సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి విని మహాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఆమె భేటీ అయ్యారు.
అనంతరం జల్ జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తరువాత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకంపై సమీక్షించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నదే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశమని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 2024 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా తగినంత ప్రమాణంలో శుద్ధమైన తాగునీటిని అందించాలని కోరారు.
ఇందుకు గ్రామ పంచాయతీలను పూర్తిగా బలోపేతం చేసి మహిళా స్వయం శక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, వ్యర్థాలను లాభదాయక వనరులుగా వినియోగించుకొనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై కేంద్ర కార్యదర్శి విని మహాజన్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ విధిగా మరుగుదొడ్డి నిర్మించాలన్నారు.
విజయవంతంగా అమలుకు చర్యలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాక వర్షాకాలంలో వచ్చే డయేరియా కేసులు పూర్తిగా తగ్గాయని చెప్పారు.
ప్రతి ఇంటి నుంచి ఘన, ద్రవ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని సక్రమ విధానంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యాన్ని కలి్పంచేందుకు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment