భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. వాయిస్ ఆధారిత జనరేటివ్ AIని అభివృద్ధి చేయడం, అజూర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా సర్వం ఏఐకి (Sarvam AI)కి మద్దతు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
భారత్‌లో ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భారంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించింది.
సర్వం ఏఐ భారతీయ భాషలు, నేపథ్యంపై ఉత్పాదక ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో పని చేస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్, ఖోస్లా వెంచర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్‌లో సుమారు రూ.340 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ స్టార్టప్‌ను స్థాపించిన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్‌లు గతంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధనా బృందం ఏఐ4భారత్‌తో కలిసి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు.
ప్రతిఒక్కరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఏఐ-మొదటి దేశంగా భారత్ పరివర్తన చెందడానికి సాధికారత కల్పిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా & దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అన్నారు. సర్వం ఏఐతో సహకారం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, వారి భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా వాయిస్-ఆధారిత ఏఐ సొల్యూషన్‌ల శక్తి నుంచి ప్రయోజనం పొందగల భవిష్యత్తును తాము ప్రోత్సహిస్తున్నామని చందోక్ చెప్పారు.
భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ అప్లికేషన్‌ల కోసం వాయిస్ అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌లలో ఒకటి. విద్య, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో దీన్ని వర్తింపజేయొచ్చు. సర్వం ఏఐ ఇండిక్ వాయిస్ ఎల్‌ఎల్‌ఎంను అజూర్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా భారత్-కేంద్రీకృతంగా మరిన్ని ఆవిష్కరణలు రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ పునాదులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment