తక్షణమే రాజీనామా చేయండి
బీఆర్‌ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌లకు టీఎన్‌ఎస్‌ఎఫ్ హెచ్చరిక
వీసీ చాంబర్ ఎదుట ఆందోళన
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్‌ఎస్‌ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.
ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.
అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్‌ఎస్‌ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీసీని అవమానించడం అన్యాయం
దళిత వీసీని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్‌డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment