బ్లాక్‌మెయిల్ చేస్తే బెదరను
బ్లాక్‌మెయిల్ చేస్తే బెదరను
Published Fri, Nov 4 2016 7:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
– ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తాను
– కొందరు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు
– విలేకర్ల సమావేశంలో ఆర్‌యూ వీసీ
కర్నూలు సిటీ: యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తుంటే కొందరు విద్యార్థులు విద్యార్థి సంఘాల ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని, అయితే, వాటికి బెదరను అని రాయలసీమ యూనివర్సిటీ వీసీ వై. నరసింహులు అనా్నరు. ఆర్‌యూలో అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్‌యూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న వర్సిటీ నిర్వహణను చక్కదిద్దేందుకు తాను వీసీగా బాధ్యతలు తీసుకున్న తరువాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానన్నారు. గతంలో మధ్యాహ్నం తరువాత విద్యార్థులు క్యాంపస్‌లో ఉండేవారు కాదన్నారు. ఇప్పుడు సాయంత్రం వరకు ఉండేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు. కొందరు విద్యార్థులు క్లాస్‌లకు సక్రమంగా హాజరుకాకున్నా పరీక్షలకు అనుమతించాలని, కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. పీహెచ్‌డీ చేసిన వారినే బోధన సిబ్బందిగా నియమించామన్నారు. నియమకాల్లో అక్రమాలు జరిగాయని మూడునెలల తర్వాత ఆరోపణలు చేయడం తగదన్నారు. భర్తీ చేసే సమయంలో ఎందుకు అభ్యంతరం చేయలేదని ప్రశ్నించారు.
నాన్ టీచింగ్ స్టాఫ్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్నారు. హాస్టల్‌లో కొంత మంది విద్యార్థులు కిచెన్ స్టాఫ్ మీద దాడులు చేస్తుండడంతో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. విద్యార్థులే కమిటీగా ఏర్పడి మెస్‌ను మెయింటెన్ చేసుకోమన్నా వారు వినిపించుకోవడం లేదన్నారు. వచ్చే ఏడాది ఎంఎస్ ఎర్త్ సైన్స్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం కమ్యూనికేషన్ అనే కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో రిజిస్ట్రార్ అమరనాథ్, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement