భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం
భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం
Published Sat, Jun 24 2017 5:48 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
న్యూయార్క్: ఆలు మగలు చేతిలో చేయేసి పట్టుకు తిరగాలోయ్! అని ఓ భావ కవి ఊరికే అనలేదేమో! అలా తిరిగినట్లయితే భార్యకున్న చేతి నొప్పులు ఇట్టే మాయమై పోతాయని అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా చేయడం వల్ల భర్త గుండె లయ, శ్వాసప్రక్రియ భార్య గుండె లయ, శ్వాసప్రక్రియ సమమవడం ద్వారా భార్య చేతుల్లోని నొప్పి, మంట మాయం అవుతుందని వారు అంటున్నారు.
భార్య చేతిని సానుభూతితో పటిష్టంగా పట్టుకొని కూర్చున్నా, నిలబడినా, నడిచినా ఫలితం సమంగా ఉంటుందట. చేతులు పట్టుకోకుండా పక్కపక్కనే కూర్చున్నా ఫలితం ఉండదట. 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సున్న 22 జంటలపై ఈ పరిశోధన సాగించారు. వారిని చేతులు పట్టుకోకుండా పక్క పక్కన కూర్చోబెట్టి, వారిని పక్కపక్క గదుల్లో విడివిడిగా ఉంచి, చేతులు పట్టుకొని కూర్చుని, నిలబెట్టి ఈ ప్రయోగాలు నిర్వహించారు.
ముఖ్యంగా ఆడవాళ్లకు ముంజేతుత్లో కొంచెం నొప్పి, మంట తరచుగా వస్తాయని, అందుకనే వారిపైనా ఈ పరిశోధన చేసినట్లు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఒక్క ఆలుమగలు చేతులు పట్టుకుంటేనే ఫలితం ఉంటుందా? ప్రేమికులు పట్టుకుంటే కూడా ఈ ఫలితం ఉంటుందా? అసలు స్త్రీ, పురుషులు పట్టుకుంటే కూడా ఫలితం ఉంటుందా ? అన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు తేల్చలేదు.
Advertisement
Advertisement