ఇపుడా వీధులన్నీ బొమ్మలమయం
న్యూఢిల్లీ: గుడి, బడి, ఆసుపత్రి అనే తేడా లేకుండా ఎక్కడిబడితే అక్కడ పాన్ తిని ఉమ్మిన మరకలు చూస్తే చిరాగ్గా ఉంటుంది కదూ. ఏ రహదారైనా ఏ దారైనా.. ఖాళీ గోడ కనిపించగానే లఘుశంక తీర్చుకునే వాళ్లను చూస్తే ఎవ్వరికైనా చిర్రెత్తుకొస్తుంది. అలా చేయకండర్రా బాబూ అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది కదూ. సరిగ్గా దేశరాజధాని నగరంలోకి వీధుల పరిస్థితిని చూసిన కొంతమందికి ఇలాగే అనిపించింది. దీంతో నగరానికి చెందిన కొంతమంది సామాజిక కార్యకర్తలు ఈ పనిని కొంచెం కళాత్మక జోడించి సందేశాత్మకంగా చేశారు. సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నవారి ప్రయత్నం పలువురి ప్రశంసలను అందుకుంటున్నారు.
ఢిల్లీ పరిసరాలను మురికి కూపంలా మారుస్తూ, రోడ్లను దుర్గంధ పూరితం చేస్తున్నస్పిట్టింగ్ అండ్ లిట్టరింగ్ను ఎలాగైనా నిరోధించాలని ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రూపు కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. దేశరాజధాని వాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనుకున్నారు. దీనికి కొంచెం కళాత్మకతను జోడించి మరింత అందంగా ఈ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు.
గుర్గావ్, ఖాన్ మార్కెట్ ఏరియాలోని గోడలను ఎంచుకుని అందంగా పెయింట్ చేశారు. జానపద కళాకృతులను జోడించి ఆకర్షణీయంగా వాటిని తీర్చిదిద్దారు. కొన్ని గోడలపై సూక్తులను, సందేశాలను చిత్రించారు. మరికొన్నిచోట్ల దేవుడి బొమ్మలను పెయింట్ చేశారు.
మన నగరం, మన బాధ్యత అనే అంశంపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రూపు ప్రతినిధి నీరజ్ వాయిద్ తెలిపారు. నగరంలోని గోడలను శుభ్రం చేయడానికి, అందంగా , సందేశాత్మకంగా తీర్చి దిద్దడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. దీంతోపాటు పబ్లిక్ డస్ట్బిన్ వాడకాన్ని ప్రమోట్ చేయడంకోసం వాటిని అందంగా పెయింట్ చేస్తున్నామని తెలిపారు.