రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!
- తాళ్లపాలెం బహిరంగ సభలో లోక్‌సభ స్పీకర్ మహాజన్ పిలుపు
అనకాపల్లి: ‘రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి!.’ అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని తాళ్లపాలెం గ్రామంలో గురువారం డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో మహాజన్ మాట్లాడారు. దత్తత తీసుకున్న ఎంపీల సహకారంతో గ్రామాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు.
‘గ్రామాభివృద్ధి అంటే సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ఒక్కటే కాదు. గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే అసలైన అభివృద్ధి’ అని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా ఉండాలనే దృక్పథంతో ఉండాలని కోరారు.
మోదీది అమోఘ కృషి: దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు, ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ గట్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కృషినీ ప్రశంసించారు.
ప్రారంభాలు.. శంకుస్థాపనలు..
ఆమె ఈ సందర్భంగా తాళ్లపాలెం , లాలంకొత్తూరు, రామన్నపాలెం, అచ్యుతాపురం, జి.భీమవరం గ్రామాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కంభంపాటి అనువాదం
హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడిన స్పీకర్ మహాజన్ ప్రసంగాన్ని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.