పార్ట్‌నర్స్ | Malladi Venkata Krishna Crime stories - 35 | Sakshi
Sakshi News home page

పార్ట్‌నర్స్

Published Sun, Feb 28 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

పార్ట్‌నర్స్

పార్ట్‌నర్స్

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 35
ఎడ్వర్డ్, చార్లెస్ షేర్ బ్రోకర్ వ్యాపారంలో భాగస్వాములు. ఆ రోజు తెల్లవారు జామున ఎడ్వర్డ్ తన ఆఫీస్ తలుపు తెరుచుకుని వచ్చేసరికి అకౌంట్స్ రాస్తున్న చార్లెస్ కనిపించాడు.
 ‘‘ఈ సమయంలో పని చేస్తున్నావేంటి?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు.
 ‘‘నిద్రపట్టక పెండింగ్ పని పూర్తి చేద్దామని వచ్చాను’’ చార్లెస్ చెప్పాడు. ‘‘చార్లీ! బయట ఆగి ఉన్న కొత్త కారు నీదేనా? నువ్వు నన్ను మోసం చేసి మన కంపెనీ నించి తస్కరించిన డబ్బుతోనే కొన్నావా?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు.
 ‘‘పొద్దున్నే ఈ జోకేంటి?’’
 ‘‘నీ గర్ల్‌ఫ్రెండ్ ఉండే అపార్ట్‌మెంట్ అద్దె కూడా ఆ దొంగిలించిన సొమ్ము లోంచే కడుతున్నావా?’’
 ‘‘ఏమిటి నువ్వనేది?’’

 ‘‘ఆడిటర్స్ అకౌంట్స్‌ని పరిశీలించి తొంభై ఐదు వేల డాలర్లు దొంగిలించ బడ్డాయని చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా నేను మాట్లాడడం లేదు. ఓ కొత్త కారు, అపార్ట్‌మెంట్ అద్దె పోను ఇంకా అరవై వేల డాలర్లు నీ దగ్గర ఉండాలి. మన సంస్థకి తిరిగి ఇవ్వు. లేదా పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. ఇవాళ రాత్రి తొమ్మిదిలోగా నువ్వు ఆ డబ్బుతో ఇక్కడికి రావాలి’’... ఎడ్వర్డ్ తన మిత్రుడ్ని హెచ్చరించాడు.
   
 ‘‘నా మిత్రుడు ఎంత చెడ్డవాడో! నన్ను పోలీసులకి పట్టిస్తానన్నాడు. ఏదో చిన్న పొరపాటుకి ముప్ఫై ఐదేళ్లు జైల్లో కూర్చోవాలా? స్కూల్ డేస్ నించి మేం ఫ్రెండ్స్. యుద్ధంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు అదంతా మర్చిపోయాడు’’ చార్లెస్ ఆక్రోశించాడు.
 ‘‘ఏం జరిగింది?’’ అతని గర్ల్‌ఫ్రెండ్ లీనా అడిగింది.
 ‘‘సంస్థ నించి తొంభై ఐదు వేల డాలర్లు తీసుకున్నాను - అప్పుగానే. అది అతనికి చెప్పకపోతే దాన్ని దొంగతనం అంటున్నాడు’’ చార్లీ నిరసనగా చెప్పాడు.
 ‘‘మరిప్పుడెలా?’’
 పచార్లు చేస్తున్న చార్లీ చిటికె వేసి చెప్పాడు. ‘‘పోలీసులకి ఫిర్యాదు చేయక మునుపే అతన్ని చంపేస్తాను.’’
 ‘‘తక్షణం అనుమానం నీ మీదకి వస్తుంది. ఆ డబ్బు ఎక్కడుంది?’’
 ‘‘నీ ఖర్చులు, కారు ఖర్చులు పోను అరవై వేల డాలర్లని ఓ చోట దాచాను...’’
 ‘‘ఎక్కడ?’’
 మళ్లీ చిటికె వేసి చెప్పాడు.

 ‘‘ఐడియా. నేను ఆత్మహత్య చేసుకుంటాను.’’
 ‘‘అది పిచ్చి పని.’’
 ‘‘తాత్కాలికంగా కొద్ది రోజులే మరణిస్తాను. ఇంకో దేశం వెళ్లిపోదాం.’’
 ‘‘నిజం ఆత్మహత్య నేనొప్పుకోను. కొద్ది రోజులు మాత్రమే మరణించేటట్లయితే సరే. ఎలా చస్తావు?’’
 మళ్లీ కొద్దిసేపు పచార్లు చేసి, చిటికె వేసి చెప్పాడు.
 ‘‘నీళ్ళల్లోకి దూకి. వందడుగులు కిందికి వెళ్లి డైనమైట్‌తో పేల్చుకుని మరణిస్తాను. క్షణానికి ఐదు లక్షల గ్యాలన్ల నీరు వంద అడుగుల లోతున ప్రవహిస్తుంటే శవం దొరకదు. యుద్ధంలో ఇలాంటివి చాలా చేశాను. ఓ గడ్డి బొమ్మకి నా కొత్త సూట్ తొడిగి దాన్ని చంపుతాను.’’
 ‘‘కొత్త సూట్ పోయినా, కొత్త జీవితం వస్తుంది’’ లీనా ఆనందంగా చెప్పింది.
 టేబుల్ ముందు కూర్చుని తన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఎడ్వర్డ్‌కి ఓ ఉత్తరం రాసాడు.
 ‘‘రాత్రి దీన్ని ఎడ్వర్డ్ ఆఫీస్ టేబుల్ మీద ఉంచితే, మర్నాడు ఉదయం చదువుతాడు. ఇక పోలీసులకి ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదని తెలుసుకుని ఆ పని చేయడు.’’

 ఆ ఉత్తరంతో ఆఫీస్‌కి వెళ్లి డూప్లికేట్ తాళం చెవితో ఆఫీస్ తలుపు తెరిచి ఎడ్వర్డ్ టేబుల్ మీద పెట్టాడు చార్లీ.
 అక్కడి నించి సముద్రం దగ్గరికి వెళ్లి, గడ్డి బొమ్మని, దానికి కట్టిన లాండ్రీ బ్యాగ్‌లోని రాళ్లని సముద్రంలోకి తోసే ముందు వాటర్ ప్రూఫ్ అలారం క్లాక్‌ని ఆన్ చేసాడు. దాదాపు పావు నిమిషం తర్వాత సముద్రంలోంచి పెద్ద పేలుడు వినిపించడంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు పరిగెత్తుకు వచ్చారు. దారంతో రెయిలింగ్‌కి కట్టిన ఉత్తరాన్ని వాళ్లు చదివి పోలీసులకి ఫోన్ చేసారు.
   
 ‘‘హనీ! నేను పోయాను. పోలీసులు నిన్ను కొద్ది రోజులు నా గురించి ప్రశ్నిస్తారు. వాళ్లకి అనుమానం రాకుండా నువ్వు దుఃఖాన్ని ఎంతో సహజంగా అభినయించాలి. వారం తర్వాత ఆ డబ్బుతో నువ్వు, నేను సౌత్ అమెరికాకి వెళ్లిపోదాం. దొంగ పాస్‌పోర్ట్స్ గురువారం అందుతాయి’’ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన చార్లీ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఆనందంగా చెప్పాడు. ‘‘ఇక నువ్వు మళ్లీ పుట్టవా?’’ లీనా అడిగింది.
 ‘‘ఆ అవసరం వస్తే చూద్దాం.’’
 ‘‘నువ్వు ఎక్కడ దాక్కుంటావు?’’

 ‘‘ఇంకెక్కడ? ఇక్కడే. కాలి బూడిదైన నాకోసం పోలీసులు ఎక్కడా వెదకరు. ముఖ్యంగా ఇక్కడ’’ చెప్పాడు.
 ‘‘డబ్బెక్కడుంది?’’
 ఈ ప్రశ్నకి అతను జవాబు చెప్పలేదు.
   
 ‘‘బుధవారం తెల్లవారు జామున విమానం. డబ్బు ఎక్కడ దాచావని అడిగావుగా? మా ఆఫీస్‌లో. పద వెళ్దాం’’... మంగళవారం రాత్రి చార్లీ చెప్పాడు. ఇద్దరూ ఆమె కారుని ఆఫీస్ బయట ఆపి లోపలికి నడిచారు. పిల్లి గడ్డం, మీసాలు, నల్ల కళ్లజోడుతో చార్లీ మారు వేషంలో ఆఫీసు లోపలికి నడిచాడు.
 అతను సరాసరి ఫైల్ క్యాబినెట్ దగ్గరికి వెళ్లాడు. అందులో దాచిన ఓ కవర్ని బయటికి తీసి అందులోని అరవై వేల డాలర్లని లీనాకి ఆనందంగా చూపించాడు. ‘‘హేండ్సప్’’ బీరువా చాటు నించి చేతిలో రివాల్వర్‌తో వచ్చిన ఎడ్వర్డ్‌ని చూసి చార్లీ నివ్వెరపోయాడు.
 ‘‘నీకెలా తెలుసు?’’ అడిగాడు.

 ‘‘లీనా ద్వారా. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ కూడా. నిన్ను క్యాంప్‌కి పంపినప్పుడల్లా మేం కలిసేవాళ్లం.’’
 తక్షణం లీనా చార్లీకి ఓ ఇంజెక్షన్ చేసి ఎడ్వర్‌‌డని అడిగింది. ‘‘ఇప్పుడు ఇతన్ని ఏం చేద్దాం?’’
 ‘‘ఇతను ఎప్పుడో మరణించాడు. నా దగ్గర కావలసినంత డైనమైట్ ఉంది’’ ఎడ్వర్డ్ చెప్పాడు. సముద్రంలో గడ్డి బొమ్మ పేలిన చోట వంద అడుగుల లోతున ఇంకోసారి డైనమైట్ పేలింది. దినపత్రికలో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య గురించి చదివి ఎవరో అలానే మళ్లీ ఆత్మహత్యని చేసుకున్నారని పోలీసులు భావించారు. ఈ సారి శవం తాలూకు ముక్కలు ఒకటి రెండు దొరికాయి.
 (మైఖేల్ జురాయ్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement