![Agriculture department launches state wide farmer registry: Andhra Pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/KISAN-CARD1.jpg.webp?itok=tClnl51G)
రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి వ్యవసాయ శాఖ శ్రీకారం
మార్చి 25లోగా పూర్తి చేయాలని లక్ష్యం
దీని ఆధారంగానే సంక్షేమ పథకాలు వర్తింపు
సాక్షి, అమరావతి: రైతు (ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి రోజు 63 వేల మందికి విశిష్ట సంఖ్య (యూసీ) జారీ అయినట్లు సమాచారం. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికీ గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో యూనిక్‌కోడ్ (యూసీ)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు
రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనాకాగా, వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం 60 లక్షల మంది రైతులున్నట్టుగా గుర్తించారు. ఫిబ్రవరి 25వ తేదీలోగా 25 లక్షల మందికి, మార్చి 25వ తేదీలోగా మిగిలిన 35 లక్షల మందికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేయనున్నారు.
ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే..
ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్ లబ్దిదారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిందే. కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలు
రైతులు, అటవీ , దేవాదాయ భూ సాగుదారులు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రయోజనాలు ఎన్నో..
ప్రతీ రైతుకు జారీ చేసే యూనిట్ ఐడీకి ఆయా రైతులు సీజన్‌లో పొందే సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. ఇలా తయారైన ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్‌ఫామ్స్‌కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలురైతులతో పాటు ల్యాండ్ లెస్ లేబరర్స్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్ల ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ ఐడీని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్‌తో కూడిన ఆరి్ధక సేవలను పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
రిజిస్ట్రీ ఎలా...
రిజిస్ట్రీ కోసం ఏపీఎఫ్‌ఆర్‌అగ్రిస్టాక్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ) అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీన్ని వెబ్‌ల్యాండ్, గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్‌సైట్‌లతో అనుసంధానించారు. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌లోకి వెళ్లి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది.
రెండోసారి ఓటీపిని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత ఆ రైతుకు గ్రామంలో పొలం ఉన్నట్టయితే ఆటోమెటిక్‌గా ల్యాండ్ డిటైల్స్ డిస్‌ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్‌తో కూడిన మెస్సేజ్ రైతు మొబైల్‌కు వెళ్లడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment