Social awareness
-
'ఓ మహిళా.. జర పదిలం!' లేదంటే?
ఆదిలాబాద్: 'రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైనా నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర రూట్లతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది. ప్రయాణ ప్రాంగణాల్లో పురుషుల కంటే మహిళ ప్రయాణికులే ఎక్కువగా ఉండడంతో దీనిని అదునుగా తీసుకున్న చిల్లర దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు, ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహిళలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.' పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల వద్ద మహిళల రద్దీ.. ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు అధికంగా వస్తున్నారు. పల్లె వెలుగులతో పోల్చితే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా స్టాపులు ఉండడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు మండల కేంద్రాలకు, పల్లెలకు ప్రయాణించేవారు మాత్రం పల్లె వెలుగు బస్సులు ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రధాన పట్టణాలకు వెళ్లేవారు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంల వద్ద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వద్ద మహిళా ప్రయాణికులు ఉండడంతో చిల్లర దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి దొంగతనాలు గతంలో నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి రద్దీ సమయంలో ప్రయాణించే మహిళలు విలువైన నగలు ధరించకూడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తమ హ్యాండ్ బ్యాగులో సైతం విలువైన వస్తువులు, ఖరీదైన మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది కూడా నిఘా పెంచడంతోపాటు ఎప్పటికప్పుడు మైకు ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. దీనితోపాటు సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చోరీ ఘటనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులు అందించే వాటర్ బాటిల్ నీరు, తినుబండరాలు వంటివి వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే ఆర్టీసీ భద్రత సిబ్బందికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో కొన్ని ఘటనలు ఇలా.. గతంలో తరచుగా హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లు, నగలు, డబ్బులు పోయినట్లు ప్రయాణికుల నుంఛి ఫిర్యాదులు అందాయి. కొందరు చిల్లర దొంగలు బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేయడమే పనిగా పెట్టుకొని మాకం వేస్తారు. అందులో కొన్ని ఘటనలు ఇలా.. • గత నెలలో బస్సు ఎక్కుతున్న మహిళ చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కొని పరిగెడుతుండగా అక్కడే ఉన్న ఆర్టీసీ భద్రత సిబ్బంది ఆ దొంగను పట్టుకొని మొబైల్ ఫోన్ సంబంధిత మహిళకు ఇచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు. • పనిమీద జిల్లా కేంద్రానికి వచ్చినా ఓ వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు నగలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఇలా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నాం! మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో కంటే ప్రస్తుతం మహిళల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, పోలీసుల సాకారం కూడా తీసుకుంటున్నాం. అదనపు సెక్యూరిటీని కూడా బస్టాండ్‌లో విధులు నిర్వహించేలా చూస్తున్నాం. మహిళా హోంగార్డులు, పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నాం. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. – ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డీఎం, నిర్మల్ -
గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్‌స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్‌బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్‌ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్ ఫిలిం
ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, ఓబేబి లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ చిత్రాన్ని, అలాగే అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం అనే అంతర్జాతీయ చిత్రాన్ని కూడా ఈ సంస్థలో నిర్మిస్తున్నారు. అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రానికి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డ్వేన్ బ్రావో తన అధికారిక ఫేస్ బుక్ పేజ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియచేస్తూ.. ‘డ్వేన్ బ్రావోతో ఈ సినిమాని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టోబాగోలలో షూటింగ్ చేయనున్నాం’ అని తెలిపారు. -
ఆడపిల్ల అని తేలితే అబార్షనే
సాక్షి, మహబూబాబాద్: వైద్యసేవల నిమిత్తం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా అబార్షన్ చేయటం చట్టరీత్యానేరం. ఈ విషయం సామాన్యులకు తెలుసో, తెలియదో కానీ ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వైద్యులకు తెలియదని అనుకోవటం పొరపాటే. కానీ నిబంధనలు, చట్టాలు ఇవేమీ తమకు పట్టవంటూ కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. వీరికి తోడుగా గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందించే ఆర్ఎంపీలు సైతం ఇటువంటి ఆబార్షన్లనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఖమ్మంలో ఈ తరహా దందా రహస్యంగా సాగుతోంది. ఈ దందాలో గ్రామీణ ప్రాంతాలలోని ఆర్ఎంపీ, పీఎంపీలే కీలకంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక చైతన్యం లేకపోవటమే నిరక్షరాస్యత, సామాజిక చైతన్యం లేని వాళ్లల్లో చాలా మంది ఆడ పిల్లలు వద్దనుకుంటున్నారు. పేదరికం తదితర కారణాలతో ఇక్కడి తల్లిదండ్రులు తమకు మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నారు. దీని కోసం తమకు పుట్టబోయే సంతానం ఆడ, మగ తెలుసుకోవాలని ఆర్ఎంపీ డాక్డర్లను సంప్రదిస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారికి అవగహన కల్పించాల్సిన ఆర్ఎంపీలు డబ్బే ధ్యేయంగా, తమకు తెలిసిన స్కానింగ్ కేంద్రాల్లో రహస్యంగా పరీక్షలు చేయిస్తూ, ఆడపిల్ల అని తేలితే సొంతగా వారే ఆబార్షన్లు చేస్తున్నారు. అలాగే జిల్లాలో కొంతమంది అవాహితలు గర్భందాల్చిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవడానికి వీరిని సంప్రదిస్తున్నారు. ఇదే ఆసరాగా వారి దగ్గర నుంచి డబ్బు దండుకోవటంతో పాటు, వారిని బెదిరించి అన్ని రకాలుగా వాడుకుంటున్నా సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా వైద్యధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్నా పాలీ క్లీనిక్‌లను తరుచూ తనిఖీలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. భవిష్యత్... భయానకం జిల్లాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 996 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. సకుటుం బ సమగ్ర సర్వే ప్రకారం 986 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్‌లో ఎదుర య్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి. చట్టరీత్యా చర్యలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పై ప్రజలకు విస్తృతంగా అవగహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అలాగే ఎవరైన లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం గాని, అబార్షన్లు చేస్తున్నట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నాం. చట్టవ్యతిరేఖ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ధనసరి శ్రీరాం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
సామాజిక కార్యక్రమాల్లో మోహన్ బాబు
ఇటీవల గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో, విలక్షణ నటడు మోహన్ బాబు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెట్టారు. తాజాగా యుఎస్ కాన్సూల్ జనరల్ కేథరిన్‌ను కలిసి మోహన్ బాబు మహిళ అక్రమ రవాణా విషయంలో అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నట్టుగా ప్రకటించారు. మోహన్ బాబుతో సమావేశంపై కేథరిన్ హడ్డ స్పందించారు. ‘సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్ మోహన్ బాబును కలవటం ఆనందంగా ఉంది. మీ స్ఫూర్తిదాయకమైన కథను వివరించినందుకు కృతజ్ఞతలు. మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. A pleasure to meet a legend of cinema, @themohanbabu! Thank you for sharing your inspirational story. Look forward to working with you. pic.twitter.com/MUo3slqHCR — Katherine Hadda (@USCGHyderabad) 5 March 2018 Was nice meeting @USCGHyderabad Ms. Katherine. Appreciate the efforts she has undertaken in creating awareness on the evils of women trafficking. Look forward working with her on social awareness programs. More power to you Ms.Katherine — Mohan Babu M (@themohanbabu) 6 March 2018 -
న్యాయ వ్యవస్థతో సత్వరం న్యాయం
చిల్లకూరు:మండల న్యాయసేవా సంస్థను ఆశ్రయిస్తే సత్వర న్యాయం, శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఏడవ అదనపు జిల్లా జడ్జి గుర్రప్ప అన్నారు. ఏరూరు, నాంచారమ్మపేట గ్రామాల్లో శనివారం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. దీని కోసం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వమిస్తున్నామన్నారు. అధిక శాతం భూముల విషయాల్లో అవగాహన లేక ఎంతో మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. మరో న్యాయమూర్తి ఏడుకొండలు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉందని, అయితే నేటికీ అది అమలు కావడంలేదన్నారు. ప్రస్తుతం గర్భంలో ఆడపిల్ల ఉన్నట్లు తెలిస్తే వెంటనే అబార్షన్ చేసేస్తున్నారని ఇలాంటి తప్పుడు నిర్ణాయాలు తీసుకోవడం తగదన్నారు. అనంతరం న్యాయమూర్తులు దివాకర్, కేపీ సాయరాంలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై అంకమ్మ, చింతవరం ఆసుపత్రి కమిటీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ముత్యాలపాడు సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ అమృతం లక్ష్మి, వెంకటయ్య, పెజ్జాయి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెంకటక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇపుడా వీధులన్నీ బొమ్మలమయం
న్యూఢిల్లీ: గుడి, బడి, ఆసుపత్రి అనే తేడా లేకుండా ఎక్కడిబడితే అక్కడ పాన్ తిని ఉమ్మిన మరకలు చూస్తే చిరాగ్గా ఉంటుంది కదూ. ఏ రహదారైనా ఏ దారైనా.. ఖాళీ గోడ కనిపించగానే లఘుశంక తీర్చుకునే వాళ్లను చూస్తే ఎవ్వరికైనా చిర్రెత్తుకొస్తుంది. అలా చేయకండర్రా బాబూ అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది కదూ. సరిగ్గా దేశరాజధాని నగరంలోకి వీధుల పరిస్థితిని చూసిన కొంతమందికి ఇలాగే అనిపించింది. దీంతో నగరానికి చెందిన కొంతమంది సామాజిక కార్యకర్తలు ఈ పనిని కొంచెం కళాత్మక జోడించి సందేశాత్మకంగా చేశారు. సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నవారి ప్రయత్నం పలువురి ప్రశంసలను అందుకుంటున్నారు. ఢిల్లీ పరిసరాలను మురికి కూపంలా మారుస్తూ, రోడ్లను దుర్గంధ పూరితం చేస్తున్నస్పిట్టింగ్ అండ్ లిట్టరింగ్ను ఎలాగైనా నిరోధించాలని ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రూపు కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. దేశరాజధాని వాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనుకున్నారు. దీనికి కొంచెం కళాత్మకతను జోడించి మరింత అందంగా ఈ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. గుర్గావ్, ఖాన్ మార్కెట్ ఏరియాలోని గోడలను ఎంచుకుని అందంగా పెయింట్ చేశారు. జానపద కళాకృతులను జోడించి ఆకర్షణీయంగా వాటిని తీర్చిదిద్దారు. కొన్ని గోడలపై సూక్తులను, సందేశాలను చిత్రించారు. మరికొన్నిచోట్ల దేవుడి బొమ్మలను పెయింట్ చేశారు. మన నగరం, మన బాధ్యత అనే అంశంపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రూపు ప్రతినిధి నీరజ్ వాయిద్ తెలిపారు. నగరంలోని గోడలను శుభ్రం చేయడానికి, అందంగా , సందేశాత్మకంగా తీర్చి దిద్దడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. దీంతోపాటు పబ్లిక్ డస్ట్‌బిన్ వాడకాన్ని ప్రమోట్ చేయడంకోసం వాటిని అందంగా పెయింట్ చేస్తున్నామని తెలిపారు. -
యువశక్తి.. సేవానురక్తి
అమలాపురం టౌన్ :చినుకు, చినుకు కలిసి చెరువు అయి దాహం తీరుస్తాయి. మూన, మూన కలిసి పైరు అయి ఆకలి తీరుస్తాయి. అలాగే ఆ విద్యార్థులంతా కలిసి ఒక్కటై మంచి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూనే.. ఇంకోవైపు సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రేపటి బాటలు వేసుకునే సమయంలో సాటి మనుషుల నేటి కష్టాలకు స్పందిస్తున్నారు. శక్తి మేరకు సహాయ హస్తం అందిస్తున్నారు. అలాంటి సేవాదళమే అల్లవరం మండలం ఓడలరేవులోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ‘సాల్ట్ ఆఫ్ సర్వీస్’!జిల్లాలోని 31 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 80 వేల మంది విద్యార్థుల్లో కనీసం 25 శాతం మంది సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్టు అంచనా. ఇటీవల పలు ప్రధాన ఆస్పత్రుల్లో రక్తదాతల జాబితాల్లో అధిక శాతం ఇంజనీరింగ్ విద్యార్థుల పేర్లే కనిపిస్తున్నాయి. హుద్‌హుద్ తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర బాధితుల కోసం జిల్లావ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు రూ.50 లక్షల వరకూ విరాళాలుగా ఇచ్చారు. ఇంజనీరింగ్ పూర్తయిన కొందరుమిత్రులు అమలాపురం కేంద్రంగా ‘యువ సైనిక్’ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి రక్తదానం, అన్నదానం, వస్త్రదానంతో పాటు పేదల వాడల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఓడలరేవులోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 2006 నుంచి ‘సాల్ట్ ఆఫ్ సర్వీస్’ పేరుతో ఏటా లక్షలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వంటకాల్లో ఉప్పు లేకుంటే ఎలా రుచి ఉండదో, సేవాభావం లేని జీవితానికి పరమార్థం లేదన్న భావనతోనే సంస్థకు ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 200 మంది విద్యార్థులు భాగస్వాములుగా ఉన్నారు. సంస్థ తరఫున 500 మంది విద్యార్థులు ఏ క్షణంలోనైనా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కోనసీమలోని పలు గ్రామాల్లో పేద రోగులకు ఈ సేవా సంస్థ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తోంది. వృద్ధాశ్రమాల కు కావలసిన సామగ్రి, నిత్యావసర వస్తువులు సమకూరుస్తోంది. సంస్థకు సమన్వయకర్తగా కళాశాల అధ్యాపకుడు శ్రీపాద రామకృష్ణ వ్యవహరిస్తూ విద్యార్థులను సేవాపథంలో ముందుకు నడుపుతున్నారు. చదువు, సేవ రెండు కళ్లు మేమంతా చదువుకు అవసరమైన సమయాన్ని వెచ్చిస్తూనే సమాజంలో కొందరికైనా మా వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సేవకూ ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే మా దృష్టిలో చదువు, సేవ రెండు కళ్లు. మా తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చే డబ్బుల్లోంచి కొంత తీసి, దానికి దాతల నుంచి సేకరించిన విరాళాలను జోడించి సాల్ట్ ఆఫ్ సర్వీస్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నాం. సేవల్లో భాగస్వాములం కావడం ఎంతో తృప్తినిస్తుంది. - మండలపు లావణ్య, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఈ స్ఫూర్తి జీవితాంతం కొనసాగిస్తాం.. ఇంజనీరింగ్ విద్యార్థి దశలో సాల్ట్ ఆఫ్ సర్వీస్ ద్వారా చేస్తున్న సేవలను ఇప్పటికే పరిమితం చేయం. ఇదే స్ఫూర్తిని మా జీవితాంతం కొనసాగిస్తాం. సమాజంలోని అభాగ్యులకు, అన్నార్తులకు మా వంతు సేవలు చేస్తూనే ఇతరుల నుంచి కూడా విరాళాలు సేకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకరిస్తాం. ముఖ్యంగా పేద కుటుంబాల్లో విషమవ్యాధులకు గురైన వారి వైద్యం కోసం అధిక ప్రాధాన్యతనిస్తాం. - గూరుగుబెల్లి రాజేష్‌కుమార్, బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి