మంత్రి ఎదుట వైద్య విద్యార్థి తండ్రి, టీడీపీ కార్యకర్త ఆవేదన
గుంటూరు మెడికల్ : పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, దీని ద్వారా వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పీజీ వైద్య విద్యార్థిని తండ్రి, గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఎదుట ఆయన ఈ విధంగా మొరపెట్టుకున్నారు.
మొదటి కౌన్సెలింగ్ సమయంలో ఒక ఆర్డర్, రెండో కౌన్సెలింగ్ సమయంలో మరో ఆర్డర్ ఇచ్చారని, ఇప్పుడు మూడో కౌన్సెలింగ్‌కు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆలిండియా కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, అది ప్రారంభమయ్యాకే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఫ్రీ ఎగ్జిట్‌కు శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకు అవకాశం ఇచ్చారని, సోమవారం క్లోజ్ చేయడం వల్ల ఆలిండియా కోటాలో ఏపీ వైద్య విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
మేనేజ్‌మెంట్ పీజీ కోటా వారికి మేలు జరిగేలా హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించారు. మొదటి కౌన్సెలింగ్ అయ్యాక, కోర్టు తీర్పు వల్ల జీవో 56ను కొట్టేశారని, దీని ద్వారా వైద్య విద్యార్థుల ఫీజులు పెరిగాయన్నారు. కోర్టు తీర్పు కారణంగా పీజీ వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.
కోర్టు తీర్పు వల్ల గందరగోళం
అనంతరం పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియపై మీడియా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించగా.. కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. అన్ని ఆలోచించి విద్యార్థులకు ఏది లాభమో అదే చేస్తామని తెలిపారు. స్పెషలిస్టులు 75 శాతం, ఇతర వైద్యులు, వైద్య సిబ్బందిలో 80 శాతం కొరత ఉందని, ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment