
మంత్రి ఉత్తమ్, మాజీమంత్రి హరీశ్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి జలాల విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం సాగింది. గోదావరిలో తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్లు్యసీ సూచించిందని హరీశ్‌రావు చెబుతూ అందుకు సంబంధించిన లేఖ తన వద్ద ఉందన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ..‘మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడానికి సీడబ్లు్యసీ ఎలాంటి సిఫారసు చేయలేదు.
ఆ తప్పుడు వాదనతో రూ. లక్ష కోట్లు వృథా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్ల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేయొద్దని సిఫారసు చేసినా పట్టించుకోలేదు’అని అన్నారు, సాగునీటి పద్దుపై బుధవారం రాత్రి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వాదోపవాదాలు జరిగాయి. ‘ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించొద్దని కాదు.
మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా ఎత్తిపోయడం సాధ్యం కాదు’అని మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. కృష్ణాజలాల్లో్ల తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు తీసుకునేలా ఒప్పందంపై సంతకాలు పెట్టిందే హరీశ్‌రావు, కేసీఆర్ హయాంలో అని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఏపీకి నీటిని తరలించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మౌనంగా ఉన్నారని మంత్రి ఆరోపించారు.
దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అది కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, సెక్షన్ మూడు కింద సుప్రీంకోర్టుకు వెళ్లి,.. బచావత్ విచారణ జరిగేలా ఉత్తర్వులు తీసుకొచ్చామని ఇప్పుడు ప్రభుత్వం సరిగా వాదిస్తే 555 టీఎంసీలు తెలంగాణకు సులభంగా తెచ్చుకోవచ్చని సూచించారు.
ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి తీరుతాం : ఉత్తమ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలంగా చేసే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఉత్తమ్ అన్నారు. పదేళ్లపాటు ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టి అక్కడి రైతులను అష్టకష్టాల్లోకి నెట్టింది బీఆర్‌ఎస్ పాలన ఘనకార్యమే అని విమర్శించారు. పదేళ్లలో కాళేశ్వరం వల్ల ఆయకట్టు పెరగలేదన్నారు. ఏడాదిన్నరగా కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయనప్పటికీ యాసంగిలో 153 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 131 లక్షల టన్నుల వరి దిగుబడి రానున్నట్టుచెప్పారు.
ఈ సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ కేసీఆర్ ముందుచూపు వల్లే వరిసాగు పెరుగుతూ వచ్చిందన్నారు. ఇంతలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు వాదప్రతివాదనలకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ కూర్చుంటున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.
నేరపూరిత నిర్లక్ష్యం బీఆర్‌ఎస్‌ది : బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నేరపూరిత నిర్లక్ష్యం వల్లనే ఆదిలాబాద్ జిల్లా రైతులు కరువులో కొట్టుమిట్టాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. ‘సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రగోసలోకి నెట్టిన బీఆర్‌ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల ఊసురు ముట్టింది.
మరింత అనుభవిస్తారు’అని ఆవేశంగా పాల్వాయి హరీశ్ అన్నారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి సీతక్క జోక్యం చేసుకుంటూ ఆదిలాబాద్ రైతుల గోసను పాల్వాయి హరీశ్ వ్యక్తం చేశారని. ఆయనపైకి బీఆర్‌ఎస్ సభ్యులు గొడవకు దిగడం సరికాదన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెడిపోయిన ధాన్యం టెండరు వేశారని, ఏడాదిన్న గడిచినా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంపై సమాధానం చెప్పాలన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మార్చిలోగా డబ్బు చెల్లించకపోతే ఆ టెండర్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment