వర్సిటీ ప్రగతే లక్ష్యం | BRU New Registar Raghubabu Special Interview | Sakshi
Sakshi News home page

వర్సిటీ ప్రగతే లక్ష్యం

Published Wed, Apr 4 2018 1:41 PM | Last Updated on Wed, Apr 4 2018 1:41 PM

BRU New Registar Raghubabu Special Interview - Sakshi

రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కొరుపోలు రఘుబాబు

ఎచ్చెర్ల క్యాంపస్‌:డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్‌ విభాగం కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కొరుపోలు రఘుబాబు బాధ్యతలు స్వీకరించారు. పాలక మండలిలో చర్చించి మార్చి 27న నిర్ణయం తీసుకోగా, వర్సిటీకి ఈ నెల ఒకటో తేదీన జాయినింగ్‌ రిపోర్టు అందజేశారు. మంగళవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. 1994లో కెమిస్ట్రీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన ఈయన 2013–14లో ఏడాది పాటు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పని చేశారు. తాజాగా బీఆర్‌ఏయూలో కూడా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వర్సిటీ ప్రగతికి పాటుపడతానన్నారు. వీసీతో కలిసి పని చేసి బీఆర్‌ఏయూకి గుర్తింపు తీసుకొస్తానని చెప్పారు.

రిజిస్ట్రార్‌గా లక్ష్యాలు ఏమిటీ?
విశ్వవిద్యాలయం ప్రగతి సాధించాలంటే విద్య బలోపేతం, మౌలిక వసతులు కీలకం. ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇస్తాను.

కొత్తగా ఏర్పడిన వర్సిటీ కావడంతో నిధుల కొరత ఉంది. ఎలా అధిగమిస్తారు?
ప్రారంభంలో ఉన్న ప్రతి వర్సిటీలో నిధుల కొరత ప్రధానంగా ఉంటుంది. నన్నయ్య యూనివర్సిటీ అద్దెభవనాల్లో కొనసాగేది. ప్రస్తుతం విశ్వవిద్యాలయం రూపం సంతరించుకుంది. ఇందుకోసం ఎంతో శ్రమించా. ఇక్కడ కూడా శ్రమిస్తా.

వర్సిటీలో ప్రధానంగా ఉన్న సమస్యలు గుర్తించారా?
 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ప్రధాన సమస్యలు రెగ్యులర్‌ బోధకులు లేక పోవటం, మౌలిక వసతులు ప్రధానమైనవి. వీసీ రామ్‌జీ సైతం ఈ అంశాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన 5 ప్రాఫెసర్, 8 అసోసియేట్‌ ప్రొఫెసర్, 32 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తే చాలా వరకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం నిర్మాణాలకు పాలక మండలి తీర్మానం చేసింది. రూ. 51 కోట్ల క్యాపిటల్, బడ్జెట్‌ నిధులు, అంతర్గత నిధులు ఉన్నాయి. ప్రణాళికా బద్ధంగా వెళితే వర్సిటీ ప్రగతి సాధ్యం.

వన్సిటీలో కోర్సుల నిర్వహణ ఎలా ఉంది?
ఇప్పటికే ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రభుత్వ అనుమతి లభించింది. సెల్ప్‌ఫైనాన్స్‌ మోడ్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ బ్రాంచ్‌లు ప్రారంభిస్తున్నాం. వీసీ, నేను ఇంజినీరింగ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన వాళ్లం. తప్ప కుండా ఇంజినీరింగ్‌ కళాశాలను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. సైన్స్, అర్ట్సు, ఇంజినీరింగ్‌ ఇలా కళాశాలగా విభజించి బలోపేతం చేస్తున్నాం. వసతి గృహం, తరగతి గదుల కొరత వంటి అంశాలు అధిగమిస్తే భవిష్యత్తులో మరిన్ని కొత్త, సైన్స్‌ కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ర్యాంకింగ్‌లపై మీ అభిప్రాయం?
సమానంగా నిధులు, వసతులు, బోధన సిబ్బందిని నియమించిన తరువాతే ర్యాంకింగ్‌లు ఇవ్వాలి. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించిన వర్సిటీలతో కనీస నిధులు, వసతల్లేని వర్సిటీలు పోటీ పడటం సాధ్యం కాదు. అయితే విద్యకు ప్రాధాన్యత పెరగాలి. భవిష్యత్‌లో విద్యకు తప్పకుండా ప్రభుత్వాలు కేటాయింపులు పెంచుతాయి.

గ్రామీణ ప్రాంత వర్సిటీ ప్రగతి పథంలో నడవాలంటే?
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో పయనించాలంటే ఇక్కడి అవసరాలు గుర్తించాలి. విశ్వవిద్యాయంలో పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలను వర్సిటీలో భాగస్వామ్యం చేయాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే వర్సిటీ ప్రగతి సాధ్యం.

అధికారులు స్థానికంగా ఉండాల్సిన అవసరం ఉందా?
విశాఖపట్నం నుంచి రాక పోకలు సాగించటం వల్ల ఇక్కడ పూర్తిస్థాయిలో పనిచేయటం కష్టం కావచ్చు. అందుకే నేను స్థానికంగా ఉంటా. వీసీతో కలిసి పూర్తి సమయం వర్సిటీ కోసం పనిచేస్తా. వర్సిటీకి గుర్తింపు తీసుకువస్తా. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తా.

అకకొర క్లాస్‌ వర్కుపై మీ అభిప్రాయం?
అరకొర క్లాస్‌ వర్కు వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతాయి. అందుకే విద్యార్థులకు, బోధన సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌ హజరు తప్పని సరిగా ఉన్నత విద్యా మండలి చేస్తుంది. విద్యార్థులు తరగతులకు రాకుండా తీసుకున్న డిగ్రీ వల్ల ప్రయోజనం ఉండదు. విష య పరిజ్ఞానం లేని డిగ్రీలతో న్యాయం జరగదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement