వర్సిటీల్లో కూటమి నేతల రాజకీయ విషక్రీడ
పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని హుకుం
అధికారుల ద్వారా ఒత్తిడి చేసిన ప్రభుత్వ పెద్దలు
ఇప్పటికే వీసీలుగా తప్పుకున్న కొందరు
తాజాగా వైదొలగిన మరికొందరు
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్‌లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.
సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.
తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్‌చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్‌టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు.
పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామా
తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..
కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.
కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.
వైదొలిగిన జేఎన్‌టీయూకే వీసీ
జేఎన్‌టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..
గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment