Mahajan
-
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి విని మహాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. అనంతరం జల్ జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తరువాత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకంపై సమీక్షించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నదే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశమని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 2024 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా తగినంత ప్రమాణంలో శుద్ధమైన తాగునీటిని అందించాలని కోరారు. ఇందుకు గ్రామ పంచాయతీలను పూర్తిగా బలోపేతం చేసి మహిళా స్వయం శక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, వ్యర్థాలను లాభదాయక వనరులుగా వినియోగించుకొనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై కేంద్ర కార్యదర్శి విని మహాజన్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ విధిగా మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. విజయవంతంగా అమలుకు చర్యలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాక వర్షాకాలంలో వచ్చే డయేరియా కేసులు పూర్తిగా తగ్గాయని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఘన, ద్రవ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని సక్రమ విధానంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని కలి్పంచేందుకు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. -
అసీం మహాజన్‌కు తెలుగు సంఘాల ఘన సన్మానం
డల్లాస్, టెక్సాస్: కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్‌తో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్లో గురువారం ఆతిధ్య సమావేశం జరిగింది. వివిధ తెలుగు సంఘాల ప్రముఖ నాయకులు - రఘువీర్ బండారు – తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్); డా. శ్రీధర్ కొర్సపాటి – నా ర్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ (నాటా); డా. సంధ్యా రెడ్డి గవ్వ – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా); లక్ష్మి పాలేటి - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్టేక్ష్); మురళి వెన్నం - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా); శేఖర్ అన్నే- నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్); మహేంద్ర రావు – డల్లాస్ ఏరియా తెలంగాణా అసోసియేషన్ (డాటా)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికంగాను, జాతీయ స్థాయిలోను, మాతృ దేశంలోను చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కాన్సల్ జెనరల్‌కు వారు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున డా. ప్రసాద్ తోటకూర కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్‌ను దుశాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ అభినందనకు కాన్సల్ జెనరల్ మహాజన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ – “అమెరికాలో తెలుగు వారి విజ్ఞానం, ఆధిక్యత - విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యాపారంలాంటి అన్ని రంగాలలోను విశేష ప్రభావం చూపుతోంది. అవసరమైనప్పుడు వీలైన సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా’’నని అన్నారు. -
పార్లమెంటులో నగదు రహిత లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నగదు రహిత లావాదేవీలకు వీలుగా కార్డు ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆహార నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఉన్న టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి అన్ని క్యాంటీన్లలో ఈ మిషన్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. బుధవారం వీటిని లోక్‌సభ స్పీకర్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు క్యాంటీన్లలో నగదు రహిత లావాదేవీలకు వీలు కల్పించిన జితేందర్ రెడ్డిని ప్రశంసించారు. -
రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!
తాళ్లపాలెం బహిరంగ సభలో లోక్‌సభ స్పీకర్ మహాజన్ పిలుపు అనకాపల్లి: ‘రండి.. అభివృద్ధిలో చేతులు కలపండి!. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి!.’ అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని తాళ్లపాలెం గ్రామంలో గురువారం డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో మహాజన్ మాట్లాడారు. దత్తత తీసుకున్న ఎంపీల సహకారంతో గ్రామాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు. ‘గ్రామాభివృద్ధి అంటే సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ఒక్కటే కాదు. గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే అసలైన అభివృద్ధి’ అని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా ఉండాలనే దృక్పథంతో ఉండాలని కోరారు. మోదీది అమోఘ కృషి: దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు, ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ గట్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కృషినీ ప్రశంసించారు. ప్రారంభాలు.. శంకుస్థాపనలు.. ఆమె ఈ సందర్భంగా తాళ్లపాలెం , లాలంకొత్తూరు, రామన్నపాలెం, అచ్యుతాపురం, జి.భీమవరం గ్రామాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కంభంపాటి అనువాదం హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడిన స్పీకర్ మహాజన్ ప్రసంగాన్ని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.