ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం కొంత మందికి ఇష్టం లేనట్లుంది. అధిక ధరలతో రైతులు ఇబ్బంది పడాలని, ఎరువులు.. విత్తనాల కోసం అప్పులు చేసి, వడ్డీల మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేస్తూ.. రైతుల ముంగిటకే సేవలు అందేలా చేయడం నచ్చడం లేదనిపిస్తోంది. అందుకే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది బాధాకరం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పండించిన పంటలకు రైతులకు మంచి ధర అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచడం ద్వారా రైతులకు మంచి ధర లభించేలా చూడాలని స్పష్టం చేశారు. అగ్రి, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశాజనక పరిస్థితులు ఉన్నా, వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకుని.. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. రైతులకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పని తీరును దేశ వ్యాప్తంగా కొనియాడుతుంటే, కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు విత్తనాల నుంచి పంటల విక్రయం వరకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయని చెప్పారు.
నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. బయట మార్కెట్లో డీలర్ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకే లభిస్తున్నాయని.. ధరల్లో, నాణ్యతలో ఎక్కడా మోసం లేదని అన్నారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా, రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్ ఇవ్వగానే.. నిర్ణీత సమయంలోగా అవి వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొటాష్‌ను కూడా తెప్పించుకున్నామని చెప్పారు. రైతులకు మరిన్ని సేవలు అందేలా దృష్టి పెట్టాలన్నారు.
ఈ దిశగా మరో అడుగు ముందుకేస్తూ.. ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు వివరించారు. వచ్చే రబీ సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంకా ఈ సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.
అమూల్ వచ్చాకే పాడి రైతులకు పెరిగిన ధర
► జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా బీఎంసీల నిర్మాణం గురించి అధికారులు వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన బీఎంసీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, జగనన్న పాల వెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందని తెలిపారు.
► రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపై కూడా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అమూల్ అన్నది ప్రైవేటు సంస్థ కాదని, అది పెద్ద సహకార ఉద్యమం అని తెలిపారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని, లాభాలన్నీ తిరిగి రైతులకే పంచుతారని, ఇలాంటి కార్యక్రమంపైనా విష ప్రచారానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
► అమూల్ వచ్చాక ఇతర సంస్థలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
► ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బోర్ల కింద ప్రత్యామ్నాయ సాగుకు ప్రోత్సాహకాలు.
► బోర్ల కింద వరిని సాగు చేసే చోట ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని, చిరుధాన్యాల (మిలెట్స్)తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా సూచనలివ్వాలని సీఎం చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించారు.
► ఇలాంటి చోట ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని, తద్వారా రైతులకు అండగా నిలబడగలుగుతామని సీఎం అన్నారు. 33 చోట్ల సీడ్ కమ్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్‌కు 20 యూనిట్లు అందుబాటులోకి వస్తాయని, మిగతావి 2022 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులు జరుగుతున్నాయని, జూలైలో పనులు దాదాపుగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్ల పనులపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment