
ఉత్తమ్ అవాకులు, చెవాకులు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఎత్తిపోతల పథకాలకు కరెంటు ఖర్చు అవుతుందని ఆ ఎత్తిపోతలు లేకపోతే తెలంగాణ కరువు ప్రాంతంగా, వలసలకు నెలవుగా, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకుని అవగాహనతో మాట్లాడాలని, కనీసం ఢిల్లీలో మాట్లాడేటప్పుడయినా తెలంగాణ పరువు తీయవద్దని ఆదివారం ఒక ప్రకటనలో పాలకులకు హితవు పలికారు.
డ్యాం సేఫ్టీ అథారిటీతో సమావేశం అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అవాకులు, చెవాకులు పేలడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఆరడుగులు కుంగిపోయిందని ఉత్తమ్ అంటున్నారని, అది కేవలం ఒక దురదృష్టకర ఘటన అని, అలా జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదని పేర్కొన్నారు.
’’2022లో సంభవించిన వరద గోదావరి చరిత్రలోనే అతి పెద్దది, మేడిగడ్డ బరాజ్ వద్ద 28లక్షల క్యూసెక్కులపైగా వరద ప్రవాహం వచ్చింది దాంతో బ్యారేజి కింది సిమెంటు బ్లాకులు అక్కడక్కడ లేచిపోయి ఉన్నందున చిన్న లీకేజీలు బుంగలుగా మారి సొరంగంగా ఏర్పడ్డాయి, ఈ సొరంగం 2023 వరదల అనంతరం మూడు పిల్లర్ల కుంగుబాటుకు కారణమైంది’’ అని వివరించారు.
మేడిగడ్డ పునాదులు బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన మంత్రి మళ్లీ మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యం కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వరద వచ్చేంతవరకు సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే కారణమైతే ఇందుకు ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీశ్ డిమాండ్ చేశారు.