర్జాగా..!
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో.. అలాగే నాలాలపై నిర్మించిన కట్టడాల్లో రెండు రకాలైనవి ఉంటున్నాయి. కొన్నింటిని అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మించేయగా.. మరికొన్నింటికి అవసరమైన అన్ని అనుమతులూ ఉండటం గమనార్హం. ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపడుతున్నారు.
వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా.. ఇతర విభాగాలు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల లేఔట్లు, వెంచర్లు, అపార్ట్‌మెంట్లు కూడా యథేచ్ఛగా వెలిశాయి. ఈ క్రమంలో రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ!
ఏదైనా భవనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులు ఆద్యంతం పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణంలో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించారని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ‘నివాసానికి యోగ్యం’అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే రాజధానిలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో నిర్మితమవుతున్న కొన్ని భవనాలకు పనులు పూర్తి కాకుండానే ఓసీలు జారీ అయిపోతున్నాయనే ఆరోపణలున్నాయి.
దీనికి ఆ విభాగం అధికారుల అవినీతే కారణమనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు వాటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని రద్దు చేయాల్సిందిగా కోరుతూ హెచ్‌ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టనున్నారు.
ఆ అధికారుల గుండెల్లో రైళ్లు
ప్రస్తుతానికి ఆయా నిర్మాణాల కూల్చివేతల పైనే హైడ్రా దృష్టి పెడుతోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తు స్పందన.. తదితర లక్ష్యాలతో ఏర్పాటు అయిన హైడ్రా జలవనరుల పరిరక్షణకే పెద్దపీట వేసి ముందుకు వెళ్తోంది. అయితే ఈ విభాగానికి ప్రత్యేక పోలీసుస్టేషన్ మంజూరైన తరువాత మరో అడుగు ముందుకు వేయనుంది.
ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రతి విభాగం, ఆయా అధికారుల పైనా విచారణ జరిపి, సంబంధిత శాఖలకు నివేదికలు ఇవ్వడంతో పాటు చర్యలకు సిఫారసు చేయనుంది. దీంతో ప్రస్తుతం ఆయా విభాగాలకు చెందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
10 వేలకు మిగిలింది 3,900 ఎకరాలే...
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ‘గ్రేటర్’తో పాటు చుట్టుపక్కల ఉన్న 56 చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 1979–2023 మధ్య 44 ఏళ్లలో అవి ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో తేల్చింది. అప్పట్లో 10416.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జలవనరులు గత ఏడాది నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయి.
ఇలా మొత్తమ్మీద 61 శాతం మాయమై కేవలం 39 శాతం మిగిలినట్లు ఎన్‌ఆర్‌ఎస్‌సీ లెక్కకట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్ని మార్చాలని కోరుతూ హైడ్రాకు నివేదిక సమర్పించింది.
చెక్కు చెదరని హకీంపేట.. విస్తరించిన చెన్నపురం
రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న డిఫెన్స్ ఏరియా హకీంపేటలోని 18 ఎకరాల చెరువు మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని ఎన్‌ఆర్‌ఎస్‌సీ సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర అంశం చెన్నపురం చెరువుకు సంబంధించింది.
సికింద్రాబాద్ చంద్రపురికాలనీలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 44 ఏళ్లల్లో పెరిగింది. 1979లో ఇది 16 ఎకరాల్లో విస్తరించి ఉండగా..2023 నాటికి 15 శాతం పెరిగి 18.2 ఎకరాలకు చేరింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా..చెరువు విస్తీర్ణం అలా పెరగడానికి కారణాలను విశ్లేషించాలని నిర్ణయించింది.
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లూ వర్తించవు..
మూడు దశల్లో కార్యాచరణ అమలు
హైడ్రా పరిధిలో ఉన్న ప్రతి చెరువు, కుంట పూర్వాపరాలు అధ్యయనం చేస్తున్నాం. కూల్చివేతలు అనేవి చట్ట ప్రకారం జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆద్యంతం పరిశీలిస్తాం. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు పూడ్చే ట్రాక్టర్లు, టిప్పర్లను కూడా భవిష్యత్తులో సీజ్ చేయనున్నాం. చెరువు, కుంటలకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, పార్కు స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లు వర్తించవు.
చెరువులు, కుంటలు, నాలాలు తదితరాల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. మొదటి దశలో ఇకపై ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఒక్క చదరపు అడుగు కూడా ఆక్రమణ కాకుండా చూస్తోంది. రెండో దశలో ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో అనుమతి ఉన్నా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం. మూడో దశలో ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న మాదిరిగా చెరువుల పునరుద్ధరణ చేపడతాం.
నగరంలో ఉన్నవి అన్నీ గొలుసుకట్టు చెరువులే. ఒకటి అలుగు పారితే ఆ నీరు నాలాలు, వాగుల ద్వారా మరో దాంట్లోకి వెళ్లాలి. ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు, లేఔట్లలో ప్రజలు ఫ్లాట్లు, స్థలాలు ఖరీదు చేయొద్దు. త్వరలో ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పెడతాం. ఇప్పటికే ఇలా ఖరీదు చేసి నష్టపోయిన వాళ్లు ఉంటే బిల్డర్‌పై కేసు పెట్టండి.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment