
వైకల్యాన్ని జయించి..
రెండు చేతులూ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించి అనేక అవార్డులు రివార్డులు పొందాడు. అనుకోకుండా తనకు సంభవించిన వైకల్యాన్ని ఎదిరించి జీవితంలో ప్రత్యేకతను సాధించాడు. పధ్నాలుగేళ్ళ వయసులో చేతులు రెండు కోల్పోయినా విద్యతోపాటు, తనకిష్టమైన చిత్రలేఖనంపై దృష్టిని నిలిపి అపురూప దృశ్యకావ్యాలను రూపొందిస్తూ అందర్నీ అబ్బుర పరుస్తున్నాడు.
ధవల్ కత్రి తన 14 ఏళ్ళ వయసులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకున్నాడు. పాఠశాల సిబ్బంది కూడ అతడిని ప్రోత్సహించడం మానేసి, సెలవు తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ అటువంటి అడ్డంకులను ఏమాత్రం పట్టించుకోని ధవల్.. పట్టుదలతో తన విద్యభ్యాసాన్ని కొనసాగించడంతోపాటు, పరీక్షలన్నీ స్వతహాగా రాయడమే కాక, గిటారు వాయించడంలోనూ, పెయింటింగ్స్ వేయడంలోనూ ఆరితేరాడు. అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారు కూడ సాధించలేని విజయాలను సాధిస్తూ ఇప్పటివరకూ 300 వరకూ పెయింటింగ్స్ వేసిన ధవల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.