Raghubabu
-
తెలీదు!
నివాస్, అమిత శ్రీ జంటగా వినోద్ కుమార్, రఘుబాబు, పృథ్వీ, భరద్వాజ్, ఖయ్యూం కీలక ΄పాత్రల్లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ సినిమా గురువారం ఆరంభమైంది. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ నెల 18న రెగ్యులర్ షూట్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘మా సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది’’ అని శరత్‌బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్ .ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్. -
సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారును ఒక బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందినట్లు తెలుస్తోంది. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రఘుబాబుది తప్పులేదని వీడియోలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి అసలు విషయాలు వెళ్లడించనున్నారు. నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం అని తెలుస్తోంది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఏపీలో పాలన ఎక్స్ట్రార్డినరీ... అంతే!
తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... అనూహ్యమైన పాలన ఇది.. నిజంగా జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను. మా సొంత ఊళ్లో... ఎంత మార్పో ! మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు. మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను. –సత్యార్థ్ -
బ్రహ్మానందం, రఘుబాబు మరియు సప్తగిరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
-
బియాండ్ ది బోర్డర్ బాగుంది: సినీ నటుడు రఘుబాబు
సాక్షి, ఒంగోలు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా బియాండ్ ది బోర్డర్‌కు ఆరు ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా నుంచి 2, బెంగళూరు నుంచి 3, హైదరాబాద్ నుంచి ఒకటి చొప్పున వచ్చాయి. మొత్తంగా 153 ఫిర్యాదులు రాగా వాటిలో నేరుగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారు 125, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారు 22, బియాండ్ది బోర్డర్ ఆరు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఎస్బీ–2 సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్ ఎస్ఐ, కోఆర్డినేషన్ ఎస్ఐలు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి సినీ నటుడు రఘుబాబు ఎస్పీతో మాట్లాడుతూ స్కాచ్ అవార్డు, జిఫైల్స్ అవార్డులు అందుకున్నందుకు ముందుగా జిల్లా ఎస్పీకి కృతతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం బాగుందని, ప్రజలు కూడా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారన్నారు. బియాండ్ది బోర్డర్ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడుతుందని రఘుబాబు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి చంద్రబాబు అనే ఫిర్యాది మాట్లాడుతూ తన సొంత ఊరు కొత్తపట్నం అని, తను 2019 నవంబరు 20న కొత్తపట్నం నుంచి ఒంగోలులోని గోరంట్ల సినిమాహాల్కు వచ్చానన్నారు. అయితే మార్గంమధ్యలో రూ.80 వేల విలువైన తన బ్రేస్లెట్ కనిపించలేదని, సీసీ పుటేజి చూడగా ఒక వ్యక్తి ఆ బ్రేస్లెట్ తీసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. దయచేసి రికవరీ చేయించాలని కోరగా టూటౌన్ సీఐ రాజేష్‌కు దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ అప్పగించారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ నుంచి షేక్ షర్విజ్ మాట్లాడుతూ తన సొంత ఊరు చీరాల అని, చీరాలకు చెందిన గోలి గంగాధరరావు, అతని కుటుంబ సభ్యులు తమకు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించుకున్నారని, తన తల్లి మరణానికి కూడా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా చీరాల ఒన్‌టౌన్ సీఐని సత్వరమే విచారించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. బెంగళూరు నుంచి వంశీకృష్ణ మాట్లాడుతూ తన సొంత ఊరు రాచర్ల అని, అక్కడ తన పూర్వీకుల ఆస్తి ఉందన్నారు. అందులో తాను ఇల్లు కట్టుకోగా తన ఇంటి పక్కన ఉండే దూదేకుల ఖాశిం అనే అతను, అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి కాంపౌండ్ ముందు గేదెలు, ట్రాక్టర్లు ఉంచి తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తక్షణమే విచారించి తగు చర్యలు చేపట్టాలని రాచర్ల ఎస్ఐని ఎస్పీ ఆదేశించారు. -
అక్కినేని అన్నపూర్ణమ్మ
అమ్మ పాత్రలనగానే గుర్తొచ్చే నటీమణుల్లో అన్నపూర్ణమ్మ ఒకరు. క్యారెక్టర్ నటిగా పలు పాత్రలు చేసిన ఆమె ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఇప్పటివరకూ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన అన్నపూర్ణమ్మ ఇందులో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.ఎన్.ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరిలో ఎవరికి ఏం జరిగినా రచ్చబండ దగ్గర పంచాయితీ చేస్తారు. ఈ రచ్చబండకు అక్కినేని అన్నపూర్ణమ్మ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. హీరోయిన్గా అర్చన నటిస్తుండగా, జీవ, రఘుబాబు, కారుమంచి రఘు, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
వర్సిటీ ప్రగతే లక్ష్యం
ఎచ్చెర్ల క్యాంపస్:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్ విభాగం కెమిస్ట్రీ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు బాధ్యతలు స్వీకరించారు. పాలక మండలిలో చర్చించి మార్చి 27న నిర్ణయం తీసుకోగా, వర్సిటీకి ఈ నెల ఒకటో తేదీన జాయినింగ్ రిపోర్టు అందజేశారు. మంగళవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. 1994లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఈయన 2013–14లో ఏడాది పాటు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పని చేశారు. తాజాగా బీఆర్ఏయూలో కూడా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వర్సిటీ ప్రగతికి పాటుపడతానన్నారు. వీసీతో కలిసి పని చేసి బీఆర్ఏయూకి గుర్తింపు తీసుకొస్తానని చెప్పారు. ♦ రిజిస్ట్రార్‌గా లక్ష్యాలు ఏమిటీ? ♦ విశ్వవిద్యాలయం ప్రగతి సాధించాలంటే విద్య బలోపేతం, మౌలిక వసతులు కీలకం. ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇస్తాను. ♦ కొత్తగా ఏర్పడిన వర్సిటీ కావడంతో నిధుల కొరత ఉంది. ఎలా అధిగమిస్తారు? ♦ ప్రారంభంలో ఉన్న ప్రతి వర్సిటీలో నిధుల కొరత ప్రధానంగా ఉంటుంది. నన్నయ్య యూనివర్సిటీ అద్దెభవనాల్లో కొనసాగేది. ప్రస్తుతం విశ్వవిద్యాలయం రూపం సంతరించుకుంది. ఇందుకోసం ఎంతో శ్రమించా. ఇక్కడ కూడా శ్రమిస్తా. ♦ వర్సిటీలో ప్రధానంగా ఉన్న సమస్యలు గుర్తించారా? ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ప్రధాన సమస్యలు రెగ్యులర్ బోధకులు లేక పోవటం, మౌలిక వసతులు ప్రధానమైనవి. వీసీ రామ్‌జీ సైతం ఈ అంశాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 5 ప్రాఫెసర్, 8 అసోసియేట్ ప్రొఫెసర్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తే చాలా వరకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం నిర్మాణాలకు పాలక మండలి తీర్మానం చేసింది. రూ. 51 కోట్ల క్యాపిటల్, బడ్జెట్ నిధులు, అంతర్గత నిధులు ఉన్నాయి. ప్రణాళికా బద్ధంగా వెళితే వర్సిటీ ప్రగతి సాధ్యం. ♦ వన్సిటీలో కోర్సుల నిర్వహణ ఎలా ఉంది? ♦ ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలకు ప్రభుత్వ అనుమతి లభించింది. సెల్ప్‌ఫైనాన్స్ మోడ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు ప్రారంభిస్తున్నాం. వీసీ, నేను ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లం. తప్ప కుండా ఇంజినీరింగ్ కళాశాలను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. సైన్స్, అర్ట్సు, ఇంజినీరింగ్ ఇలా కళాశాలగా విభజించి బలోపేతం చేస్తున్నాం. వసతి గృహం, తరగతి గదుల కొరత వంటి అంశాలు అధిగమిస్తే భవిష్యత్తులో మరిన్ని కొత్త, సైన్స్ కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది. ♦ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ర్యాంకింగ్లపై మీ అభిప్రాయం? ♦ సమానంగా నిధులు, వసతులు, బోధన సిబ్బందిని నియమించిన తరువాతే ర్యాంకింగ్‌లు ఇవ్వాలి. వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన వర్సిటీలతో కనీస నిధులు, వసతల్లేని వర్సిటీలు పోటీ పడటం సాధ్యం కాదు. అయితే విద్యకు ప్రాధాన్యత పెరగాలి. భవిష్యత్‌లో విద్యకు తప్పకుండా ప్రభుత్వాలు కేటాయింపులు పెంచుతాయి. ♦ గ్రామీణ ప్రాంత వర్సిటీ ప్రగతి పథంలో నడవాలంటే? ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో పయనించాలంటే ఇక్కడి అవసరాలు గుర్తించాలి. విశ్వవిద్యాయంలో పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలను వర్సిటీలో భాగస్వామ్యం చేయాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే వర్సిటీ ప్రగతి సాధ్యం. ♦ అధికారులు స్థానికంగా ఉండాల్సిన అవసరం ఉందా? ♦ విశాఖపట్నం నుంచి రాక పోకలు సాగించటం వల్ల ఇక్కడ పూర్తిస్థాయిలో పనిచేయటం కష్టం కావచ్చు. అందుకే నేను స్థానికంగా ఉంటా. వీసీతో కలిసి పూర్తి సమయం వర్సిటీ కోసం పనిచేస్తా. వర్సిటీకి గుర్తింపు తీసుకువస్తా. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తా. ♦ అకకొర క్లాస్ వర్కుపై మీ అభిప్రాయం? ♦ అరకొర క్లాస్ వర్కు వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతాయి. అందుకే విద్యార్థులకు, బోధన సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హజరు తప్పని సరిగా ఉన్నత విద్యా మండలి చేస్తుంది. విద్యార్థులు తరగతులకు రాకుండా తీసుకున్న డిగ్రీ వల్ల ప్రయోజనం ఉండదు. విష య పరిజ్ఞానం లేని డిగ్రీలతో న్యాయం జరగదు. -
అంబేడ్కర్ వర్సిటీకి కొత్త రిజిస్ట్రార్
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కొత్త రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన బీఆర్‌ఏయూ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ తులసీరావు పదవీకాల ఏప్రిల్ ఒకటితో ముగియనుంది. ఈయన రెండేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. టెర్మ్ పెంచుకునే అవకాశమున్నా... వైస్ చాన్సలర్ సిఫారసుతో పాటు పాలక మండలి, ఉన్నత విద్యా మండలి అనుమతితో ఏటా పదవీ కాలన్నీ పెంచుకునే సౌలభ్యం ఉంది. 1991 విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏటా రెన్యువల్ చేస్తూ ఆరేళ్ల వరకు కొనసాగించవచ్చు. ఇదే వర్సిటీలో ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ఆరేళ్లు దాటి పనిచేశారు. టెర్మ్‌లు పెంచడం, అన్టిల్ ఫర్దర్ ఆర్డర్ (తాత్కాలిక ఉత్తర్వులు)తో సుదీర్ఘంగా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. 2009 సెప్టెంబర్ 16 నుంచి 2016 మార్చి 31 వరకు ఆయన కొనసాగారు. 2016 మార్చి 31న తులసీరావు నియమించగా ఏప్రిల్1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వర్సిటీలో ముగ్గురు రెగ్యులర్ రిజిస్ట్రార్లు పనిచేశారు. నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్(హెచ్ఓడీ) కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. వర్సిటీలో మొదటి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జి.జ్ఞానమణి 2008 ఆగస్టు 25 నుంచి 2009 ఆగస్టు 25 వరకు కొనసాగారు. వీసీ ఎస్వీ సుధాకర్‌తో పొసగకపోవటంతో ఏడాదికే పరిమితం చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అనంతరం 2009 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ బిడ్డిక అడ్డయ్య కొనసాగారు. 2017 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించిన వీసీ కూన రామ్‌జీ రిజిస్ట్రార్ మార్పునకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పాలక మండలి సభ్యులు విభేదించడంతో టెర్మ్ కోసం ఎదురు చూశారు. మరోవైపు వీసీ ప్యానల్లో రామ్‌జీ, తులసీరావు పేర్లు చివరి వరకు కొనసాగాయి. తులసీరావు స్థానిక ప్రొఫెసర్. రామ్‌జీ కంటే సీనియర్. మరోవైపు జిల్లా నుంచి రిజిస్ట్రార్‌గా పనిచేసింది ప్రొఫెసర్ తులసీరావు ఒక్కరే కావడం గమనార్హం. మిగిలిన వారంతా ఏయూకు చెందిన వారే. ఏయూ వీసీగా నాగేశ్వరరావు కొనసాగి న సమయంలో రిజిస్ట్రార్‌గా తులసీరావు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత వీసీ తనకు అనుకూలమైన పాలనా సౌలభ్యం కోసం పలు మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 1న బాధ్యతల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నాలుగో రెగ్యులర్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన వీసీ రామ్‌జీకి సన్నిహితుడు. మరోవైపు స్థానిక ప్రొఫెసర్లు సైతం రిజిస్ట్రార్ పదవిని ఆశించినా వీసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇద్దరూ ఏయూ వారే... అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజే ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యులు కాగా, రఘుబాబు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆచార్యులు. వీరిద్దరికీ శ్రీకాకుళంతో అనుబంధం కలిగి ఉండటం విశేషం. వర్సిటీలో పలు కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. రఘుబాబు గతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఏడాదికాలం పనిచేశారు. తాజాగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఘనత రఘుబాబుకు దక్కుతుంది. ఈయన ప్రస్తుతం ఏయూ గెస్ట్‌హౌస్‌ల డీన్‌గా వ్యవహరిస్తున్నారు. రూ. 91 కోట్లతో బడ్జెట్ ఆమోదం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో రూ.91 కోట్లతో బడ్జెట్ ఆమోదించారు. ప్రధానంగా వర్సిటీ బడ్జెట్, రిజస్ట్రార్ మార్పుపైనే సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్యానాథ్, ఉన్నత విద్యా మండలి అధికారులు, వర్శిటీ అధికారులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, కె.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి నిర్ణయాలివే.. ♦ వర్సిటీకి రూ. 91.70 కోట్లు నిధులు కేటాయించాలని తీర్మానం. ♦ రూ.60 కోట్లు పనులను కేంద్ర ప్రజా పనుల ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించాలని నిర్ణయం. ♦ రిజిస్ట్రార్‌గా ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు నియామకం. ♦ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావును ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల బాధ్యతలు అప్పగింత. ♦ అకడిమిక్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నియామకం. ♦ డాక్టర్ యు.కావ్యజ్యోత్స్నకు మహిళా వసతి గృహం చీఫ్ వార్డెన్, రీ వేల్యుయేషన్ డీన్‌గా బాధ్యతలు అప్పగింత. ♦ డాక్టర్ కె.స్వప్నవాహినికి బయోటెక్నాలజీ హెచ్ఓడీగా, పేపర్ సెట్టింగ్స్ డీన్‌గా, పీజీ ప్రవేశాల సెట్ సహాయ కన్వీనర్లగా నియామకం. ♦ కామర్స్ విభాగం బలోపేతానికి రూ.13 లక్షల కేటాయింపు. ♦ నిపుణులు, ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలని తీర్మానం. -
'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు'
నిడదవోలు : సినిమాల్లో కామెడీ పండించడం ఓ వరమని హాస్యనటుడు రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు నిడదవోలు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ '1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు...జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు. ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంలో నాన్న ఎంతో గర్వపడుతున్నారు. ఇప్పటివరకూ 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ, కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరం బుల్లోడు, మోహన్ బాబు తనయులతో పాండువులు పాండవులు తుమ్మెద, చార్మీ హీరోయిన్ గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ బాబు ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను. హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు. సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు సాప్ట్వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ.' అని మనసులోని మాటను చెప్పారు.