rayalaseema university
-
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
అడ్డదారిలో ఉద్యోగాలు?
1990లో జన్మించిన ఓ వ్యక్తి 2004లో రాయలసీమ పీజీ సెంటర్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. అంటే 14 ఏళ్లకే పది పాసై ఉద్యోగం సాధించాడని అక్కడి మినిమం టైం స్కేల్ కమిటీ రికార్డులు చెబుతున్న మాట. ఇతడే ఆర్యూ ఏర్పాటైన తరువాత 2011లో ఫుడ్ సప్లయర్‌గా ఉద్యోగంలో చేరినట్లు మరో రికార్డులో ఉంది. ఏది నిజమో వర్సిటీ అధికారులకే తెలియాలి. మొదటిది నిజమైతే బాల కార్మిక చట్టాన్ని ఉల్లఘించినట్టు.. రెండోది నిజమైతే మొదటి దాని సంగతేంటో. 1977లో పుట్టిన ఓ మహిళ 2002లో స్వీపర్‌గా చేరింది. ఆమె కుమారుడు 1985లో పుట్టి, 2006లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరినట్లు రికార్డుల్లో ఉంది. తల్లి 1977లో పుడితే 8 ఏళ్లకే ఆమెకు కొడుకు పుట్టాడట. ఈ రెండు ఘటనలే కాదు 2018లో టీడీపీ హయాంలో మినిమం టైం స్కేలు పొందిన 102 మంది ఉద్యోగుల్లో పలువురు అడ్డదారుల్లో ఉద్యోగాల్లో చేరినట్లు స్పష్టమవుతోంది. ఉన్నత విలువలు నేర్పాల్సిన రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు విలువలకు తిలోదకాలిచ్చారు. నీతి బోధించాల్సిన చోటునే అవినీతికి అడ్డాగా మలుచుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారే అక్రమార్జనకు తెరతీశారు. ఆమ్యామ్యాలకు తలొగ్గి అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టి కాసులు వెనకేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదులతో విచారణ చేపట్టిన వర్సిటీ స్థాయి కమిటీ ఇప్పటికే 14 మంది అక్రమార్గంలో ఉద్యోగాలు పొందినట్లు తేల్చినట్లు సమాచారం. విచారణ తుది దశకు చేరుకోవడంతో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొంత మంది, వారికి సహకరించిన వర్సిటీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ 2008లో ఏర్పాటైంది. అనంతర కాలంలో నాన్ టీచింగ్ నియామకాల కోసం అప్పట్లో జీఓ ఎంఎస్ నంబరు 50 జారీ అయింది. ఈ జీఓ ప్రకారం నాలుగు పోస్టులు రెగ్యులర్, 23 పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏకంగా 150 నుంచి 200 పోస్టులను ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి వర్సిటీ అధికారులు పలు దఫాలుగా నియమించి నిబంధనలకు విరుద్ధంగా మినిమం టైం స్కేలు అమలు చేశారు. ఇందులో 60 ఏళ్ల వయస్సు పైబడిన వారి ఆధార్‌కార్డులలో పుట్టిన తేదీలు మార్పులు చేసి, విధుల్లో చేరిన తేదీలను సైతం మార్పులు చేసి రికార్డుల్లో నమోదు చేశారు. అందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు, ప్రస్తుత ఇద్దరు ప్రొఫెసర్లపై ఆరోపణలున్నాయి. ఫిర్యాదుల వెల్లువ.. కనీస విద్యార్హతలు కూడా లేని వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాటించకుండా పోస్టుల్లో నియమించడంతో ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్పందించిన ఉన్నత విద్యా ప్రభుత్వ కార్యదర్శి గత ఏడాది డిసెంబరు 15న ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి బిశ్వాస్, ఉన్నత విద్యా మండలి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అదే ఏడాది డిసెంబరు 23లోపు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని వర్సిటీ అ«ధికారులకు లేఖ రాసింది. స్పందించకపోవడంతో ఈ ఏడాది జనవరి 4న విచారణకు రావాలని మరో సారి సూచించింది. అయితే వర్సిటీలోని కీలక అధికారులు రంగప్రవేశం చేసి ఆ కమిటీతో కాకుండా యూనివర్సిటీ స్థాయిలోనే ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని చెప్పి తప్పించుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో.. మూడు నెలల క్రితం ప్రారంభమైన వర్సిటీ స్థాయి విచారణ నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేశాయి. దీంతో రాజ్‌భవన్, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో విచారణను వేగవంతం చేసి తుది దశకు చేర్చారు. ఈ విచారణలో ఇప్పటి వరకు 14 మంది అనర్హులకు టైం స్కేల్ అమలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మరో 11 మంది మినిమం టైంస్కేల్ ఉద్యోగుల సర్టిఫికెట్లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ 25 మందికి రెండు నెలలుగా జీతాలు నిలిపేసినట్లు సమాచారం. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు పొందిన వారు కూడా అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆర్‌యూలో జరిగిన నియామకాలకు సంబంధించిన జీఓలు, ప్రకటనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలను సేకరించాలని జిల్లా ట్రెజరీని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. విచారణ చివరి దశకు వచ్చింది రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న నాన్ చీటింగ్ స్టాఫ్ విద్యార్హతలు, తదితర అంశాలపై చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నాం. ఇలాంటివి రెగ్యులర్‌గా జరిగే విచారణలే. – మధుసూదన్ వర్మ, రిజిస్ట్రార్, ఆర్యూ -
ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వ విద్యాలయంలో కీలక పదవులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. వర్సిటీలోని పరిస్థితులకు భయపడి పదవులు వదులుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్సిటీ హాస్టల్స్ ఛీఫ్ వార్డెన్, వార్డెన్, దూర విద్య విభాగం డైరెక్టర్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితర కీలక పోస్టులకు ప్రొఫెసర్లు కరువయ్యారు. పరీక్షల విభాగం డీన్‌గా ఒక ప్రొఫెసర్ ఉన్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక పదవులు ఖాళీగా ఉండడంతో వర్సిటీలో పాలన గాడి తప్పుతోంది. ఆర్యూ హాస్టల్స్ వార్డెన్ ఎవరో..? రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు మెన్స్, రెండు ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అందులో సుమారు 700 మంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమవుతుంది. వారికి రెండు హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అయితే హాస్టళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఛీఫ్ వార్డెన్‌గా ఎవరున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న ప్రొఫెసర్ వై.నరసింహులు సంవత్సరం కిత్రమే ఆ పదవికి రిజైన్ చేశారు. రిలీవ్ చేయాలని వందల సార్లు వీసీ, రిజిస్ట్రార్లకు మొరపెట్టుకున్నా చేయలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వర్సిటీలో ఆరŠట్ప్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖ విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని పనిభారం ఉందని విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. ఆయన స్థానంలో ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట శేషయ్యకు వార్డెన్‌గా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన మొదట అంగీకరించినప్పటికీ తరువాత నాకు ఏపదవి వద్దని చెప్పినట్లు సమాచారం. మెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఒక డిప్యూటీ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఇద్దరు డిప్యూటీ వార్డెన్లు హాస్టళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. అలాగే దూర విద్య విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు పదవి రాజీనామా చేశారు. అయితే ఉన్నతాధికారులు రిలీవ్ చేయలేదు. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. అంటీముట్టనట్లుగా పరీక్షల విభాగం డీన్ ఆర్యూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి విధులకు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నరని సమాచారం. పరీక్షల విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో బా«ధ్యతలు నిర్వర్తించడం లేదు. విభాగంలో అవకతవకల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విశ్వవిద్యాలయం -
ఫెయిలైనా ' పీజీ' అడ్మిషన్ దొరుకుతుంది ఇక్కడ
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. పరీక్షల విభాగంలో జరిగే అవకతవకలకు అంతే లేకుండా పోతోంది. ఇక్కడ అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనేది చాలా సార్లు నిరూపితమైంది. ‘నిబంధనలు వర్తించవు.. ఎన్ని సార్లైనా తప్పులు చేస్తాం..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అనే ధైర్యంతో చలామణి అవుతున్నారు. గతంలో డిగ్రీ రీవ్యాల్యుయేషన్ సమాధాన పత్రాలు మాయమైనా ఎలాంటి చర్యలు లేవు. గత నాలుగు రోజుల కిత్రం డిగ్రీ సమాధాన పత్రాలు తడిసినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇన్ని తప్పిదాలు జరిగినా ఎలాంటి చర్యలు లేక పోవటంతో తప్పులు చేస్తుండటం పరిపాటిగా మారింది. అలాంటిదే బుధవారం ఒక ఘటన జరిగింది. ఇది గురువారం రోజు బయట పడింది. ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థినికి ఏకంగా పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే ఈ విద్యార్థిని ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫలితాలు విడుదల కాలేదు. అయినా పరీక్షల విభాగం సీఈ డాక్టర్ వెంకటే«శ్వర్లు..‘‘ ఆ విద్యార్థిని ఫెయిల్ కాలేదు. ఉత్తీర్ణత సాధించారు. సీజీపీఏ 7.58 పాయింట్లు వచ్చాయి’’ అని లిఖిత పూర్వకంగా ఒక కాపీ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయిలో పీజీ సెట్ రెండో విడత కౌన్సె లింగ్ హాజరయ్యారు. గాయత్రీ ఎస్టేట్‌లోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) డిగ్రీ చదివిన ఒక విద్యార్థిని డిగ్రీ నాలుగోసెమిస్టర్లో జువాలజీ, ఆరో సెమిస్టర్ బాటనీలో ఏడో పేపర్ ఫెయిల్ అయ్యారు. ఈ విద్యార్థిని ఆర్యూ పీజీ సెట్లో బాటనీ కోర్సుకు ప్రవేశ పరీక్ష రాసింది. అందులో 46వ ర్యాంక్ సాధించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం సీఈని కలిశారు. అయిన ఏమి ఆలోచన చేశారో కానీ ఆ విద్యార్థిని ఏప్రెల్, 2019లో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసిందని, సీజీపీఏ 7.58 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిందని, ప్రొవిజినల్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది ప్రాసెస్‌లో ఉందని ఒక లిఖిత పూర్వక లేఖను విద్యార్థినికి ఇచ్చారు. ఆ అమ్మాయి కౌన్సెలింగ్ కేంద్రంలోని అధికారులను కలిసి సంబంధిత లేఖను చూపించారు. కౌన్సెలింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించినట్లు సంతకాలు చేశారు. సీఈ ఇచ్చిన కాపీని కాకుండా వెరిఫికేషన్ అధికారులు డిగ్రీ మార్కుల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే జరిగిన తప్పిదం బయట పడేది. ఇవేమీ పట్టించుకోకుండా సీఈ లేఖను ఆధారంగా చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేసి ఆప్షన్లు నమోదు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇది వర్సిటీ అధికారులు నిర్వాకం. ఈ విషయమై సీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘ఆ విద్యార్థిని డిగ్రీ ఆరో సెమిస్టర్లో ఒక పేపర్ ఫెయిల్ అయింది. రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ అమ్మాయి ఉత్తీర్ణత సాధించినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చాను. తరువాత ఆ అమ్మాయి సమాధాన పత్రాలను రీ వ్యాల్యు చేయించాను. పాస్ అయింది. మార్కుల జాబితా రావాల్సి ఉంది.’’ అని పేర్కొన్నారు. -
ఎల్‌బ్రస్‌నైనా ఎక్కేస్తా!
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): ఇప్పటికే ఆఫ్రికా ఖండం టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రాయలసీమ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చిక్కెం రమేష్.. దాతలు సహకరిస్తే మరో సాహస యాత్రకు సై అంటున్నాడు. మంత్రాలయం మండలం వి. తిమ్మాపురానికి చెందిన ఆనందప్ప, ఆశీర్వాదమ్మ దంపతుల కుమారుడు రమేష్ ఆర్‌యూలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాడు. గత ఏడాది 40 మంది యువకులతో కలిసి సాహసయాత్ర చేపట్టిన రమేష్ కిలిమంజారోపై మువన్నెల జెండా,రాయలసీమ యూనివర్సిటీ పతాకాన్ని రెపరెపలాడించి ప్రశంసలు అందుకున్నాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. అయితే చిన్నప్పటి నుంచి పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న రమేష్ .. కల సాకారం చేసుకునే దశలో ముందడుగు వేశాడు. పర్వతారోహణ కోసం యువజన సంక్షేమ శాఖ వారు గత ఏడాది ఫిబ్రవరి 12న జిల్లా స్థాయి, 24న రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగా ఏపీలో 150 మంది హాజరయ్యారు. ఇందులో 60 మందిని ఎంపిక చేసి కృష్ణా జిల్లా కేతనకొండ సీబీఆర్ అకాడమీలో ఐదు రోజులు, మార్చి 1 నుంచి జమ్మూ కశ్మీర్ పహల్గావ్లో 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అనంతరం కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన 40 మందిలో రమేష్ కూడా ఉన్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలకు కిలిమంజారో పర్వతారోహణ యాత్ర ప్రారంభించి 13వ తేదీ ఉదయం 8:20 గంటలకు 5,895 మీటర్ల (19,341అడుగులు) పర్వతాన్ని అధిరోహించారు. పర్వతంపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల 10వ తేదీ యూరఫ్ ఖండంలో అతి ఎత్తయిన ఎల్బ్రస్ (రష్యా) పర్వతాన్ని అధిరోహించేందుకు శిక్షణ పొందాడు. మౌంట్ ఎల్బ్రస్ ఎక్స్పెండేషన్ మిషన్ –2019 హైదరాబాద్ ఇందుకోసం అవకాశం కల్పించారు. అయితే పర్వతారోహణకు అయ్యే ఖర్చు భరించే స్థితిలో లేని రమేష్ దాతలు సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. సాయం చేస్తే ఎల్బ్రస్ పర్వతాన్ని కూడా అధిరోహించి జిల్లా, యూనివర్సిటీకి కీర్తి ప్రతిష్టలు తెస్తామని చెబుతున్నాడు. -
ఇంటర్ ఫెయిలా? పర్లేదులే.. ‘బాబ్బాబూ.. అడ్మిషన్ తీసుకో’
సాక్షి, కర్నూలు : ‘బాబ్బాబూ.. డిగ్రీ అడ్మిషన్ తీసుకో.. కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా మేము చూసుకుంటాం.. ఆరు సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లిస్తాం. బస్సు పాస్‌కు అయ్యే ఖర్చు భరిస్తాం. ఇదే కాకా అదనంగా రూ.5000 ఇస్తాం. ఐటీఐ చదివినా.. ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేనేజ్ చేసుకుంటాం’ ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న తంతు. ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి. ఐటీఐ చదివినా డిగ్రీలో అడ్మిషన్ బనగానపల్లె, కోవెకుంట్ల, పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఐటీఐ చదివిన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నారు. పత్తికొండలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళా«శాలలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం ఆడ్మిషన్లు ఇచ్చారు. సదరు విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇలా జరగదు. అక్కడ డిగ్రీ విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాలను పక్కాగా పరిశీలిస్తారు. ఆర్‌యూలో మాత్రం ఇవేమీ చేయరు. దీంతో ఇంటర్ ఫెయిల్ అయినా, ఐటీఐ చదివినా డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 12 ప్రభుత్వ, 7 ఎయిడెడ్, 85 ప్రైవేట్ మొత్తం 104 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 65వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని చాలా కళాశాలలు ముఖ్యంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో డిగ్రీలో చేరితే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళాశాలల యాజమాన్యాలే ఒక్కో విద్యార్థికి డిమాండ్, పరిస్థితులను బట్టి రూ.3000 నుంచి రూ.6000 వరకు చెల్లిస్తున్నాయి. ఆరు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు రూ.3000, బస్‌పాస్‌కు అయ్యే ఖర్చు రూ.5000 ఇలా ఒక విద్యార్థికి సుమారు రూ.14000 వరకు ఖర్చుచేసి సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. వీరు కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా యాజమాన్యాలే చూసుకుంటాయి. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారేంటే ఒక్కొక్క విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.18000, మూడేళ్లకు రూ.54000 ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒక విద్యార్థిపై తాయిలాల రూపంలో రూ.14000 ఖర్చు చేస్తే తమకు రూ.40,000 వరకు మిగులుతుందని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకుల ప్లాన్. ఆన్లైన్లో లేకపోవడంతో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీలో చేరాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా మార్కులు, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇది విద్యార్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వారి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. వర్సిటీ కేటాయించిన సీట్లకంటే కూడా 20 శాతం అదనంగా చేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించి అఫ్లియేషన్ ఫీజు సైతం వర్సిటీకి చెల్లించకుండా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో వర్సిటీ అధికారులు కూడా కఠినంగా వ్యవహరించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమలు కాని బయోమెట్రిక్ హాజరు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌నకు అర్హులు. ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలేవీ లేకపోవడంతో ప్రవేశాలు భారీగా జరుగుతున్నాయి. -
కదలరు..కదపలేరు!
సాక్షి, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. ఏళ్ల తరబడి వారు కొన్ని విభాగాల్లో తిష్ట వేయడంతో కొత్తగా వచ్చే ఏ విభాగాధిపతి అయినా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిన పరిస్థితి. వారి స్థానాలను మారుస్తూ వైస్ చాన్సలర్ ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉద్యోగులు ఖాతరు చేయరు. సీటు మారరు. వీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు కావడంతో పాటు వారు విధులు నిర్వహించే విభాగాలు ఆదాయం వచ్చేవి. దీంతో వారి లాబీయింగ్‌కు వర్సిటీ ఉన్నతాధికారులు తలొగ్గుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 265 మంది ఉన్నారు. వర్సిటీలో పని తక్కువ రాజకీయాలు ఎక్కువ. 12 మంది ప్రోఫెసర్లలో వారు బోధనతో పాటు పరిపాలనకు (బోధనేతర) సంబంధించి ఒక్కొక్కరు మూడు, నాలుగు విభాగాలకు అధిపతులుగా ఉంటున్నారు. వీరు హెడ్స్‌గా ఉన్నా చాలా విభాగాల్లో బోధనేతర సిబ్బంది హవానే నడుస్తోంది. వీరు వర్గాలుగా విడిపోయి పంతం నెగ్గించుకుంటున్నారు. వర్సిటీలో ఒక్క ఉద్యోగి కూడా జాబ్ చార్ట్ పాటించరు. వారి కనుసన్నల్లో పాలన.. పరీక్షల విభాగం, దూర విద్య విభాగం, పరిశోధన విభాగం, సీడీసీ, ఫైనాన్స్, ప్రిన్సిపల్ కార్యాలయాల్లో పాతుకు పోయిన ఉద్యోగుల కనుసన్నల్లో పాలన సాగుతోంది. ఆయా విభాగాలకు ఏ ప్రోఫెసర్ అధిపతిగా వచ్చినా ఆయన వారి మాట వినాల్సిందే. లేకపోతే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. సదరు కీలక వ్యక్తులు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ ఆ విభాగం డైరెక్టర్ పెట్టాల్సిందే. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. దీంతో కొందరు ప్రొఫెసర్లు లేని పోని తలనొప్పులు ఎందుకని పరిపాలనా అంశాల జోలికి వెళ్లడం లేదు. వైస్‌చాన్సలర్ ఆదేశాలూ పట్టవు.. ఆర్‌యూలో పరిపాలన గాడి తప్పిందనేది బహిరంగ రహస్యమే. పరీక్షల విభాగం, డిస్టెన్స్, ఫైనాన్స్ విభాగాలు ఏర్పడినప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు బదిలీ కాలేదు. రీసెర్స్, సీడీసీ విభాగాల్లో చాలా ఏళ్లుగా అక్కడే ఉన్నారు. ఈ కీలక విభాగాల్లో ఆదాయ మార్గాలు ఉండటంతో అక్కడి నుంచి కదలడానికి ఇష్ట పడరు. పూర్వపు వైస్‌చాన్సలర్ నరసింహులు ఆయన పదవీకాలం ముగిసే ఆరు నెలల ముందు బోధనేతర సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏ ఒక్క ఉద్యోగి కూడా వారి స్థానాల నుంచి కదలలేదు. తమను ఏమీ చేసుకోలేరనే ధీమానో.. సదరు అధికారి చేసిన తప్పిదాల గుట్టు వారి దగ్గర ఉందనే ధైర్యమో తెలియదు. బదిలీలకు సాహసించని ప్రస్తుత వీసీ ప్రస్తుత వీసీ ప్రసాదరావు బదిలీల ప్రక్రియ చేపట్టడానికి సాహసించడం లేదు. మొదట్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి వర్సిటీ పాలనను గాడిన పెడతానని పలు మార్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఏడాదవుతున్నా వాటి జోలికి వెళ్లడం లేదు. కదిపితే ఎక్కడ తన ఉనికికే ప్రమాదం వస్తుందనే అభిప్రాయంతో వీసీ బదిలీలకు సాహసించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇతర ఏ వీసీ హయాంలో జరగనన్ని గొడవులు, ఆందోళనలు ఈయన పీరియడ్‌లో జరుగుతున్నాయి. నాలుగైదు సార్లు బోధనేతర సిబ్బంది వీసీ చాంబర్లోకి వచ్చి ఆయనను అసభ్య పదజాలంతో దూషింనా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో పలువురు ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థి నేతలు గత ఎన్నికల్లో కోడుమూరు, నందికొట్కూరు నియోజక వర్గాల టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వర్సిటీలో పోస్టులు, పదోన్నతులు పొందేందుకు వీసీపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పక్కా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరింన పూర్వపు రిజిస్ట్రార్ అమర్నాథ్ రిలీవ్ అయ్యే ముందు కొందరు ఉద్యోగులకు పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు దస్త్రం సిద్ధం చేసిన విషయం బయటికి పొక్కడంతో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారు. అయినా, సదరు అధికారి తన పని తాను చేసినట్లు సమాచారం. ఈ దస్త్రం ప్రస్తుతం వీసీ దగ్గర ఉన్నట్లు వినికిడి. అదే టీడీపీ వ్యక్తిగా ముద్ర పడ్డ వీసీ ఒత్తిళ్లకు తలొగ్గి దస్త్రాన్ని క్లియర్ చేస్తారా? లేక పక్కన పెడతారో చూడాల్సి ఉంది. విభాగాల వారీగా కొందరు తిష్ట వేసిన స్థానాలు ☛ దూరవిద్య విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి, మరో ఇద్దరు ఉద్యోగులు ఆ విభాగం ఏర్పడినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ☛ రీసెర్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్, ముగ్గురు ఉద్యోగులదీ అదే పరిస్థితి. ☛ వర్సిటీ ప్లేస్మెంట్ అధికారిగా ఏళ్ల తరబడి ఒకరు కొనసాగుతున్నారు. ☛ పరీక్షల విభాగంలో ఉద్యోగులందరూ ఆ విభాగాన్ని శాసించే స్థాయి పాతుకుపోయారు. ☛ సీడీసీ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. ☛ ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఏళ్ల తరబడి ఉన్న ఉద్యోగులదే పెత్తనం ☛ కొత్తగా ఏర్పడిన ఫైనాన్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు అక్కడి నుంచి కదలకుండా ఉన్నారు. ☛ వర్సిటీలో 15 మంది దాకా ఉద్యోగులు ఉదయం వచ్చి సంతకం చేస్తారు. తర్వాత వారిసొంత వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. కొత్త రిజిస్ట్రార్ వచ్చాకే బదిలీలు వర్సిటీలో బోధనేతర సిబ్బంది బదిలీలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఉన్నారు. రెగ్యులర్ రిజిస్ట్రార్ వచ్చాక బదిలీల ప్రక్రియ చేపడతాం. కొంత మంది వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు. అడిగిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కదా. – ఎ.వి.ప్రసాదరావు, వీసీ -
త్రీడీ.. రెడీ
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): సాంకేతిక రంగంలో భవిష్యత్ తరాలకు త్రీడీ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే అత్యాధునిక అడ్వాన్స్డ్ త్రీడీ టెక్నాలజీ ఆవశ్యకత పెరుగనుంది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, వైద్య రంగంలో అవసరమైన వాటిని డిజైన్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన త్రీడీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నాన్‌టెక్నికల్ యూనివర్సిటీల్లో త్రీడీ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఏకైక విశ్వవిద్యాలయం రాయలసీమ విశ్వవిద్యాలయం కావటం గర్వకారణం. రూ.30 లక్షలతో త్రీడీ ల్యాబ్‌ను రెండు నెలల క్రితం అప్పటి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.నరసింహులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రారంభించారు. ఐదు కంప్యూటర్లు, అత్యాధునికమైన ఐదు ప్రింటర్లు, స్కానింగ్ మిషన్ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వస్తువులు. త్రీడీ స్కానర్ మనుషులు కొలవలేని, డిజైన్ చేయలేని వాటిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి ప్రింటింగ్ తీసుకోవచ్చు. త్రీడీ టెక్నాలజీ.. త్రీ డైమెన్సనల్ ప్రింటింగ్ అనేది (త్రీడీ) అడిటివ్ మానుఫ్యాక్షరింగ్ అనే అంశంపై ఆధారపడి భౌతిక వస్తువులను త్రీ డైమెన్సన్లో అచ్చు వేస్తోంది. ఇది ఒక పొర మీద ఒక పొరను జమ చేస్తూ ఒక క్రమపద్ధతిలో ప్రింట్ చేస్తుంది. దీని కోసం త్రీడీ క్యాడ్ నమూనాను కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ద్వారా రూపొందిస్తారు. ఆర్యూ ల్యాబ్‌లో ఇలా.. ⇔ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వారు టర్బైన్ బ్లేడ్స్‌ను త్రీడీ స్కానింగ్ చేసుకోడానికి ఆర్‌యూలోని త్రీడీ స్కానర్‌ను ఉపయోగించుకున్నారు. ⇔ ఏపీలోని అటానమస్ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులకు సమ్మర్ స్కూల్ ప్రొగ్రామ్‌లో భాగంగా త్రీడీ ప్రిటింగ్పై శిక్షణ ఇచ్చారు. ⇔ ఆర్‌యూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం విద్యార్థులు కొంత మంది హైదరాబాద్‌లోని ఆడెడ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శిక్షణ పొందారు. ⇔ ఆర్యూ క్యాంపస్‌లోని భవనాలు, వర్సిటీ పేరును త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేస్తున్నారు. త్రీడీ ల్యాబ్, స్కానర్‌తో ఉపయోగాలు ⇔ పరిశ్రమల్లో చాలా వేగంగా ప్రాథమిక నమూనాను తయారు చేసుకోవచ్చు. ⇔ త్రీడీ షూ లాస్ట్స్ (షూ మోడల్) తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ⇔ ఆర్ట్ అండ్ జ్యూవెలరీ ఫొటో టైప్ డిజైనింగ్‌కు అవకాశం. ⇔ దంత వైద్యాలయాల్లో పళ్ల నమూనాలు రూపొందిస్తారు. ⇔ ఇళ్లు, కాలనీలు, వెంచర్ల నమూనాల డిజైనింగ్‌కు నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. ⇔ ఆటోమోటీవ్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తారు. ⇔ యంత్రాల బాహ్య డిజైనింగ్ చేయుటకు ఉపయోగిస్తారు. -
వీరిపై వారు.. వారిపై వీరు!
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): పీజీ హాస్టల్స్ ఓపెన్ చేస్తే తరగతులకు హాజరవుతామని విద్యార్థులు... విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని రాయలసీమ వర్సిటీ అధికారులు.. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉండడంతో పీజీ తరగతులు ప్రారంభమై వారం గడిచినా అత్తెసరు హాజరే నమోదవుతోంది. వచ్చే నెలలో వర్సిటీలో న్యాక్ అధికారుల పర్యటన ఉండడం, అధికారులు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్సిటీలో హాజరు తక్కువగా ఉండడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ కళాశాల పీజీ సెమిస్టర్ –3,5 తరగతులు ఈనెల 18వ తేదీ ప్రారంభమయ్యాయి. అయితే హాస్టల్స్ మాత్రం తెరుచుకోవడంలేదు. విద్యార్థులు వస్తే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు అంటుండగా.. హాస్టళ్లు తెరిస్తే వస్తామని విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి ఆర్యూ హాస్టళ్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ఎప్పు డు తెరుస్తారో కూడా ప్రకటించలేని çపరిస్థితిలో అధికారులున్నారు. మరో వైపు న్యాక్ పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 5,67, తేదీల్లో ఆర్‌యూను న్యాక్ సభ్యులు సంద ర్శించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో న్యాక్ సభ్యులు ఇంటరాక్ట్ అవుతారు. వారి నుంచి తీసుకునే ఫీడ్ బ్యాక్‌ను బట్టే యూజీసీ న్యాక్ గ్రేడ్ ఇస్తుంది. అత్యంత కీలక సమయంలో వర్సిటీ అధికారులు హాస్టళ్లు తెరవకపోవడం, విద్యార్థులు తరగతులకు రాకపోవడం లాంటి పరిస్థితి న్యాక్ పర్యటనపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదీ పరిస్థితి.. రాయలసీమ వర్సిటీలో ఐదు హాస్టళ్లున్నాయి. ఇందులో తుంగభద్ర, కృష్ణ, సంఘమేశ్వర హాస్టళ్లు అబ్బాయిలకు, భ్రమరాంబ, జోగుళాంబ హాస్టళ్లు అమ్మాయిలకు సంబంధించినవి. మెన్ హాస్టళ్లలో 330 మంది, ఉమెన్ హాస్టళ్లలో 335 మంది ఉంటారు. వర్సిటీ కళాశాల పీజీ తరగతులు ప్రారంభమై వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు 25 మంది అబ్బాయిలు మాత్రమే హాస్టల్లో రిపోర్ట్ చేశారు. వీరిలో 10 మంది కూడా హాస్టల్లో లేరు. అమ్మాయిలు 40 మంది దాకా రిపోర్ట్ చేసినా 10 మంది కూడా హాజరు కావడం లేదు. వర్సిటీకి వచ్చి బిల్లులు చెల్లించి రూమ్ అలాట్ చేసుకొని వారి ఊర్లకు వెళ్లి పోతున్నారు. హాస్టల్ తెరిచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం తయారు చేసి పెడితే హాస్టల్లోనే ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. ఇవన్నీ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది.. విద్యార్థుల కంటే సిబ్బంది, బయటి విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో బిల్లు మొత్తం ఉన్న విద్యార్థులపైనే పడుతుందని వర్సిటీ వార్డన్లు పేర్కొంటున్నారు. హాస్టల్లో వసతి కల్పించాలి సోమవారం పరీక్షలున్నందు వల్ల వర్సిటీకి వచ్చాను. ఇక్కడ చూస్తే విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. టిఫన్, అన్నం వడ్డించడం లేదు. ఇక్కడ ఉండడం కష్టం కాబట్టి మళ్లీ మా ఊరికి వెళ్తున్నాను. పూర్తిస్థాయిలో హాస్టల్ నడుస్తున్నప్పుడు వస్తాను.– లోకేష్, ఎంబీఏ విద్యార్థి,ఆలూరు మండలం బిల్లేకల్ ఊరికి వెళ్లి పోతున్నా.. సోమవారమే విశ్వవిద్యాలయానికి వచ్చాను. విద్యార్థులు 20 మంది కూడా లేరు. ఇక్కడ ఉండాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దీంతో హాస్టల్ పూర్తి స్థాయిలో నడిచినప్పుడే వద్దామనుకుంటున్నాను. అంత వరకు మా ఊర్లోనే ఉంటాను.–శివశంకర్, ఇంగ్లిష్ విభాగంవిద్యార్థి, ఆదోని విద్యార్థులంతా హాజరు కావాలి.. నాలుగు రోజుల క్రితం వర్సిటీకి వచ్చాను. విద్యార్థులు పూర్తిస్థాయిలో రాలేదంటూ హాస్టల్లో అన్నం పెట్టడం లేదు. మూడు పూటలా బయట తినడం వల్ల రోజుకు రూ.200 వరకు ఖర్చవుతోంది. తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులందరూ హాజరు కావాలి. నేను కూడా నా స్నేహితులకు ఫోన్ చేసి రావాలని చెబుతున్నాను. – విష్ణుచరణ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం, రామాపురం, అవుకు మండలం -
అనుమానమా? నమ్మకమా?
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఫలితాలపై అనుమానమో లేక తాము రాసిన పరీక్షలకు ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకమో గానీ రీవాల్యుయేషన్‌కు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో వర్సిటీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రెండు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్లు, ఇయర్ ఎండ్ విద్యార్థులు మొత్తం 26,815 మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంగమనార్హం. ఫలితాలపై అనుమానమేనా? డిగ్రీ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో టాపర్ల జాబితా మారటం, విద్యార్థులు ఆందోళన చేయటం, పరీక్షల వ్యవహారాన్ని నిర్వహిస్తూ తప్పిదానికి కారణమైన విభా సొల్యూషన్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, ఫలితాల పరిశీలనపై కమిటీ వేయటం లాంటి ఘటనలతో విద్యార్థుల్లో పలు అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. ఈ కారణంగానే వేల సంఖ్యలోరీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వాలని, రూ.300 ఉన్న ఫీజును తగ్గించాలని వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. స్పందించిన వర్సిటీ రిజిస్ట్రార్ రూ.300 నుంచి రూ.200లకు ఫీజు తగ్గించారు. దీంతో ఎక్కువ మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టులు సెమిస్టర్ –2లో ఇంగ్లిష్‌కు 1,179, గణితానికి 1,236, కంప్యూటర్ సైన్స్‌కు 1,440, ప్రోగ్రామ్ ఇన్ సీకి 1,473 మంది, సెమిస్టర్–4లో గణితానికి 1,170, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్‌కు 1130 మంది, ఆఫీస్ అటోమేషన్ టూల్స్‌కు 1,052, ఇన్‌కమ్‌ట్యాక్స్ సబ్జెక్టుకు 965 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు తగ్గించడం వల్లే.. రీవాల్యుయేషన్ ఫీజును రూ.300 నుంచి రూ.200లకు తగ్గించటం వల్లే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. గత ఏడాది సుమారు 16,000 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 26,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు,పరీక్షల నియంత్రణాధికారి -
ఆర్యూ పీజీ సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
సాక్షి, కర్నూలు(గాయత్రి ఎస్టేట్) : రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ఆర్యూ లైబ్రరీ హాల్లో ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రక్రియను ప్రారంభించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రశాంతంగా సాగింది. అనంతపురం ఎస్కేయూ పరిధిలో డిగ్రీ చదివి ఆర్యూ పీజీ సీట్ రాసి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నిరాసే మిగిలింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలను తెచ్చుకో లేకపోయారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టుకు 22, బాటనీ సబ్జెక్టుకు 117, కంప్యూటర్ సైన్స్‌కు 113, బయోటెక్నాలజీ సబ్జెక్టుకు 19 మంది మొత్తం 271 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంఈడీ కోర్సు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. వెబ్ఆప్షన్లు ఆగస్టు 1వ తేదీన ఇచ్చుకోవచ్చన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని కేటగిరీల వారు 1 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరు కావాలన్నారు. అవకాశం కల్పించండి ఆర్యూ పీజీసెట్ కౌన్సె లింగ్‌కు అవకాశం కల్పించాలి. మాది ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామం. యాడికి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాను. నాకు ఆర్యూ పీజీసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో నాకు ఆర్‌యూలో పీజీ చేరే అవకాశం లేకుండా పోతోంది. వర్సిటీ అధికారులు స్పందించి అవకాశం కల్పించి ఉన్నత విద్య చదువుకోడానికి అవకాశం ఇవ్వాలి. – వెంకటకృష్ణారెడ్డి, ఫిజిక్స్ 27వ ర్యాంకు -
ప్రభుత్వం మాది.. మా మాటే వినవా?
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల రోజుల పాటు డిపాజిట్ చేసుకుంటామని కమిటీ తెలిపింది. దీంతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం నాయకుడు, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్యగౌడ్ వెరిఫికేషన్‌ను అడ్డుకుని.. అధ్యాపకులందరినీ బయటికి పంపించేశారు. ఆయనతో పాటు అనంతపురం ఎస్కే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్పచౌదరి, మరికొందరు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫూటుగా మద్యం సేవించి సాయంత్రం రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం..నిన్ను బతకన్విం’’.. అంటూ రిజిస్ట్రార్‌ను నానా దుర్భాషలాడారు. రత్నప్పచౌదరి చెప్పు తీసి దాడి చేయడానికి యత్నించగా అక్కడున్న ఉద్యోగులు అడ్డుకుని వారించారు. వర్సిటీలోని ఉద్యోగులంతా వచ్చి రిజిస్ట్రార్‌కు అండగా నిలవడంతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ విషయమై కర్నూలు తాలూకా ఎస్ఐ భాస్కరరాజును సాక్షి వివరణ కోరగా.. గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని..యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడిని నిరసిస్తూ ఆర్యూ విద్యార్థి జేఏసీ బుధవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. -
ఆర్‌యూలో అర్ధరాత్రి అలజడి
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అలజడి చెలరేగింది. వర్సిటీ పూర్వ విద్యార్థులు పూటుగా మద్యం సేవించి విశ్వవిద్యాలయం అతిథి గృహంపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వర్సిటీ పరిశోధక విద్యార్థులు మద్దిలేటి, భాస్కర్, సూర్యప్రకాష్, గురుస్వామి పూటుగా మద్యం సేవించి సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వర్సిటీ అతిథి గృహంలోకి వెళ్లి రిజిస్ట్రార్ బస చేసే గదిలోని ఫర్నీచర్, అతని వాహనాన్ని ధ్వంసం చేశారు. రిజిస్ట్రార్ కోసం అతిథి గృహంలోని గదులన్నీ వెతికారు. ఒక గదిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి సుధాకర్ ఉండగా అతణ్ని బెదిరించారు. తమకు వీసీ, రిజిస్ట్రార్ ఇద్దరు టార్గెట్ అంటూ కేకలు వేసుకుంటూ వెళ్లారని సుధాకర్ తెలిపారు. అతిథిగృహంలో శబ్ధం రావటంతో కొందరు సెక్యూరిటీ గార్డులు వారిని వెంబడించారు. నలుగురిలో ముగ్గురు దొరకగా వారిని పోలీసులకు అప్పగించారు. విద్యార్థులపై కేసు నమోదు వర్సిటీలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన భాస్కర్, రాఘవేంద్ర, మద్దిలేటి మరికొందరు విద్యార్థులపై రిజిస్ట్రార్ ఆచార్య అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్ సీఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేశారు. వర్సిటీ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు విద్యార్థులు ఎవరైనా సరే వర్సిటీ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసిన పీడీఎఫ్ విద్యార్థులను గుర్తించాం. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ ఆధారంగా వారి ఉపకార వేతనాలు నిలిపేయాలని సంబంధిత ఫండింగ్ సంస్థలకు నివేదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వై.నరసింహులు, వీసీవర్సిటీ -
చీవాట్లు పెట్టినా... చులకన చేసినా..
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలకు అర్థం తెలియదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనాలు కోకొల్లలు. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నా మా తీరింతే అన్నట్టుగా ఉంది. కోర్టులు చీవాట్లు పెట్టినా... కొందరు విద్యార్థులు చులకనగా మాట్లాడినా వెనక్కి తగ్గరనేందుకు రెండు సంవత్సరాల కాలపరిమితితో నియమించబడిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి పూనుకోవడం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తించిన నాన్ టీచింగ్ సిబ్బంది గురువారం మూకుమ్మడిగా ఫైల్ సిద్ధం చేసిన అధికారిని నిలదీయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడంతో గుట్టు బట్టబయలైంది. అంతా మా ఇష్టం... ఆర్యూ ఉన్నతాధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తునారనేందుకు ఇంక్రిమెంట్ ఇవ్వదలచిన కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 40 వేలకు పైగా జీతం ఇవ్వడంతోపాటు హెచ్ఆర్ఎ ఇవ్వడం నిదర్శనం. సర్వీస్ రిజిస్టర్ లేకుండానే ఇంక్రిమెంట్లు ఎలా ఇస్తారనేది అర్థమవ్వని విషయం. అంతర్గత ఒప్పందం మేరకు నియమించుకుని దొడ్డిదారిన పర్మనెంట్ చేయడానికే ఈ ఎత్తుగడని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగానికి సూపరింటెండెంట్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడు. అయితే ప్రైవేట్ ఐటీ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తిని నియమించడమే నిబంధనలకు విరుద్ధం. అప్పట్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు కూడా. వైస్ చాన్స్‌లర్ నరసింహులు పదవీ కాలం ఏప్రియల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ ఇంక్రిమెంట్ల ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగిగా స్థిరపడేందుకు ఎత్తుగడ అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. నాన్‌టీచింగ్ సిబ్బంది పాపమేంటి ? వర్సిటీలో టైం స్కేల్ పొందుతున్న నాన్ టీచింగ్ సిబ్బంది 12 మంది ఉన్నారు. ఖాళీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరిని వదిలేసి మూడేళ్ల నుంచి మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తిని పర్మనెంట్ చేయడానికి పావులు కదపడంలో మతలబ్ ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా 110 మంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కంట్రాక్టు సిబ్బందికి టైంస్కేలు ఇవ్వని ఉన్నతాధికారులు సదరు ఉద్యోగికి అడ్డదారిన ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు చేస్తున్న తీరును ఉద్యోగులు తప్పుపడుతున్నారు. -
‘నన్నే పెళ్లి చేసుకోవాలి’ అంటూ..
కర్నూలు (ఆర్యూ): విశ్వవిద్యాలయాలు నైతిక విలువలను పెంపొందించాల్సిన ఆలయాలు. అలాంటి విద్యాలయంలో అధ్యాపకులే నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారు. తోటి అధ్యాపకురాలిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం ఈ విషయాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అవివాహితురాలైన ఆమె మెరిట్ మీద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా గత జూలైలో ఆర్‌యూలో ఉద్యోగంలో చేరారు. ఆరు నెలలుగా ముగ్గురు తోటి కాంట్రాక్ట్ అధ్యాపకులే వివిధ రూపాల్లో లైగింక వేధింపులకు పాల్పడుతున్నారు. ‘నన్నే పెళ్లి చేసుకోవాలి’ అంటూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత అధ్యాపకురాలు.. ఉద్యోగం వదలిపోతున్నట్టు సన్నిహితులతో చెప్పి వాపోయారు. ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులకు చెప్పాలని, తాము కూడా తోడుంటామని వారు చెప్పారు. ఇందుకోసం సోమవారం ఆమె వెళుతుండగా.. దారిలోనే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విద్యార్థులు, అధ్యాపకులు ఆమెను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై గతంలోనూ ఆరోపణలు అధ్యాపకురాలిని వేధించిన వారిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా అందింది. అయినా చర్యలు తీసుకోలేదు. సంజాయిషీ కూడా కోరకపోవడంతో వీరు మరింత రెచ్చిపోయి.. అధ్యాపకురాలిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, వేధింపులు నిజమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని రిజిస్ట్రార్ అమర్నాథ్ తెలిపారు. -
రాయలసీమ యూనివర్సిటీకి హైకోర్టు అక్షింతలు
– అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై మూడు వారాలు స్టే – వారంలోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి పని చేస్తున్న అధ్యాపకులను రెన్యూవల్ చేయకుండా మే నెలలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టులలో పీజీతో పాటు పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్ ఏదో ఒక విద్యార్హత కలిగి ఉండాలని అందులో పేర్కొంది. అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎంత మంది అవసరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర నిబంధనలు తెలపకపోవడంతో పాటు వర్సిటీ అధికారులు వాటిని పాటించకపోవడంతో నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని బాధితులు గతనెల 28న హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు అదే రోజు నియామకాలపై స్టే విధించింది. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్సిటీ పాలకులు మరుసటి రోజే అంటే 29వ తేదీన కూడా దాదాపు 30 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి బాధితులు తీసుకెళ్లడంతో జూలై 4వ తేదీన ఇరువురు వాదనలు విని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా అనర్హులను నియమించుకోవడమే కాక ఆ విషయాలను దాచి సుప్రీం కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా అని నియామకాలపై మూడు వారాలకు స్టే విధించింది. వారంలోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్యూ నియామకాలపై తాత్కాలిక స్టే
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలు పాటించకుండా చేపట్టిన నియామకాలను నిలుపుదల చేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు డాక్టర్ జి.మల్లికార్జున, డాక్టర్ మల్లెపోగు రవి, డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడారు. రాయలసీమ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ వై.నరసింహులు..యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు చేయకుండా అధ్యాపకులు నియామకాలు చేపట్టారని ఆరోపిచారు. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు విజ్ఞప్తిని పెడచెవిన పెడుతూ నియంత ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులకు అనుమతి
కర్నూలు సిటీ: స్థానిక బీక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు పూర్తి చేసేందుకు రాయలసీమ యూనివర్శిటీ అనుమతులు ఇచ్చినట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఇంగ్లిషు, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు వచ్చాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. -
ఆర్యూ అధికారులపై ఫిర్యాదు
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కాంట్రాక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు శ్రీరాములు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. ఆర్‌యూలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చారని, అనర్హులకు, రాజకీయ ఒత్తిళ్లకు లోనై పోస్టు భర్తీ చేసేలా వైస్ చాన్సలర్ చర్యలున్నట్లు కానవస్తున్నాయని ఆరోపిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ జయరాజు, కార్యదర్శి వరదరాజు, వైస్‌చైర్మన్ నరసింహవర్మలను కలిసి వినతిపత్రం అందజేసినట్లు విద్యార్థి సమాఖ్య నాయకులు తెలిపారు. స్పందించిన అధికారులు వర్సిటీలో చేపట్టిన అన్ని నియామకాలపై విచారణ చేపడతామని హామీనిచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
కొలువులు.. పైరవీలు!
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో గోప్యత - దరఖాస్తులు, పోస్టుల వివరాలు వెల్లడించని ఆర్యూ వర్గాలు - కాల్ లెటర్లు పంపినా సంఖ్య తెలియదని బుకాయింపు - తమకే స్పష్టత లేదంటున్న వైస్ చాన్స్‌లర్ - అనర్హులకు పెద్దపీట వేసే ప్రయత్నం - భారీగా రాజకీయ నాయకుల సిఫారసులు రాయలసీమ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో చేపట్టిన నియామకాలు వివాదాస్పదం అయినప్పటికీ.. మళ్లీ అదే తీరు కొనసాగుతోంది. ప్రస్తుత వైస్ చాన్స్‌లర్ చేపట్టిన నియామకాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. బంధుప్రీతి, అధికార పార్టీ నేతల సిఫారసులకు ఎదురు లేకుండా పోతోంది. కర్నూలు(ఆర్యూ): వర్సిటీలో పోస్టుల భర్తీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క రోజు ముందు కూడా అధికారులు సరైన వివరాలు వెల్లడించకపోవడం వెనుక భారీగా పైరవీలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సుమారు 75 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా.. 406 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నియామకంలో రోస్టర్ పాయింట్లు ఉండవని.. రిజర్వేషన్లు పాటిస్తామని ఇది వరకు వీసీ ప్రకటించారు. అయితే సబ్జెక్టు వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనే విషయంలోనూ గోప్యత పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పెద్ద ఎత్తున పైరవీలు జరగడం వల్లే వర్సిటీ అధికారులు ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సిఫారసులతో అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పోస్టులను అమ్మకానికి పెట్టినట్లు విద్యార్థులు గత సోమవారం వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టినా అధికారుల్లో చలనం లేకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఎప్పుడూ లేని వింత పద్ధతి వర్సిటీలో కొందరు అధ్యాపకులు 10 సంవత్సరాలుగా.. మరికొందరు 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతామా అనే ఆశతో వీరంతా నిరీక్షిస్తున్నారు. నియామకం పొందినప్పటి నుంచి ఈ అధ్యాపకులు ఆటోమేటిక్ రెన్యూవల్ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా కొత్త దరఖాస్తుదారులతో పాటు వీరు కూడా దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. ఇంతకాలం వర్సిటీకి సేవలు అందించగా.. తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పాత వారిని సాగనంపే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. కాల్ లెటర్లు పంపిస్తున్నారు.. క్లారిటీ లేదంటారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ కాల్ లెంటర్లు పంపించారు. బుధవారం(14న) నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. అయితే అధికారులు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? ఏ సబ్జెక్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనే విషయాలను బయటకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రిజిస్ట్రార్‌కు సంబంధం లేకుండా వీసీ ఎకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీడీఎఫ్ స్కాలర్స్ టీచింగ్ అసిస్టెంట్‌లా? బయో కెమిస్ట్రీ రీసెర్స్ స్కాలర్స్ అయిన హలీమ్, రజాక్‌లు, పీడీఎఫ్‌లు కమల, కిరణ్, సెంథాల్లకు యూజీసీ నుంచి రూ.50వేలకు పైగా స్కాలర్షిప్ వస్తోంది. రీసెర్చ్ స్కాలర్స్ అయిన వీరిని టీచింగ్ అసిస్టెంట్లుగా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెంథాల్ రీసెర్చ్ స్కాలర్ అయినప్పటికీ హెచ్ఓడీగా నియమించడం గమనార్హం. అనర్హులకూ కాల్ లెటర్లు దరఖాస్తుకు ముందు రోజు థీసిస్ సమర్పించిన ఎంసీఏ రాజేశ్వరికి కాల్ లెటర్ పంపడం.. ఎంకామ్‌లో పీహెచ్డీ చేసిన రేణుక, సురేంద్రలను ఎంబీఏలో ఫ్యాకల్టీలుగా ఎలా అనుమతిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సురేంద్ర వినాయక మిషన్ అనే యూజీసీ గుర్తింపు లేని సంస్థ నుంచి చెల్లుబాటు కాని పీహెచ్డీ సమర్పిస్తే ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో చిరంజీవిరెడ్డి గత రెండు సంవత్సరాలుగా అధ్యాపకులుగా పని చేసినా కాల్ లెటర్ పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు అర్హుడైనా.. ఇప్పుడు ఎందుకు అర్హుడు కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లిష్‌లో ప్రతాప్ అనే అభ్యర్థికి కూడా కాల్ లెటర్ పంపకపోవడం వెనుక మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అయ్యాక చెప్తా అసలు మీకు ఇది వార్తే కాదు. ఎంత మంది దరఖాస్తు చేశారో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో మాకే ఇంత వరకు క్లారిటీ లేదు. నియామకాలన్నీ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తాం. - నరసింహులు, ఆర్యూ వీసీ నేటి నుంచి ఇంటర్వ్యూలు రాయలసీమ యూనివర్సిటీలో నేటి నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 14వ తేదీన ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్, 16న ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ సైన్స్, 17న ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, 18న ఎకనామిక్స్, 19న కామర్స్, ఎంబీఏ, 20న బోటనీ, జువాలజీ, బయో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, 21న తెలుగు సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ అమర్నాథ్ తెలిపారు. -
19 నుంచి ఆర్యూ పీసెట్ కౌన్సిలింగ్
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో పీజీలో చేరేందుకు ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జనరల్ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 150 ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకోరావాలని సూచించారు. 19వ తేదీ ఉదయం – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మధ్యాహ్నం – బోటని, బయోటెక్నాలజీ, 20న ఉదయం – కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, డెటా సైన్స్, మధ్యాహ్నం – ఇంగ్లిషు, స్టాటిస్టిక్స్, 21వ తేదీ ఉదయం – ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, మధ్యాహ్నం – ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, 22వ తేదీ ఉదయం – జువాలజీ, మైక్రో బయాలజీ, మధ్యాహ్నం – తెలుగు, 23వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, కామర్స్, 24వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, 25వ తేదీ ఉదయం – సైన్స్ సబ్జెక్టులు, మధ్యాహ్నం – ఆర్ట్స్ సబ్జెక్టుల ( ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పీహెచ్, సీఏపీ, స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కలిగిన అభ్యర్థుల )కు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కన్వీనర్ తెలిపారు. -
డిగ్రీ రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ ఏప్రిల్–2017 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రివాల్యుయేషన్‌కు మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ నెల 5వ తేదీలోపల www.ruexms.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రివాల్యుయేషన్ ఫీజు రూ.300ను విద్యార్థులు ఆయా కళాశాలల్లోనే చెల్లించాలన్నారు. ఒక్క సబ్జెక్టు మాత్రమే ఫెయిలైన మూడో సంవత్సరం విద్యార్థులు మాత్రం ఇన్స్టంట్ పరీక్షకు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇన్స్టంట్ పరీక్ష జూన్ 20వ తేదీన జరుగుతుందన్నారు. కళాశాలల యాజమాన్యాలు..విద్యార్థుల జాబితా, ఆన్లైన్ చలానాలను జూన్ 7వ తేదీలోపల వర్సిటీకి చేర్చాలని పేర్కొన్నారు. -
ముగిసిన ఆర్యూ సెట్
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షల్లో రిజిస్ట్రార్ అమర్నాథ్ ఆదోని ఆర్ట్స్ కాలేజ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులుగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. నంద్యాల, ఆదోని, కర్నూలులో మొత్తం 4 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ప్రతిరోజు 4 సెషన్ల ప్రకారం మొత్తం 18 డిపార్ట్మెంట్లకు వర్సిటీ క్యాంపస్‌లో 608 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 2,600 సీట్లకు 4,397 మంది దరఖాస్తు చేసుకోగా 3,953 మంది(89.9 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 1వ తేదీ లోగా ప్రకటించి మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
25 నుంచి ఆర్యూ పీజీ సెట్
కర్నూలు(ఆర్యు): ఈ నెల 25 నుంచి 27వతేదీ వరకు ఆర్యూ పీజీ సెట్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 వరకు, 11 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, 4 నుంచి 5:30 గంటల వరకు ప్రతిసారీ గంటన్నర సమయంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించి కర్నూలు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, వెంకాయపల్లె రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆదోనిలోని ఆదోని ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాలల కేంద్రాలుగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25వ తేదీన మైక్రోబయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, భౌతిక శాస్త్రం, ఎకనామిక్స్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, తెలుగు. 26వ తేదీన మాథమేటిక్స్, బోటని, కామర్స్, 27వ తేదీన కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్ (ఓఆర్, ఎస్, క్యు, సి) ఇంగ్లీషు, బయోకెమిస్ట్రీ, డాటా సైన్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 18 విభాగాలకు గాను 4,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్సైట్(www.rudoa.in/www.ruk.ac.in)లో వెబ్సైట్లో చూడవచ్చని కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
ఘనంగా ఆర్యూ వార్షికోత్సవం
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ తొమ్మిదో వార్షికోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ఆర్యూ ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, వైస్ చాన్సలర్ ఆచార్య వై.నరసింహులు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రామ్‌ప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వీసీ నరసింహులు వర్సిటీ అభివృద్ధిపై కీలకోపన్యాసం చేశారు. ఎమ్మెల్సీ డేటాసైన్స్ విద్యార్థులు మొబైల్ ఆప్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. త్వరలోనే త్రి డైమన్షల్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్నుసను ఆర్‌యూలో ప్రవేశపెడతామన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. కర్నూలు మెడికల్ కళాశాలలలో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సాయంత్రం 6 గంటలకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి.