Painting Exhibition
-
Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై..
⇒కొనతేలిన ముక్కునే కుంచెగా.. అబ్బురపరుస్తున్న చిత్రకారుడు⇒ఆకర్షించే వందలాది నాసిక చిత్రాలు..⇒అబ్దుల్‌కలాం ప్రశంసలు.. మరెన్నో అవార్డులు, బిరుదులు..⇒సత్యవోలు రాంబాబు అసాధారణ ప్రతిభ.. ఇప్పటి వరకూ పెన్సిల్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, నెయిల్ ఆర్ట్, బ్రష్ ఆర్ట్, నైఫ్ ఆర్ట్, ఆఖరికి కాళ్లతోనూ బొమ్మలు వేసేవాళ్లను.. ఇలా.. అనేక రకాల పెయింటింగ్స్ వినుంటాం... కానీ అతను ముక్కునే కుంచెగా ఎంచుకున్నాడు.. ముక్కుతో ఆర్ట్ ఎలా వేస్తారండీ బాబూ అనొచ్చు... అదే ఇందులో ఉన్న గొప్పతనం.. పూర్తిగా చూస్తూ వేస్తేనే చాలా కష్టమనిపించే ఆర్ట్‌ని ముక్కుతో వేయడమంటే.. ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి.. ఎందరో ప్రముఖుల చిత్రాలను సైతం తన ముక్కుతో గీసి వారికి అభిమానాన్ని చూరగొన్నాడు. అతడే నిజాంపేటకు చెందిన సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సత్యవోలు రాంబాబు. తన చిత్రకళా ప్రస్థానంలో ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం... డాక్టరో..యాక్టరో..సాఫ్ట్‌వేరో..ఇలా తాము ఎంచుకున్న రంగాన్ని ఏలేసేయాలన్న కసితో నగరానికి వచ్చేవారెందరో..వారందరి లాగే ఓ యువకుడు చిత్ర కళను తన ఊపిరిగా చేసుకుని, భుజాన ఓ సంచి..అందులో కొన్ని ఖాళీ పేపర్లు.. నాలుగైదు పెన్సిళ్లు.. చాలన్నట్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చిత్రకళ కడుపు నింపుతుందా ‘భాయ్’.. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అన్నవాళ్లు నోరెళ్లబెట్టేలా చేశాడు.. ఎంచుకున్న కళే జీవితంగా బతికాడు.. రాణించాడు.. మరెందరికో ఆదర్శంగా నిలిచాడు.. అయితే అందరిలా గుర్తింపు తెచ్చుకుంటే మజా ఏంటి అనుకున్నాడో ఏమో.. కొనదేలిన నాసికాన్నే తన కుంచెగా ఎంచుకున్నాడు. క్షణాల్లో ఔరా.. అనే చిత్రాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు.ముక్కుతో ఏడేళ్ల సాధన తన కెరీర్లో మామూలు చిత్రకారుడిగా మిగిలిపోకూడదని తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే నాసికా చిత్రకారుడిగా మలిచింది. ఏడేళ్ల పాటు సాధన చేసి ముక్కును కుంచెగా చేసుకుని వందలాది బొమ్మలను గీసి ఎందరో మన్ననలను పొందారు. ముక్కుతో బొమ్మలు గీసే అరుదైన చిత్రకారుడంటూ అతని ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తా సంస్థ సైతం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీశారు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ సమక్షంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం బొమ్మను చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. అబ్దుల్‌కలాం సైతం అబ్బురపడి ప్రశంసిస్తూ రాంబాబుకు లేఖ రాశారు.లైవ్‌లోనూ మేటిగా.. ఒకవైపు నృత్య విన్యాసాలు.. వాటిని అనుకరిస్తూ మరోవైపు ముక్కుతో చిత్రాలు గీయడమంటే ఆషామాషీ కాదు. సంగీత, నృత్య, చిత్ర సంగమంగా గతంలో డిజైర్స్ పేరిట రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాంబాబు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వేదికపై నృత్యకారిణులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుంటే రాంబాబు నాట్యభంగిమలు, హావభావాలను, ముఖ కవళికలను చకచకా చిత్రించి ఔరా అనిపించారు. రెండు నిమిషాలకో చిత్రం చొప్పున కేవలం పది నిమిషాల్లో ఐదు నృత్య భంగిమలకు ప్రాణం పోసి చూపరులను ఆకట్టుకున్నారు.ఎన్నో అవార్డులు.. ప్రశంసలు..👉 ఏషియా వేదిక్ రీసెర్చ్ యూనివర్శిటీ నాసికా చిత్రలేఖనం, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్.👉 మానవతా స్వచ్ఛంద సంస్థ అమలాపురం వారిచే చిత్రకళా రత్న అవార్డు.👉 లంక ఆర్ట్స్థియేటర్ వారిచే నాసిక చిత్రకళా రత్న.👉 యువ కళావాహిని వారిచే స్వామి వివేకానంద అఛీవ్మెంట్ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే బెస్ట్ టీచర్ అవార్డు.👉 ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే బెస్ట్ ఆరి్టస్ట్ అవార్డు. 👉 సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ వారిచే గురుబ్రహ్మ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ సరీ్వసు అవార్డు.👉 సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ హ్యూమానిటీ అవార్డు.👉 ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ నుంచి స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు. 👉 కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ నుంచి కళాప్రతిభ అవార్డు. 👉 సుధా ఆర్ట్స్ అకాడమీ నుంచి కళానిధి అవార్డు. 👉 జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నుంచి కళాభిషేకం అవార్డు. 👉 మెగా రికార్డ్స్ సంస్థ నుంచి కళా ప్రతిభ మూర్తి, ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు. 👉 యశోద ఫౌండేషన్ నుంచి కళారత్న అవార్డు.విశ్వగురు అవార్డ్స్‌ను స్థాపించి..విభిన్న రంగాల్లో మేటిగా సేవలందించే వారిని గుర్తించి వారిలో నూతనోత్తేజాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో విశ్వగురు అవార్డ్స్‌ను నెలకొల్పి ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఏటేటా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులను అందించి సన్మానించడం ఆనవాయితీ. అలాగే నిజాంపేటలో సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా చిత్రకళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిక్షణ అందిస్తున్నారు.రెండు దశాబ్దాల క్రితం..ఓ 20 ఏళ్ల క్రితం..అసలు చిత్రకళ అంటే అంతగా పట్టించుకోని రోజులు.. పశి్చమ గోదావరి జిల్లా వేగివాడకు చెందిన సత్యవోలు రాంబాబు పాఠశాల స్థాయిలో చిత్రకళపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. తన గురువు ఇజ్రాయిల్ ప్రేరణతో పాఠశాల స్థాయిలోనే లోయర్, హయ్యర్ పూర్తి చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుని చిత్రకళపై తనకున్న అభీష్టాన్ని చాటిచెప్పాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. చదివింది ఇంటరీ్మడియెట్ అయినా కళలో తనకున్న ప్రావీణ్యాన్నే నమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాడు. అడపాదడపా జరిగే పోటీల్లో పాల్గొనడం, అక్కడ ఇచ్చే పారితోíÙకంతో జీవితాన్ని నెట్టుకురావడం చేశాడు. ఇంటర్‌తో ఆగిపోయిన చదువును కొనగించాలని డిగ్రీలో చేరి మరోవైపు చిత్రకళను కొనసాగించారు. అలా తన ప్రస్థానం మొదలై ఎందరికో ఆ కళను పంచే స్థాయికి ఎదిగారు. -
ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్‌లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7నుం చి మూడు రోజుల పాటు జరగనుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టిల్ను తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నా యి. ఇప్పటివరకూ ప్రతి ఏటా ఢిల్లీ, బెంగళూరు , ముంబై తదితర నగరాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించగా ఇపుడు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొం టున్నా రు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో మొదటిసారి ఇం డియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్ట్ ఫెస్టివల్ విశేషాలు దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మందికళాకారులు , గ్యా లరీ ఎగ్జిబిట్ లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా , శక్తి బర్మ న్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, S G వాసుదేవ్, అం జోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టీ.వైకుంఠం , లక్ష్మ ణ్ ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం , జతిన్ దాస్, పి. జ్ఞాన, రమేష్ గోర్జాల, ప్రసన్న ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు కొలువుదీరతాయి.ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్ బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎం.వీ రమణా రెడ్డి, పిజెస్టాలిన్, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుజాతా అచ్రేకర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరుల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యా లరీ, స్నే హ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యా లరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూ ఢిల్లీ నుంచి ఆర్ట్ హట్, గ్యా లరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్ , స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్, ముంబై నుంచి బియాండ్ ది కాన్వా స్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యా లరీ, మ్రియా ఆర్ట్స్ , ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యా లరీ, కలాస్ట్రో ట్, రిగ్వే ద ఆర్ట్ గ్యా లరీ, స్టూడియో పం కజ్ బావ్డేకర్, ది బాం బే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. అలాగే జ్ఞాని ఆర్ట్స్ (సిం గపూర్), ఎక్స్ క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్ కతా), కాన్వా స్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యా లరీ (నాగ్ పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి. కళాఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ప్రదర్శన కూడా ఉంటుంది.భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం "ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్", హైలైట్‌గా నిలవనున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2024 వైవిధ్యం, సృజనాత్మక , కళాత్మక వ్యక్తీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కళాభిమానులు, ఆర్ట్ కలెక్టర్స్ ఈ ప్రత్యేక సాంస్కృ తిక కార్యక్రమాన్ని చూసేందుకు బుక్ మై షోలో టికెట్స్ (299 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.ఈవెంట్ వివరాలు:ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ : జూన్ 7-9వ తేదీ వరకువేదిక: కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్, పిల్లర్ 68, పివి నర్సిం హారావు ఎక్స్ ప్రెస్ వే, రేతిబౌలి, హైదరాబాద్సమయం : ఉదయం 11:00 నుం డి రాత్రి 8:00 వరకుమరింత సమాచారం కోసం IAF డైరెక్టర్ రాజేంద్ర : 7400009978, 9820737692 -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్‌బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్‌పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Kovilpatti: కళాపూర్ణోదయం
తమిళనాడులోని కోవిల్పట్టి అనే చిన్న పట్టణం అద్భుత చిత్రకారులకు నెలవు. క్యాలెండర్లు, మ్యాగజైన్లు, బుక్ కవర్లు, ఇన్విటేషన్లు, గ్రీటింగ్‌కార్డ్స్... మొదలైన వాటికి వేసిన అద్భుత పెయింటింగ్‌లు గత కాల జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఆ చిత్రకారుల గురించి నామమాత్రంగా కూడా తెలియకుండా పోయింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘కోవిల్పట్టి: ది టౌన్ దట్ పేపర్డ్ ఇండియా’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన అద్భుత పెయింటింగ్‌లు నెట్లో చక్కర్లు కొడుతూ ‘ఆహా’ అనిపిస్తున్నాయి. -
బతుకు చిత్రాలకు ఉత్తమ స్థానాలు
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రాకళా పోటీలు, ప్రదర్శన ఆదివారంతో ముగిశాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, బిహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల చిత్రకారులు వేసిన 189 పెద్దచిత్రాలను ప్రదర్శించారు. గుంటూరు చిత్రకారుడు వస్తగిరి జస్టిస్ వేసిన సజీవ చిత్రానికి మొదటి బహుమతి దక్కింది. కోల్‌కతాకు చెందిన రాజేష్ వేసిన స్వీయ జీవన చిత్రం ద్వితీయ బహుమతిని, చెన్నైకి చెందిన చిత్రకారుడు గణేషన్ జీవితంలో సొంతవారి కోసం నిరీక్షిస్తున్నట్టు వేసిన సజీవ చిత్రం తృతీయ బహుమతిని పొందాయి. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు వేసిన బెంగళూరు చిత్రకారుడు దేవీప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. మెగా అవార్డును రాజు (రాజమండ్రి), ప్రత్యేక బహుమతులను చక్రపాణి (హైదరాబాద్), కె.భాస్కరావు (పాలకొల్లు), అన్నామలై (చెన్నై), కరుణాకర్ (విజయనగరం), విజయ్ (హైదరాబాద్) పొందారు. ఈ పోటీలకు ప్రముఖ చిత్రాకారులు ఎం.సుబ్రహ్మణ్యం, కె.రామ్మోహన్రావు, వీవీ కోటేశ్వరరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రదర్శన నిర్వాహకుడు, చిత్రకళా నిలయం చిత్రకారుడు బొడ్డేడ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.రామనరేష్ పాల్గొని బహుమతులు అందజేశారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న దేవీప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. -
డైరెక్టర్ మారుతి కూతురు ఆర్ట్ గ్యాలరీ.. సందడి చేసిన సినీతారలు (ఫొటోలు)
-
కాదేదీ బిజినెస్‌కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
అంతర్జాతీయ వేదికపై అద్భుత ‘కళ’
సాక్షి, హైదరాబాద్: హృదయంలో కళాత్మకత, చేసే పనిలో అంకితభావం ఉంటే ఏ కళకైనా, కళాకారునికైనా కీర్తి, ఖ్యాతి దరి చేరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని నగరానికి చెందిన దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ మరోసారి నిరూపించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్ట్ దుబాయ్ వేదికగా హైదరాబాదీ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. మాస్కులర్ డిస్ట్రోఫీ(కండర క్షీణత) వ్యాధితో బాధ పడుతూ ముప్పై ఏళ్లుగా చీకటి గదికే పరిమితమైన షేక్ నఫీస్ నిబద్దతతో తాను ప్రాణం పోస్తున్న కళ తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. కండరాల క్షీణతతో బాధపడుతున్న నఫీస్ ప్రతిభ 2018లో వెలుగులోకి వచ్చింది. మొదటగా రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో తన ప్రతిభను చాటింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018లో రవీంద్రభారతిలో, 2021లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నఫీస్ చిత్రాలను ప్రదర్శించి వైకల్యం దేహానికే తప్ప ఎంచుకున్న లక్ష్యానికి కాదని నిరూపించింది. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన.. ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ వేదికగా గత నాలుగు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఎగ్జిబిషన్లో నఫీస్ చిత్రాలను ప్రదర్శించే అవకాశం లభించింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో సారంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. తన కృషిని ప్రపంచానికి చాటేందుకు మొదటి నుంచి కృషి చేస్తున్న సామాజికవేత్త ఖాజా ఆఫ్రిది ఆమె చిత్రాలను వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆఫ్రిది మాట్లాడుతూ.. నాలుగు గోడలకే పరిమితమైన నఫీస్ కళను నలుగురికి చూపించాలనే తన సంకల్పం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేదికపై లక్షలాది మంది అంతర్జాతీయ స్థాయి కళా ప్రేమికులు నఫీస్ చిత్రాలను ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శనను షేక్ నఫీస్ నగరం నుంచి వర్చువల్‌గా తిలకించి తన కళకు, కృషికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి సంబరపడుతుందని పేర్కొన్నారు. -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం..!
-
రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో ఆసక్తికర పోస్టుపై మహీంద్రా స్పందించారు. రష్యాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక కొన్ని కోట్లు విలువైన పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. అయితే, ఈ వార్తాపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా.." ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త కళాఖండాన్ని ఎన్ఎఫ్టిగా మార్చండి" అని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH — anand mahindra (@anandmahindra) February 10, 2022 ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ.7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న 10 నగరాల్లో 2 మనవే..!) -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం
Bored Security Guard Drew Eyes On Painting of Faceless Figures: కొంతమంది సరదాగానో లేక బోరుకొడుతుందనో చేసిన పనులు వికటించి పెను ప్రమాదాలుగా మారిని సందర్భాలు కోకొల్లలు. ఐతే అవి ఒక్కోసారి మనకు నష్టం వాటిల్లకపోయిన లక్‌ని తీసుకువచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఒక్కోసారి ఆ పనులు మనం కలలో కూడా ఊహించనంత నష్టాన్ని చవిచూసేలా చేస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే రష్యాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ. 7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు కూడా. (చదవండి: వెన్నుముక మార్పిడి..వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..) -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
డబ్బే డబ్బు!: జంతువు వేసిన పెయింటింగ్‌కు రికార్డు ధర
మాస్టారి టాలెంట్ ఏమిటో ఫొటో చూడగానే మీరో అంచనాకు వచ్చేసుంటారు.. ఇది ఉత్త పిగ్ కాదు.. దీని పేరు పిగ్కాసో.. అంటే.. పందుల్లో పికాసో టైపు అన్నమాట. నిజానికి బిర్యానీలో లెగ్పీసు కింద మారాల్సిన ఈ వరాహం.. జువానే లెఫ్సన్ అనే ఆవిడ పుణ్యాన రోజుకో ఆర్టు పీసును సృష్టించేస్తోంది.. ఇంతకీ ఏమైందంటే.. చిన్నప్పుడు దీన్ని ఓ మటన్ షాపుకు అమ్మేశారట.. కీమా కొట్టేయడానికి.. అయితే జువానే రక్షించి.. పెంచుకున్నారు.. అదే సమయంలో తన షాపులోపడి ఉన్న పెయింట్ బ్రష్షు పట్టుకుని.. విన్యాసాలు చేస్తుంటే చూసి.. ఆ దిశగా ప్రోత్సహించారు.. అంతే... అప్పట్నుంచి పిగ్ కాసో తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేసుకుంది.. తాజాగా వారాల తరబడి కష్టపడి.. ఇదిగో ఈ పెయింటింగ్‌ను వేసే సింది. తన కష్టం వృథా పోలేదు.. ఈ వరాహం వేసిన పెయింటింగ్‌కు అచ్చంగా వరహాల మూటే దక్కింది. జర్మనీకి చెందిన పీటర్ ఎసర్ అనే వ్యక్తి రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్‌ను దక్కించు కున్నారు. దాంతో పిగ్కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదనుకోండి.. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది. -
అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!
German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం.. ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్ ఆర్ట్ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్ వేశాడా జర్మన్ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి -
మా దారి రంగుల దారి
పెయింటర్ వచ్చాడా అని గతంలో అడిగేవారు. ఇకపై పెయింటరమ్మ వచ్చిందా అని అడగాలి. గ్రామీణ తమిళనాడులో స్త్రీ ఉపాధికి కొత్త మార్గం తెరుచుకుంది. మగవారికే పరిమితమైన వాల్ పెయింటింగ్‌లో జపాన్ పెయింట్ సంస్థ ‘నిప్పన్’ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారు నిచ్చెనలు ఎక్కి బ్రష్ పట్టుకుంటున్నారు గోడలకే కాదు బతుకు దారికీ రంగు వేస్తున్నారు. ‘గ్రామీణ స్త్రీలకు ఉపాధి చూపించాలి. శ్రమ జీవనంలో ఉండే ఆ స్త్రీలు శ్రమతో నిండిన వాల్ పెయింటింగ్‌లో రాణించగలరని భావించాం. అదే ఇప్పుడు నిజమైంది’ అంటారు నిప్పన్ పెయింట్స్ (ఆసియా) విభాగం ప్రతినిధి మహేష్ ఆనంద్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ‘ఎన్‌శక్తి’లో భాగంగా ఆ దిగ్గజ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరు, వెల్లూరు, రామనాథపురం... వంటి జిల్లాల్లో చిన్న ఊళ్ల నుంచి 1000 మంది స్త్రీలకు వాల్ పెయింటింగ్‌లో శిక్షణ ఇవ్వాలని రెండేళ్ల క్రితం నిశ్చయించుకుంది. ఇప్పటికి ఐదువందల మంది స్త్రీలు శిక్షణ పొంది వాల్ పెయింటింగ్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు కాంట్రాక్టర్ మైలాదుతురై అనే ఊరికి చెందిన దుర్గ మొదటిసారి పెయింటింగ్ బ్రష్ పట్టుకున్నప్పుడు ఈ పనిలో రాణించగలనా అనుకుంది. కాని ఇప్పుడు ఆమె పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా తన జీవితాన్నే మార్చుకుంది. ‘వాల్ పెయింటింగ్‌లో శిక్షణ తీసుకున్నాక పెయింటింగ్ మొదలెట్టాను. నా చురుకుదనం చూసి నన్నే కాంట్రాక్ట్‌లు తెచ్చుకోమని నా తోటి మహిళా పెయింటర్లు సూచించారు. ఇప్పుడు నేనే కాంట్రాక్ట్ తెచ్చి పని చేయిస్తున్నాను’ అంటుంది దుర్గ. అయితే ఆ పని అంత సులువు కాలేదు. ఇంట్లో వాళ్లు ఆమెను ఆ పనికి పంపడానికి అంగీకరించలేదు. ‘నేను వాల్‌పెయింటింగ్ చేస్తున్న దృశ్యాన్ని ఫోన్లో వీడియోగా షూట్ చేసి ఇంట్లో చూపిస్తే వాళ్లు ఆ పని నేను బాగా చేస్తున్నానని అంగీకరించారు’ అని దుర్గ అంది. ‘ఆ వీడియో నా ప్రచారం కోసం కూడా వాడుతున్నాను. అది చూసి నాకు పని ఇస్తున్నారు’ అని అంది దుర్గ. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న గ్రామీణ స్త్రీలను వెతికి నిప్పన్ సంస్థతో అనుసంధానం చేసే పని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ట్రయినింగ్ 12 రోజులు ఉంటుంది. ఆ 12 రోజుల్లో పెయింటింగ్‌కు సంబంధించిన మెళకువలు, జాగ్రత్తలు నేర్పిస్తారు. ‘మేమందరం చీరలు కట్టుకుని ఊళ్లల్లో ఉండేవాళ్లం. ప్యాంటు షర్టు వేసుకుని ఈ పని చేయాలంటే కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలవాటైపోయింది’ అని వెన్మతి అనే పెయింటర్ నవ్వుతూ అంది. అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహిళా పెయింటర్లు బృందాలుగా ఏర్పడి బయటి నగరాలకు వెళ్లి పని చేస్తామంటే ఇళ్లల్లో పంపిస్తున్నారు. ‘మేము రెండేసి నెలలు కోయంబత్తూరు, చిదంబరం వంటి నగరాలకు వెళ్లి పెయింట్ చేసి వస్తున్నాం’ అని ఈ పెయింటర్లు చెప్పారు. వీరికి ఒక్కొక్కరికి 650 రూపాయల కూలీ ఆ పైన దొరుకుతోంది. చెన్నైలో 2000 మంది నిప్పన్ సంస్థ ఒక్క చెన్నైలోనే రెండు వేల మంది మహిళా పెయింటర్లను తయారు చేయాలని తాజాగా నిశ్చయించుకుంది. ఇందుకు చెన్నై రోటరీ క్లబ్‌తో ఒక ఒడంబడిక చేసుకుంది. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న మహిళలను రోటరీ క్లబ్ నిప్పన్‌తో అనుసంధానం చేస్తుంది. ‘వాల్ పెయింటింగ్ ఇవాళ్టికి మగవారి పనిగా ఉంది. కాని ఈ పనిలో స్త్రీలు బాగా రాణిస్తారు’ అని రోటరీ క్లబ్ ప్రతినిధి అన్నారు. పెయింటింగ్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో కూడా వీరికి తెలుసు. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే పని చేస్తున్నారు. ‘వీరు పెయింటింగ్‌లో శిక్షణ పొందాక ఇంటీరియర్ డిజైన్ సంస్థలకు, కన్స్ట్రక్షన్ సంస్థలకు మేము వారిని అనుసంధానం చేస్తాం. పని దొరికేలా కూడా చూస్తాం’ అని నిప్పన్ సంస్థ ప్రతినిధి చెప్పారు. స్త్రీలకు కొత్త బతుకుదారి తెరుచుకోవడం... అది రంగుల దారికావడం మంచి విషయం. -
డబ్బులు లేక ఆ రోజు చేసిన పని.. నేడు ట్రెండ్‌గా మారింది
జూలియా సయూద్ సిరియాకు చెందిన యువతి. ఆమెకు పెయింటింగ్స్ అంటే ప్రాణం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జూలియా తన ఇంటిని వదిలి బయటకు రావల్సివచ్చింది. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కిట్‌ను అక్కడే వదిలేసింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందంటే.. తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్స్‌ను ఆపడం ఇష్టం లేని ఆ యువతి.. కలర్స్ లేకపోయనా తన కళను కొనసాగించాలనుకుంది. అందుకోసం ఆమె ఓ కొత్త ఐడియా ఆలోచించింది. అదే.. కలర్స్ బదులుగా మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్‌ను వేయాలని నిర్ణయించుకుంది. అలా మొదలు పెట్టిన జూలియా ప్రస్తుతం ఆ మట్టి పెయింటింగ్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అప్పుడు మట్టితో పెయింటింగ్స్ వేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనుకున్నా. మొదట, నేను నా కలను కొనసాగించాలని ఆలోచనతో అలా మట్టితో మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు వేరే మార్గం లేదు .. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోందని తెలిపింది. మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తన వేసిన సాయిల్ పెయింటింగ్స్ ఆ ప్రాంతంలో ట్రెండ్‌గా మారడంతో పాటు ఆ పరిసరాల్లోని పిల్లలకు కూడా ఈ మట్టితో పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నారు. WATCH: Syrian artist Julia Saeed started painting with soil after she fled her home in Raqqa and could not afford to buy paint. Now she has made painting with soil her unique style pic.twitter.com/JsE64Imai5 — Reuters (@Reuters) October 10, 2021 -
రూ. 300 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. స్పెషల్ ఏంటి?
ఊపిరి సినిమా చూశారా! అందులో హీరో కార్తీ టాయిలెట్ క్లీనింగ్ బ్రష్‌తో ఓ చిత్రమైన పెయింటింగ్ వేస్తాడు. దానిని రూ. 2 లక్షలు పెట్టి కొనటమే కాకుండా.. లేని ఓ అర్థాన్ని వివరిస్తూ హాస్యం పండిస్తాడు ప్రకాశ్‌రాజ్. అలా వచ్చిన డబ్బుతో కార్తీ తన చెల్లి పెళ్లి చేస్తే.. నిజ జీవితంలో బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. అయితే, ఇతను కార్తీలా కాదు.. ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? ఇలా వాళ్ల అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి వాటిని తనకు పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని వెచ్చించి ఆ పెయింటింగ్ వేశాడు. దీనికోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్‌ను ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా తయారు చేశాడు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు కూడా సంపాదించుకుంది. పైగా ఇందులో ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అర్థం దాగి ఉంది. దుబాయ్‌లోని ‘ది పామ్’ హోటల్లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. #HappeningNow the #OpeningAuction of @SachaJafri' record breaking #artwork #TheJourneyOfHumanity is achieved great interest! It actually has enough interest to be sold entirely to one bidder! pic.twitter.com/e2E4EcGg1z — Mazdak (@MazRaf75) March 22, 2021 చదవండి: రూ.2,000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన -
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్‌ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్‌ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్‌లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్‌లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్‌లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్‌ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్‌ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్‌తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్‌లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్‌గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!
ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 44 ఏళ్ల బ్రిటీష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ. కరోనా వైరస్ ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న చిన్నారులకు ఏదోరకంగా సాయం చేయాలనుకున్న జాఫ్రీ తనకు తెలిసిన విద్యతో కోట్లు సంపాదించి సామాజిక సేవచేస్తున్నాడు. గత ఏడాది కరోనా కాలంలో జాఫ్రీ వేసిన ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పెయింటింగ్ తాజాగా దుబాయ్‌లో జరిగిన వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మన రూపాయలలో దీని విలువ రూ.450 కోట్లకుపై మాటే. జాఫ్రీ ఈ మొత్తాన్నీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు.జాఫ్రీ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌ను 70 భాగాలుగా వేసాడు. ఈ భాగాలను విడివిడిగా విక్రయించి 30 మిలియన్ డాలర్లను కూడబెట్టి చిన్నారులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఫ్రెంచ్ క్రిఫ్టో కరెన్సీ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్ మొత్తం పెయింటింగ్‌కు రెట్టింపు డబ్బులు ఇస్తాననడంతో పెయింటింగ్ రూ.450 కోట్లకు విక్రయించాడు. జాఫ్రీ ఈ మొత్తాన్నీ దుబాయ్ కేర్స్, యూనిసెఫ్, యునెస్కో, గ్లోబల్ గిఫ్ట్ట్ ఫౌండేషన్ వంటి సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు. కరోనా కాలంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. తినడానకి తిండిలేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది చిన్నారులు నానా అవస్థలు పడడం చూసి చలించిన జాఫ్రీ వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే పెద్ద పెయింటింగ్ వేసి కనీసం 30 మిలియన్ డాలర్లు సంపాదించి చిన్నారులకు విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. అతిపెద్ద పెయింటింగ్ వేసేందుకు చిన్నారుల నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుని..‘‘కరోనా కాలంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే విధంగా ఆర్ట్ వర్క్స్‌ను నాకు పంపండి’’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులను జాఫ్రీ కోరాడు. జాఫ్రీ సందేశానికి స్పందించిన 140 దేశాల్లోని చిన్నారులు ఆన్లైన్ ద్వారా తమ ఆర్ట్‌వర్క్‌ను పంపించారు. అప్పుడు దుబాయ్‌లోని అట్లాంటిస్ హోమ్ హోటల్లో జాఫ్రీ సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20గంటలపాటు కష్టపడి చిన్నారులు పంపిన చిత్రాలను జతచేస్తూ గతేడాది సెప్టెంబరులో పెయింటింగ్‌ను పూర్తిచేశాడు. 17 వేల చదరపు అడుగుల ‘జర్నీ ఆఫ్ హ్యూమానిటీ’ పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించడం తో ఈపెయింటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌గా నిలిచింది. ఇది నాలుగు ఎన్బీఏ బాస్కెట్ బాల్ కోర్టుల పరిమాణానికి సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌ను దక్కించుకున్న అబ్దున్ మాట్లాడుతూ..‘‘నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి తిండిలేనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎన్నోసార్లు ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పెయింటింగ్ విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో మంది చిన్నారుల ఆకలి తీరుస్తాయి. అందుకే రెట్టింపు ధరతో పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. -
ఒక్క పెయింటింగ్ ధర రూ. 450 కోట్లు.. ప్రత్యేకత ఇదే!
అబుదాబి: ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్‌లకు ఎంతో విలువ ఉంటుంది. పెయింటింగ్ అంటే పడిచచ్చే వాళ్లు వాటి కోసం ఎంత డబ్బైయిన వెచ్చించి తమ సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో వాటి ధర కోట్లలో పలికి.. అమ్ముడు పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా వేలంలో ఓ పెయింట్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయింది. ఏకంగా రూ. 62 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 450 కోట్లు) అమ్ముడు పోయి ప్రపంచలోనే అత్యంత వీలువైన పెయింటింగ్‌గా గుర్తింపు పొంది గిన్నిస్ రికార్టుకెక్కింది. ఈ పెయింటింగ్‌ను బ్రిటిష్ చిత్రకారుడు సచా జాఫ్రీ వేశాడు. అయితే అతడు వేసిన ఈ పెయింటింగ్ విశేషం ఏంటో ఓ సారి చుద్దాం. ప్రముఖ బ్రిటిష్ పెయింటరైన సచా జాఫ్రీ దీనిని దుబాయ్‌లో రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్యాస్ పెయింటింగ్‌గా పెరొందిన దీనిని 17, 176 చదరపు అడుగుల మేర వేశాడట. అంటే ఇది 6 టెన్నిస్ కోర్టులతో సమానం. దీంతో ఈ పెయింటింగ్‌ను మొత్తం 70 భాగాలు విభజించి దుబాయ్‌లో వేలం వేయగా 450 రూపాలయ కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మనుషుల జీవన మనుగడను ప్రతిబించే ఈ పెయింటింగ్‌ను ‘జర్నీ ఆఫ్ హుమానిటీ’ పేరుతో జాఫ్రీ దీనిని రూపొందించాడు. అయితే దీనిని గీసేందుకు అతడికి 1065 పెయింటింగ్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింటింగ్ పట్టిందట. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నిస్‌బుక్ నిర్వాహక అధికారులు ధృవీకరించారు. అంతేగాక రికార్డుకు సంబంధించిన పత్రాన్ని ఆర్టిస్ట్ జాఫ్రీకి నిర్వాహకులు అందిచారు. ఈ పెయింటింగ్‌ను ఫ్రెంచ్కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యాపార వేత్త వేలం పాటలో రూ.450 కోట్లకు దక్కించుకోవడం విశేషం. చదవండి: చైతో ఇదే సమస్య.. దాని కోసం తరచూ వాదన: సామ్ వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు -
ఆర్ట్ ఎగ్జిబిషన్: సల్మాన్‌కు అరుదైన గౌరవం
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పెయింటింగ్ అంటే ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీ సమయం దొరికనప్పుల్లా తన పెయింట్ బ్రష్‌కు పని చేప్తుంటాడు భాయిజాన్. అలా లాక్డౌన్లో ఆయన వేసిన కొన్ని పెయింటింగ్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో సల్మాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్‌లను ప్రదర్శించనున్నారు. అది కూడా ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవి వర్మ పెయింటింగ్ చిత్రాలతో పాటు ఆయన పెయింటింగ్‌ను కూడా ప్రదర్శించనున్నారు. దీనిపై భాయిజాన్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో శుక్రవారం పంచుకున్నాడు. ‘రాజా రవి వర్మ, అబనీంద్రనాథ్ ఠాగూర్, వీఎస్ గైతోండే వంటి గొప్ప కళాకారుల మధ్య నా పెయింటింగ్ ప్రదర్శించబోతుండటం నిజంగా విశేషం. ఈ విషయాన్ని గ్రహించడం కాస్తా ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇది అరుదైన గౌరవం. అందరికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సల్మాన్ సంతకం చేసిన మదర్ థెరిస్సా పెయింటింగ్‌ను ఈ ఇమ్మోర్టల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. కాగా సల్మాన్ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది రంజాన్‌కు విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో సల్మాన్‌కు జోడిగా దిశా పటాని నటిస్తుంది. ‘రాధే’తో పాటు మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) చదవండి: షారుక్ ఖాన్ సినిమాలో సల్మాన్! హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం -
ఎంఎఫ్ హుస్సేన్ ‘సినిమా ఘర్’.. ఇక ఫొటోలోనే..
సాక్షి, బంజారాహిల్స్: సినిమాలు, కళలను అనుసంధానిస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో తన కలల సౌధంగా నిర్మించుకున్న సినిమా ఘర్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు సినిమాలను, ఇంకోవైపు పెయింటింగ్స్‌ను తిలకిస్తూ కళాకారులు మురిసిపోయే విధంగా 1994లో ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ సినిమా ఘర్ పేరుతో తన సొంత ఆలోచనతో దీన్ని నిర్మించారు. అప్పటి బాలీవుడ్ అగ్రనటి మాధురి దీక్షిత్ చేతులమీదుగా ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దీని నిర్వహణ వదిలేశారు. కోట్ల విలువ చేసే పెయింటింగ్స్‌ను ముంబైకి తరలించారు. పది సంవత్సరాల నుంచి ఈ భవనం శిథిలావస్థలోనే ఉంది. పదేళ్ల క్రితమే మళ్లీ తెరుస్తామని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ లోపే ఆయన 2011 జూన్ 9న మరణించడంతో మళ్లీ తెరుచుకోలేదు. ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ సినిమా పేరుతో కనువిందుగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. 50 మంది కూర్చొని సినిమా తిలకించే విధంగా సౌందర్య టాకీస్ పేరుతో ఇందులో మినీ థియేటర్ కూడా ఉండేది. ఇక పెయింటింగ్స్, బుక్స్, పోస్ట్‌కార్డుల ప్రదర్శన కోసం ప్యారిస్ సూట్ పేరుతో మరో హాల్ ఉండేది. తరచూ ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడికి వచ్చి తన సన్నిహితులతో, కళాకారులతో సంభాషిస్తూ ఉండేవారు. ఆయన మరణం సినిమా ఘర్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేస్తుంటే కళాభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంఎఫ్ హుస్సేన్ జ్ఞాపకాలు కళ్లముందే కూలిపోతుంటే ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు. కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకొని కళాకారుల సందర్శనార్థం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.