ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మాట్లాడుతున్న సినీ నటుడు రఘుబాబు
సాక్షి, ఒంగోలు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా బియాండ్ ది బోర్డర్‌కు ఆరు ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా నుంచి 2, బెంగళూరు నుంచి 3, హైదరాబాద్ నుంచి ఒకటి చొప్పున వచ్చాయి. మొత్తంగా 153 ఫిర్యాదులు రాగా వాటిలో నేరుగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారు 125, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారు 22, బియాండ్‌ది బోర్డర్ ఆరు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఎస్‌బీ–2 సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్ ఎస్‌ఐ, కోఆర్డినేషన్ ఎస్‌ఐలు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
- హైదరాబాద్ నుంచి సినీ నటుడు రఘుబాబు ఎస్పీతో మాట్లాడుతూ స్కాచ్ అవార్డు, జిఫైల్స్ అవార్డులు అందుకున్నందుకు ముందుగా జిల్లా ఎస్పీకి కృతతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం బాగుందని, ప్రజలు కూడా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారన్నారు. బియాండ్‌ది బోర్డర్ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడుతుందని రఘుబాబు పేర్కొన్నారు.
- బెంగళూరు నుంచి చంద్రబాబు అనే ఫిర్యాది మాట్లాడుతూ తన సొంత ఊరు కొత్తపట్నం అని, తను 2019 నవంబరు 20న కొత్తపట్నం నుంచి ఒంగోలులోని గోరంట్ల సినిమాహాల్‌కు వచ్చానన్నారు. అయితే మార్గంమధ్యలో రూ.80 వేల విలువైన తన బ్రేస్‌లెట్ కనిపించలేదని, సీసీ పుటేజి చూడగా ఒక వ్యక్తి ఆ బ్రేస్‌లెట్ తీసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. దయచేసి రికవరీ చేయించాలని కోరగా టూటౌన్ సీఐ రాజేష్‌కు దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ అప్పగించారు.
- అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ నుంచి షేక్ షర్విజ్ మాట్లాడుతూ తన సొంత ఊరు చీరాల అని, చీరాలకు చెందిన గోలి గంగాధరరావు, అతని కుటుంబ సభ్యులు తమకు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించుకున్నారని, తన తల్లి మరణానికి కూడా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా చీరాల ఒన్‌టౌన్ సీఐని సత్వరమే విచారించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు.
- బెంగళూరు నుంచి వంశీకృష్ణ మాట్లాడుతూ తన సొంత ఊరు రాచర్ల అని, అక్కడ తన పూర్వీకుల ఆస్తి ఉందన్నారు. అందులో తాను ఇల్లు కట్టుకోగా తన ఇంటి పక్కన ఉండే దూదేకుల ఖాశిం అనే అతను, అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి కాంపౌండ్ ముందు గేదెలు, ట్రాక్టర్లు ఉంచి తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తక్షణమే విచారించి తగు చర్యలు చేపట్టాలని రాచర్ల ఎస్‌ఐని ఎస్పీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment