Partners
-
ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇటీవలి కాలంలో తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్, కన్స్యూమర్ పేమెంట్స్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. -
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది. -
కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు
భారత్‌పాటు ఇతర అల్పాదాయ దేశాలలో విస్తృత-స్పెక్ట్రమ్ యాంటీ-మైక్రోబయల్ వ్యాక్సిన్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం అలోపెక్స్ ఇంక్‌తో భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు భారత్‌తోపాటు ఇతర లైసెన్స్ భూభాగాల్లో వ్యాక్సిన్ AV0328 అభివృద్ధి, వాణిజ్యీకరణ చేపడతాయని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఒప్పందం ప్రకారం.. వన్‌టైమ్ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో AV0328 వ్యాక్సిన్ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది."వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్లను అందించాలనే మా మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, AV0328 వ్యాక్సిన్ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. -
మీడియాటెక్‌తో జియోథింగ్స్ జట్టు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ జియోథింగ్స్ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్స్‌ను అందిస్తుంది.ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ మొదలైన వాటికి స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్ యాప్ సూట్‌కి ఈ ప్లాట్‌ఫాం ద్వారా యాక్సెస్ లభిస్తుంది. -
హృతిక్ రోషన్‌తో ‘జీప్’ ప్రచార కార్యక్రమం
హైదరాబాద్: కార్ల తయారీ సంస్థ ‘జీప్ ఇండియా’ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్ రాంగ్లర్ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్ ఇండియా ప్రకటించింది. హృతిక్ రోషన్‌ను జీప్ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్ పార్ట్నర్గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు. -
స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోదీ, షా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్లను ముంచేశారు షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటేమే 13: జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్ షా సూచించారు. మే 19: జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్‌టైమ్ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. జూన్ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.పస లేని ఆరోపణలు పీయూష్ గోయల్ మండిపాటు స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు. -
ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్లివే?
ప్రధాని మోదీ నాయకత్వంలో కలిసి ఉంటామని మరోమారు ఎన్డీఏ మిత్రపక్షాలు పునరుద్ఘాటించిన దరిమిలా కేంద్ర క్యాబినెట్ బెర్త్‌లపై బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరు కీలక మంత్రిత్వ శాఖల విషయంలో బీజేపీ రాజీపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మంత్రిత్వ శాఖల జాబితాలో రైల్వే, హోం, ఫైనాన్స్, డిఫెన్స్, లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయిని సమాచారం.అదేవిధంగా మిత్రపక్షాలు 10 నుంచి 12 మంత్రిత్వ శాఖలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బీజేపీ తన మిత్రపక్షాల మద్దతును మరింతగా పెంచుకుంది. తాజాగా ఏడుగురు స్వతంత్రులు, మరో మూడు చిన్న పార్టీల నుండి బీజేపీకి మద్దతు లభించింది. తాజాగా మద్దతునందించిన 10 మంది ఎంపీలతో ఎన్డీఏకు మొత్తం 303 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది.మోదీ ప్రభుత్వం వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోనున్నది. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే అంశంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. అందుకే దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగంలో స్వావలంబనకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ ఇటీవలే పునరుద్ఘాటించారు.ఆరు కీలక మంత్రిత్వ శాఖలు మినహా మిత్రపక్షాల మంత్రిత్వశాఖల బెర్త్‌ల డిమాండ్లను బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనున్నదని సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మద్దతు ఒప్పందం తదితర అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినప్పటికీ, మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ, 12 స్థానాలు గెలుచుకున్న జేడీ (యూ) మిత్రపక్షాల నుంచి ప్రధాన డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు శివసేన (షిండే) ఏడు, ఎల్జేపీ (ఆర్వి) ఐదు, హెచ్ఏఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. జూన్ 7న జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించి మిత్రపక్షాల డిమాండ్లు ప్రస్తావనకు రానున్నాయి.జనతాదళ్(యూ) రెండు మంత్రి పదవులను ఆశిస్తోందని, శివసేన (షిండే) తన కేబినెట్ బెర్త్‌తో పాటు రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) ఇంకా తన డిమాండ్లను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు ఒక మంత్రివర్గం, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీ శాంభవి చౌదరితో సహా ఇతర ఎంపీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గయ నుంచి ఎన్నికైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం ఒక కేబినెట్ ర్యాంక్ పదవిని కోరినట్లు సమాచారం. -
Sarvam AI: భారతీయ ‘గొంతు’కు మైక్రోసాఫ్ట్ మద్దతు!
భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. వాయిస్ ఆధారిత జనరేటివ్ AIని అభివృద్ధి చేయడం, అజూర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా సర్వం ఏఐకి (Sarvam AI)కి మద్దతు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భారత్‌లో ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భారంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించింది. సర్వం ఏఐ భారతీయ భాషలు, నేపథ్యంపై ఉత్పాదక ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో పని చేస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, ఖోస్లా వెంచర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో సుమారు రూ.340 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ స్టార్టప్‌ను స్థాపించిన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్‌లు గతంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధనా బృందం ఏఐ4భారత్‌తో కలిసి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు. ప్రతిఒక్కరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఏఐ-మొదటి దేశంగా భారత్ పరివర్తన చెందడానికి సాధికారత కల్పిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా & దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అన్నారు. సర్వం ఏఐతో సహకారం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, వారి భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా వాయిస్-ఆధారిత ఏఐ సొల్యూషన్ల శక్తి నుంచి ప్రయోజనం పొందగల భవిష్యత్తును తాము ప్రోత్సహిస్తున్నామని చందోక్ చెప్పారు. భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ అప్లికేషన్ల కోసం వాయిస్ అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌లలో ఒకటి. విద్య, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో దీన్ని వర్తింపజేయొచ్చు. సర్వం ఏఐ ఇండిక్ వాయిస్ ఎల్ఎల్ఎంను అజూర్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా భారత్-కేంద్రీకృతంగా మరిన్ని ఆవిష్కరణలు రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ పునాదులు వేస్తోంది. -
రేవంత్, కవిత బిజినెస్ పార్ట్నర్స్
సుభాష్‌నగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిజినెస్ పార్ట్నర్స్ అని, వారు ఒకే కంపెనీ లో డైరెక్టర్లుగా ఉన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో బీజేపీ అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కవిత రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఆకుల లలితను కాంగ్రెస్‌లోకి పంపించి అర్బన్ టికెట్ ఇప్పిస్తున్నారని, అందుకే కవితను నిజామాబాద్ అర్బన్, బోధన్ ఇన్‌చార్జీగా బీఆర్ఎస్ నియమించిందని ఆరోపించారు. బతికుండగా ఆరోగ్యబీమా ఇవ్వలేని సీఎం కేసీఆర్.. చనిపో యాక రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారని, కానీ మంత్రి కేటీఆర్‌కు రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ కవిత కు రూ.20 లక్షలు బీమా ఇస్తానని ఎద్దేవా చేశా రు. మైనార్టీబంధు రూ.10 లక్షలకు పెంచాలని ఎంఐఎం నేత ఒవైసీ ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పాలన్నారు. ప్రజలకు నవంబర్ 30న మంచి అవకాశం వచ్చినందున బీజేపీకి మద్దతుగా నిలవాలని అన్నారు. -
మనుషులే కాదు, ఇప్పుడు పక్షులు కూడా విడాకులు
-
అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!
మనుషులకు ఏం తీసిపోం అన్నట్లుగా పకులు కూడా బిహేవ్ చేస్తున్నాయి. ఔను అవి కూడా మనుషుల మాదిరి విడాకులు తీసుకుంటున్నాయట. అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. అవి విడాకులు తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..మనుషుల్లాగే పక్షలు కూడా తమ భాగస్వాములకు విడాకులు ఇస్తున్నట్లు పరిశోధకులు వివిధ జాతి పక్షులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట. ఈ మేరకు చైనా, జర్మనీకి చెందిన పరిశోధకులు దాదాపు 232 పక్షి జాతులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 90 శాతం కంటే ఎక్కువ పక్షి జాతులు సాధారణంగా ఒకే సహచరుడితో సంతానోత్పత్తి కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐతే కొన్ని పక్షలు మాత్రం తమ సహచరుడు జీవించి ఉన్నప్పటికీ తదుపరి సంతానోత్పత్తి సీజన్లలో కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రవర్తనను 'విడాకులుగా' సూచించారు పరిశోధకులు. దీనికి ప్రధాన కారణం 'వలసలు' అని అన్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధకుడు డాక్టర్ జిటాన్ సాంగ్ మాట్లాడుతూ..సంతానోత్పత్తి కాలంలో పుట్టిన పక్షలు బాధ్యతలను మగపక్షులు చూడటంతో.. ఆడపక్షులు తదుపరి సంతానం కోసం వేరేవాటితో జత కట్టేందుకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ దూరాలకు వలస వెళ్లినప్పుడూ తమ పాత భాగస్వామి కోసం వేచి ఉండకుండా కొత్త భాగస్వామితో జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు గమనించారు. ఎక్కువ వలసలు వెళ్తున్న పక్షల జాతుల్లోనే ఈ విడాకుల రేటు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పునరుత్పత్తి లేదా వలసల కారణంగా అవి విడిపోతున్నాయని, కొత్త భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని పక్షులు మాత్రం తమ పాత భాగస్వామితో ఉండటం లేదా అవి లేనట్లయితే ఒంటరిగా ఉండిపోవటం జరుతుందని అన్నారు. దీనంతటికి కారణం మనిషేనని, అందువల్లే అవి మన మాదిరిగా విడిపోతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. తన స్వార్థ కోసం అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం, వాటికి ఆవాసం లేకుండా చేయడం తదితర కారణాల రీత్యా అవి వలస బాటపట్టడంతో..పక్షలుకు కూడా ఆ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. (చదవండి: తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!) -
టీవీఎస్, జొమాటో జోడీ.. డెలివరీల కోసం 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో ప్లాట్‌ఫామ్‌పై డెలివరీల కోసం వచ్చే రెండేళ్లలో టీవీఎస్ తయారీ 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడతారు. 2030 నాటికి డెలివరీల కోసం పూర్తిగా ఈవీలను ఉపయోగించాలని జొమాటో లక్ష్యంగా చేసుకుంది. అలాగే వచ్చే రెండేళ్లలో ఒక లక్ష ఈవీలతో కార్యకలాపాలను సాగించేందుకు 50కిపైగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. 2020లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన టీవీఎస్ మోటార్ ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా యూనిట్లను విక్రయించింది. -
సౌత్‌పై కన్నేసిన ఫిజిక్స్‌వాలా.. మూడేళ్లలో రూ. 500 కోట్లు..
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్ సంస్థ ఫిజిక్స్‌వాలా మూడేళ్లలో ఎడ్టెక్ సంస్థ జైలెమ్ లెర్నింగ్‌ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్టెక్ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్‌వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్ లెర్నింగ్ జైలెమ్ మోడల్‌ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. -
రిలయన్స్ స్నాక్స్ బిజినెస్.. భారత్‌లోకి అమెరికన్ బ్రాండ్ చిప్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్ కన్జూమర్ ఫుడ్స్ తయారీ సంస్థ జనరల్ మిల్స్‌తో రిలయన్స్ రిటైల్ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్ బ్యూగుల్స్ బ్రాండ్ కార్న్ చిప్స్ స్నాక్స్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ రిటైల్‌లో భాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, (ఆర్సీపీఎల్) తెలిపింది. ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్లో గణనీయ మార్కెట్ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్సీపీఎల్ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్కిక్, టాఫీమ్యాన్ తదితర బ్రాండ్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
ఐటీ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే ఉందని, స్టార్టప్‌ల ఫలితాలను రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారతదేశంలో పెట్టుబడులు రాబ ట్టడం కష్టమైనదేమీ కాదని, స్టార్టప్‌లకు నిధులు సేకరణ ఇబ్బందికర అంశంకాదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లకు మార్గదర్శనం చేసే లక్ష్యంతో డల్లాస్ వెంచర్ కేపిటల్(డీవీసీ), టీహబ్ శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆరు వేలకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయని, దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన సంస్థ టీ హబ్‌లోనే పురుడు పోసుకుందని అన్నారు. డీవీసీ, టీహబ్ కలిసి డీవీసీ ఇండియా ఫండ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, రెండు ప్రముఖ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం తెలంగాణను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మరింత దోహదం చేస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా డల్లాస్ వెంచర్ ఫండ్ ద్వారా డీవీసీ హైదరాబాద్ స్టార్టప్‌లకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు. దేశంలో టెక్ స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రూ.350 కోట్లతో డీవీసీ ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీవీసీ ఇప్పటికే భారత్‌లో అనేక స్టార్టప్ లను నెలకొల్పిందని వివరించారు. కార్యక్రమంలో డీవీసీ ఎండీ దయాకర్ పూస్కూర్, సహ వ్యవస్థాపకులు అబిదాలీ నీముచ్వాలా, శ్యామ్ పెనుమాక, గోకుల్ దీక్షిత్, కిరణ్ కల్లూరి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. స్టార్టప్‌లకు ఊతం డల్లాస్ వెంచర్ కేపిటల్ 2023లో స్టార్టప్‌లు తమ వాణిజ్య పరిధిని విస్తరించుకునేందుకు ఊతమివ్వడం ద్వారా వినియోగదారుల్లో విస్త తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. దీని కోసం ప్రస్తుతమున్న స్టార్టప్‌లతోపాటు కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తుంది. టీ హబ్ సహకారంతో వృద్ధి చెందే సామర్థ్యమున్న వినూత్న స్టార్టప్‌లను గుర్తించి అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించేందుకు అవసరమైన వినూత్న సాంకేతికత, మౌలిక వసతులు, బృంద సామర్థ్యం పెంపుదల తదితరాల్లో డీవీసీ మార్గదర్శనం చేస్తుంది. -
డాక్టర్ రెడ్డీస్‌తో థెరానికా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైగ్రేన్ చికిత్సలో ఉపయోగపడే వేరబుల్ డివైజ్ నెరీవియోను భారత్‌లో విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్)తో థెరానికా ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మక లైసెన్స్, సరఫరా డీల్ ప్రకారం ప్రకారం నెరీవియోకు సంబంధించి డీఆర్ఎల్ దేశీయంగా మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని థెరానికా సీఈవో అలోన్ ఇరోనీ తెలిపారు. ఈ ఒప్పందం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమని చెప్పారు. దీన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడంపై ఇరు కంపెనీలు చర్చించడం కొనసాగిస్తాయని పేర్కొన్నారు. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
5జీ సేవలు: రిలయన్స్ జియోతో జతకట్టిన మోటరోలా
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో ,స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటరోలా భాగస్వామ్యం కుదుర్చుకుని తన కస్టమర్లకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో మోటరోలా వినియోగదారులు 5G పోర్ట్‌ఫోలియోలో జియో ట్రూ 5జీ సేవలను ఉపయోగించవచ్చు. అందుకోసం మోటరోలా తమ సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా విడుదల చేసింది. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ దీనిపై మాట్లాడుతూ.. ‘మోటరోలా క్యారియర్ అగ్రిగేషన్, 4x4 Mimo, 5G బ్యాండ్లకు సపోర్ట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ, 5జీ ఫీచర్లతో వస్తుందన్నారు. ఈ ఫీచర్లు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పాటు భారతదేశంలో 5జీ సేవలకు సంబంధించిన నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయన్నారు. మోటరోలా స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్న జియో యూజర్లు ఇకపై Jio True 5G సేవలు అందిస్తున్న ప్రాంతాలలో జియో వెల్కమ్ ఆఫర్ కింద అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా పొందగలరని చెప్పారు. ‘మోటరోలా స్మార్ట్ఫోన్లు లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్లుతో పాటు వేగవంతమైన 5G అనుభవాన్ని అందిస్తాయి. తమ కస్టమర్లకు ట్రూ 5జీ అందించాలనే మా నిబద్ధతకు కంపెనీ కట్టుబడి ఉంది. మోటరోలా కంపెనీ భారత్‌లోని తన కస్టమర్లకు అత్యంత సమగ్రమైన, ఎక్కడా కూడా రాజీ లేకుండా 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 13 5G బ్యాండ్లకు సపోర్ట్ ఇస్తోందని’ మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి తెలిపారు. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి కస్టమర్లు తమ మొటోరోలా స్మార్ట్ ఫోన్ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చుకోవాల్సి ఉంటుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
నటి ప్రియాంక బిజినెస్ ప్లాన్స్: నా బ్యూటీకి దేశీ ఉత్పత్తులనే వాడతా
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందుకోసం నైకా బ్రాండ్ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ–కామర్స్ సంస్థ ఎఫ్ఎస్ఎన్తో డీల్ కుదుర్చుకుంది. అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) "అనోమలీ హెయిర్కేర్ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) -
‘భార్యలను మార్చుకునే’ రాకెట్ గుట్టురట్టు!
తిరువనంతపురం(కేరళ): మన సమాజంలో వివాహానికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. అయితే, ఈ మధ్య చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. కొన్నిచోట్ల భార్య, భర్తలు వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుట్టుంటే.. మరి కొన్నిచోట్ల కొందరు బరితెగించి తమ కన్నవారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల స్నేహం ముసుగులో యువతి, యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఇటువంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది. వివరాలు.. కేరళలోని కరుచాకల్కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతం చేసేవాడు. ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అతను వ్యవహరించేవాడు. కొంత కాలానికి ఆ వ్యక్తి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతను మరికొందరు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ ఏడుగురితో కూడా సంబంధం పెట్టుకోవాలని తన భార్యను ఆ వ్యక్తి బలవంతం చేశాడు. ఆ గ్యాంగ్‌లోని అందరూ తమ భార్యలపట్ల ఇలాంటి అభ్యంతరకర పద్ధతినే కొనిసాగించేవారు. ఈ క్రమంలో సదరు మహిళ.. భర్త చేష్టలతో విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు. వీరి విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా టెలిగ్రామ్, మెసెంజర్లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన చాటింగ్ గ్రూపులో వేలాది మంది యువతి,యువకులున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు గత ఆదివారం నిందితులను కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాల నుంచి అరెస్టు చేశారు. -
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నూతన తయారీ కేంద్రంలో.. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లుంది. హైదరాబాద్‌లో పెయింటింగ్ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ 2021–22లో టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
టెక్ స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ ఊతం..
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా ఇన్వెస్ట్ ఇండియాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇన్వెస్ట్ ఇండియాలో భాగమైన యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ (అగ్ని మిషన్)తో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కలిసి పనిచేస్తుంది. ఇందులో భాగంగా 11 అంకుర సంస్థలు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కార్యక్రమంలో చేరాయి. వ్యవసాయం, రక్షణ, ఇ–మొబిలిటీ, వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన యాంపిల్ఎర్త్ ప్యాకేజింగ్ అండ్ సిస్టమ్స్, అరిష్టి సైబర్‌టెక్, డేబెస్ట్ రీసెర్చ్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాం కోసం ఎంపికైన అంకుర సంస్థలకు మైక్రోసాఫ్ట్ సాంకేతికతలు (అజూర్, గిట్‌హబ్, ఎం365 మొదలైనవి) అందుబాటులో ఉంటాయి. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికలను మెరుగుపర్చుకోవడం, విస్తరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్ఇండ్ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్‌టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్టివి) రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్ ఇండ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు. అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా కస్టమర్‌పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పథకాల నిమిత్తం టాటా మోటార్స్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టీఏ రాజగోప్పలన్ తెలిపారు. -
స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని ‘భారత్’ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఆత్మనీర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని విశ్వసిస్తున్నానని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపారు. -
అమెజాన్‌లో మూవీ టికెట్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన ప్లాట్‌ఫాం ద్వారా భారతదేశంలో సినిమా టిక్కెట్లను కూడా విక్రయించనుంది. ఇందుకోసం ప్రముఖ టిక్కెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’తో అమెజాన్ ఇండియా ఒప్పందం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నాన్ ప్రైమ్ వినియోగదారులకు కూడా దీని ద్వారా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం యాప్ లేదా మొబైల్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంది. కస్టమర్ల జీవితాలను సాధ్యమైనంత సరళీకృతం చేయడమే లక్ష్యం, షాపింగ్ చేస్తున్నప్పుడు, బిల్లులు చెల్లించేటప్పుడు లేదా ఇతర సేవలను కోరుకునేటప్పుడు వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించే ప్రయాణంలో మరో మెట్టు అని అమెజాన్ పే డైరెక్టర్ మహేంద్ర నెరుర్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్‌లో 'మూవీ టికెట్స్' ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని బుక్ మైషో వ్యవస్థాపకుడు సీఈవో ఆశిష్ హేమరాజని తెలిపారు. బుకింగ్ ఎలా చేసుకోవాలి? అమెజాన్.ఇన్ యూజర్లకోసం 'షాప్ బై కేటగిరీ' లేదా అమెజాన్ పే టాబ్ కింద 'మూవీ టిక్కెట్లు' కేటగిరీని కొత్తగా జోడించింది. దీంతో అమెజాన్ మొబైల్ యాప్‌లో ‘షాపింగ్ బై కేటగిరీ’ విభాగంలో అమెజాన్ పే టాబ్ లో ‘మూవీ టికెట్లు’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మూవీ టికెట్లు ఆప్షన్‌ను క్లిక్ చేసి, ప్రాంతం, జోన్‌పై క్లిక్ చేసిన అనంతరం నచ్చిన సినిమాని ఎంచుకోవాలి. ఆ తర్వాత సినిమా థియేటర్, షో టైమ్ సెలక్ట్ చేసుకొని అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, లేదా ఇతర డిజిటల్ పద్ధతులను ద్వారా డబ్బు చెల్లించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడం మాత్రమే కాదు పోస్టర్లు, కంటెంట్, సినిమాలపై రివ్యూలు రాసి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. లాంచ్ ఆఫర్లో భాగంగా అమెజాన్ మూవీ టికెట్ బుకింగ్‌పై 20 శాతం(రూ.200 దాకా) క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులోఉండనుంది. అలాగే డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం ప్రస్తుతం మూవీ టికెట్స్ ఆప్షన్ అందుబాటులోలేదు. -
జీ కొత్త వ్యూహాలు : 50శాతం వాటా అమ్మకం
సాక్షి, ముంబై: ఎస్సెల్ గ్రూప్‌లోని జీ ఎంటర్టైన్మెంట్లో మేజర్ వాటాను ప్రమోటర్ల విక్రయించనున్నారు. మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ,సుభాష్ చంద్ర ప్రమోటర్‌గా తమ వాటాలో సగభాగాన్ని విక్రయించనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వ్యూహాత్మక బిజినెస్ ప్రణాళికల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్‌నకున్న వాటాలో సగభాగాన్ని విదేశీ సంస్థకు విక్రయించనున్నట్లు పేర్కొంది. జీ గ్రూప్‌ను గ్లోబల్ మీడియా టెక్ సంస్థగా రూపొందించే బాటలో అంతర్జాతీయ భాగస్వామికి ప్రమోటర్ల వాటాలో సగభాగం వరకూ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ అంశంలో సలహాల కోసం అడ్వయిజర్లతో సమావేశమైనట్లు జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఈ బాటలో గోల్డ్‌మన్ శాక్స్ సెక్యూరిటీస్, లయన్ ట్రీ సంస్థలను అంతర్జాతీయ వ్యూహాత్మక సలహాదారుగా నియమించాలని నిర్ణయించింది. ఇది 2019 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ముగించాలని భావిస్తోంది.సెప్టెంబర్ నాటికి జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వాటాను కలిగి ఉంది. బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లో తమ బలం తెలుసు. ఇప్పటికే జీ 5 మార్కెట్లో రెండవ అతిపెద్ద ప్లేయగా ఉంది.. కానీ ప్రపంచ లక్ష్యాలు సాధించడానికి నిర్ణయం తీసుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయెంకా అన్నారు. అలాగే మైనారిటీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబోయే సమయంలో మరింత మెరుగవుతాయని ఆయన చెప్పారు మరోవైపు ప్రమోటర్ల వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. తొలుత 4 శాతం పతనమైంది. వెంటనే కొనుగోళ్ల తిరిగి జోరందుకుంది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 455 ఎగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 470 వరకూ ఎగసింది. -
కలపకుంటే తిరుగుబాటే
న్యూఢిల్లీ: మెజారిటీ ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు చేయకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుబాటు చెలరేగే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. భారత్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను ఇదే తరహాలో అభివృద్ధికి దూరంగా ఉంచుతోందన్నారు. జర్మనీలోని హాంబర్గ్‌లో ఉన్న బుసెరియస్ సమ్మర్ స్కూల్లో బుధవారం జరిగిన ఓ సదస్సులో రాహుల్ మాట్లాడారు. ‘2003లో అమెరికా–ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాక్‌లో ఓ తెగ వారిని ప్రభుత్వ ఉద్యోగాలు, సైన్యంలో తీసుకోకుండా నిషేధిస్తూ చట్టం తెచ్చారు. దీంతో ఆ తెగవారు తిరుగుబాటుదారుల్లో చేరిపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ తిరుగుబాటుదారులు సిరియాకూ విస్తరించారు. చివరికి అదే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రసంస్థగా రూపాంతరం చెందింది’ అని రాహుల్ అన్నారు. మహిళలకు ప్రపంచంలోనే భారత్ ప్రమాదకరమైన దేశమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కానీ దేశంలో మహిళల పట్ల దారుణాలు పెరిగిపోతున్నాయని అంగీకరించారు. ‘భారత్ మారాల్సిన అవసరం ఉంది. పురుషులు మహిళలను గౌరవంతో, తమతో సమానంగా చూడాలి. కానీ ఇది ప్రస్తుతం భారత్‌లో జరగడం లేదు’ అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగం కారణంగా మూకహత్యలు నిరుద్యోగం, పేదలకు సమాన అవకాశాలు రాకపోవడం కారణంగా ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహంతోనే దేశంలో మూకహత్యలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దుందుడుకుగా తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)కారణంగా చిన్న వ్యాపారాలు నాశనమైపోయాయని దుయ్యబట్టారు. మరోవైపు, జర్మనీలో జరిగిన సదస్సులో మహిళల భద్రత విషయంలో భారత్‌ను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. దేశంలోని ముస్లింలకు ఉద్యోగాలు కల్పించకుంటే వారంతా ఇస్లామిక్ స్టేట్‌లో చేరతారన్నట్లు రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. -
మలాలాతో టెక్ దిగ్గజం భాగస్వామ్యం
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ బాలికల విద్యకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందుకోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ నాయకత్వంలోని ది మాలాలా ఫండ్‌కు భారీ మద్దతు ఇవ్వనున్నట్టు సోమవారం తెలిపింది. బాలికల విద్యకు, సమానత్వానికి విశేషంగా కృషి చేస్తున్న మలాలా ఫండ్ సేవలకు విస్తరణకు ఈ పార్టనర్షిప్ తోడ్పడనుంది. అంతేకాదు మలాలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి టెక్ సంస్థ కూడా ఆపిల్‌నే. అలాగే మలాలా ఫండ్ లీడర్షిప్ కౌన్సిల్లో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా చేరనున్నారు. ప్రతి బాలిక పాఠశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలనే మలాలా యూసఫ్ జాయ్ నిబద్ధతలో తాము కూడా భాగస్వామ్యులు కావాలని నిర్ణయించామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఒక ప్రకటనలో తెలిపారు. ''మలాలా బాలికా విద్య, సమానత్వం కోసం పనిచేస్తున్న ధైర్యం గల న్యాయవాది. మన కాలంలో చాలా ఉత్తేజకరమైన వ్యక్తులలో ఆమె కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల సాధికారిత కోసం ఆమె చేస్తున్న ముఖ్యమైన పనిలో భాగం కావడం సంతోషంగా ఉంది. మనల్ని ఏకం చేయడంలో విద్య గొప్ప సమానమైన శక్తి అని నమ్ముతాం'' అని కుక్ పేర్కొన్నారు. 2013 నుండి, 12 సంవత్సరాల వరకు ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్య ప్రతి అమ్మాయి హక్కుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న , ప్రైవేటు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు భాగస్వామ్యంతో మలాలా ఫండ్ పని చేస్తోంది. 130 మిలియన్ల మందికిపైగా బాలికలు పాఠశాలలో దూరంగా ఉండడం వారి కృషి ప్రాముఖ్యతను మరింత పెంచిందని కుక్ వ్యాఖ్యానించారు. అటు ఆపిల్ భాగస్వామ్యంపై మలాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి అమ్మాయి తన సొంత భవిష్యత్తును ఎన్నుకోవడమే తన కల అని ఆమె పేర్కొన్నారు. -
భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం
న్యూయార్క్: ఆలు మగలు చేతిలో చేయేసి పట్టుకు తిరగాలోయ్! అని ఓ భావ కవి ఊరికే అనలేదేమో! అలా తిరిగినట్లయితే భార్యకున్న చేతి నొప్పులు ఇట్టే మాయమై పోతాయని అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా చేయడం వల్ల భర్త గుండె లయ, శ్వాసప్రక్రియ భార్య గుండె లయ, శ్వాసప్రక్రియ సమమవడం ద్వారా భార్య చేతుల్లోని నొప్పి, మంట మాయం అవుతుందని వారు అంటున్నారు. భార్య చేతిని సానుభూతితో పటిష్టంగా పట్టుకొని కూర్చున్నా, నిలబడినా, నడిచినా ఫలితం సమంగా ఉంటుందట. చేతులు పట్టుకోకుండా పక్కపక్కనే కూర్చున్నా ఫలితం ఉండదట. 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సున్న 22 జంటలపై ఈ పరిశోధన సాగించారు. వారిని చేతులు పట్టుకోకుండా పక్క పక్కన కూర్చోబెట్టి, వారిని పక్కపక్క గదుల్లో విడివిడిగా ఉంచి, చేతులు పట్టుకొని కూర్చుని, నిలబెట్టి ఈ ప్రయోగాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆడవాళ్లకు ముంజేతుత్లో కొంచెం నొప్పి, మంట తరచుగా వస్తాయని, అందుకనే వారిపైనా ఈ పరిశోధన చేసినట్లు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఒక్క ఆలుమగలు చేతులు పట్టుకుంటేనే ఫలితం ఉంటుందా? ప్రేమికులు పట్టుకుంటే కూడా ఈ ఫలితం ఉంటుందా? అసలు స్త్రీ, పురుషులు పట్టుకుంటే కూడా ఫలితం ఉంటుందా ? అన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు తేల్చలేదు. -
బాహుబలి ఫ్యాన్స్‌కి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
హైదరాబాద్:భారత అతిపెద్ద, అతివేగమైన టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఖాతాదారుల సౌలభ్యంకోసం బాహుబలి దకన్క్లూజన్ టీంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4జీ డాటా సేవలందించే స్పెషల్ 4 జీ సిమ్ లను లాంచ్ చేసింది. 'బాహుబలి' పేరుతో లాంచ్ చేసిన ఈ బాహుబలి సిమ్ ద్వారా ఉచిత 4జీడేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. దీంతోపాటు 4జీ రీచార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. ఇందుకు బాహుబలి-2తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఈఓ వెంకటేష్ విజయరాఘవన్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో లు ప్రభాస్, రానా, నటి అనుష్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా బాహుబలి నెట్‌వర్క్‌ను లాంచ్ చేశారు. బాహుబలి టీం సోషల్‌మీడియాను బాగా ఉపయోగించుకుందని రాజమౌళి చెప్పారు. ఈ ఘనత నిర్మాత శోభుకి, ఆర్కా టీంకు దక్కుతుందన్నారు. వివిధ డిజిటల్ ప్లాట్ ప్లాంలపై బాహుబలి-2 ప్రమోషన్ చేపడతామని ఎయిర్టెల్ కన్స్యూమర్ బిజినెస్ & చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజ్ పూడిపెద్ది చెప్పారు. అలాగే తమ కస్టమర్లు ప్రత్యేక బాహుబలి-2 మేకింగ్ కంటెంట్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఎయిర్టెల్ నుంచి బాహుబలి సిమ్‌తోపాటు ఉచిత 4జీ డేటా, బాహుబలి 4జీ రీఛార్జ్ ప్యాక్, బాహుబలి కంటెంట్‌లో భాగంగా వీడియోలు, వింక్ మ్యూజిక్, గెస్ట్ ఎడిటర్స్, ఇలా ప్రత్యేకమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు విజయరాఘవన్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎయిర్టెల్ 4జీ వినియోగదారుల కోసం లైవ్ ఓపెన్ ఇంటరాక్టివ్ క్యాంపెయిన్ త్వరలో నిర్వహించనుంది. అయితే రీఛార్జ్ ప్యాక్‌లపై వివరాలను స్పష్టంగా తెలియలేదు. కాగా శనివారం విడుదలైన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్రోమో దుమ్ము రేపుతోంది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్లను పలకరించనుంది. -
జాంట్ చైనాతో జతకట్టిన షియోమి
బీజింగ్ : స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో తనదైన హవా సాగిస్తున్న చైనీస్ టెక్నాలజీ కంపెనీ షియోమి, వర్చ్యువల్ రియాల్టీ కంటెండ్ ప్రొవైడర్ జాంట్ చైనాతో జతకట్టింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందంతో షియోమి గత అక్టోబర్‌లో లాంచ్ చేసిన వీఆర్ హెడ్సెట్ల కోసం జాంట్ చైనా ఓ యాప్‌ను రూపొందించనుంది. మార్కెటింగ్, టెక్నాలజీ విషయంలో రెండు కంపెనీలు ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయని వెల్లడించాయి. వీఆర్ వీడియో షూటింగ్, ఎడిటింగ్, డిస్ట్రిబ్యూషన్లో జాంట్ కంపెనీ ప్రస్తుతం నిమగ్నమై ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. షాంఘై మీడియా గ్రూప్, చైనా మీడియా క్యాపిటల్‌తో కలిసి ఈ ఏడాది జాంట్ చైనాను కంపెనీ ఆవిష్కరించింది. జాంట్తో కలిసి హై క్వాలిటీ వీఆర్ వీడియోలను తాము అందిస్తామని విశ్వసిస్తున్నట్టు షియోమి తెలిపింది. షియోమితో భాగస్వామ్యం తమకు మరింత విశ్వాసాన్ని అందిస్తుందని జాంట్ చైనా కూడా పేర్కొంది. 2016లో చైనా వీఆర్ మార్కెట్ 5.55 బిలియన్ యువాన్లు. వీఆర్ స్టార్టప్‌లకు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు నిధులు అందించడం కోసం బైడు, ఆలీబాబా, టెన్సెంట్‌లు ఆ స్టార్టప్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో మొబైల్ వీఆర్‌లోకి మరలడానికి ఫోన్ తయారీసంస్థల మధ్య పోటీ తీవ్రతరమైంది. -
ఫైనాన్స్ పేరిట కుచ్చుటోపి !
రూ. 20 లక్షలకు ఎసరు బీర్కూర్ : చిట్టీలు, ఫైనాన్సు పేరిట మోసాలు జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది వ్యాపారులు, ఉద్యోగులు తమ డబ్బు వీలైనంత త్వరగా రెట్టింపు కావాలనే ఆశతో ప్రయివేటు ఫైనాన్సుల్లో భాగస్వాములుగా ఉంటూ మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే బీర్కూర్‌లో చోటుచేసుకుంది. బీర్కూర్‌లో 11 మంది స్నేహితులు కలిసి ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున 11 లక్షలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ను ప్రారంభించారు. నిర్వాహణ బాధ్యతను కొన్నేళ్లు బాగానే చూసుకున్న ఓ భాగస్వామి డబ్బుపై దురాశతో లెక్కలు బుట్టదాఖలు చేశాడు. అసలు, లాభం కలుపుకుని సుమారు రూ. 20 లక్షలకు కుచ్చుటోపి పెట్టాడు. భాగస్వాముల వాటా చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో వారు శుక్రవారం బీర్కూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తన రెండెకరాల పొలం అమ్మి భాగస్వాములకు బాకీ చెల్లిస్తానని సదరు వ్యక్తి కులపెద్దలతో రాయబారం పంపించాడు. ఈవిషయమై ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డిని సంప్రదించగా సివిల్ కేసు పరిధిలోకి వస్తుందని, బాధితులు ఎలాంటి ఫిర్యాదు చే యలేదని పేర్కొన్నారు. బాధిత భాగస్వాముల్లో ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉండడం కొసమెరుపు. -
మారుతి, ఎన్‌ఎస్‌డీసీతో ఉబెర్ భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటో మేజర్ మారుతి సుజుకి, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో క్యాబ్ డ్రైవర్ల శిక్షణ, మరియు సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించింది. సుమారు నాలుగు లక్షలమంది డ్రైవర్లతో అమెరికా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద క్యాబ్ ప్రొవైడర్ గా ఉన్న ఉబెర్ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ, సదుపాయాలకోసం కృషి చేస్తోంది. 2018 నాటికి పది లక్షల మందికి జీవనోపాధి అవకాశాలు సృష్టించే యోచనలో మారుతీ, ఎన్ఎస్డీసీ భాగస్వామ్యంతో 'ఉబెర్ షాన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మారుతీ సుజుకి భాగస్వామ్యంతో 2018 నాటికి సుమారు పదిలక్షలమందికి జీవనోపాధి అవకాశాలను కల్పించాలనే తమ లక్ష్యం నెరవేరనుందని ఉబెర్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద 30,000 డ్రైవర్లకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సి తెలిపారు. నైపుణ్యం లేని డ్రైవర్లకు శిక్షణ అందించి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఉద్దేశించిందని ఉబెర్ భారతదేశం అధ్యక్షుడు అమిత్ జైన్ పీటీఐకి తెలిపారు. అలాగే డ్రైవర్లు వాణిజ్య లైసెన్సుల, వాహనం ఫైనాన్సింగ్, లీజింగ్ పరిష్కారాల్లో ఈ ప్రణాళిక సహాయాన్నంది స్తుందన్నారు. ఢిల్లీ / ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నైలలో 4నెలల పైలట్ ప్రోగ్రాంను నిర్వహించనున్నామన్నారు. ఇది పూర్తయ్యాక దీని ఆధారంగా భారతదేశం అంతటా ఇతర నగరాలకు విస్తరిస్తామని జైన్ ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ శిక్షణా కేంద్రాల ద్వారా కొత్త, పాత డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఆటోమొబైల్ సెక్టార్ లో స్కిల్ బిల్డింగ్ కు ఇది ప్రోత్సాహాన్నందిస్తుందని పేర్కొన్నారు. -
భాగస్వాములే హత్య చేశారు
కుటుంబ సభ్యుల ఆరోపణ పోలీసుల అదుపులో అనుమానితులు చిల్లకూరు : మద్యం దుకాణాల లావాదేవిల్లో విభేదాల కారణంగానే భాగస్వాములే తన భర్తను దారుణంగా హత్య చేశారని మండలంలోని తొణుకుమాల పంచాయతీ ఉడతావారిపార్లపల్లికి చెందిన మృతుడు గొడ్డటి కోటేశ్వరరావు (59) భార్య సుభాషిణి డీఎస్పీ శ్రీనివాస్‌కు తెలిపారు. గురువారం అర్ధరాత్రి కోటేశ్వరరావు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డీఎస్పీ శుక్రవారం విచారణ చేపట్టారు. మద్యం దుకాణ లావాదేవిల్లో 8 నెలలుగా విభేదాలు ఉన్నట్లు హతుడి భార్య సుబాషిణి వివరించింది. తన అన్న కుమారులైన జగదీష్, తులసి, అంజయ్యతో తన భర్త భాగస్వామ్యం ఉన్నాడని, సుమారు రూ.35 లక్షలు పెట్టుబడులుగా పెట్టి భాగస్వామిగా ఉంటున్నాడని, అయితే ఇటీవల కాలంలో పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతోనే తన అన్న కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలన క్లూస్‌టీంతో పాటు, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి చుట్టపక్కల ఆదారాల కోసం ప్రయత్నించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్, సిఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పోలీసుల అదుపులో అనుమానితులు కోటేశ్వరరావు హత్యకు సంబంధించి అనుమానంపై అతనికి దగ్గర బంధువులైన బావమరిది, రమేష్, అతని కుమారులు తులసి, జగదీష్‌తో పాటు కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణ ంలో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
పార్ట్నర్స్
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 35 ఎడ్వర్డ్, చార్లెస్ షేర్ బ్రోకర్ వ్యాపారంలో భాగస్వాములు. ఆ రోజు తెల్లవారు జామున ఎడ్వర్డ్ తన ఆఫీస్ తలుపు తెరుచుకుని వచ్చేసరికి అకౌంట్స్ రాస్తున్న చార్లెస్ కనిపించాడు. ‘‘ఈ సమయంలో పని చేస్తున్నావేంటి?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు. ‘‘నిద్రపట్టక పెండింగ్ పని పూర్తి చేద్దామని వచ్చాను’’ చార్లెస్ చెప్పాడు. ‘‘చార్లీ! బయట ఆగి ఉన్న కొత్త కారు నీదేనా? నువ్వు నన్ను మోసం చేసి మన కంపెనీ నించి తస్కరించిన డబ్బుతోనే కొన్నావా?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు. ‘‘పొద్దున్నే ఈ జోకేంటి?’’ ‘‘నీ గర్ల్‌ఫ్రెండ్ ఉండే అపార్ట్మెంట్ అద్దె కూడా ఆ దొంగిలించిన సొమ్ము లోంచే కడుతున్నావా?’’ ‘‘ఏమిటి నువ్వనేది?’’ ‘‘ఆడిటర్స్ అకౌంట్స్‌ని పరిశీలించి తొంభై ఐదు వేల డాలర్లు దొంగిలించ బడ్డాయని చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా నేను మాట్లాడడం లేదు. ఓ కొత్త కారు, అపార్ట్మెంట్ అద్దె పోను ఇంకా అరవై వేల డాలర్లు నీ దగ్గర ఉండాలి. మన సంస్థకి తిరిగి ఇవ్వు. లేదా పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. ఇవాళ రాత్రి తొమ్మిదిలోగా నువ్వు ఆ డబ్బుతో ఇక్కడికి రావాలి’’... ఎడ్వర్డ్ తన మిత్రుడ్ని హెచ్చరించాడు. ‘‘నా మిత్రుడు ఎంత చెడ్డవాడో! నన్ను పోలీసులకి పట్టిస్తానన్నాడు. ఏదో చిన్న పొరపాటుకి ముప్ఫై ఐదేళ్లు జైల్లో కూర్చోవాలా? స్కూల్ డేస్ నించి మేం ఫ్రెండ్స్. యుద్ధంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు అదంతా మర్చిపోయాడు’’ చార్లెస్ ఆక్రోశించాడు. ‘‘ఏం జరిగింది?’’ అతని గర్ల్‌ఫ్రెండ్ లీనా అడిగింది. ‘‘సంస్థ నించి తొంభై ఐదు వేల డాలర్లు తీసుకున్నాను - అప్పుగానే. అది అతనికి చెప్పకపోతే దాన్ని దొంగతనం అంటున్నాడు’’ చార్లీ నిరసనగా చెప్పాడు. ‘‘మరిప్పుడెలా?’’ పచార్లు చేస్తున్న చార్లీ చిటికె వేసి చెప్పాడు. ‘‘పోలీసులకి ఫిర్యాదు చేయక మునుపే అతన్ని చంపేస్తాను.’’ ‘‘తక్షణం అనుమానం నీ మీదకి వస్తుంది. ఆ డబ్బు ఎక్కడుంది?’’ ‘‘నీ ఖర్చులు, కారు ఖర్చులు పోను అరవై వేల డాలర్లని ఓ చోట దాచాను...’’ ‘‘ఎక్కడ?’’ మళ్లీ చిటికె వేసి చెప్పాడు. ‘‘ఐడియా. నేను ఆత్మహత్య చేసుకుంటాను.’’ ‘‘అది పిచ్చి పని.’’ ‘‘తాత్కాలికంగా కొద్ది రోజులే మరణిస్తాను. ఇంకో దేశం వెళ్లిపోదాం.’’ ‘‘నిజం ఆత్మహత్య నేనొప్పుకోను. కొద్ది రోజులు మాత్రమే మరణించేటట్లయితే సరే. ఎలా చస్తావు?’’ మళ్లీ కొద్దిసేపు పచార్లు చేసి, చిటికె వేసి చెప్పాడు. ‘‘నీళ్ళల్లోకి దూకి. వందడుగులు కిందికి వెళ్లి డైనమైట్‌తో పేల్చుకుని మరణిస్తాను. క్షణానికి ఐదు లక్షల గ్యాలన్ల నీరు వంద అడుగుల లోతున ప్రవహిస్తుంటే శవం దొరకదు. యుద్ధంలో ఇలాంటివి చాలా చేశాను. ఓ గడ్డి బొమ్మకి నా కొత్త సూట్ తొడిగి దాన్ని చంపుతాను.’’ ‘‘కొత్త సూట్ పోయినా, కొత్త జీవితం వస్తుంది’’ లీనా ఆనందంగా చెప్పింది. టేబుల్ ముందు కూర్చుని తన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఎడ్వర్డ్‌కి ఓ ఉత్తరం రాసాడు. ‘‘రాత్రి దీన్ని ఎడ్వర్డ్ ఆఫీస్ టేబుల్ మీద ఉంచితే, మర్నాడు ఉదయం చదువుతాడు. ఇక పోలీసులకి ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదని తెలుసుకుని ఆ పని చేయడు.’’ ఆ ఉత్తరంతో ఆఫీస్‌కి వెళ్లి డూప్లికేట్ తాళం చెవితో ఆఫీస్ తలుపు తెరిచి ఎడ్వర్డ్ టేబుల్ మీద పెట్టాడు చార్లీ. అక్కడి నించి సముద్రం దగ్గరికి వెళ్లి, గడ్డి బొమ్మని, దానికి కట్టిన లాండ్రీ బ్యాగ్‌లోని రాళ్లని సముద్రంలోకి తోసే ముందు వాటర్ ప్రూఫ్ అలారం క్లాక్‌ని ఆన్ చేసాడు. దాదాపు పావు నిమిషం తర్వాత సముద్రంలోంచి పెద్ద పేలుడు వినిపించడంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు పరిగెత్తుకు వచ్చారు. దారంతో రెయిలింగ్‌కి కట్టిన ఉత్తరాన్ని వాళ్లు చదివి పోలీసులకి ఫోన్ చేసారు. ‘‘హనీ! నేను పోయాను. పోలీసులు నిన్ను కొద్ది రోజులు నా గురించి ప్రశ్నిస్తారు. వాళ్లకి అనుమానం రాకుండా నువ్వు దుఃఖాన్ని ఎంతో సహజంగా అభినయించాలి. వారం తర్వాత ఆ డబ్బుతో నువ్వు, నేను సౌత్ అమెరికాకి వెళ్లిపోదాం. దొంగ పాస్పోర్ట్స్ గురువారం అందుతాయి’’ అపార్ట్మెంట్కి వచ్చిన చార్లీ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఆనందంగా చెప్పాడు. ‘‘ఇక నువ్వు మళ్లీ పుట్టవా?’’ లీనా అడిగింది. ‘‘ఆ అవసరం వస్తే చూద్దాం.’’ ‘‘నువ్వు ఎక్కడ దాక్కుంటావు?’’ ‘‘ఇంకెక్కడ? ఇక్కడే. కాలి బూడిదైన నాకోసం పోలీసులు ఎక్కడా వెదకరు. ముఖ్యంగా ఇక్కడ’’ చెప్పాడు. ‘‘డబ్బెక్కడుంది?’’ ఈ ప్రశ్నకి అతను జవాబు చెప్పలేదు. ‘‘బుధవారం తెల్లవారు జామున విమానం. డబ్బు ఎక్కడ దాచావని అడిగావుగా? మా ఆఫీస్‌లో. పద వెళ్దాం’’... మంగళవారం రాత్రి చార్లీ చెప్పాడు. ఇద్దరూ ఆమె కారుని ఆఫీస్ బయట ఆపి లోపలికి నడిచారు. పిల్లి గడ్డం, మీసాలు, నల్ల కళ్లజోడుతో చార్లీ మారు వేషంలో ఆఫీసు లోపలికి నడిచాడు. అతను సరాసరి ఫైల్ క్యాబినెట్ దగ్గరికి వెళ్లాడు. అందులో దాచిన ఓ కవర్ని బయటికి తీసి అందులోని అరవై వేల డాలర్లని లీనాకి ఆనందంగా చూపించాడు. ‘‘హేండ్సప్’’ బీరువా చాటు నించి చేతిలో రివాల్వర్‌తో వచ్చిన ఎడ్వర్డ్‌ని చూసి చార్లీ నివ్వెరపోయాడు. ‘‘నీకెలా తెలుసు?’’ అడిగాడు. ‘‘లీనా ద్వారా. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ కూడా. నిన్ను క్యాంప్‌కి పంపినప్పుడల్లా మేం కలిసేవాళ్లం.’’ తక్షణం లీనా చార్లీకి ఓ ఇంజెక్షన్ చేసి ఎడ్వర్డని అడిగింది. ‘‘ఇప్పుడు ఇతన్ని ఏం చేద్దాం?’’ ‘‘ఇతను ఎప్పుడో మరణించాడు. నా దగ్గర కావలసినంత డైనమైట్ ఉంది’’ ఎడ్వర్డ్ చెప్పాడు. సముద్రంలో గడ్డి బొమ్మ పేలిన చోట వంద అడుగుల లోతున ఇంకోసారి డైనమైట్ పేలింది. దినపత్రికలో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య గురించి చదివి ఎవరో అలానే మళ్లీ ఆత్మహత్యని చేసుకున్నారని పోలీసులు భావించారు. ఈ సారి శవం తాలూకు ముక్కలు ఒకటి రెండు దొరికాయి. (మైఖేల్ జురాయ్ కథకి స్వేచ్ఛానువాదం) -
మొక్కల పెంపకాన్ని అలవరచుకోండి
కణేకల్లు: ‘రాయదుర్గం-హరిత స్వర్గం’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేపట్టిన ‘రాయదుర్గం-హరిత స్వర్గం’ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కణేకల్లు మండలంలోని గోపులాపురం, యర్రగుంట, కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం స్పీకర్ మొక్కలను నాటారు. యర్రగుంట గ్రామంలో వెటర్నరీ ఆసుపత్రిని, కొత్తపల్లిలో కేజీబీవీ స్కూల్‌ను స్పీకర్ ప్రారంభించారు. యర్రగుంట గ్రామంలో ఏర్పాటైన సభలో స్పీకర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హరిత విప్లవం కోసం నేడు 20వేల మొక్కలు, ఏటా 5లక్షలు, నాలుగేళ్లలో 20లక్షల మొక్కలు పెంచాలని కాలువ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమం జిల్లా, రాష్ట్రమంతా వ్యాపించి హరితాంధ్రగా మారాలని స్పీకర్ ఆకాక్షించారు. మనం చెట్లను నరకడం ఒక్కటే నేర్చుకొన్నామని, పెంచడం నేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. మొక్కలు పెంచడం సంప్రదాయంగా అలవరుచుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో తీవ్ర కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటుందన్నారు. ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని ఇంకించాలన్నారు. ప్ర చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయదుర్గం హరిత వనానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ కోశ శశిధర్ మాట్లాడుతూ రూ.388కోట్లతో జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 717 చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి కూడా సమావేశంలో ప్రసంగించారు. కార్యక్రమంలో ఏజేసీ ఖాజామొహిద్దీన్, ఆర్డీఓ రామరావు, డీఏఫ్ఓ రాఘవయ్య, రాయదుర్గం మార్కెట్‌యార్డ్ చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, తహశీల్దార్ వెంకటశేషు, ఎంపీడీఓ రెహనబేగం, ఎంపీపీ షేక్ ఫాతిమాబీ, జెడ్పీటీసీలు పూలనాగరాజు, శారద, సర్పంచుల సంఘం అధ్యక్షులు బసవరాజు, టీడీపీ మండల కన్వీనర్ లాలెప్ప తదిరులు పాల్గొన్నారు. విరివిగా మొక్కలు పెంచండి అనంతపురం అర్బన్ : జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు పెంచాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. సోమవారం తెల్లవారుజామున అనంతపురం రైల్వే స్టేషన్లో ఆయనకు చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేషన్ అతిథి గృహం చేరుకున్న స్పీకర్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జితేంద్రగౌడ్, మేయర్ స్వరూప, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జేసీ సయ్యద్ ఖాజమోహిద్దీన్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజాప్రతినిధులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఐదారు మొక్కలకు తక్కువ కాకుండా పెంచాలన్నారు. -
పన్ను ఎగ్గొట్టే వారి పని పడతాం : జైట్లీ
-
రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!
తాళ్లపాలెం బహిరంగ సభలో లోక్‌సభ స్పీకర్ మహాజన్ పిలుపు అనకాపల్లి: ‘రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి!.’ అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని తాళ్లపాలెం గ్రామంలో గురువారం డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో మహాజన్ మాట్లాడారు. దత్తత తీసుకున్న ఎంపీల సహకారంతో గ్రామాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు. ‘గ్రామాభివృద్ధి అంటే సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ఒక్కటే కాదు. గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే అసలైన అభివృద్ధి’ అని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా ఉండాలనే దృక్పథంతో ఉండాలని కోరారు. మోదీది అమోఘ కృషి: దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు, ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ గట్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కృషినీ ప్రశంసించారు. ప్రారంభాలు.. శంకుస్థాపనలు.. ఆమె ఈ సందర్భంగా తాళ్లపాలెం , లాలంకొత్తూరు, రామన్నపాలెం, అచ్యుతాపురం, జి.భీమవరం గ్రామాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కంభంపాటి అనువాదం హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడిన స్పీకర్ మహాజన్ ప్రసంగాన్ని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
జైల్లో శృంగారం.. ప్రాథమిక హక్కు!
-
జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు
చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు (దంపతులు) వారి జీవిత భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని, అది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఖైదీలుగా ఉన్న భార్యాభర్తలు బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాటియాల సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు సోనియా, జస్వీర్ సింగ్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో వీరికి మరణశిక్ష పడింది. కాగా జైల్లో తామిద్దరూ కలసి జీవించాలని ఉందని, బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతివ్వాలని సోనియా, జస్వీర్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. తామిద్దరూ కలసి జీవించడానికి ఏర్పాట్లు చేసేలా జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమని, తన పెళ్లయిన ఎనిమిది నెలలకే అరెస్ట్ చేశారని జస్వీర్ కోర్టుకు తెలియజేశాడు. నేరం, శిక్ష తీవ్రతను పరిశీలించాలన్న జస్వీర్ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు.. అతని భార్యతో కలసి జీవించడానికి అనుమతిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, బిడ్డకు జన్మినిచ్చే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులు, ఖైదీలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది. -
వలస పేరును చెరిపేద్దాం
►అభివృద్ధిలో భాగస్వాములు కండి ►పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట ►పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక ►మారుమూల పల్లెలకు ఐటీ సేవలు ►తాగునీటి అవసరాలు తీర్చేందుకు గ్రిడ్ ►నవంబర్ నుంచి పెంచిన పింఛన్లు ►స్వాతంత్య్రదిన వేడుకల్లో మంత్రి కేటీఆర్ సాక్షి, మహబూబ్‌నగర్/పాలమూరు: ఎంతోమంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడదామని రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయని, ఇక నుంచి ఆ ముద్రను చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా ప్రగతికి అధికారులు సమష్టిగా కృషిచేయాలని కోరారు. 68వ స్వాతంత్య్ర దినవేడుకలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయజెండాను ఆవి ష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసేందుకు ప్రజాసంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకే ఈనెల 19న సమగ్ర కుటుంబసర్వేను చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను మంత్రి కోరారు. వలసలకు స్వస్తి చెబుతాం పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయి. ఇక నుంచి వాటి ముద్ర చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే జిల్లాలో 30,097 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అదనంగా మరో రెండు మెగా పరిశ్రమలు, 78 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చాయని వీటి ద్వారా 73,800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఐటీరంగాన్ని కూడా విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ఐటీ సాంకేతిక ఫలాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ- పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘తెలంగాణ హరితహారం’ పేరిట ప్రతి నియోజకవర్గంలో 40లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని నిర్ణయించామని, అందులో భాగంగానే జిల్లాలో 6.20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మంత్రి వెల్లడించారు. సాగు,తాగునీటికి ప్రాధాన్యం మహబూబ్‌నగర్ జిల్లాలో తాగు, సాగునీటికి అధికప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు. సురక్షిత తాగునీటి కోసం జిల్లాలో 792 సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు రూ.57.48 కోట్లతో చేపట్టిన 213 పనులు పూర్తయ్యాయని, 48 సమగ్ర మంచినీటి పథకాలను 927 నివాస ప్రాంతాల్లో రూ.767 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4 మంచినీటి గ్రిడ్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా గ్రిడ్ ఏర్పాటుచేసి 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బీడుభూములను సాగునీరు అందించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా వంటి భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎత్తిపోతల పనులు దాదాపు 80శాతం అయ్యాయని, మిగతా 20శాతం పనులు త్వరతగతిన పూర్తిచేసి ఆయకట్టు రైతాంగానికి నీరందిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలోని 6055 చిన్న, పెద్ద చెరువుల ద్వారా దాదాపు 2.60 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి, నూనె గింజల అభివృద్ధి, ఆర్కేవీవై, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలుచేసేందుకు ఈఏడాది రూ.1,659 లక్షలు కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 2,21,938 వ్యవసాయ కనెక్షన్లకు గాను 2,19,841 కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లా ప్రణాళికకు రూ.2776 కోట్లు బీఆర్జీఎఫ్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3,701 పనులను రూ.3,847 లక్షల అంచనాలతో జిల్లా ప్రణాళిక కమిటీ ద్వారా ఆమోదించి ప్రభుత్వానికి నివేదించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలోని 1331 పంచాయతీల్లో రూ.2776 కోట్ల అంచనాతో 9484 పనులు, 64 మండలాల్లో రూ.2028 కోట్ల అంచనా వ్యయంతో 640 పనులు, జిల్లాలో 50 పనులు రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో గుర్తించినట్లు చెప్పారు. ‘మన ఊరు.. మన దవాఖానా’ ద్వారా 93,085 మంది రోగులు, 74,475 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా 2014-15 ఇప్పటివరకు రూ.110 కోట్లతో 2,53,706 కుటుంబాల్లో 4,31,238 మంది కూలీలకు ఉపాధి క్పలించామని, 2014-15 సంవత్సరానికి 25,100 సంఘాలకు రూ.697.58 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,617 సంఘాలకు రూ.95.19 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా 249 గ్రూపులకు రూ.125లక్షల రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.169 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేశామని, పేద దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ఒక్కొక్కరికీ రూ.50వేల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ‘కల్యాణ లక్ష్మి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నవంబర్ నుంచి పింఛన్లు పెంపు జిల్లాలో మొత్తం 4.65 లక్షలమంది పింఛన్‌దారులకు సామాజిక భద్రత ఫించన్ల ద్వారా ప్రతినెల రూ.13.13 కోట్లు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్‌ను నవంబర్ నుంచి అందజేస్తామన్నారు. చదువులకు పెద్దపీట పేద విద్యార్థుల చదువుల భారాన్ని భరించేందుకు ఫాస్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2013-14 పదోతరగతి ఫలితాల్లో 94శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.25 లక్షలు, కోచ్‌లకు క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎవరెస్టు విజేతలు గిరిజన, దళితబిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షల నగదు పారితోషికం అందించినట్లు వివరించారు. అలాగే జిల్లాలో 65 కేజీబీవీలకు ఈ ఏడాది 2014-15లో రూ.4,304లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.6,518 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.461 లక్షలు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.13 లక్షలు, మరమ్మతుల కోసం రూ.65 లక్షలు మంజూరైనట్లు వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి, గృహం, వారి పిల్లలకు ఉచితవిద్య, వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించామన్నారు. నిరుద్యోగులకు చేయూత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన ఖాళీ పోస్టులను క్రమం తప్పకుండా నియామకాలు చేపడతామని, ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపుగా ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి, సర్టిఫ్టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డీ నాగేంద్రకుమార్, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి
టాటా సంస్థలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం ప్రభుత్వానికి సహకరిస్తామన్న టాటా గ్రూప్‌ల చైర్మన్ మిస్త్రి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని టాటా సంస్థలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. పారిశ్రామిక, ఐటీ, విద్య, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో అనుభవం ఉన్న టాటా కన్సల్టెన్సీ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. సీఎం అధికారిక నివాసంలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రి తన ప్రతినిధి బృందంతో బుధవారం సీఎం కేసీఆర్‌ను కలి శారు. ప్రభుత్వం తయారు చేసిన పారిశ్రామిక ముసాయిదా విధానం చాలా బాగుందని, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని మిస్త్రి అభిప్రాయపడ్డారు. ‘పారిశ్రామిక వృద్ధితో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి, కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం, అందరికీ వైద్యం వంటి పథకాలను చేపడుతున్నామ ని... ఏ ఒక్క రంగాన్నీ కూడా విస్మరించడం లే దు. పారిశ్రామిక భూములపై సర్వే జరుగుతోం ది. హైదరాబాద్ నగరంలో 1,700 గుర్తించిన మురికివాడలు ఉన్నాయి. వీటిలో ఇండ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం’ అని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్రమాల కు టాటా కన్సల్టెన్సీ సేవలు అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ అనుభవం, విజ్ఞానం, సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని మిస్త్రి హామీ ఇచ్చారు. ‘ఉచిత నిర్బంధ విద్య అమలుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలతోపాటు బోధన పద్ధతులు మొదలైన వాటిలో తమ వద్ద అవసరమైన సమాచారం ఉంది. ఇందుకోసం కేటాయించిన యంత్రాంగాన్ని ప్రభుత్వానికి సహకరించేందుకు ఉపయోగిస్తాం. గ్రామాల్లో పర్యటించి తరగతులను కూడా స్వయంగా చూసి కావాల్సిన సలహాలు ఇస్తారు’ అని మిస్త్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా మార్చాలన్న సీఎం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, వాటి రూపురేఖలు మార్చేందుకు అవసరమైన విధాన రూపకల్పనలోనూ సహకారం అందిస్తామని ప్రకటించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారు కూడా మెరుగైన జీవితాన్ని అందుకునే విధంగా కాలనీలు ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన కోసం ఆలోచించాలని కేసీఆర్ కోరారు. దీనిపై తాము ఇప్పటికే అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే ఫలితాలు సాధిస్తామని మిస్త్రి వివరించారు. సమావేశంలో ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మిశ్రా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. వైమానిక, ఆటో రంగాల్లో మహీంద్రా పెట్టుబడులు 9న కేసీఆర్‌తో మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో భేటీ హైదరాబాద్: రాష్ర్టంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సిద్ధమవుతోంది. విమానయాన, ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఈ నెల 9న సీఎం కేసీఆర్‌తో మహీం ద్రా అండ్ మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో ప్రవీణ్ షా భేటీ కానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో వైమానిక, ఆటో రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫ్రాన్స్ కార్ల తయారీ కంపెనీ ఫ్యూజోతో మహీంద్రా కం పెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో యూనిటు ఏర్పాటుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కూడా కుదిరింది. తాజాగా మహీంద్రాతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ యూనిట్‌ను మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌కు మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జహీరాబాద్‌లో మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లతోపాటు ట్రాలీ యూనిట్ కూడా ఉంది. డిసెంబరులో ట్రాలీ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇక్కడే కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని.. మహీంద్రా ఆలోచిస్తోం దని ప్రభుత్వవర్గాలు వివరించాయి. మరోవైపు తాజాగా ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన మహీంద్రా.. ఈ రంగంలోనూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఇప్పటికే టాటా సంస్థ విమానయానరంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రం గంలో పెట్టుబడులను తెలంగాణలోనే పెట్టాలని మహీంద్రా భావిస్తున్నట్టు సమాచారం.