ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే! | Worlds Largest Painting The Journey Of Humanity | Sakshi
Sakshi News home page

ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!

Published Sat, Mar 27 2021 12:22 AM | Last Updated on Sat, Mar 27 2021 9:41 AM

 Worlds Largest Painting The Journey Of Humanity - Sakshi

ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 44 ఏళ్ల బ్రిటీష్‌ ఆర్టిస్ట్‌ సచా జాఫ్రీ. కరోనా వైరస్‌ ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న చిన్నారులకు ఏదోరకంగా సాయం చేయాలనుకున్న జాఫ్రీ తనకు తెలిసిన విద్యతో కోట్లు సంపాదించి సామాజిక సేవచేస్తున్నాడు. గత ఏడాది కరోనా కాలంలో జాఫ్రీ వేసిన ‘జర్నీ ఆఫ్‌ హ్యుమానిటీ’ అనే పెయింటింగ్‌ తాజాగా దుబాయ్‌లో జరిగిన వేలంలో ఏకంగా 62 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది.  

మన రూపాయలలో దీని విలువ రూ.450 కోట్లకుపై మాటే. జాఫ్రీ ఈ మొత్తాన్నీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు.జాఫ్రీ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌ను 70 భాగాలుగా వేసాడు. ఈ భాగాలను విడివిడిగా విక్రయించి 30 మిలియన్‌ డాలర్లను కూడబెట్టి చిన్నారులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఫ్రెంచ్‌ క్రిఫ్టో కరెన్సీ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్‌ మొత్తం పెయింటింగ్‌కు రెట్టింపు డబ్బులు ఇస్తాననడంతో పెయింటింగ్‌ రూ.450 కోట్లకు విక్రయించాడు.

జాఫ్రీ ఈ మొత్తాన్నీ దుబాయ్‌ కేర్స్, యూనిసెఫ్, యునెస్కో, గ్లోబల్‌ గిఫ్ట్ట్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు. కరోనా కాలంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. తినడానకి తిండిలేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది చిన్నారులు నానా అవస్థలు పడడం చూసి చలించిన జాఫ్రీ వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే పెద్ద పెయింటింగ్‌ వేసి కనీసం 30 మిలియన్‌ డాలర్లు సంపాదించి చిన్నారులకు విరాళంగా ఇవ్వాలనుకున్నాడు.

అతిపెద్ద పెయింటింగ్‌ వేసేందుకు చిన్నారుల నుంచి ఇన్‌పుట్‌ తీసుకోవాలనుకుని..‘‘కరోనా కాలంలో మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే విధంగా ఆర్ట్‌ వర్క్స్‌ను నాకు పంపండి’’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులను జాఫ్రీ కోరాడు. జాఫ్రీ సందేశానికి స్పందించిన 140 దేశాల్లోని చిన్నారులు ఆన్‌లైన్‌ ద్వారా తమ ఆర్ట్‌వర్క్‌ను పంపించారు. అప్పుడు దుబాయ్‌లోని అట్లాంటిస్‌ హోమ్‌ హోటల్‌లో జాఫ్రీ సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20గంటలపాటు కష్టపడి చిన్నారులు పంపిన చిత్రాలను జతచేస్తూ గతేడాది సెప్టెంబరులో పెయింటింగ్‌ను పూర్తిచేశాడు.

17 వేల చదరపు అడుగుల ‘జర్నీ ఆఫ్‌ హ్యూమానిటీ’ పెయింటింగ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తించడం తో ఈపెయింటింగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌గా నిలిచింది. ఇది నాలుగు ఎన్‌బీఏ బాస్కెట్‌ బాల్‌ కోర్టుల పరిమాణానికి  సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌ను దక్కించుకున్న అబ్దున్‌ మాట్లాడుతూ..‘‘నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి తిండిలేనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.

ఎన్నోసార్లు ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పెయింటింగ్‌ విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో మంది చిన్నారుల ఆకలి తీరుస్తాయి. అందుకే రెట్టింపు ధరతో పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నాను’’ అని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement