
మొక్కల పెంపకాన్ని అలవరచుకోండి
కణేకల్లు: ‘రాయదుర్గం-హరిత స్వర్గం’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేపట్టిన ‘రాయదుర్గం-హరిత స్వర్గం’ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కణేకల్లు మండలంలోని గోపులాపురం, యర్రగుంట, కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం స్పీకర్ మొక్కలను నాటారు. యర్రగుంట గ్రామంలో వెటర్నరీ ఆసుపత్రిని, కొత్తపల్లిలో కేజీబీవీ స్కూల్‌ను స్పీకర్ ప్రారంభించారు. యర్రగుంట గ్రామంలో ఏర్పాటైన సభలో స్పీకర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హరిత విప్లవం కోసం నేడు 20వేల మొక్కలు, ఏటా 5లక్షలు, నాలుగేళ్లలో 20లక్షల మొక్కలు పెంచాలని కాలువ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమం జిల్లా, రాష్ట్రమంతా వ్యాపించి హరితాంధ్రగా మారాలని స్పీకర్ ఆకాక్షించారు.
మనం చెట్లను నరకడం ఒక్కటే నేర్చుకొన్నామని, పెంచడం నేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. మొక్కలు పెంచడం సంప్రదాయంగా అలవరుచుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో తీవ్ర కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటుందన్నారు. ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని ఇంకించాలన్నారు. ప్ర చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయదుర్గం హరిత వనానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ కోశ శశిధర్ మాట్లాడుతూ రూ.388కోట్లతో జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 717 చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేలు పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి కూడా సమావేశంలో ప్రసంగించారు. కార్యక్రమంలో ఏజేసీ ఖాజామొహిద్దీన్, ఆర్డీఓ రామరావు, డీఏఫ్‌ఓ రాఘవయ్య, రాయదుర్గం మార్కెట్‌యార్డ్ చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, తహశీల్దార్ వెంకటశేషు, ఎంపీడీఓ రెహనబేగం, ఎంపీపీ షేక్ ఫాతిమాబీ, జెడ్పీటీసీలు పూలనాగరాజు, శారద, సర్పంచుల సంఘం అధ్యక్షులు బసవరాజు, టీడీపీ మండల కన్వీనర్ లాలెప్ప తదిరులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు పెంచండి
అనంతపురం అర్బన్ : జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు పెంచాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. సోమవారం తెల్లవారుజామున అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆయనకు చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేషన్ అతిథి గృహం చేరుకున్న స్పీకర్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జితేంద్రగౌడ్, మేయర్ స్వరూప, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జేసీ సయ్యద్ ఖాజమోహిద్దీన్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజాప్రతినిధులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఐదారు మొక్కలకు తక్కువ కాకుండా పెంచాలన్నారు.