సమావేశంలో చర్చిస్తున్న పాలక మండలి సభ్యులు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కొత్త రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన బీఆర్‌ఏయూ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ తులసీరావు పదవీకాల ఏప్రిల్ ఒకటితో ముగియనుంది. ఈయన రెండేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.
టెర్మ్ పెంచుకునే అవకాశమున్నా...
వైస్ చాన్సలర్ సిఫారసుతో పాటు పాలక మండలి, ఉన్నత విద్యా మండలి అనుమతితో ఏటా పదవీ కాలన్నీ పెంచుకునే సౌలభ్యం ఉంది. 1991 విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏటా రెన్యువల్ చేస్తూ ఆరేళ్ల వరకు కొనసాగించవచ్చు. ఇదే వర్సిటీలో ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ఆరేళ్లు దాటి పనిచేశారు. టెర్మ్‌లు పెంచడం, అన్‌టిల్ ఫర్దర్ ఆర్డర్ (తాత్కాలిక ఉత్తర్వులు)తో సుదీర్ఘంగా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. 2009 సెప్టెంబర్ 16 నుంచి 2016 మార్చి 31 వరకు ఆయన కొనసాగారు. 2016 మార్చి 31న తులసీరావు నియమించగా ఏప్రిల్1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వర్సిటీలో ముగ్గురు రెగ్యులర్ రిజిస్ట్రార్‌లు పనిచేశారు. నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్(హెచ్‌ఓడీ) కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. వర్సిటీలో మొదటి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జి.జ్ఞానమణి 2008 ఆగస్టు 25 నుంచి 2009 ఆగస్టు 25 వరకు కొనసాగారు. వీసీ ఎస్వీ సుధాకర్‌తో పొసగకపోవటంతో ఏడాదికే పరిమితం చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.
అనంతరం 2009 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ బిడ్డిక అడ్డయ్య కొనసాగారు. 2017 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించిన వీసీ కూన రామ్‌జీ రిజిస్ట్రార్ మార్పునకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పాలక మండలి సభ్యులు విభేదించడంతో టెర్మ్ కోసం ఎదురు చూశారు. మరోవైపు వీసీ ప్యానల్‌లో రామ్‌జీ, తులసీరావు పేర్లు చివరి వరకు కొనసాగాయి. తులసీరావు స్థానిక ప్రొఫెసర్. రామ్‌జీ కంటే సీనియర్. మరోవైపు జిల్లా నుంచి రిజిస్ట్రార్‌గా పనిచేసింది ప్రొఫెసర్ తులసీరావు ఒక్కరే కావడం గమనార్హం. మిగిలిన వారంతా ఏయూకు చెందిన వారే. ఏయూ వీసీగా నాగేశ్వరరావు కొనసాగి న సమయంలో రిజిస్ట్రార్‌గా తులసీరావు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత వీసీ తనకు అనుకూలమైన పాలనా సౌలభ్యం కోసం పలు మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 1న బాధ్యతల స్వీకరణ..
ఏప్రిల్ 1 నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నాలుగో రెగ్యులర్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన వీసీ రామ్‌జీకి సన్నిహితుడు. మరోవైపు స్థానిక ప్రొఫెసర్లు సైతం రిజిస్ట్రార్ పదవిని ఆశించినా వీసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
ఇద్దరూ ఏయూ వారే...
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజే ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యులు కాగా, రఘుబాబు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆచార్యులు. వీరిద్దరికీ శ్రీకాకుళంతో అనుబంధం కలిగి ఉండటం విశేషం. వర్సిటీలో పలు కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. రఘుబాబు గతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఏడాదికాలం పనిచేశారు. తాజాగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఘనత రఘుబాబుకు దక్కుతుంది. ఈయన ప్రస్తుతం ఏయూ గెస్ట్‌హౌస్‌ల డీన్‌గా వ్యవహరిస్తున్నారు.
రూ. 91 కోట్లతో బడ్జెట్ ఆమోదం...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో రూ.91 కోట్లతో బడ్జెట్ ఆమోదించారు. ప్రధానంగా వర్సిటీ బడ్జెట్, రిజస్ట్రార్ మార్పుపైనే సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్యానాథ్, ఉన్నత విద్యా మండలి అధికారులు, వర్శిటీ అధికారులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, కె.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాలక మండలి నిర్ణయాలివే..
♦ వర్సిటీకి రూ. 91.70 కోట్లు నిధులు కేటాయించాలని తీర్మానం.
♦ రూ.60 కోట్లు పనులను కేంద్ర ప్రజా పనుల ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించాలని నిర్ణయం.
♦ రిజిస్ట్రార్‌గా ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు నియామకం.
♦ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావును ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల బాధ్యతలు అప్పగింత.
♦ అకడిమిక్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నియామకం.
♦ డాక్టర్ యు.కావ్యజ్యోత్స్నకు మహిళా వసతి గృహం చీఫ్ వార్డెన్, రీ వేల్యుయేషన్ డీన్‌గా బాధ్యతలు అప్పగింత.
♦ డాక్టర్ కె.స్వప్నవాహినికి బయోటెక్నాలజీ హెచ్‌ఓడీగా, పేపర్ సెట్టింగ్స్ డీన్‌గా, పీజీ ప్రవేశాల సెట్ సహాయ కన్వీనర్లగా నియామకం.
♦ కామర్స్ విభాగం బలోపేతానికి రూ.13 లక్షల కేటాయింపు.
♦ నిపుణులు, ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలని తీర్మానం.
Comments
Please login to add a commentAdd a comment