స్నేహలత మేకల
ఎనిమిది దక్షిణాసియా దేశాలూ, అభివృద్ధికి నోచుకోని అనేక ఆఫ్రికాలోని వెనకబడిన దేశాల పల్లెల్లోని అట్టడుగు వర్గాలు, మారుమూల గిరిజనులకు, నగరాల్లోని మురికివాడల్లో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న వందలాది సంస్థల్ని సమన్వయం చేసే బాధ్యతలు... చాలా దేశాల్లోని పేదలూ, అణగారిన ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌లాంటి వారి అవసరాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడంతో పాటు వారికి అందాల్సిన సేవలూ, సౌకర్యాల విధాన రూపకల్పనలకు కృషి.. తమ పరిశోధనల్ని అంతర్జాతీయ సంస్థలకూ, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకూ, అక్కడి నేతలకు తెలియజెప్పే పని... అర్ధరాత్రి, అపరాత్రుల్లేకుండా దాదాపు 35 పైగా దేశాల్లో పర్యటనలు... ఇవన్నీ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న సార్క్ దేశాల, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త ‘స్నేహలత మేకల’తో మాటా మంతీ...
► ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి...
స్నేహలత : మన దేశంలోనే కాకుండా... మరెన్నో దేశాలలోని కుగ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో, పేదరికం తాండవిస్తున్న కొన్ని దేశాల్లోని మారుమూల పల్లెల్లో, పట్టణ మురికివాడల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కల్పనకు అవసరమైన విధాన రూపకల్పనలతో పాటు అనేక సేవా కార్యకలాపాల రంగంలో పాలుపంచుకుంటున్నాను. మనదేశంతోపాటు బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని 500 పైగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలను సమన్వయపరుస్తూ... అవి తమ అవసరాలను, అభిప్రాయాలను అంతర్జాతీయ వేదికలపైన తెలియజెప్పే బాధ్యతలను, ప్రభుత్వ సహాయాలు అందేందుకు లోపరహితమైన విధాన రూపకల్పనలో పాలుపంచుకునే‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ శానిటేషన్ ఫర్ ఆల్’ (సాకోశాన్) ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. అట్టడుగువర్గాలు, గిరిజనలతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్ లాంటివారి వెతలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడమే కాకుండా... ఆ సేవలన్నీ వారికి ఎలా అందాలన్న విధాన రూపకల్పనపై ప్రభుత్వాలతో కలిపి పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమాల కోసం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలు మొదలుకొని... యూఎస్, ఫ్రాన్స్, బెల్జియమ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం.
► ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కార్యకలాపాలూ, వాటిల్లో మీ భాగస్వామ్యం...
ఇది రెండు విధాలుగా జరుగుతుంది. వివిధ దేశాల్లోని 500 స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పాటు, బడుగువర్గాలు, నగర మురికివాడల్లోని పేద ప్రజల వెతలు తీర్చడానికి వివిధ దేశాల్లోని హైలెవల్ పొలిటికల్ కమిటీలు, ప్రభుత్వంలోని నేతలు, బాధ్యులందరూ తీసుకోవాల్సిన చర్యలు, అవి జరగడానికి అవసరమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో తోడ్పాటు అందిస్తుంటాను. అలాగే అట్టడుగు వర్గాలు, గిరిజనుల గొంతుకను అంతర్జాతీయ వేదికలపై వినిపించడం... ఇదంతా ఒకవైపు కార్యక్రమం.
ఇక మరోవైపున మా ప్రతిపాదనలు సాకారమయ్యాక... వీటి నిర్వహణకు కావలసిన పాలనాపరమైన ఆవశ్యకతలు, నిధులు... ఇవన్నీ అనేక దేశాల్లోని బడుగువర్గాలు, నగర మురికివాడల ప్రజలకు చేరేందుకు అవసరమైన సేవలందిస్తుంటాం.
► ఇన్ని దేశాల్లోని ఇన్నిన్ని మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులెలా?
మాకు యునిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్, వాటర్ ఎయిడ్, జీడబ్ల్యూపీ వంటివాటితో పాటు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు నిధుల్ని అందిస్తాయి.
► అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మీ ప్రవేశం... ఇందుకు దోహదపడ్డ నేపథ్యం...
నా కెరియర్ కర్నూలులో మొదలైంది. వాననీటిని ఒడిసిపట్టి, చెక్‌డ్యామ్స్ వంటివి నిర్మించి, భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే ‘వాటర్‌షెడ్’ కార్యక్రమంలో చాలా చిన్నస్థాయి ‘సోషల్ ఆర్గనైజర్’గా కెరియర్ ప్రారంభించా. ఈ కార్యక్రమంలో ఓ వ్యవసాయ అధికారి, ఓ ఇంజనీర్, ఓ ఫారెస్టు అధికారితోపాటు కలిసి ఫీల్డ్‌లో పనిచేయాలి. మారుమూల ప్రాంతాలతోపాటు కొన్నిసార్లు గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి వచ్చేది. క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలూ, వేదికలపై కార్యకలాపాలతో పాటు ప్రపంచబ్యాంకుకూ, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలకు కన్సెల్టెన్సీ బాధ్యతలనూ నిర్వర్తించా. ప్రస్తుతం తాజాగా ‘ఫాన్సా’ లో ముఖ్యంగా సమన్వయ బాధ్యతలు. ఈ కార్యక్రమంలోనే భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ బోర్డుతో కలిసి ఇక్కడ కూడా నీటి వృథా నివారించడం, వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఓ ప్రాజెక్టులో భాగం పంచుకున్నా.
► భవిష్యత్తు కార్యకలాపాల గురించి ఏమైనా ప్రణాళికలు?
ప్రస్తుతం ఈ సేవలతో పాటు కొంపల్లి ప్రాంతంలో ‘నిశ్చింత’ అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా. అది నాకెంతో ఇష్టమైన సేవా కార్యక్రమం. చేయగలిగినంత కాలం చేశాక... నేనూ, నా భర్త... పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్‌నే ఎంచుకుని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంతమందికి ఆరోగ్యాన్నివ్వాలన్నదే నా సంకల్పం.
ఆమె సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం.
► మహిళగా వివక్షగానీ, ఇబ్బందులుగానీ ఎదుర్కొన్నారా?
స్నేహలత : వివక్ష కాదుగానీ... ఇబ్బందులు చాలానే ఎదుర్కొన్నా. మారుమూల పల్లెలకూ, దట్టమైన అడవుల్లోని చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో నన్ను తీసుకెళ్లడానికి తోటివాళ్లు ఇబ్బంది పడేవారు. పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ఇలా గ్రామాలు పట్టుకు తిరగడం నాకంటే... నాతోటివాళ్లనీ, గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టేది. వాళ్లతో మమేకం కావడానికీ, వయసుకంటే పెద్దగా కనిపించడానికీ చీరకట్టుతో వెళ్తుండేదాన్ని. అడవిబాటల్లో చీరకట్టుతో ప్రయాణం అదో ఇబ్బంది. కాన్ఫరెన్స్‌ల కోసం ఇంగ్లిష్ తెలియని ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు ఓ సవాల్. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఆఫ్రికాలోని బుర్కినాఫాస్ లాంటి చోట్లకు వెళ్లినప్పుడు కేవలం సైగలతో నెట్టుకురావడం లాంటివి ఇబ్బంది కలిగించేవే. ఒంటరిగా దాదాపు 35 దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని అటవీ ప్రయాణాలు, అర్ధరాత్రి పయనాలు సాహసయాత్రకు తీసిపోనివిగా ఉండేవి. మహిళలకు ఫీల్డ్ జాబ్ అనువు కాదని ఈ రోజుల్లో అనుకోడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. మూడు దశాబ్దాల కిందటే నేనూ, అలాగే మా తరంలోని అనేకమంది చేయగలిగినప్పుడు... ఇప్పుడిది ఓ అంశమే కాదు.
– యాసీన్
ఫొటో: రాజేశ్
Comments
Please login to add a commentAdd a comment