200 టీఎంసీలు తరలించినట్టు హరీశ్ పచ్చిఅబద్ధాలు
గోదావరి–బనకచర్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు
హరీశ్‌రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ నిర్మించి 200 టీఎంసీలు తరలించుకుపోతుంటే మేము మౌనంగా ఉన్నామని మాజీమంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలా ప్రాజెక్టు నిర్మాణమే జరగలేదు. 200 టీఎంసీలు కాదుకదా ఒక్క చుక్కనీరు ఎవరూ తీసుకుపోలేదు’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తే ఆ లేఖను ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు పంపించారని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ఈ అక్రమ ప్రాజెక్టుకు నిధులు కేటాయించొద్దని కోరుతూ తాము నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌కు ఇప్పటికే కౌంటర్ లేఖలు రాశామని స్పష్టం చేశారు. ‘ఈ అంశంపై అఖిలపక్షం పెట్టాలని అడగడానికి వారెవరు ? పిలవాలో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం.. అబద్ధాలు మాట్లాడి పిలవమంటే ఎలా?’అని హరీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు కోలుకోలేని నష్టం..
‘బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్ని విధాలుగా తీవ్రమైన నష్టం జరిగింది’అని ఉత్తమ్ అన్నారు. ఆ నష్టాలను పూడ్చడానికి ప్రయత్నిస్తుంటే ఓర్వలేకనో అధికారం పోయిందనో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూన్ 18, 19న, అలాగే 2016 జూన్ 21, 22న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఇచ్చుకోండి అని చెప్పి వచ్చారని తప్పుబట్టారు.
అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్‌తోపాటు ఆ తర్వాత జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా కేటాయింపులు జరిపిందని, దీని ఆధారంగా మనకు ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగారన్నారని విమర్శించారు. క్యాచ్‌మెంట్ ఏరియా, జనాభా, సాగుకు యోగ్యమైన భూములు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం, ఏపీకి 30 శాతం కేటాయింపులు జరపాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2, కేఆర్‌ఎంబీతోపాటు సుప్రీం కోర్టులో పోరాడుతున్నామన్నారు.
‘రాయలసీమ’కు బీఆర్‌ఎస్ సహకారం
ఏపీలోని ముచ్చుమర్రి ప్రాజెక్టు సామర్థ్యం బీఆర్‌ఎస్ హయాంలో 3,850 నుంచి 6,738 క్యూసెక్కులకు పెరిగినా నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ నిశ్శబ్దంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాడు ఏపీ నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సాఫీగా జరిగేలా, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరిందని తప్పుబట్టారు. రోజుకు 3 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టమన్నారు. కేసీఆర్ పాలనలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 నుంచి 92,000 క్యూసెక్కులకు పెరిగిందని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, మల్యాల, ముచ్చుమర్రి నుంచి గతంలో కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్లడం ప్రారంభమైందన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీలను తరలిస్తే గత ప్రభుత్వ హయాంలో 9.69 టీఎంసీకి పెరిగిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment