‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్‌లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు...
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్‌లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు.
కొంతకాలం తరువాత...
నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు.
మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు.
ఇప్పుడు...
‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు.
‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ.
ఇంత మార్పు ఎలా వచ్చింది?
నీరజ మాటల్లో చెప్పాలంటే...
‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’
ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది.
‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న.
‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి.
చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
Published Tue, Nov 22 2022 4:09 AM | Last Updated on Tue, Nov 22 2022 1:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment