కర్రకు జీవం.. | Wooden toys Artists | Sakshi
Sakshi News home page

కర్రకు జీవం..

Published Sun, Jan 4 2015 3:44 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

కర్రకు జీవం.. - Sakshi

కర్రకు జీవం..

నిర్మల్ అర్బన్ : కొయ్యబొమ్మలు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నిర్మల్. ఇక్కడి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పునికి కర్రతో తయారు చేసే బొమ్మలు, పరికరాలు, చిత్రకళలు, పెయింటింగ్స్ సహ జసిద్ధంగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. ప్రతీ ఒక్కరి మనస్సు దోచుకుంటాయి. చిత్రకళకు ప్రతీరూపాలైన నిర్మల్ బొమ్మలకు అంతటి ఘనత ఉంది మరీ.

400 ఏళ్ల చరిత్ర..
నిర్మల్ కొయ్యబొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కళాకారులు ఇక్కడి కలపను ఉపయోగించి అందమైన బొమ్మలు తయారు చేసేవారు. దీనినే వృత్తిగా మలుచుకుని పలు కుటుంబాలు ఇళ్లలోనే బొమ్మలు తయారు చేసేవని పూర్వీకులు చెబుతారు. చిన్న, చిన్న వస్తువులు, బొమ్మలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తుండేవారని ప్రతీతి.

దీంతో పాటు రాజులకు అవసరమైన వస్తువులు తయారు చేసేవారు. నిజాం నవాబు కాలంలో సోన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన రాజు కూర్చునేందుకు ప్రత్యేకంగా కూర్చీని తయారు చేసి ( రాజు కూర్చోగానే బంగారు పూల వర్షం కురిసేలా) బహూకరించడంతో, దానిని చూసి మంత్రముగ్దులైన రాజు తన వంతుగా 16మంది కళాకారులకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేశాడని, ఇలా ప్రారంభమైన కొయ్యబొమ్మల తయారీ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కళాకారులు చెబుతారు.
 
సంఘంగా ఏర్పాటు

మొదట్లో కొయ్యబొమ్మలను ఎవరికి వారే తమ తమ ఇళ్లలో తయారు చేసుకునే వారు. సంతలలో అమ్ముకునేవారు. ఎవరైనా ముందుగానే ఆర్డర్ ఇస్తే వాటిని తయారు చేసి ఇచ్చేవారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ఇబ్బందులు రావడంతో తయారీదారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేవి. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కళపై ఉన్న మక్కువతో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి కళాకారులకు సలహా ఇచ్చింది. దీంతో జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయంతో 1955లో ‘నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహాకార సంఘం’ ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం 16 మందితో ఉన్న సొసైటీలో ప్రస్తుతం దాదాపు 46 మంది సభ్యులు ఉన్నారు.
 
ఉట్టిపడే జీవకళ
కళాకారులు చేతిలో కర్రలు జీవాన్ని పొందుతున్నాయి. మెత్తగా, తేలికగా, నాణ్యతగా, పగుళ్లు లేకుండా, రంగులు అద్దేందుకు వీలుగా, చెదలు పట్టకుండా ఎక్కువ కాలం మన్నేలా, అన్నింటికి అనువైనది పునికి కర్ర ఉండటంతో దీనిని బొమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ప్రత్యేక మైన మట్టిని కూడా వీటి తయారీలో వాడుతున్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తుండటంతో బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది.
 
నిర్మల్
బొమ్మలకు వినియోగించేది కేవలం పునికి కర్ర మాత్రమే కావడంతో దీనికోసం కళాకారులే అడవులకు వెళ్లారు. పునికి చెట్లపై స్థానికులు, అటవీ శాఖాధికారులకు అవగాహన అంతంత మాత్రంగా ఉండటం, చెట్లను గుర్తించేందుకు స్వయంగా వెళ్లాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. పడిపోయిన చెట్లను మాత్రమే అటవీశాఖాధికారుల సహకారంతో టింబర్‌డిపోకు తరలించి, అక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తామని, దీంతో ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు.

కనీసం కర్రను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అడవంతా గాలించడం ఒక ఎత్తయితే దానిని అడవి నుంచి తరలించడం మరో ఎత్తు అవుతోంది. టింబర్ డిపోనుంచి కొనుగోలు చేసిన కలపతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తయారు చేసేందుకు కార్యదర్శి సూచనలతో తయారీకి సిద్ధమవుతామని చెబుతున్నారు.
 
కుటీర పరిశ్రమగా..

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది.  పురుషులతోపాటు మహిళలు కూడా ఇంటి వద్ద కొయ్యబొమ్మలకు రూపాలు ఇస్తున్నారు. సుమారు 30 మంది మహిళలు ఇళ్లలో బొమ్మలు తయారు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరు తయారు చేసిన బొమ్మలు సహజ రూపంతో నిలుస్తున్నాయి.
 
సహజత్వానికి మారు పేరు

కొయ్యబొమ్మలు సహజత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. అలాగే వీరు వేసే పెయింట్స్‌కు కూడా ప్రత్యేకత ఉంది. డెకో పేయింటింగ్‌తో వేయడంతో ప్రత్యేక ఆకర్షణ వస్తోంది. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు.

డెకో పేయింటింగ్ రాకముందు సహజమైన రూపంలో కళాకారులు రంగులు తయారు చేసుకునేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదిగ పువ్వు వాడేవారు. ఇక నలుపు రంగు కోసం దీపం పెట్టి దానిపై ఓ పాత్రను ఉంచడంతో దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. అయితే ప్రస్తుతం వివిధ రంగులను ఒక్కతాటిపై తీసుకువచ్చి డెకో పేయింటింగ్‌తో చిత్రాలు గీస్తున్నారు. ఈ చిత్రాలు కొన్నేళ్ల పాటు శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండడమే దీని ప్రత్యేకత.
 
ఇతర రాష్ట్రాల్లోనూ దర్శనం
నిర్మల్ కళారూపాలు దేశంలోని పలుచోట్ల దర్శనమిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ మ్యూజియంలో కామధేను, కోన్‌గల్లి, రథం, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు సుమారు 16 లక్షల విలువైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. అలాగే 1948లో మహారాష్ట్రలోని పాలజ్‌కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొల్పేందు కోసం గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరడంతో అప్పట్లో.. కళాకారుడు గుండాజివర్మ పాలజ్ గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఆ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది.
 
కాలానికనుగుణంగా..
నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో తయారీకి, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో  ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించేలా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే సీసీహెచ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ కలర్లతో పేయింటింగ్ నేర్పించారు. దీంతో వివిధ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్యాకింగ్‌లోనూ ఇటీవల శిక్షణ ఇచ్చారు.
 
ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు

పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాచర్ల లింబయ్య వర్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన దేవతామూర్తులను తీర్చిదిద్దడంలో దిట్ట. ఈయన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

2006లో అలనాటి రాజుల కాలంలో ఏ విధంగా ఉండేవో అదే రూపంలో కామధేనువు, నాగలక్ష్మీదుర్గాదేవి, కొనుగుల్ల (అవార్డుకు ఇచ్చేవారు), డాల్‌ల్యాంప్, డ్రెస్సింగ్ టేబుల్, చెస్‌బోర్డు (బరాత్), రథం, మంచం, సోఫాసెట్లు, ప్రముఖుల ఇళ్లలో ఉండే బట్టలు మార్చుకునే పరికరాలను న్యూఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శించారు.
 
వీటిని తయారు చేయడంలో రాచర్ల లింబయ్యతో పాటు పలువురు ఆయనకు సహాయమందించి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. 2006లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షేకావత్ చేతుల మీదుగా రాష్ర్టం నుంచి  ‘శిల్పగురు’ అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు భూసాని నర్సింగం వర్మ, చిన్న పోశెట్టి వర్మ, నాంపల్లి రాజశేఖర్‌వర్మ తదితరులు అనేక గుర్తింపులు పొందారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement