
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టమేమీ ఉండదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఏపీ బేసిన్ బయట ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏ మేరకు మళ్లిస్తోందని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ప్రశ్నించగా.. ఉమ్మడి రాష్ట్రంలో అంతర్గత ఏర్పాటు ద్వారా 512 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటోందని వైద్యనాథన్ వివరించారు.
ఇందులో ఇతర బేసిన్‌లకు 323 టీఎంసీలను మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్‌లో 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ ఎదుట బుధవారం మూడోరోజు తన వాదనలు కొనసాగించారు.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం
ఏపీలో కృష్ణా డెల్టాకు డ్రెయిన్ల కింద 43.2 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టు నుంచి మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయని ట్రిబ్యునల్‌కు వైద్యనాథన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరిపై పట్టిసీమ ఎత్తిపోతలను ఏపీ నిర్మించిందని, 2015 నుంచి ఆ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తోందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఏడాదిలో 100 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని చెప్పారు.
కృష్ణా బేసిన్‌లో 2023–24లో తీవ్రమైన నీటి కొరత ఉందని, ఆ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులోకి కేవలం 145 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చిందన్నారు. అయినాసరే కృష్ణా డెల్టా కింద దాదాపు 125 టీఎంసీలను ఏపీ వినియోగించుకుందని వివరించారు. ఇందులో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించిన జలాలే 40 టీఎంసీలన్నారు. ఏపీలోని ప్రాజెక్టులకు అదనపు నీటి వనరులు అందుబాటులో ఉన్నాయని.. అక్కడ ఆదా చేసిన నీటిని తెలంగాణలో బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు.
ఎస్‌ఆర్‌బీసీ, ఎస్‌ఎల్‌బీసీ ఒకేసారి చేపట్టినా...
శ్రీశైలంఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)ని నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీ ద్వారా 150 టీఎంసీలను అందించడానికి ప్రతిపాదించారన్నారు. కానీ.. ఈ పథకానికి నీటిని కేటాయించాలని కేడబ్ల్యూడీటీ–1 ఎదుట ఉమ్మడి రాష్ట్రం ఒత్తిడి చేయలేదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఇతర బేసిన్‌లలోని ప్రాజెక్టులకు నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చిoదన్నారు.
శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్‌ఆర్‌బీసీ), ఎస్‌ఎల్‌బీసీలను 1980లో ఒకేసారి చేపట్టారని.. ఎస్‌ఎల్‌బీసీకి మిగులు జలాలుగా కేటాయించగా, ఎస్‌ఆర్‌బీసీకి 75 శాతం లభ్యత కింద నికర జలాలను ఉమ్మడి రాష్ట్రం కేటాయించిదని ట్రిబ్యునల్‌కు వివరించారు. కేడబ్ల్యూటీటీ–2 ఎదుట ఎస్‌ఆర్‌బీసీకి నికర జలాలను కేటాయించాలని కోరకుండా.. బేసిన్ బయటకు నీటిని తరలించే తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తెచ్చిoదని వివరించారు.
ఏప్రిల్ 15కు వాయిదా
కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రోజుల విచారణ బుధవారం ముగిసింది. విచారణను ఏప్రిల్ 15–17కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తుది వాదనలను వినగా, తదుపరి వాదనలను ఏప్రిల్ 15 నుంచి చేపట్టే విచారణలో వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment