ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్‌ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు.
2027 నాటికల్లా..
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్‌వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన గిట్‌హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్‌లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్‌హబ్‌లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్‌హబ్‌లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్‌తో భారత్‌తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment