software developer
-
Generative AI: ఏఐలో అమెరికాను ఢీకొట్టేది భారతీయులే..!
ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్‌ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 2027 నాటికల్లా.. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన గిట్‌హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్‌హబ్‌లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్‌హబ్‌లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్‌తో భారత్‌తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్‌మేకర్‌గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్‌గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్‌కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్‌కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్‌లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బడ్టెట్‌ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
‘వైజాగ్ బిట్స్’ విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.. ‘కాంకర్డ్’కు అంకురార్పణ
సాక్షి, విశాఖపట్నం: స్థానిక బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు “కాంకర్డ్” పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ డా.గోవింద రాజు వెల్లడించారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా చెగ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ప్రకృతి శ్రీవాస్తవ గౌరవ అతిధిగా క్యాథెరిన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ హాజరయ్యారని తెలిపారు. చదవండి: వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా? కాంకర్డ్ అంకుర సంస్థను బిట్స్ వైజాగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు పి. జాషువ రాజు ఆధ్వర్యంలో, ఐదుగురు విద్యార్థుల బృందం ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, యుఐ/యుఎక్స్ డిజైనింగ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలెప్మెంట్, డిజైన్ స్పాటిలైట్ వెర్టికల్స్ లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారని సంస్థ వ్యవస్థాపకులు జోషువా రాజు వివరించారు. సహ వ్యవస్థాపకులు సందీప్, మేఘశ్యామ్ ఫుల్ స్ట్యాక్ డెవలప్మెంట్ లో అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తారని, విద్యార్థి రాహుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, మహేష్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని చెప్పారు. మూడవ సంవత్సరం చదువుతున్న శ్రావ్య కంటెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా పని చేస్తారన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సంస్థను ప్రారంభించడం అభినందనీయమని, వారికి తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగాప్రకృతి శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. తమ విద్యార్థులు అంకుర సంస్థను విద్యార్థులు స్థాపించడం చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంస్థల్ని మరిన్ని తీసుకురావాలని ప్రిన్సిపాల్ అభిలషించారు. కళాశాల కరెస్పాండెంట్ డా. కొండ్రు శ్రీలక్ష్మి బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని సంస్థలు అన్ని విభాగాల్లోనూ స్టార్టప్‌తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిట్స్ వైజాగ్ అకడమిక్ ముఖ్య సలహాదారు డా. సీవీ గోపినాథ్, డీన్ డా.విక్టర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి!
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా దాదాపు 200 ఉద్యోగాల్లో కోత విధించనుంది. వీటిలో ఎక్కువ భాగం ఉద్యోగాలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలోనే ఉండనున్నాయి. మరోవైపు, సాఫ్ట్వేర్యేతర ఇంజినీరింగ్ విభాగాలపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోంది. కొత్తగా సుమారు 3,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. వాహనాలు, సెల్, బ్యాటరీలు, తయారీ, ఆటోమేషన్ మొదలైన విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం దాదాపు 2,000 మంది ఇంజినీర్లు ఉండగా ఈ ప్రక్రియతో సుమారు 10 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడనుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. 2024లో ఓలా ఎలక్ట్రిక్ తమ తొలి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. -
రిలయన్స్ భారీ పెట్టుబడులు: మరో విదేశీ కంపెనీతో డీల్
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో విదేశీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నరియాకు చెందిన చెందిన సెన్స్‌హాక్‌లో 79.4 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనికి విలు32 మిలియన్ డాలర్లు.సెన్స్‌హాక్ ఇంక్. (సెన్స్‌హాక్)తో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ మంగళవారం ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెన్స్‌హాక్, 2018లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్వేర్ బేస్డ్ మేనేజ్మెంట్ టూల్స్‌ను అందించే సంస్థ. ఆటోమేషన్‌ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టు ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, ఎండ్-టు-ఎండ్ సోలార్ అసెట్ లైఫ్‌సైకిల్‌ను నిర్వహించేలా నిరంతరమైన సేవలందించే సోలార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాయని రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 GW సౌరశక్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. సెన్స్‌హాక్ సహకారంతో ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుతామన్నారు. అలాగే రిలయన్స్ మద్దతుతోసెన్స్హాక్ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ డీల్‌పై సెన్స్‌హాక్ ఫౌండర్ సీఈవో స్వరూప్ మావనూర్, ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ సాంఖే సంతోషం వ్యక్తం చేశారు. -
శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన 'ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్'గ్రామ్ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవకాశం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. తేదీలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు వారి అర్హతలను బట్టి జీతం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సంవత్సరానికి రూ.7.3 లక్షల జీతం పొందవచ్చు. అర్హతలు ►ఏదైనా నుండి బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) లేదా (ఎంటెక్)/బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ) లేదా (ఎంఈ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)/మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ఈ) నుండి విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ 2019,2020, 2021లో పట్టభద్రులు మాత్రమే దరఖాస్తచేసుకోవడానికి అర్హులు. ►అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో కనీసం 6-12 నెలల పని అనుభవం కూడా కలిగి ఉండాలి. ►అభ్యర్థులు 10, 12వ తరగతి, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్‌లో కనీసం 70% మొత్తం మార్కులను స్కోర్ చేసి ఉండాలి. ►అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు మరియు నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. ►విద్యలో ఖాళీలు ఏవైనా ఉంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ప్రకటించాలి. అత్యధిక విద్యార్హత వరకు మొత్తం అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు. ►పూర్తి సమయం కోర్సులు మాత్రమే పరిగణించబడతాయి, పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు పరిగణించబడవు. ఎంపిక విధానం కంపెనీ నిర్వహించే రెండు రౌండ్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ వ్రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ. రాత పరీక్ష రిమోట్‌గా నిర్వహించబడుతుంది. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 నిమిషాలు), వెర్బల్ ఎబిలిటీ (10 నిమిషాలు), అడ్వాన్స్డ్ కోడింగ్ (60 నిమిషాలు) ఆధారంగా పలు ప్రశ్నలుంటాయి. -
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే లక్షల్లో జీతాలు!
వెబ్సైట్లలో యూజర్ ఇంటరాక్టివిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్లకు జావాస్క్రిప్ట్‌ను జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటీతో కూడిన డైనమిక్ వెబ్సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటీ రంగంలో.. ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్లో జావాస్క్రిప్ట్ కీలక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మారుతోంది. చిన్నచిన్న కంపెనీల నుంచి పెద్ద సంస్థల వరకూ.. జావాస్క్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో.. జావాస్క్రిప్ట్‌తో ప్రయోజనాలు.. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తీరుతెన్నులు.. నేర్చుకునేందుకు అర్హతలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... జావాస్క్రిప్ట్ అనేది వెబ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్తోపాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్ పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్సైట్లు రూపొందించేందుకు జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. ఇది వెబ్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లలో ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్సేవల్లోనూ జావాస్క్రిప్ట్ డెవలపర్‌ది ప్రధాన పాత్ర. డెవలపర్ ఉద్యోగాల్లో మూడో వంతు ఉద్యోగాలు వీరికి సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్క్రిప్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. జావాస్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్లను రూపొందించడానికి డెవలపర్లు ఉపయోగించే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్సైట్లలో ఉపయోగించే డ్రాప్‌డౌన్ మెనూ, ఏదైనా బటన్‌ను క్లిక్ చేయడం, పేజీలో రంగును మార్చడం వంటివి జావాస్క్రిప్ట్కు ఉదాహరణలు. జావాస్క్రిప్ట్‌ను వెబ్ అప్లికేషన్లు, గేమ్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఉపయోగించే బహుళార్ధసాధక ప్రోగ్రామింగ్ భాషగా కూడా పేర్కొంటారు. జావాస్క్రిప్ట్‌ను ఒకసారి రాసి.. ఎన్నిసార్లయినా రన్ చేసే వెసులుబాటు ఉంది. అప్లికేషన్స్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్: ఆబ్జెక్టులను క్రియేట్ చేయడానికి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. ఆ ఆబ్జెక్టును ఇంటరాక్టివ్‌గా మార్చడానికి జావాస్క్రిప్ట్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు హెచ్టీఎంఎల్తో వెబ్సైట్లో ‘అప్లోడ్ ఫైల్’ కనిపించేలా చేయొచ్చు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్‌ను అప్లోడ్ చేయడానికి వీలుకల్పించేదే జావాస్క్రిప్ట్. అలాగే ఇమేజెస్, టెక్స్›్ట ఫీల్డ్ తదితర ఫీచర్లను హెచ్టీఎంఎల్తో క్రియేట్ చేసినా.. అవి ఇంటరాక్టివ్‌గా పనిచేయాలంటే.. జావాస్క్రిప్ట్‌ను హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సీఎస్ఎస్ జావాస్క్రిప్ట్, సీఎస్‌ఎస్‌లను వేర్వేరు విధాలుగా వెబ్‌పేజీలలో ఉపయోగిస్తారు. వెబ్సైట్లో ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కోసం లే అవుట్‌ను రూపొందించడానికి సీఎస్ఎస్ సహాయపడుతుంది. వెబ్‌పేజీని ఇంటరాక్టివ్‌గా చేసేందుకు జావాస్క్రిప్ట్ ఉపయోగపడుతుంది. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్కు సంక్షిప్త రూపం..ఏపీఐ. అప్లికేషన్లను కమ్యూనికేట్ చేయడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఫోన్లో ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నుంచి సర్వర్‌కు డేటా వెళ్లడం, కావాల్సిన సమాచారంతో డేటా మళ్లీ ఫోన్‌కు రావడం ఏపీఐ ద్వారా జరుగుతుంది. జావాస్క్రిప్ట్‌లో ఏపీఐలు సర్వర్, క్లయింట్ మధ్య ఇంటర్ఫేస్ను ఏర్పరుస్తాయి. వెబ్ అడ్మిన్ సూచనల ఆధారంగా పేజీని యాక్సెస్ చేయడానికి ఏపీఐలు, వినియోగదారులను అనుమతిస్తాయి. ∙యూజర్‌కు కనిపించే ఫ్రంట్ ఎండ్తోపాటు, బ్యాక్ ఎండ్‌లోనూ నోడ్జేఎస్తో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా డెవలపర్లు డేటాబేస్ నుంచి డేటాను తిరిగి పొందవచ్చు, సేవ్ చేయవచ్చు. అంతేకాకుండా పేమెంట్లు చేయడం, సోషల్ మీడియా పోస్ట్‌లను సేవ్ చేయడం వంటివీ చేయొచ్చు. వెబ్పేజీల్లో అపరిమితమైన ఫంక్షన్ల ద్వారా జావాస్క్రిప్ట్ భాషను ఉపయోగిస్తారు. వెబ్ పేజీలలో జావాస్క్రిప్ట్ ► మౌస్తో కదిలించినప్పుడు, క్లిక్ చేసినప్పుడు వచ్చే మార్పులు. ► పేజీలో హెచ్‌టీఎంఎల్ కంటెంట్ కలపడం, మార్చడం లేదా తీసివేయడం. ► టైపింగ్ చేస్తున్నప్పుడు జరిగే మార్పులు. ► ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం. ► కాచీలో డేటా నిల్వచేయడం. ► వెబ్సైట్ వీక్షకులతో ఇంటరాక్షన్, సందేశాలు పంపడం. ► మొబైల్ అప్లికేషన్లు, ఆన్లైన్ గేమ్‌లను రూపొందించడానికీ జావాస్క్రిప్ట్ ఉపయోగిస్తున్నారు. బ్రౌజర్ ఏదైనా ఇటీవల కాలంలో జావాస్క్రిప్ట్‌ను చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనవల్ల వినియోగదారుడు వెబ్సైట్లో ఏదైనా క్లిక్ చేయగానే వేగంగా ప్రాసెస్ అవుతుంది. లోపాలు, బగ్‌ల ఆధారంగా పరీక్షించడం, సవరించడం జావాస్క్రిప్ట్‌తో సులభం. ఏ బ్రౌజర్ అయినా జావాస్క్రిప్ట్ కోడ్‌ను రన్ చేస్తుంది. ఎలా పని చేస్తుంది వెబ్ బ్రౌజర్లలో జావాస్క్రిప్ట్, ఇతర కోడ్లను అనువదించే ఇంజన్లు ఉంటాయి. అవి జావాస్క్రిప్ట్లోని కమాండ్స్‌కు అనుగుణంగా డైనమిక్ చర్యలకు దోహదపడతాయి. బాగా రాసిన, ఆప్టిమైజ్ చేసిన కోడ్ ..వెబ్‌పేజీలను సమర్ధవంతంగా ఓపెన్ చే స్తుంది. సరిగ్గా లేని ఆదేశాలతో కూడిన జావాస్క్రిప్ట్ యూజర్ బ్రౌజర్‌ను నెమ్మదించేలా చేస్తుంది. ఎవరు నేర్చుకోవచ్చు వెబ్డెవలప్మెంట్పై ఆసక్తి ఉన్నవారు ముందుగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొని.. ఆ తర్వాత జావాస్క్రిప్ట్‌పై దృష్టిసారించాలి. ఆన్‌లైన్‌లోనూ అనేక ఉచిత మెటీరియల్, ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. జావాస్క్రిప్ట్ కమాండ్స్(ఆదేశాలు) ఇంగ్లిష్ మాదిరిగా ఉండటం వల్ల దీన్ని నేర్చుకోవడం సులభం. జావాస్క్రిప్ట్‌లో ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు లభించిన తర్వాత.. ప్రోగ్రామింగ్‌లో కెరీర్ ప్రారంభించొచ్చు. జావాస్క్రిప్ట్ స్టడీ గ్రూప్‌లలో చేరడం ద్వారా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. కెరీర్ అవకాశాలు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సొంతం చేసుకుంటే.. లక్షల్లో వేతనాలు పొందొచ్చు. అన్ని కంపెనీల్లో జావాస్క్రిప్ట్ వినియోగం పెరగడం వల్ల రానున్న రోజుల్లో జావాస్క్రిప్ట్ డెవలపర్లకు మరింత డిమాండ్ పెరగనుంది. నిపుణులైన జావాస్క్రిప్ట్ డెవలపర్లను చాలా కంపెనీలు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, జావాస్క్రిప్ట్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్, వెబ్ డిజైనర్, యూఐ డిజైనర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డెవ్‌ఓప్స్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా డెవలపర్లుగా పనిచేయొచ్చు. -
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ నెల సంపాదన ఎంతో తెలుసా..?
షన్నూ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్ ఒక్క వీడియో పోస్ట్ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్. మొదట్లో కామెడీ, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ .. ఒకే ఒక వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిపోయాడు. అదే ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’. ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌కు 80 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ది సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూపర్ సిరీస్‌తో షణ్ముఖ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ సంపాదించగలిగాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత షణ్ముఖ్ షేర్ చేస్తున్న ప్రతి వీడియో 10 మిలియన్స్ పైగా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘సూర్య’ అనే వెబ్ సిరీస్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల చేసిన 6 ఎపిసోడ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌లో షన్నూకు వచ్చిన క్రేజీతో ఇప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి కూడా సెలెక్ట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూట్యూబ్‌లో ఇంతలా దూసుకెళ్తున్న షణ్ముఖ్ ఆదాయానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షణ్ముఖ్ యూట్యూబ్ చానల్‌కు ప్రస్తుతం 3.32 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఆ లెక్కన ఈయనకు నెలకు రూ.7లక్షల వరకు ఆదాయం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే షన్నూ చేసే వెబ్ సిరీస్‌కి ఎపిసోడ్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటాడట. వాటిని కూడా కలిపితే.. ఈ యూట్యూబ్ స్టార్ నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వామ్మో.. సురేఖ వాణి, సుప్రిత రచ్చ మాములుగా లేదుగా, అర్థరాత్రి వేళ.. -
బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ ఇతనే!
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ గతేడాది డిసెంబర్ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక నాల్గో సీజన్ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. స్టార్ మా కూడా ఐదో సీజన్ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఐదో సీజన్ మొదటి కంటెస్టెంట్ ఇతనే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఎవరో కాదు.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆయనకు యూత్‌లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షణ్ముఖ్ తీసిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ షార్ట్ఫిలిమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్ఫిలిమ్తో సంపాదించాడు షణ్ముఖ్. సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొని వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూపర్ సిరీస్‌తో షణ్ముఖ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజీయే ఇప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి సెలెక్ట్ అయ్యేలా చేసిందని టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు అతడిని సంప్రదించగా, షణ్ముఖ్ కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. శణ్ముఖ్కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారట నిర్వాహకులు. అలాగే యాంకర్ రవి, కమెడియన్ హైపర్ ఆది పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత? ఐదో సీజన్లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
దీప్తి కోసమే ఆ టాటూ వేసుకున్నా: షణ్ముఖ్
కంటెంట్ ఉంటే చాలు క్రేజ్ దానంతటదే వస్తుందనడానికి "సాఫ్ట్వేర్ డెవలపర్" మంచి ఉదాహరణ. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ షార్ట్ఫిలిమ్ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు.. మిగతావి చూడకుండా ఉండలేనంతగా యువతను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా తన బుట్టలో వేసుకుంటోన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్ సిరీస్‌లోని హీరోహీరోయిన్లు షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్యతో యాంకర్ సత్తి గరంగరం ముచ్చట్లు పెట్టారు. సాఫ్ట్వేర్ డెవలపర్లో ఆ ఎపిసోడ్ నా ఫేవరెట్ ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు, తాను మొదటగా రెండో సీజన్ స్క్రిప్ట్ రాసేసుకున్నామని చెప్పాడు. దాన్ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్లాన్ కూడా చేశామన్నాడు. ఆ సీజన్లో కొత్త టీమ్ ఉండబోతుందని, అయితే వైష్ణవికి పెళ్లైంది కాబట్టి ఆమె ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసినదాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీసే ఎక్కువ ఇష్టమని, అందులోనూ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ చూసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మా సిరీస్ బాగుందని ప్రశంసించాకని, అలాగే మరికొందరు డైరెక్టర్లు ఫోన్ చేసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. (చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు) దీప్తికి ఇష్టమైతే కలిసి నటిస్తాం "వెబ్ సిరీస్‌లో చూపించినట్లు కాకుండా నేను నిజజీవితంలో చాలా సైలెంట్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలో అవకాశం వచ్చేవరకు పరిగెడుతూనే ఉంటాను. ఇండస్ట్రీలో సూర్య, అల్లు అర్జున్ నాకు ఫేవరెట్. ఈ మధ్యే సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' చూసి ఏడ్చేశాను" అని చెప్పాడు. తన చేతికున్న టాటూ గురించి చెప్తూ అది దీప్తి సునయన కోసం వేయించుకున్నానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమెకు ఇష్టమైతే మళ్లీ కలిసి నటిస్తామని మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: సూపర్ సిరీస్..‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’) అదే నా పెద్ద డ్రీమ్: వైష్ణవి వైష్ణవి మాట్లాడుతూ.. నా జీవితంలో మిస్టర్ షన్నూలాంటి వాళ్లు ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. సినిమా హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే నాని టక్ జగదీశ్, నాగశౌర్య సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తున్నా. బిగ్‌బాస్‌లోకి అవకాశం వస్తే వెళ్తాను. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నా డ్రీమ్ ఒక్కటే.. వైష్ణవి అంటే ట్రెడిషనల్.. ట్రెడిషనల్ అంటే వైష్ణవి. ఆ పేరు రావాలి" అని చెప్పుకొచ్చింది. -
షన్ను, వైష్ణవిలతో గరం ముచ్చట్లు
-
షార్ట్ అండ్ స్వీట్.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’
తెలుగు తెరపై కొన్ని ఆణిముత్యాలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి.. ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి.. కొంతకాలంగా సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. ప్రతి ఒక్కరి టాలెంట్‌కు యూట్యూబ్ ప్లాట్‌ఫాం ఇస్తుంది. ఇదే యూట్యూబ్ వేదికగా ఇటీవల విడుదలైన షార్ట్‌ఫిలిం ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌ని 80.6 మిలియన్స్ (8కోట్ల మంది) వీక్షించారు. అందరి మన్ననలు సొంతం చేసుకుని సౌత్‌లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సోషల్ మీడియాలో ట్రెండ్ ఇప్పటి వరకు ఈ పది ఎపిసోడ్స్‌ని 86 మిలియన్స్ ప్రజలు వీక్షించారు. 1.50 మిలియన్ మంది ఛానల్‌ను సబ్‌స్రై్కబ్ చేసుకున్నారు. అక్టోబర్ నెలలోనే 1.04 మిలియన్స్ సబ్‌స్రైబ్ చేసుకోవడంతో యూట్యూబ్‌లో సౌత్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. వెబ్ సిరీస్ సూపర్‌హిట్ ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థ నిర్మించిన ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ సిరీస్‌ను వీక్షిస్తున్నారు. ఈ సిరీస్‌లో జీవితాంతం గుర్తుండిపోయే క్యారెక్టర్ షన్నూ. లీడ్‌రోల్ చేసిన షన్నూ(షన్మఖ్ జశ్వంత్) తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకుల్ని సైతం మెప్పించాడు. – షన్నూ(షన్ముఖ్ జశ్వంత్) ఆసక్తికరమైన క్యారెక్టర్లు ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరో రెండు ఆసక్తికరమైన క్యారెక్టర్లను పరిచయం చేశాడు దర్శకుడు సుబ్బు.కె. మేనేజర్‌గా ఉన్న అరవింద్(జయచంద్ర) తన కంపెనీలో చేసే ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చుతూ టైంకి పని చేపించుకుంటాడు. పిజ్జా, బర్గర్లు లాంటివి ఆర్డర్ చేస్తూ.. మా మేనేజర్ భలే మంచోడనే ట్యాగ్‌లైన్‌ని సొంతం చేసుకున్నాడు. –మేనేజర్ అరవింద్(జయచంద్ర), హెచ్ఆర్ శృతి(శ్రీవిద్య) లుక్స్‌తో ఫ్లాట్ చేసిన చైతన్య ఫీమేల్ లీడ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఈ వెబ్‌సిరీస్‌లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చేసిన మాదిరిగా చేయడం తనకు తానే సాటిగా మలుచుకుంది. తన లుక్స్, హావభావాలతో నెట్టింట్లోని ప్రతి అబ్బాయిని ఫ్లాట్ చేసింది. క్యూట్ లుక్స్, స్వీట్ వాయిస్‌తో షన్నూ మాట్లాడుతుంటే.. మొబైల్స్‌లో అది చూస్తున్న ప్రేక్షకుడు గాల్లో తేలిపోయారు. –వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైప్ కోసం చేశా.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ అనేది నా మైండ్‌లో లేదు. సీజన్ టూ అని స్క్రిప్ట్ రాసుకున్నాను. సీజన్ టూ చేద్దాం అనుకునే సమయంలో సీజన్ వన్ చేయాలి కదా అన్నారు. సో, సీజన్ వన్‌కి ఏదైనా హైప్ తెస్తేనే.. సీజన్ టూకు క్రేజ్ వస్తుందనే ఐడియా వచి్చంది. అందుకే 10 ఎపిసోడ్స్‌తో ఉన్న ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ని చేశా. నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. – సుబ్బు.కె. డైరెక్టర్ ట్రెండింగ్ అవుతున్నాం.. మేం నమ్మి అవకాశం ఇచి్చనందుకు డైరెక్టర్ కె.సుబ్బు బాగా తీశారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్ చూస్తుంటే భలే ఆనందమేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మా సిరీస్‌నే ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్స్‌కి 100శాతం న్యాయం చేశారు. ఇదే స్ఫూర్తి, ఆనందంతో సీజన్ టూని ఇంతకన్నా క్వాలిటీగా, ప్రతి ప్రేక్షకుడూ మర్చిపోలేని విధంగా నిర్మించి తీరుతా. –వందనా బండారు, ప్రొడ్యూసర్, ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ -
మిట్రాన్ యాప్ రేటింగ్ అందుకే పెరిగింది!
న్యూఢిల్లీ: మిట్రాన్ యాప్‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా మిట్రాన్ యాప్‌ను భారత్ తయారు చేసిందని, దానిని ఐఐటీ విద్యార్థిచే తయారు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదని తేలింది. మిట్రాన్ యాప్ వాస్తవానికి పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టిక్ యాప్ రీప్యాకేజీ వెర్షన్ అని వెల్లడైంది. దీని తామే తయారు చేసినట్టు పాకిస్తాన్‌కు చెందిన క్యూబాక్సస్ అనే సాఫ్ట్వేర్ సంస్థ వెల్లడించింది. ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి సోర్స్ కోడ్ తమ సంస్థకు చెందినదని క్యూబాక్సస్ వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్ షేక్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘మా సంస్థ యాప్ సోర్స్ కోడ్‌ను మిట్రాన్ ప్రమోటర్‌కు 34 డాలర్లు(రూ. 2600) లకు విక్రయించాం. మిట్రాన్ డెవలపర్ మా సంస్థ సోర్స్ కోడ్ ద్వారా మిట్రాన్ యాప్‌ను తయారు చేసి కేవలం లోగో మార్చి వారి స్టోర్‌లో అప్లోడ్ చేసుకున్నారు. అయితే ఇదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు మా కోడ్‌ను డబ్బులతో కోనుగోలు చేసి దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మా సంస్థ సోర్స్ కోడ్‌తో తయారు చేసిన మిట్రాన్ యాప్‌ను భారతీయ యాప్‌గా పేర్కొనడమే అభ్యంతకరం. ఎందుకంటే వారు ఆ కోడింగ్‌లో ఎటువంటి మార్పులు చేయలేద’ని ఆయన స్పష్టం చేశారు. (ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ) ఇక డేటా హోస్టింగ్ ప్రక్రియ గురించి ఆయనను అడగ్గా.. ‘క్యూబాక్సస్ సర్వర్‌లో యూజర్ డేటాను పొందే అవకాశాన్ని మా సంస్థ కల్పిస్తుంది. కానీ మిట్రాన్ అలా చేయలేదు. బదులుగా యూజర్ డేటాను వారి స్వంత సర్వర్‌లో పొందేలా యాక్సెస్ ఇచ్చింది. ఇప్పటికీ మిట్రాన్ యూజర్ డేటాపై స్పష్టత లేద’ని ఆయన పేర్కొన్నారు. కాగా యాప్‌కు సంబంధించిన కోడ్‌ను కోనుగోలు చేయడం, వేరే పేరుతో దానిని ఉపయోగించడం అనేది చట్ట విరుద్దమేమి కాదు. క్యూబాక్సస్ కూడా గతంలో ఎన్నో ఇతర ఆప్ కోడ్లను క్లోన్లుగా పనిచేసే బహుళ యాప్‌లను తయారు చేసింది. అంతేగాక ఇన్స్టాగ్రామ్ సోర్స్ ఆధారంగా (హష్గామ్), ఫుండీస్ సింగిల్ రెస్టారెంట్ ఆధారంగా (ఆస్కింగ్ టూ జోమాటో), అచ్చం టిక్‌టాక్ మాదిరిగానే (టిక్‌టిక్) యాప్‌లను తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మిట్రాన్ యాప్ కోడ్‌లో తమ సోర్స్ కోడ్‌ను కనీసం ఒక బిట్ కూడా మార్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా మోసపూరితమైనదిగా క్యూబాక్సస్ పేర్కొంది. (ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్) మిట్రాన్ యాప్‌లో పటిష్టమైన గోప్యతా విధానం కూడా లేదని నిపుణులు అంటున్నారు. వినియోగదారులు సైన్ అప్ చేసి ఇందులో వీడియోలు అప్లోడ్ చేయొచ్చు. వారి డేటాతో ఏమి జరుగుతుందో తెలియదు వినియోగదారులకు తెలిసే అవకాశం లేదు. మిట్రాన్ యాప్ భారత్‌కు చెందినది అన్న భావనతోనే ప్లే స్టోర్‌లో అధిక రేటింగ్ వచ్చిందని భావిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన డెవలపర్ నుంచి కొనుగోలు చేశారని తెలిస్తే రేటింగ్ పడిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కువగా వాడే 'మిత్రోం' పదానికి దగ్గరా ఉండడంతో ఈ యాప్ ఆయనకు చెందినదని చాలా మంది అనుకున్నారు. ఇది కూడా మిట్రాన్ యాప్ రేటింగ్ పెరగడానికి ఒక కారణమని అంచనా. (దూసుకెళ్తున్న టిక్‌టాక్ మాతృసంస్థ) -
కోడింగ్ పిడుగు జునైరా ఖాన్ గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లకే ప్రోగ్రామ్‌లు, కోడింగ్‌లు చేస్తూ అసాధారణ ప్రతిభాపాటవాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన జునైరా ఖాన్ గుర్తుందా. ఇపుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌కి చెందిన జునైరాఖాన్ (12) ఇపుడు తన ఖాతాదారుల కోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ వర్ధమాన వ్యాపారవేత్తగా ప్రశంసలందుకుంటోంది. జెడ్ఎం ఇన్ఫోకామ్ అనే సొంత వెబ్సైట్ ద్వారా బీటెక్ విద్యార్థులకు శిక్షణనిస్తున్న జునైరా ఖాన్ తాజాగా మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టారు. టీం మేనేజ్మెంట్ కోసం కొత్త అప్లికేషన్‌ను సృష్టించానని అతి త్వరలోనే దీన్ని లాంచ్ చేయబోతున్ననని ప్రకటించారు. ఈ యాప్ ద్వారా సంస్థలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపబోతున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికే అనేక కంపెనీలకు బిజినెస్ యాప్‌లను రూపొందించిన జునైరా ఖాన్ సొంతంగా ఒక సంస్థను నడుపుతూ వుండటం విశేషం. ఇప్పటివరకు నేను నాలుగైదు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పీహెచ్‌పీ, జావాస్క్రిప్ట్‌లపై పనిచేస్తాను. ఇప్పటికే అనేక మొబైల్ యాప్‌లు, బిజినెస్ యాప్‌లు తయారు చేశాను. ప్రస్తుతం, ఒక ఎన్జీవో కోసం పని చేస్తున్నానని ఖాన్ చెప్పారు. అలాగే చిన్న వయసులోనే తాను కోడింగ్ నేర్చుకుంటానని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందనీ, ఒక తల్లిగా ఆమెకు నేర్పడం తన బాధ్యతగా భావించానని జునైరాఖాన్ తల్లి నిషాద్ ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జునైరా తల్లి నిషాత్ఖాన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ డెవలపింగ్, ఆండ్రాయిడ్ ఆప్ తరగతులు చెప్తుండేవారు. అయితే అప్పటికే నాల్గవ తరగతి చదువుతున్న జునైరాఖాన్ తనకు కూడా కోడింగ్ నేర్పాలని పట్టుబట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన నిషాత్ కూతురి ఆసక్తిని ప్రోత్సహించారు. వెబ్ డెవలపింగ్, కోడింగ్‌ను నేర్పించారు. అంతే..ఇక వెనుదిరిగి చూడలేదు. దిన దిన ప్రవర్థమానం చెంది చిన్న వయసులోనే ఢిల్లీ పబ్లిక్ స్కూలు చేత డిజిటల్ అంబాసిడర్ అవార్డును గెల్చుకుంది. తన పేరుతోనే జునైరా వెబ్ సొల్యూషన్స్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి తన అసాధారణ ప్రతిభతో దూసుకుపోతోంది. మరోవైపు జునైరా దగ్గర శిక్షణ పొందుతున్న మహమ్మద్ అర్బాజ్ అలం స్పందిస్తూ ఆమెదగ్గర శిక్షణ పొందం నిజంగా తనకు ఎంతో సంతోషంగా ఉందనీ, తన కరీర్ అభివృద్దిలో ఇది మరింత సాయపడుతుందని నమ్ముతున్నానన్నారు. -
ఫ్రెషర్స్ వేతన ప్యాకేజీపై సర్వే ఏం చెప్పిందంటే.....
కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి(ఫ్రెషర్స్) వేతన ప్యాకేజీ గతేడాది కంటే 2016లో భారీగా పెరిగిందట. వార్షిక వేతనం కింద ఆరు లక్షల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీనే చాలా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని, ఈ వృద్ధి 85 శాతం ఉందని తాజా సర్వేలు తేల్చాయి. ఉద్యోగ అంచనా సంస్థ యాస్పైరింగ్ మైండ్స్, ఫ్రెషర్ జాబ్స్ పోర్టల్ మ్యామ్క్యాట్.కామ్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉద్యోగులకు(0 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్న) ఆఫర్ చేసే వేతనాలు వార్షికంగా రూ.1-30 లక్షల మధ్యలో ఉంటాయని, వాటిలో చాలా వేతనాలు వార్షికంగా రూ.2-3 లక్షల రేంజ్‌లోనే ఉంటాయని సర్వే పేర్కొంది. అయితే వేతన ప్యాకేజీ రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఆఫర్ చేసే ఉద్యోగాలు 2015 నుంచి 85 శాతం పెరిగాయని తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6వేల ఉద్యోగాల్లో పోస్ట్ అయిన 40 లక్షల జాబ్ అప్లికేషన్లపై ఈ సర్వే నిర్వహించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్ రోల్ సాప్ట్వేర్ అప్లికేషన్స్ అని, దీనికి సుమారు 38 శాతం జాబ్ అప్లికేషన్లు నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. ఫ్రెషర్స్‌లో రెండో టాప్ జాబ్ మార్కెటింగ్, సేల్స్ అని వెల్లడైంది. మార్కెటింగ్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా పాపులర్ జాబ్‌గా ఉందని తెలిసింది. డేటా అనాలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్లకు యేటికేటికి 30 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందట. టెక్నికల్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో డిజిటల్ మార్కెటింగ్‌లు అత్యంత ప్రాముఖ్యమైన జాబ్ కేటగిరీల్లో అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయని యాస్పైరింగ్ మైండ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హిమాన్షు అగర్వాల్ చెప్పారు. -
భయంతో గుండె వేగం పెరుగుతోంది
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తుంటాను. మా బాస్ పిలిస్తే చాలు నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా, అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. అప్పటివరకూ మాత్రం టెన్షన్, హైరానా పడతాను. ఆ టైమ్‌లో అరచేతుల్లో, అరికాళ్లలో చెమటలు పడతాయి. కడుపులో అదోరకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. నాకేమైనా గుండెజబ్బు ఉందా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.- రోహిత్, హైదరాబాద్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు. కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్యపరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చక్కని పరిష్కారం హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సురేంద్రకుమార్, వరంగల్ మానసికమైన ఒత్తిడి, వ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అయితే వీటివలన కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్ల్లో కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండువైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ అంత ఆందోళన అవసరం లేదు! ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, కోదాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్