భయంతో గుండె వేగం పెరుగుతోంది
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తుంటాను. మా బాస్ పిలిస్తే చాలు నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా, అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. అప్పటివరకూ మాత్రం టెన్షన్, హైరానా పడతాను. ఆ టైమ్‌లో అరచేతుల్లో, అరికాళ్లలో చెమటలు పడతాయి. కడుపులో అదోరకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. నాకేమైనా గుండెజబ్బు ఉందా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.- రోహిత్, హైదరాబాద్
మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు. కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్యపరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్‌ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ కె.ప్రమోద్ కుమార్
సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చక్కని పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సురేంద్రకుమార్, వరంగల్
మానసికమైన ఒత్తిడి, వ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అయితే వీటివలన కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్ల్లో కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు.
లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండువైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.
ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్
డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్
అంత ఆందోళన అవసరం లేదు!
ఈఎన్‌టీ కౌన్సెలింగ్
నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, కోదాడ
మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్